
ఛండీగఢ్: తన హత్యకు ఖలిస్థానీలు కుట్రలు చేస్తున్నారని కేంద్రమంత్రి రవనీత్ సింగ్ బిట్టూ సంచలన ఆరోపణలు చేశారు. రాడికల్ ప్రచారకుడు, ఎంపీ అమృత్‌పాల్ సింగ్ నడిపిస్తున్న ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థతో సంబంధమున్న ఖలిస్థానీ మద్దతుదారులే తన హత్యకు ప్లాన్ చేశారని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.
తాజాగా, రైల్వేశాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు మాట్లాడుతూ.. పంజాబ్‌లోని రాజకీయ నాయకులకు ఖలిస్థానీ మద్దతుదారుల నుంచి ప్రమాదం పొంచి ఉంది. పలువురు నేతల హత్యకు వారు ప్లాన్ చేస్తున్నారు. ఖలిస్తానీల ప్లాన్ గురించి సోషల్ మీడియాలో లీకైన కొన్ని స్క్రీన్ షాట్ల ద్వారా ఈ విషయం నాకు తెలిసింది. ఎంపీ అమృత్‌పాల్ సింగ్ నడిపిస్తున్న ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థతో సంబంధమున్న ఖలిస్థానీ మద్దతుదారులే ఇందులో ఉన్నారు. నాతో పాటుగా మరికొంతమంది రాజకీయ నాయకుల ప్రాణాలకు కూడా ఖలిస్థానీయుల నుంచి ముప్పు పొంచి ఉంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై కూడా వారిస్ పంజాబ్ దే నాయకులు కక్ష పెంచుకున్నారని ఆరోపించారు. జాతీయ భద్రతా చట్టం కింద అమృత్‌పాల్ నిర్బంధం మరో ఏడాది పొడిగించడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోందని వెల్లడించారు. అందుకే ఈ గ్రూపుతో సంబంధం ఉన్న ఖలిస్తానీ శక్తులను పంజాబ్ ప్రభుత్వం వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
అయతే, గతంలో దిబ్రుగఢ్ జైలులో ఉన్న అమృత్‌పాల్ సింగ్ సహచరులను పంజాబ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు. ఇది ప్రధాన కుట్రదారుడిగా అమృత్‌పాల్ పాత్రపై అనుమానాలను మరింత బలపరుస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కార్యకర్తలుగా మారువేషంలో ఉన్న నేరస్థుల పట్ల పంజాబ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు.