ఈ ఏడాది 20 వేల హెక్టార్లకు పడిపోయిన సాగు విస్తీర్ణం
ఫ్యాక్టరీల క్రషింగ్ సామర్థ్యానికి అవసరమైన విస్తీర్ణంలో 30% మాత్రమే సాగు
నిజాం షుగర్ యూనిట్ల పరిధిలో దాదాపుగా కన్పించని చెరుకు పంట
పదేళ్ల క్రితం నుంచే ఒడిదుడుకులు
ధర గిట్టుబాటు కాక, కూలీల కొరత, ప్రభుత్వ ప్రోత్సాహం కొరవడటంతో ఇతర పంటల వైపు మళ్లుతున్న రైతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చెరుకు సాగు విస్తీర్ణం నానాటికీ పడిపోతుండగా, క్రషింగ్ సామర్థ్యానికి అనుగుణంగా చెరుకు లభ్యత లేక ఫ్యాక్టరీలు నష్టాల బాట పడుతున్నాయి. పంట గిట్టుబాటు కాక, కూలీల కొరత, ప్రభుత్వం ప్రోత్సాహం కరువు తదితర కారణాలతో రైతులు చెరుకు సాగుకు స్వస్తి చెప్పి ఇతర పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. రాష్ట్రంలోని 12 చక్కెర కర్మాగారాలకు గాను ఇప్పటికే ప్రభుత్వ, సహకార రంగంలోని నాలుగు ఫ్యాక్టరీలు మూతపడ్డాయి.
ఇలాంటి సమయంలో చెరు కు సాగులో కీలకమైన డ్రిప్ ఇరిగేషన్ (బిందు సే ద్యం) పరికరాలను సబ్సిడీపై రైతులకు ఇవ్వాల్సిన ప్రభుత్వం నామమాత్రపు విస్తీర్ణానికే సబ్సిడీని పరిమితం చేస్తోంది. దీంతో రాష్ట్రంలో ఫ్యాక్టరీల క్రషింగ్ సామర్థ్యానికి అవసరమైన విస్తీర్ణంలో సుమారు 30 శాతం మాత్రమే చెరుకు సాగవుతోంది. ప్రస్తుతం నిజాం డెక్కన్ షుగర్స్ లిమిటెడ్ యూని ట్లను తిరిగి పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. చెరుకు సాగు విస్తీర్ణం పెంచడంపై దృష్టి పెట్టాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మూడో వంతుకు చెరుకు సాగు
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న 12 చక్కెర కర్మాగారాల రోజువారీ చెరుకు క్రషింగ్ సామర్థ్యం 37,950 టన్నులు. సీజన్‌లో ఫ్యాక్టరీలు పూర్తి సామర్థ్యంతో క్రషింగ్ చేసేందుకు 4.33 లక్షల టన్నుల చెరుకు అవసరమవుతుంది. ఇందుకోసం 65,780 హెక్టార్లలో చెరుకు పంటను సాగు చేయాల్సి ఉంటుంది. అయితే పదేళ్ల క్రితం సాగైన రీతిలో ప్రస్తుతం చెరుకు సాగవడం లేదు. 2014–15లో 49,183 హెక్టార్లలో చెరుకు సాగవగా, మధ్యలో పెరుగుతూ, తగ్గుతూ ప్రస్తుతం 20,393 హెక్టార్లకు (అధికారుల అంచనా) చేరుకుంది.
నిజాం డెక్కన్ షుగర్స్ లిమిటెడ్ (2015లో మూతపడింది) పరిధిలోని మూడు యూనిట్లతో పాటు నిజామాబాద్ సహకార చక్కెర కర్మాగారం పూర్తి స్థాయి క్రషింగ్ సామర్థ్యానికి 14,733 హెక్టార్లలో చెరుకు సాగు జరగాల్సి ఉండగా, ప్రస్తుతం 951 హెక్టార్లకే పరిమితమైంది. నిజాం షుగర్స్ పరిధిలో ని మం¿ోజిపల్లి, బోధన్ యూనిట్ల పరిధిలో చెరుకు సాగు విస్తీర్ణం దాదాపు శూన్య స్థితికి చేరుకుంది.
ప్రభుత్వ ప్రోత్సాహమేదీ?
చెరుకు సాగును ప్రోత్సహించాల్సిన చెరుకు అభివృద్ధి మండళ్లు (సీడీసీ) పాత్ర నామమాత్రంగా తయారైంది. సీడీసీ వాటా కింద రైతులు, ఫ్యాక్టరీలు ఒక్కో టన్నుకు రూ.4 చొప్పున చెల్లిస్తున్నాయి. చెరుకు సాగు విస్తీర్ణం తగ్గిన నేపథ్యంలో సీడీసీకి సమకూరుతున్న మొత్తం కూడా అరకొరగా ఉండటంతో రైతులు స్ప్రేయర్ల వంటి పరికరాలను కూడా సొంతంగా సమకూర్చుకోవాల్సి వస్తోంది. మరోవైపు చెరుకు సాగుకు ప్రధాన ప్రతిబంధకంగా ఉన్న కూలీల కొరతను అధిగమించేందుకు యాంత్రీకరణ అవసరమున్నా ప్రభుత్వ ప్రోత్సాహం అందడం లేదు.
‘స్టేట్ నార్మల్ స్కీమ్’కింద 2014కు పూర్వం ట్రాక్టర్లు, హార్వెస్టర్లు తదితరాలను సమకూర్చుకునేందుకు రైతులకు సబ్సిడీ కింద రూ.16 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. తర్వాతి కాలంలో బడ్జెట్ కేటాయింపులు లేక చెరుకు సాగులో యాంత్రీకరణ అటకెక్కింది. మరోవైపు చెరుకు కనీస మద్దతు ధర (ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్) టన్నుకు రూ.3,150 ఉండగా, కనీసం రూ.4 వేలు ఎఫ్‌ఆర్‌పీ అన్నా ఉంటేనే గిట్టుబాటు అవుతుందని రైతులు చెప్తున్నారు.
గిట్టుబాటు కాక మానేశా
నేను ముప్పై ఏళ్లకు పైగా 40 ఎకరాల్లో చెరుకు సాగు చేశా. గాయత్రీ ఫ్యాక్టరీకి ఏటా రెండు వేల టన్నుల చెరుకు సరఫరా చేశా. అయితే రానురానూ పంట సాగుకు, చెరుకు నరకడానికి అయ్యే ఖర్చులు భారీగా పెరిగాయి. ప్రభుత్వ ప్రోత్సాహం కూడా లేకపోవడంతో గిట్టుబాటుకాక వదిలేశా. ఇతర పంటలు వేస్తున్నా. – సాయిరెడ్డి, తిప్పాపూర్, కామారెడ్డి జిల్లా
టన్నుకు రూ.500 బోనస్ ఇవ్వాలి
ఎకరానికి 30 నుంచి 40 టన్నుల దిగుబడి వచ్చినా చెరుకు సాగు గిట్టుబాటు కావడం లేదు. ఒక్కో ఎకరంలో చెరుకు సాగుకు రూ.50 వేల వరకు ఖర్చవుతోంది. చెరుకు సాగు విస్తీర్ణం పెరగాలంటే ఇతర పంటలకు ప్రకటించిన తరహాలోనే టన్నుకు రూ.500 బోనస్ ప్రకటించాలి. రికవరీ శాతంతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధర చెల్లించాలి. – రచ్చా నరసింహారావు, నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment