ముంబై బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు హిట్ అండ్ రన్ కేసు నిందితుడు మిహిర్ షా (24) పచ్చి తాగుబోతని (Habitual Drinker) పోలీసులు నిర్ధారించారు. హిట్ అండ్ రన్ కేసులో అరెస్టైన మిహిర్‌షాను విచారించగా ఈ విషయాన్ని గుర్తించామని పోలీసులు తెలిపారు.
జులై 7 ఆదివారం ఉదయం 5.30 గంటలకు ముంబైలోని వర్లీ ప్రాంతంలో మిహిర్ షా మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును వేగంగా నడుపుతూ ముందువెళ్తున్న స్కూటీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 45 ఏళ్ల కావేరీ నఖ్వా మృతి చెందగా.. ఆమె భర్త ప్రదీప్ నక్వా తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం నిందితుడు పరారయ్యాడు.
నిందితుడు తండ్రి మహరాష్ట్ర పాల్ఘర్ ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన డిప్యూటీ లీడర్‌గా ఉన్న రాజేష్ షా కావడంతో ఈ ప్రమాదంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మహరాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే రంగంలోకి దిగారు. నేరస్తులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అతడి ఆచూకీ కోసం 11 పోలీస్ శాఖ ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రమాదం జరిగిన 72 గంటల అనంతరం ప్రధాన నిందితుడు మిహిర్ షాను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
నేను పెద్ద తప్పే చేశా
తాజాగా, కేసు విచారణలో మిహిర్‌షా హిట్ అండ్ రన్‌లో మహిళ ప్రాణాలు తీసినందుకు పశ్చాతాపపడుతున్నట్లు సమాచారం. మహిళ ప్రాణం తీసి నేను పెద్ద తప్పే చేశా. నా కెరియర్ ఇక ముగిసిందని విచారణలో పోలీసుల ఎదుట విచారం వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
కటింగ్, షేవింగ్ చేసి
ఇక కేసు నుంచి తప్పించుకునేందుకు నిందితుడు విశ్వప్రయత్నాలు చేశాడు. పోలీసుల్ని తప్పుదోవ పట్టించేందుకు మీసాలు, గడ్డాలు తొలిగించాడు. కటింగ్ కూడా చేయించుకున్నాడని బార్బర్ షాపు యజమాని ఇచ్చిన స్టేట్మెంట్‌ను రికార్డ్ చేసుకున్నారు పోలీసులు.
రాజేష్ షా అరెస్ట్.. బెయిల్‌పై విడుదల
హిట్ అండ్ రన్ కేసు నిందితుడు మిహిర్ షా తండ్రి రాజేశ్ షాను పోలీసులు అరెస్ట్ చేసి ముంబై కోర్టులో హాజరు పరిచారు. విచారణ చేపట్టిన కోర్టు రాజేష్ షా, డ్రైవర్ రాజరిషి బిదావత్‌లకు వరుసగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ, ఒకరోజు పోలీసు కస్టడీ విధించింది. అయితే ఈ కేసులో రాజేష్ షాకు బెయిల్ లభించగా, బిదావత్ పోలీసు కస్టడీని జూలై 11 వరకు పొడిగించింది.
కుమారుడు చేసిన ఘన కార్యం.. ముగిసిన తండ్రి పొలిటిక్ కెరియర్
కుమారుడు మిహిర్ షా చేసిన ప్రమాదంతో రాజేష్ షా పొలిటికల్ కెరియర్ ఓ రకంగా ముగిసినట్లేనని శివసేన నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పార్టీకి చెందిన అన్ని పదవుల నుంచి తొలగించినట్లుగా శివసేన వర్గాలు వెల్లడించాయి. పాల్ఘర్‌లో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన డిప్యూటీ లీడర్‌గా ఉన్న రాజేష్ షా హిట్ అండ్ రన్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment