తల్లి చెంతకు చేరిన శిశువు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: విశాఖ కేజీహెచ్ నుంచి అపహరణకు గురైన శిశువు తల్లి చెంతకు చేరింది. వారం రోజులు దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు శిశు అపహరణ కేసు ఛేదించి బిడ్డను తల్లి ఒడికి చేర్చారు. కేజీహెచ్ ప్రసూతి వార్డు నుంచి ఈనెల 21 వేకువజామున శిశువు అపహరణకు గురైన విషయం తెలిసిందే. జాలారిపేటకు చెందిన వాసుపల్లి గుణ 21 అర్ధరాత్రి మగ శిశువుకు జన్మనిచ్చింది. ఒంటిగంట సమయంలో బిడ్డకు పాలిచ్చి గంట నిద్రపోయింది.
ఆ సమయంలో కేజీహెచ్‌లో పనిచేస్తున్న నాలుగో తరగతి సిబ్బంది ఇద్దరు, మార్చురి వద్ద అనధికార విధులు నిర్వర్తిస్తున్న మరో ఇద్దరు కలిసి ఆ బిడ్డను అపహరించారు. వార్డు గోడ మీదుగా బిడ్డను మాయం చేసి మల్కాపురం ఎక్స్‌సర్వీస్‌మెన్ కాలనీకి చెందిన ఓ పిల్లలు లేని మహిళకు రూ.30 వేలకు విక్రయించారు. కొద్దిసేపటికి పక్కలో బిడ్డ లేకపోవడం గమనించిన గుణ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారించి వారు బిడ్డను అమ్మేసినట్లు తెలుసుకున్నారు. మల్కాపురం వెళ్లి ఆ శిశువును తీసుకొచ్చి ఆస్పత్రిలో తల్లికి అప్పగించారు. నిందితులతోపాటు బిడ్డను కొనుగోలు చేసిన మహిళను అదుపులో తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది సహకరించనందున కేసు ఛేదించేందుకు వారం రోజులు పట్టిందని వన్‌టౌన్ సీఐ చెప్పారు.