
రాజయ్య, స్వరూప ( ఫైల్)
సాక్షి,వెంకటాపురం(వరంగల్): ఏడడుగులు నడిచారు. ఒకరినొకరు తోడునీడగా నిల్చున్నారు. కష్టసుఖాలను సమానంగా పంచుకున్నారు. ఆ భార్యాభర్తలను మృత్యువు కూడా వేరు చేయలేకపోయింది. ‘నీవెంటే నేనూ’అన్నట్లు భార్య మృతిచెందిన గంటలోపే భర్త కూడా కన్నుమూశాడు. ఈ విషాద ఘటన ములుగు జిల్లా వెంకటాపురం (ఎం) మండలకేంద్రంలోని తాళ్లపాడులో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మాసపత్రి రాజయ్య(75), అతని భార్య స్వరూప (70) తాళ్లపాడులో నివాసం ఉంటున్నారు. రాజయ్య భూపాలపల్లి సింగరేణిలో కార్మికుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందాడు.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం స్వరూపకు గుండెపోటు రావడంతో మృతిచెందింది. భార్య మృతిని జీర్ణించుకోలేని రాజయ్య తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. భార్య మృతిచెందిన గంటసేపటి తరువాత రాజయ్యకు కూడా గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే రాజయ్య మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాజయ్య– స్వరూపలకు ముగ్గురు కుమారులు ఉండగా, వారు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఇద్దరిని పక్కపక్కనే ఉంచి దహన సంస్కారాలు చేశారు. భార్య మృతిచెందిన గంటలోపే భర్త మృతిచెందడంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.
చదవండి: పెళ్లై ఇద్దరు పిల్లలు.. యువతితో ప్రేమాయణం.. గర్భం దాల్చడంతో
Comments
Please login to add a commentAdd a comment