తేలని గానుగాట
సాంకేతికంగా సాధ్యం కాదని తేల్చిన చక్కెర శాఖ అధికారులు
క్రషింగ్ పై ఎమ్మెల్యే ఆశ
నేడు ఆప్కాబ్ అధికారుల చర్చలు
రేపు కేబినెట్ సమావేశంలో మరింత స్పష్టత
అనకాపల్లి: రాష్ట్రంలో ఈ సీజన్‌లో క్రషింగ్‌కు అనుమతి పొందని సహకార చక్కెర కర్మాగారాల్లో ఒకటైన తుమ్మపాల కర్మాగారం భవితవ్యంపై ఇంకా స్పష్టత రాలేదు. మిగిలిన సహకార చక్కెర కర్మాగారాల గానుగాట మూహూర్తాలు ఖరారు కావడంతో సన్నాహాలు జరుగుతుండగా తుమ్మపాలలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.
నేడు, రేపు కీలకం...
తుమ్మపాల చక్కెర కర్మాగార క్రషింగ్‌పై ఇప్పటికే చక్కెర శాఖ ఉన్నతాధికారులు అనుమతి నిరాకరించడంతో డోలాయమానంలో పడిన కర్మాగార ఎండీ వాస్తవాలను బయటకు చెప్పలేక బంతిని ఎమ్మెల్యే కోర్టులోకి నెట్టివేశారు. ప్రస్తుతం తుమ్మపాల చక్కెర కర్మాగార భవితవ్యం అనకాపల్లి ఎమ్మెల్యే పీలాకు చిక్కుముడిని తెచ్చిపెట్టింది. సాంకేతికంగా ఈ సీజన్‌లో క్రషింగ్‌కు అవకాశాలు ఏమాత్రం లేనప్పటికీ గతంలో ఎమ్మెల్యే పీలా ఇచ్చిన హామీ మేరకు కడదాకా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి నుంచి కూడా సానుకూల స్పందన రాకపోవడం ఎమ్మెల్యేకు ఇబ్బందులను రెట్టింపు చేసింది. ఈ ప్రతికూల పరిణాల నేపథ్యంలో అనకాపల్లి నియోజకవర్గ ప్రజల నుంచి ముఖ్యంగా రైతుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోలేక తుమ్మపాల క్రషింగ్ ఎలాగైనా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే చెబుతూ ఉంటే చక్కెర శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు తుమ్మపాల కర్మాగార యాజమాన్యం సన్నాహాలపై నీళ్లు చల్లారు. ఇక్కడ నెలకొన్న నైరాశ్యం వీడాలంటే ఆర్థిక చిక్కుముళ్లు తొలగిపోవాలి. ఈ క్రమంలో తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని ఆప్కాబ్ ఏజీఎం సోమవారం సందర్శించి ఇక్కడి పరిస్థితులపై ఆరా తీశారు.
కర్మాగార ఆర్థిక స్థితిగతుల తోపాటు గోదాముల్లో ఉన్న చక్కెర నిల్వలపై తనిఖీలు జరిపారు. మంగళవారం విశాఖలో ఆప్కాబ్ అధికారులు నిర్వహించనున్న సమావేశంలో తుమ్మపాల అంశంపై చర్చించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే తుమ్మపాల కర్మాగారం అప్పులు ఆప్కాబ్‌కు సైతం చికాకు తెప్పిస్తుంటే కొత్తగా ఎలా అప్పులివ్వాలని ఆప్కాబ్ అధికారులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ఈనెల 16న జరిగే కేబినెట్ సమావేశంలో సహకార చక్కెర కర్మాగారాలపై చర్చకు వచ్చే అవకాశముంది. అదే సమయంలో తుమ్మపాలపై పూర్తి స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
అసెంబ్లీయే ఆఖరి అవకాశం
తుమ్మపాల చక్కెర కర్మాగారంలో ఈ సీజన్‌కు క్రషింగ్ జరగకపోతే పరిణామాలు మూతపడే స్థితికి చేరుస్తాయని కర్మాగార వర్గాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్రషింగ్ జరుగుతుందని హామీలు వస్తున్నా తుమ్మపాల పరిధిలోని చెరకును ఏటికొప్పాక కర్మాగారానికి తరలించవచ్చనే ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయని తెలిసింది. ఈ ఏడాది గానుగాటకు సంబంధించి సుగర్‌కేన్ కమిషనర్ సూచనలు ప్రతికూలంగా ఒకవైపు ఉంటే గానుగాటపై తమ భవితవ్యాన్ని ఊహించుకుంటూ కార్మికులు, రైతులు తీపికబురు కోసం ఎదురు చూస్తున్నారు.
కార్మికుల దయనీయ స్థితి
తుమ్మపాల చక్కెర కర్మాగారంలో ఈ సీజన్‌కు సంబంధించి 30 మంది రెగ్యులర్ కార్మికులు, 150 మంది ఎన్‌ఎంఆర్ కార్మికులు పనిచేస్తున్నారు. గానుగాటపై దారులు మూసుకున్న నేపథ్యంలో ఓవర్‌హాలింగ్ కోసం ఖర్చు చేసిన 40 లక్షలు, ఎన్‌ఎంఆర్‌లకు చెల్లించాల్సిన జీతాలు మరింత భారం కానున్నాయి. ఇదే సమయంలో కార్మికుల ఉద్యోగ బకాయిలు 2.76 కోట్లు, రైతులకు చెల్లించాల్సిన బకాయిలు 2 కోట్లు, కార్మికుల పీఎఫ్ కోటి 40 లక్షలు, గ్రాడ్యుటీ కోటి 15 లక్షలు, ఆప్కాబ్ రుణం 3.5 కోట్లు, ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన 4 కోట్లతో పాటు, విద్యుత్ చార్జీలు, పెండింగ్ బిల్లులు లక్షల్లో పేరుకుపోయాయి. దీంతో ఆర్థికంగా పరపతి కోల్పోయిన తుమ్మపాల చక్కెర కర్మాగారంలో ఆర్థిక కష్టాలు మరింత జటిలమయ్యాయి. ఈ కారణంగా భవితవ్యంపై ఆందోళనతో ఉన్న కొందరు ఎన్‌ఎంఆర్ కార్మికులు జీతాలు లేక అలమటిస్తూ రాత్రుళ్లు పరవాడ ఫార్మాసిటీలో అదనంగా విధులు నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది.