
సింథియా/మల్కాపురం(విశాఖ పశ్చిమ): జీవితంపై ఎన్నో కలలు కన్నాడు. కుటుంబంతో సంతోషంగా ఉండాలని భావించాడు. అక్క కూతురినే వివాహం చేసుకున్నాడు. కొంతకాలం పాటు సరదాగా సాగిన వీరి కాపురంలో ‘అనుమానం’ పెనుభూతంలా మారింది. జీవితాంతం తోడుంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన అతను.. విచక్షణ మరిచి డంబెల్‌తో భార్యను దారుణంగా హత్య చేశాడు. భార్య లేని లోకంలో తానెందుకు అనుకున్నాడో లేక భార్య మృతితో తీవ్రంగా ఆందోళన చెందాడో గానీ.. అతను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురంలోని గుల్లలపాలెంలో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివీ..
కాకినాడ ప్రాంతానికి చెందిన పోలవరపు శివనాగేశ్వరరావు(34) తన అక్క కూతురైన మాధవి(28)ని మూడేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. ఉపాధి నిమిత్తం కొంతకాలం కిందట విశాఖకు వలస వచ్చి.. శ్రీహరిపురంలోని గొల్లలపాలెం ప్రాంతంలోని కుంచుమాంబకాలనీలో నివాసం ఉంటున్నాడు. వృత్తిరీత్యా వెల్డర్ అయిన శివనాగేశ్వరరావు ఎక్కడ పని ఉండే అక్కడ చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు.పెళ్లయి మూడేళ్లయినా వీరికి పిల్లలు లేరు. కొంతకాలం సాఫీగా సాగిన వీరి జీవితంలో అనుమానం చిచ్చురేపింది. ఆరు నెలల నుంచి మాధవిపై శివనాగేశ్వరరావు అనుమానం పెంచుకోవడంతో వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన శివనాగేశ్వరరావు భార్యపై దాడికి తెగబడ్డాడు. వ్యాయామం కోసం ఉపయోగించే ఇనుప డంబెల్‌తో ఆమె తలపై బలంగా కొట్టాడు. ఈ ఘటనలో మాధవి అక్కడికక్కడే కుప్పకూలి మరణించింది. భార్య మృతితో తీవ్ర భయాందోళనకు గురైన శివనాగేశ్వరరావు కూడా అదే గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఆత్మహత్యకు ముందుకు తన అన్నయ్య కనకారావుకు వాట్సాప్‌లో మేసేజ్‌లు పంపించాడు. తన భార్యపై అనుమానం ఉందని, పలువురితో చనువుగా ఉంటోందని.. ఆమెకు ఎంత నచ్చజెప్పినా మాట వినలేదని అందులో పేర్కొన్నాడు. వాట్సాప్‌లో రెండు సందేశాలతో పాటు లెటర్‌పై తాను చనిపోవడానికి గల కారణాలు వివరించాడు.
ఆందోళనతో కనకారావు వెంటనే తన భార్యతో కలిసి శివనాగేశ్వరరావు ఇంటికి వచ్చాడు. తమ్ముడికి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ రావడంతో తలుపులు బలంగా తెరిచారు. గదిలోకి వెళ్లిచూడగా తమ్ముడు భార్య రక్తపు మడుగులో ఉండటం, తమ్ముడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండటంతో కేకలు వేశాడు. స్థానికులు, కుటుంబ సభ్యుల సమాచారం మేరకు మల్కాపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమ్తితం కేజీహెచ్‌కు తరలించారు. ఎన్నో ఆశలతో వివాహం చేసుకున్న వీరి జీవితం అనుమానం కారణంగా అర్ధాంతరంగా ముగిసిపోవడంపై కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మల్కాపురం సీఐ కూన దుర్గాప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.