![Metro Bus Accident to Sugar Bullock Cart in Krishna - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/23/oxe.jpg.webp?itok=kOKYE1_f)
బస్టాండ్ సెంటర్‌లో రోడ్డుపై బండ్లను నిలిపి ఆందోళనకు దిగిన రైతులతో మాట్లాడుతున్న ఎస్‌ఐ సత్యశ్రీనివాస్, ప్రమాదంలో గాయపడ్డ ఎద్దులు
కృష్ణాజిల్లా, ఉయ్యూరు (పెనమలూరు) : చెరకు లోడు బండిని మెట్రో సర్వీస్ బస్ ఢీకొన్న ఘటనలో రెండు ఎద్దులకు గాయాలయ్యాయి. పట్టణంలోని బస్టాండ్ సెంటర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. రైతులు ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
వివరాల్లోకి వెళితే, తోట్లవల్లూరు మండలం కనకవల్లి గ్రామానికి చెందిన రైతులు ఎడ్ల బళ్లపై చెరకును కేసీపీ కర్మాగారానికి తీసుకువస్తున్నారు. బస్టాండ్ లోపలికి వెళ్లే క్రమంలో విజయవాడ నుంచి వస్తున్న 333 సర్వీస్ మెట్రో బస్సు ప్రమాదవశాత్తూ ఢీకొంది. చెరకు బండి వెనుకగా ఢీకొట్టడంతో రెండు ఎద్దులకు గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన రైతులు బస్సు డ్రైవర్‌పై దురుసుగా ప్రవర్తించారు.
ఆందోళనకు దిగిన రైతులు..
ప్రమాద ఘటనపై ఆగ్రహించిన రైతులు చెరకు బళ్లను బస్టాండ్ సెంటర్‌లో నిలిపివేసి ఆందోళనకు దిగారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తో న్యాయం చేయించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నాకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్‌కు, రైతులకు మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఒక దశలో ఒకరిపై ఒకరు చేతులతో దాడి చేసుకునే పరిస్థితి తలెత్తడంతో సమాచారం అందుకున్న పట్టణ ఎస్‌ఐ సత్యశ్రీనివాస్ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి ఇరువర్గాలతో చర్చించి ఆందోళన విరమింపచేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment