యశవంతపుర: భర్తను వదిలేసి ప్రియునితో వెళ్లిపోయిన వివాహిత యువతి కథ విషాదాంతమైంది. చెరుకు తోటలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన హాసన్ జిల్లా హొళెనరసిపుర తాలూకా పరసనహళ్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. పరసనహళ్లికి చెందిన కావ్య (23)కు హాసన్‌కు చెందిన యువకునితో ఏడాదిన్నర క్రితం తల్లిదండ్రులు వైభవంగా పెళ్లిచేశారు.
అయితే నాలుగు నెలల క్రితం నాకు భర్త వద్దు, ప్రియుడు అవినాశ్ కావాలంటూ అతనితో కలిసి జీవనం ప్రారంభించింది. అతడు ఏ పనీ చేయకుండా తిరిగేవాడు. అప్పటినుంచి పుట్టింటి వారితో కూడా సరిగా మాట్లాడేది కాదు. నెలరోజుల క్రితం కూతురు ఎక్కడ ఉందోనని తల్లిదండ్రులు ఫోన్‌చేయగా బెంగళూరులో పని చేస్తూ హాస్టల్లో ఉంటున్నట్లు అబద్ధం చెప్పింది.
చనిపోయిందని ప్రియుడే చెప్పాడు
ఇంతలో మంగళవారం ఆమె ప్రియుడు హొళెనరసీపుర తహసీల్దార్ కృష్ణమూర్తి, పోలీసులను కలిసి కావ్య చెరుకుతోటలో చనిపోయి ఉందని చెప్పారు. అందరూ హుటాహుటిన పరసనహళ్లికి వెళ్లి చూడగా కావ్య మృతదేహం కనిపించింది. కొంతమేర పూడ్చిపెట్టి ఉంది. పోలీసులు వెలికితీసి పోస్టుమార్టం జరిపించి కుటుంబసభ్యులకు అందించారు. కావ్య మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడే తమ కూతురిని హత్యచేశాడని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కావ్య ప్రియుని మాటలను నమ్మి నాశనమైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment