బ్రహ్మపూర్: భార్యాభర్తల బంధం విడదీయరానిదని అంటారు. ఆలుమగలులో ఏ ఒక్కరు దూరమైనా మరొకరు విలవిలలాడిపోతారు. ఒంటరితనానికి లోనవుతుంటారు. అయితే ఒడిశాలోని బ్రహ్మపూర్‌కు చెందిన ఓ భర్త తన భార్య చనిపోయాక, ఆమెను మరచిపోలేక చేసిన పనిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో ప్రశాంత్ నాయక్(52) అనే వ్యాపారవేత్త భార్య కిరణ్ కరోనా కాలంలో మరణించారు. వారిద్దరికీ 1997లో వివాహం జరిగింది. వారికి ముగ్గురు సంతానం. ప్రశాంత్ తన భార్య దూరమవడాన్ని జీర్ణించుకోలేక పోయాడు. దీంతో ఆయన సిలికాన్ మెటీరియల్‌తో భార్య విగ్రహాన్ని తయారు చేయించాడు. దానిని తన డ్రాయింగ్ రూమ్‌లో ఉంచాడు. ప్రశాంత్ తన పెద్ద కూతురు వివాహం సందర్భంగా ఆ సిలికాన్ విగ్రహానికి చీర, నగలు ధరింపజేశాడు.
ప్రశాంత్ కుమార్తె మెహక్ తన తల్లి విగ్రహాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటుంది. ప్రతీరోజూ ఆ విగ్రహానికి చీరలు, నగలు మారుస్తుంటుంది. మెహక్ ప్రస్తుతం ఎంబీఏ చదువుతోంది. ఈ విగ్రహాన్ని చూసినప్పుడల్లా తన భార్య తనతోనే ఉన్నట్లు అనిపిస్తుందని ప్రశాంత్ తెలిపారు. ఇంట్లో అమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని తన పిల్లలు కోరారని ప్రశాంత్ పేర్కొన్నారు.
బెంగళూరుకు చెందిన శిల్పి ఫైబర్, రబ్బరు, సిలికాన్ ఉపయోగించి ఏడాదిపాటు శ్రమించి ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఇందుకోసం ప్రశాంత్ కుమార్ ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఈ విగ్రహాన్ని ప్రశాంత్ తన పెద్ద కుమార్తె పెళ్లికి ముందు ఇంటికి తీసుకువచ్చారు. ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా తమ తల్లి తమతోనే ఉన్నదనిపిస్తుందని ప్రశాంత్ పిల్లలు చెబుతుంటారు.
ఇది కూడా చదవండి: Weekly Horoscope: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Comments
Please login to add a commentAdd a comment