ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,కురవి(వరంగల్): విద్యుత్‌షార్ట్ సర్క్యూట్‌తో మంటలు లేచి రేకుల ఇల్లు కాలిపోయిన ఘటనలో మంచంలో నిద్రిస్తున్న వృద్ధురాలు బానోత్ బాజు(75) సజీవదహనమైంది. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కంచర్లగూడెం తండాలో మంగళవారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది. మృతురాలి భర్త బిచ్చా కథనం ప్రకారం.. తండాకు చెందిన బానోత్ బిచ్చా, బాజులు మంగళవారం రాత్రి భోజనం చేసిన తర్వాత తన రేకుల ఇంటిలో నిద్రించారు. బాజు ఒక మూలకు మంచం వేసుకోగా, బిచ్చా ఇంటి తలుపు ముందు మంచంపై పడుకున్నాడు. అర్ధరాత్రి 1.30గంటల నుంచి 2గంటల మధ్య విద్యుత్‌షార్ట్ సర్క్యూట్ రావడంతో నిప్పురవ్వలు ఎగిసి పడ్డాయి.
రేకుల ఇంటికి కింది భాగంలో తడకలు, గడ్డిపొరకలు ఉండడంతో మంటలు చెలరేగి మంచంలో పడుకుని ఉన్న బాజుకు అంటుకున్నాయి. బాజు కేకలు వేయడంతో బిచ్చా లోనికివెళ్లి భార్యను కాపాడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో బిచ్చా తలకు మంటలు అంటుకుని వెంట్రుకలు కాలిపోయాయి. బయటికి తీసుకురావడం సాధ్యంకాకపోవడంతో భయంతో బిచ్చా బయటకు పరుగులు తీశాడు. చుట్టు పక్కల జనం వచ్చి చూసే సరికి మంటలు పూర్తిగా వ్యాపించి ఇల్లు కాలిపోయింది.
మంచంపై పడుకుని ఉన్న బాజు మాంసం ముద్దలా మారింది. సమాచారం అందుకున్న కురవి ఎస్సై రాణాప్రతాప్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. శవపంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త బిచ్చా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment