The Struggle For Supremacy Is Not abating In Maharashtra Politics - Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర రాజకీయాల్లో ఇదే హాట్‌ టాపిక్‌

Published Mon, Sep 5 2022 7:45 PM | Last Updated on Mon, Sep 5 2022 8:30 PM

The Struggle For Supremacy Is Not abating In Maharashtra Politics - Sakshi

శివసేన ఎవరిది..? మహారాష్ట్ర రాజకీయాల్లో ఇదే హాట్‌ టాపిక్‌ అయింది. తిరుగుబాటుతో సీఎం పగ్గాలు దక్కించుకున్న షిండే పార్టీని చేజిక్కించుకునేందుకు ఏం చేస్తున్నారు? 

మహారాష్ట్ర సంక్షోభం కొలిక్కి వచ్చినా ఆధిపత్యపోరు తగ్గడం లేదు. తమనే అసలైన శివసేనగా గుర్తించాలంటూ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే వర్గం ఈసీని ఆశ్రయించడం, తర్వాత వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడం.. మరాఠా రాజకీయాల్లో కలకలం రేపుతోంది. 

సాధారణంగా ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు మెజార్టీ పార్టీ ఎవరి వైపు ఉంటే వారిదే అసలైన పార్టీగా ఈసీ గుర్తిస్తుంది. కానీ మహారాష్ట్రలో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి ఉంది. మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు షిండేతో వెళ్లినా పార్టీ సంస్థాగత నిర్మాణం మాత్రం ఇంకా ఉద్దవ్‌పై విశ్వాసంతో ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో రెండు వర్గాలు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి. 

మొన్నటి ఎన్నికల్లో శివసేన తరపున మొత్తం 55 మంది శాసనసభ్యులుగా గెలవగా, అందులో ఏకంగా 39 మంది ఎమ్మెల్యేలు షిండే వైపు వెళ్లిపోయారు. ఈ ఎమ్మెల్యేలు తమతో పాటు పార్టీలో కింది వర్గాన్ని కూడా థాకరేకు దూరంగా పెట్టారు. ఈ సమీకరణాలు పైకి చూడ్డానికి షిండే వైపు మొగ్గు చూపినా.. పార్టీ హర్డ్‌కోర్‌ సానుభూతి పరుల్లో మాత్రం వీరంతా థాకరేకు అన్యాయం చేశారన్న ప్రచారం ఉంది. ఏక్నాథ్ షిండే వెన్నుపోటు వల్లే థాకరే రోడ్డు మీద పడ్డారన్న సింపథీ కూడా కొంత నెలకొంది. 

ఇటీవల అన్నాడీంకేలో ఓపీఎస్‌, ఈపీఎస్‌ వర్గాలు ఢీ అంటే ఢీ అన్నట్టు తలపడ్డాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని పన్నీర్‌ సెల్వం వర్గం వ్యతిరేకించడంతో... పళని వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఒక దశలో మెజార్టీ పార్టీ శ్రేణులు పళనికి మద్దతు తెలపడంతో.. పన్నీర్‌ సెల్వం బలహీనపడిపోయారు. 

ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అలాంటి పరిస్థితే పునరావృతమయ్యే అవకాశముందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ గుర్తు విల్లు కూడా షిండే వర్గానికే వెళ్లే అవకాశముందనే టాక్‌ వినిస్తుండడం మహా రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది.

కోర్టులో పార్టీ ఫిరాయింపులపై నమోదయిన పిటిషన్లు ప్రస్తుతానికి షిండేకే అనుకూలంగా కనిపిస్తున్నాయి. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం అనర్హత వేటును షిండే వర్గం తప్పించుకున్నట్టే కనిపిస్తోంది. మెజార్టీ ఎమ్మెల్యేలు షిండే వైపు వచ్చినా.. వచ్చే ఎన్నికల్లో ప్రజా కోర్టులో ఓటర్లు ఎలాంటి తీర్పునిస్తారన్నది ఆసక్తి కరంగా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement