తీపి చేసేవారికి చేదు
=నాలుగు నెలలుగా పస్తులు
=జీతానికి నోచుకోని ‘తుమ్మపాల’ కార్మికులు
=రూ. కోటికి పైగా బకాయిలు
=నేటి నుంచి క్రషింగ్
అందరికీ తీపిని పంచుతారు.. చెరకు నుంచి చక్కెర తయారు చేస్తారు.. వారు మాత్రం చేదు దిగమింగి బతుకంతా ఉసూరం టారు. శ్రమించి చక్కెరను ఉత్పత్తి చేసే తుమ్మపాల సుగర్స్ ఉద్యోగులు చేదును చవి చూస్తున్నారు. పనిచేస్తున్న కర్మాగారం భవితవ్యంపై నీలినీడలు అలుముకుంటూ ఉండడంతో బితుకుబితుకుగా కాలం గడుపుతున్నారు. జీతాల కోసం నెలల తరబడి ఎదురు చూస్తూ అష్టకష్టాలతో నెట్టుకొస్తున్నారు.
అనకాపల్లి, న్యూస్‌లైన్: సుదీర్ఘ చరిత్ర గల తుమ్మపాల సుగర్స్ అనేక రకాల సమస్యలతో సతమతమవుతోంది. ఆర్థిక భారంతో కుంగిపోతోంది. దాంతో ఉద్యోగులు కర్మాగారం భవితవ్యంపై కలవరపడుతున్నారు. మరోవైపున నెలల తరబడి వేతనాలు చెల్లించకుండా యాజమాన్యం కాలం గడపడంతో విలవిలలాడుతున్నారు. కర్మాగారం పరిధిలో 40 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 120 మంది ఎన్‌ఎంఆర్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరందరికీ నాలుగు నెలలుగా జీతాలు లేవు. యాజమాన్యం రూ.కోటి వరకు చెల్లించాల్సి ఉంది.
మరో మూడు రోజులు గడిస్తే బకాయిలు ఐదు నెలలకు చేరుతాయి. దీంతో ఉద్యోగుల కుటుంబాలు సమస్యలతో సతమతమవుతున్నాయి. మరోవైపున శనివారం నుంచి క్రషింగ్ ప్రారంభిస్తున్నారు. మరో 302 మందిని సీజనల్ ఉద్యోగులుగా విధుల్లోకి తీసుకుంటారు. వీరికీ జీతాలివ్వాలి. గానుగాట చేపట్టాక ఉత్పత్తయిన పంచదార బస్తాలను తాకట్టు పెట్టి ఆప్కాబ్ ద్వారా రుణం తీసుకుని ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు యాజమాన్యం యోచిస్తోంది. సుమారు రూ. 40 కోట్లకు పైబడిన అప్పుల్లో యాజమాన్యం ఇప్పటికే కూరుకుపోయింది. రుణం చెల్లించాలంటూ ఏపీఐడీసీ, ఆప్కాబ్ ఒత్తిడి తెస్తున్నాయి. మిల్లు ఆధునికీకరణకు రూ.7.54 కోట్లు రుణంగా ఇస్తామని స్వయంగా సీఎం ప్రకటించినా ఆ ఫైల్ పెండింగ్‌లోనే ఉంది. గతేడాది రూ. 63 లక్షల బకాయిలను రైతులకు ఇప్పటికీ చెల్లించలేదు.
నేటి నుంచి గానుగాట
99వేల టన్నుల గానుగాట లక్ష్యంగా తుమ్మపాల సుగర్స్ శనివారం నుంచి గానుగాట ప్రారంభించబోతోంది. ఉదయం 8-41 గంటలకు క్రషింగ్ ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మేరకు టన్నుకు రూ. 2100 మద్దతు ధర చెల్లించాల్సి ఉంది. పురాతన యంత్రాల కారణంగా రికవరీ తగ్గిపోవడంతో బస్తా పంచదార ఉత్పత్తికి రూ.3,200 ఖర్చవుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో బస్తా పంచదార రూ. 2650 మాత్రమే ధర పలుకుతోంది. క్రషింగ్ చేపట్టినా నష్టాలు తప్పని పరిస్థితుల్లో రైతుల మనోభావాలు దెబ్బతినకుండా గానుగాటకు యాజమాన్యం సిద్ధమైంది. జాతీయ చక్కెర సహకార సమాఖ్య సూచనల మేరకు రుణం మంజూరయితే మరో పదేళ్ల వరకు గానుగాట జరపొచ్చుననేది అధికారుల అభిప్రాయం