![Story About Maharashtra Women SugarCane Labour - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/7/Sugar-Cane.jpg.webp?itok=AHuBXKAk)
ఒక మనిషి సంతోషంగా ఉన్నారంటే వారి జీవనం సాఫీగా సాగిపోతోందని. వారి కుటుంబంలోని సభ్యులంతా సంతృప్తిగా ఉన్నారని. మరి దేశం సంతోషంగా ఉందనే వార్త ఎప్పుడు మన చెవిన పడుతుంది?! మన దేశ ప్రజలు సురక్షితంగా, సౌభాగ్యాలతో జీవిస్తున్నారని నిర్ధారణ అయినప్పుడు. అయితే అలాంటిది ఎప్పటికీ నిర్ధారణ కాదేమోనన్న భయాన్ని, సందేహాన్ని కలిగిస్తూ.. ఎక్కడో ఒకచోట, ఏదో ఒక దారుణ సంఘటన బయటపడుతూనే ఉంది! అందుకు ఉదాహరణే మహారాష్ట్రలోని మరఠ్వాడ ప్రాంతం. ఆ ప్రాంతంలో అత్యధికులు చెరకు కార్మికులుగా ఉన్నారు.
వారిలో ఎక్కువమంది మహిళలే. నెలసరి రోజుల్లో వారిని చెరకుతోట పనుల్లోకి రానివ్వరు. దాంతో వారు ఇంటివద్దనే ఉండాల్సిన పరిస్థితి. ఆ నాలుగు రోజులూ దినసరి కూలీ కోల్పోయి, కుటుంబంలోని మిగతా సభ్యులూ పస్తులుండాల్సి వస్తుంది. అందుకే అక్కడి మహిళా కూలీలు చాలామంది రోజువారీ వేతనం పోతుందనే భయంతో ఆపరేషన్ ద్వారా తమ గర్భసంచిని తొలగించుకుంటున్నారు! ఇలా చేసింది ఒకరూ ఇద్దరు కాదు. ఇప్పటి వరకు వేల మంది! కొంతమంది చెరకుతోట కాంట్రాక్టర్లు భార్య, భర్త ఇద్దరినీ ఒక యూనిట్‌గా పరిగణించి పని కల్పిస్తారు.
భార్య ఆ నాలుగు రోజులు పనిలోకి రాకపోతే రోజుకు రూ.500 జరిమానా వేస్తారు. దాంతో.. రోజూ వచ్చి పని చేస్తున్న భర్తకు రావలసిన కూలీ కూడా చెయ్యిజారి పోతుంది. పైగా పనుల్లో కుదిర్చే కాంట్రాక్టర్లు గర్భసంచి లేని మహిళలనే పనుల్లోకి తీసుకురావడానికి ముందుకు వస్తారని, పర్యవసానంగా ఈ యేడాది 13,000 మంది చెరకు కూలీలు తమ గర్భాశయాన్ని తొలగించుకున్నారని ఇటీవల కొన్ని జాతీయస్థాయి స్వచ్ఛంద సంస్థలు జరిపిన పరిశోధనలో బయటపడింది. దీంతో జీవనోపాధికోసం తమ ప్రాణాలను పణంగా పెట్టే పరిస్థితుల్లోకి మహిళలు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి వినతులు వెల్లువలా అందుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment