అనంతపురం (శ్రీకంఠం సర్కిల్): రెండు కాళ్లూ ఛిద్రమై రక్తమోడుతున్నాయి. అయినా ఆయన భయపడలేదు. తనతో పాటు ప్రమాదానికి గురైన భార్యను కాపాడాలని తాపత్రయపడ్డాడు. పైకి లేచి నిలబడలేని స్థితిలోనూ గుండె నిబ్బరం చేసుకుని నేలపై పాకుతూ వెళ్లి భార్యను గుండెలకు హత్తుకున్నాడు. ‘ఏం కాదులే’ అని ధైర్యం చెప్పాడు. 108 వాహనంలోకి చేర్చే క్రమంలో ఆమెను దీనంగా చూస్తూ అంబులెన్స్ సిబ్బందితో.. ‘అన్నా.. తను జాగ్రత్త’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు.
భార్యను కాపాడేందుకు ఎంతగానో తపించిన ఆ భర్త చివరకు కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. అనంతపురం నగర శివారులోని నేషనల్ పార్క్ వద్ద 44వ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యాలు అక్కడి వారిని కంటతడి పెట్టించాయి. లారీ ఢీకొన్న ఘటనలో కిరణ్‌కుమార్ (42) మరణించగా.. అతడి భార్య అనిత తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నారు.
భర్త ఏఆర్ కానిస్టేబుల్.. భార్య టీచర్
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన కిరణ్‌కుమార్ 2003 బ్యాచ్‌కు చెందిన ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్. ఇదే ప్రాంతానికి చెందిన అనితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అనితకు టీచర్ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగ రీత్యా అనంతపురం శివారు కళ్యాణదుర్గం రోడ్డు ఎస్‌బీఐ కాలనీ రెండో క్రాస్‌లో నివాసం ఉంటున్నారు. కిరణ్‌కుమార్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వర్తిస్తుండగా.. అనిత తరిమెల జెడ్పీ హైసూ్కల్‌లో టీచర్. వీరికి యశ్వంత్ నారాయణ, మణిదీప్ ఇద్దరు సంతానం. రోజూ ఉదయం భార్యను సోములదొడ్డి క్రాస్‌కు బైక్‌పై తీసుకెళ్లి.. ఆర్టీసీ బస్సులో తరిమెలకు పంపించడం కిరణ్‌కుమార్ దినచర్య.
బుధవారం ఉదయం 8 గంటల సమయంలో కిరణ్‌కుమార్ భార్యతో కలిసి సోములదొడ్డి బస్‌స్టాప్ వద్దకు ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. 44వ జాతీయ రహదారిపై నుంచి నేషనల్ పార్క్ వద్ద సరీ్వసు రోడ్డులోకి వచ్చే క్రమంలో లారీ ఢీకొంది. బైక్‌పై నుంచి ఎగిరి కిందపడ్డ కిరణ్‌కుమార్ కాళ్లపై లారీ వెనుక టైర్లు వెళ్లాయి. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకోగానే అల్లంత దూరంలో భార్య అనిత పడి ఉండటం చూసి ఆమెను ఎలాగైనా కాపాడాలనుకున్నాడు. తన కాళ్లు ఛిద్రమైపోయినా శక్తినంతటినీ కూడదీసుకుని పాకుతూనే ఆమె వద్దకు చేరాడు. భార్యను చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు.
ముక్కు, చెవిలో రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరుకుంటున్న భార్యను చూసి ‘ఏమీ కాదు’ అంటూ ధైర్యం చెబుతూ కన్నీరు పెట్టుకున్నాడు. ఆమెను అంబులెన్స్‌లోకి ఎక్కించిన తరువాత అపస్మారక స్థితిలోకి చేరాడు. దంపతులిద్దరినీ 108 వాహనంలో సర్వజనాస్పత్రికి తీసుకెళ్లగా.. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ప్రథమ చికిత్స చేసి బెంగళూరుకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కానిస్టేబుల్ కిరణ్‌కుమార్ మృతి చెందగా.. భార్య అనిత కోమాలోకి వెళ్లింది.
చదవండి: కుమారుడు పరీక్షలో తప్పాడని..తల్లి ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment