మల్కాపురం(విశాఖపట్నం), న్యూస్‌లైన్: ప్రేమ.. రెండు హృదయాల స్పందన. రెండు మనసుల అంగీకారం. కులమతాలకు అతీతం. త్యాగానికి నిలువెత్తు నిదర్శనం. పుస్తకాల్లో చదువుతున్న ఈ అక్షరాలకు స్వచ్ఛమైన భాష్యం పలికి తన ఆదర్శాన్ని చాటుకున్నాడో యువకుడు. ఫోన్లో పరిచయమైన యువతిపై మనసు పారేసుకున్నాడు. కాలక్రమంలో వికలాంగురాలని తెలిసినా అవాక్కవ్వలేదు.
మరింత ప్రేమను పెంచుకున్నాడు. మనస్సాక్షిగా ఆమెను పెళ్లి చేసుకొని తన పెద్దమనసును చాటుకున్నాడు. నెల్లూరు జిల్లాకు చెందిన జాయ్ కీర్తన రాజు (23) ఎలక్ట్రీషియన్. ప్రైవేట్ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. రెండేళ్ల క్రితం రాజుకు ఫోన్ ద్వారా మల్కాపురం ప్రాంతానికి చెందిన మేరీరాణి (20)తో పరిచయమైంది. వారి పరిచయం ప్రేమకు దారితీసింది. ఒకరినొకరు చూసుకోకుండానే పెళ్లి తీరం వరకు వచ్చేశారు.
రాజు పెళ్లి ప్రస్తావన చేయడంతో మేరీరాణి అసలు విషయం చెప్పింది. ఏడో తరగతిలో ఉండగా నరాల బలహీనత కారణంగా తన శరీరంలోని అవయవాలన్నీ చచ్చుబడిపోయాయని, వీల్ చైర్ ఆధారంగానే జీవనం సాగిస్తున్నానని చెప్పగానే రాజు అవాక్కవ్వలేదు. తన ప్రేమ మనసుకే నంటూ ఆమెను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇరుకుటుంబాల పెద్దలు కూడా అడ్డు చెప్పకపోవడంతో బుధవారం మల్కాపురం సామాజిక భవనంలో ఒక్కటయ్యారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఆదర్శ జంట వివాహానికి పారిశ్రామికవాడ నలుమూలల నుంచి పలువురు పెద్దలు హాజరై ఆశీర్వదించారు. రాజు ఆదర్శాన్ని అభినందించారు. క్రిస్టియన్ మత పెద్దలు ఆశీర్వచనం పలికారు.
మనసు పలికిన ప్రేమరాగం
Published Thu, Nov 21 2013 3:35 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement