Cooperative sugar factories
-
‘చోడవరం’లో గ్రీన్ ఫీల్డ్ ఇథనాల్ ప్లాంట్
సాక్షి, అమరావతి: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సహకార చక్కెర కర్మాగారాలను తిరిగి బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా పంచదార ఉత్పత్తికంటే అధికాదాయాన్నిచ్చే బయో ఇథనాల్ ఉత్పత్తిని పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటోంది. తద్వారా చెరకు రైతులను అన్ని విధాలా ఆదుకోనుంది. తొలి దశలో అనకాపల్లి జిల్లా చోడవరంలోని చోడవరం సహకార సంఘ చక్కెర కర్మాగారంలో గ్రీన్ ఫీల్డ్ బయో ఇథనాల్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రోజుకు 60 కిలోలీటర్ల ఇథనాల్‌ను ఉత్పత్తి చేసేలా ఈ యూనిట్ ఏర్పాటుకానుంది. చోడవరం చక్కెర కర్మాగారంలో బయో ఇథనాల్ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి కోసం దరఖాస్తు చేయగా.. జూలై 10న అనుమతులు మంజూరు చేసి పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదికను పంపాల్సిందిగా కేంద్రం కోరింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక కోసం కన్సల్టెన్సీ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. ప్రాజెక్టు ఎంత వ్యయం అవుతుంది.. ముడిపదార్థాలు ఎంత అవసరం.. ఆదాయం.. రుణం ఎంత కాలంలో తీర్చగలం? వంటి అన్ని అంశాలతో ఈ నివేదికను తయారు చేయాల్సిందిగా కోరింది. ఆసక్తి గల సంస్థలు ఆగస్టు 28లోగా దాఖలు చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని కలిపి వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే లీటరు పెట్రోలో 10 శాతం ఇథనాల్ కలుపుతుండగా, ఈ మొత్తాన్ని 2025–26 నాటికి 20 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుని ఆ మేరకు మిగులు ధాన్యాల నుంచి ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించేలా ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్(ఈబీపీ) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం బయో ఇథనాల్‌లో పెద్ద ఎత్తున పరిశ్రమలను ఆకర్షించేలా ప్రత్యేకంగా ఓ పాలసీనే తీసుకొచ్చింది. ఇప్పుడు సహకార చక్కెర కర్మాగారాల్లో కూడా బయో ఇథనాల్ యూనిట్లను ఏర్పాటు చేయడం ద్వారా వాటిని ఆర్థికంగా పరిపుష్టి చేయనుంది. -
చక్కెర ఫ్యాక్టరీలకు పునర్ వైభవం
వైఎస్సార్ చేయూత ద్వారా వచ్చే నాలుగేళ్లలో మహిళలకు పెద్ద ఎత్తున ఆర్థిక లబ్ధి చేకూరుస్తున్నాం. తద్వారా డెయిరీ కార్యక్రమాల ద్వారా వారి ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. రానున్న రోజుల్లో సహకార డెయిరీల బలోపేతం, డెయిరీ రంగంలో మహిళల భాగస్వామ్యం, పాడి పశువులను గణనీయంగా పెంచడమనే మూడు కోణాల్లో కార్యక్రమాలు విస్తృతం చేస్తాం. సహకార చక్కెర ఫ్యాక్టరీలపై పెట్టే ప్రతి పైసా సద్వినియోగం కావాలి. సొంత కాళ్ల మీద ఫ్యాక్టరీ నిలబడాలి. రైతులు ఆనందంగా ఉండాలి. అప్పుడు కొంత, ఇప్పుడు కొంత ఇచ్చి.. అటూ ఇటూ కాకుండా ఫ్యాక్టరీని, రైతులను ఇబ్బంది పెట్టొద్దు. రెండు మూడేళ్లలో వీటిని అత్యంత ఆధునిక పరిశ్రమలుగా తీర్చిదిద్దాలి. సాక్షి, అమరావతి : రాష్ట్రంలో సహకార చక్కెర ఫ్యాక్టరీలు, డెయిరీల పునర్ వైభవానికి సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పని చేస్తున్న ఫ్యాక్టరీలను మరింత బలోపేతం చేయడంతో పాటు మూత పడిన వాటిని తెరిపించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇప్పుడున్న పోటీని తట్టుకుని, లాభదాయకంగా నడపడానికి తీసుకోవాల్సిన చర్యలను అందులో పొందుపరచాలన్నారు. సహకార చక్కెర ఫ్యాక్టరీలు, సహకార డెయిరీలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తాజా సాంకేతిక పరిజ్ఞానంతో కర్మాగారాలను అభివృద్ధి చేయడంతోపాటు ఉప ఉత్పత్తుల ద్వారా అవి సొంతకాళ్ల మీద నిలబడేందుకు అవసరమైన ఆలోచనలు చేయాలని సీఎం సూచించారు. చెరకు సరఫరా చేసిన రైతులకు బకాయిలను చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా చెరకు పంట సాగు, సహకార చక్కెర ఫ్యాక్టరీల పరిస్థితి గురించి అధికారులు సీఎంకు నివేదించారు. ఫ్యాక్టరీల వారీగా రైతుల బకాయిలు, రుణాలు.. తదితర అంశాలపై సీఎం అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, పశు సంవర్థక, మత్స్య, మార్కెటింగ్ శాఖల మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. చక్కెర ఫ్యాక్టరీల పరిస్థితి ఇదీ.. - దేశంలో 330.70 లక్షల మెట్రిక్ టన్నుల పంచదార ఉత్పత్తి అవుతోంది. అత్యధికంగా 116.7 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో ఉత్తరప్రదేశ్ దేశంలో మొదటి స్థానంలో ఉండగా, 5.02 లక్షల మెట్రిక్ టన్నులతో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉంది. కాగా రాష్ట్రంలో 10.23 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెర డిమాండ్ ఉంది. - ఒక్కో హెక్టారుకు చెరకు ఉత్పత్తిలో 105 మెట్రిక్ టన్నులతో తమిళనాడు దేశంలో ప్రథమ స్థానంలో ఉండగా, 78 మెట్రిక్ టన్నులతో ఏపీ ఏడో స్థానంలో ఉంది. - మన రాష్ట్రంలో 29 చక్కెర కర్మాగారాలకుగాను 18 మాత్రమే పని చేస్తున్నాయి. మహారాష్ట్రలో 264 ఉంటే 195 పనిచేస్తున్నాయి. - రాష్ట్రంలో 2006–07లో 100.91 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్ అయ్యేది. 2018–19 నాటికి అది 54.05 లక్షల టన్నులకు పడిపోయింది. - సహకార చక్కెర ఫ్యాక్టరీలకు సంబంధించి విజయనగరం జిల్లా భీమసింగిలోని విజయరామగజపతి, విశాఖపట్నం జిల్లా చోడవరం, ఏటికొప్పాక, తాండవ ఫ్యాక్టరీలు మాత్రమే ప్రస్తుతం రాష్ట్రంలో పని చేస్తున్నాయి. అనకాపల్లి (ఎన్నికల ముందు ప్రారంభమైనా మళ్లీ మూత), గుంటూరు జిల్లా జంపని, నెల్లూరు జిల్లా కోవూరు, చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలోని శ్రీ వెంకటేశ్వర, చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీ, కడప సమీపంలోని చెన్నూరు సుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. పది సహకార సుగర్ ఫ్యాక్టరీలపై రూ.891.13 కోట్ల భారం ఉంది. సీఎం సూచనలు, ఆదేశాలు.. - సహకార ఫ్యాక్టరీల నుంచి రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించేలా దృష్టి సారించాలి. - ప్రస్తుతం నడుస్తున్న నాలుగు సహకార చక్కెర ఫ్యాక్టరీలను పూర్తి స్థాయిలో ఆధునికీకరించడానికి, మూత పడిన వాటిని తెరవడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయండి. - వైఎస్సార్ జిల్లా చెన్నూరు, చిత్తూరు జిల్లా గాజులమండ్యం, విశాఖ జిల్లా అనకాపల్లి ఫ్యాక్టరీలను వెంటనే పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి. - తెరవడానికి అవకాశం లేని సహకార చక్కెర కర్మాగారాల విషయంలో ఉన్న బకాయిలను తీర్చడానికి ఏం చేయాలన్న దానిపై ప్రణాళిక సిద్ధం చేయండి. - మొలాసిస్ లాంటి ఉప ఉత్పత్తుల వల్ల ఆర్థిక ప్రయోజనం సమకూరే మార్గాలపైనా దృష్టిపెట్టాలి. - ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, ఇతరత్రా అంశాలపై దృష్టి సారించాలి. - సహకార డెయిరీలను మరింత బలోపేతం చేయడంతోపాటు, తద్వారా రైతులకు మరింత లబ్ధి చేకూర్చాలి. - ఎన్నికల ప్రణాళికలో నిర్దేశించిన విధంగా సహకార డెయిరీలకు పాలు పోస్తున్న రైతుకు ప్రతి లీటరుకు రూ.4ల బోనస్ ఇచ్చేలా ప్రతిపాదనలు రూపొందించాలి. - సహకార డెయిరీలు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ల స్థితిగతులను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలి. డెయిరీల సామర్థ్యాన్ని పెంచేందుకు, మార్కెటింగ్‌లో కొత్త వ్యూహాలు దిశగా అడుగులు వేయాలి. ఇందులో భాగంగా ప్రముఖ బ్రాండ్ల భాగస్వామ్యం దిశగా ఆలోచించాలి. - రాష్ట్రంలో చెరకు సాగు తగ్గకుండా మరింత పెరిగేలా, నాణ్యత ఉండేలా వ్యవసాయ శాఖ దృష్టి సారించాలి. చెరకు నాటడానికి, కటింగ్‌కు ఫ్యాక్టరీ ద్వారా అత్యాధునిక పరికరాలను రైతులకు అందించేలా చూడాలి. అధిక దిగుబడి కోసం తమిళనాడు విధానాలను పరిశీలించండి. -
రైతన్నకు తీపి కబురు
సాక్షి, శ్రీకాకుళం: రోజుకు 1,250 టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో దాదాపు పదివేల మంది రైతులకు, ప్రత్యక్షంగా పరోక్షంగా మరో రెండు మూడు వేల మంది కార్మికులు, ఉద్యోగుల జీవితానికి ఒకప్పుడు భరోసాగా ఉన్న ఆమదాలవలస చక్కెర కర్మాగారానికి చెల్లుచీటి రాసేసింది టీడీపీ ప్రభుత్వ హయాంలోనే! నాడు జిల్లాకే తలమానికంగా ఉన్న ఈ ఫ్యాక్టరీని సహకార రంగ చట్టాన్ని మార్చేసి మరీ వేలంవేసి అమ్మేశారు! ఇది వాస్తవానికి జిల్లాలోని 9,374 మంది వాటాదారులతో సహకార రంగంలో ఆమదాలవలస పట్టణానికి ఆనుకొని 1962లో ప్రారంభమైంది. 1990వ దశకం వరకూ బాగానే నడిచింది. తర్వాత నష్టాలు మొదలయ్యాయి. వాటిని సాకుగా చూపించి 2001లో నాటి చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ జపం మొదలెట్టింది. వాటాదారులు, కార్మికులు, చివరకు కర్మాగార నిర్వహణ మండలి (బోర్డు) తీవ్రంగా వ్యతిరేకించినా పునరాలోచించలేదు. 2018 జూన్ 28 ఆమదాలవలస మండలంలోనే జరిగిన ఏరువాక ప్రారంభ కార్యక్రమానికి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఏరువాకలో తమకేదో వరాల జల్లు కురిపిస్తారనుకుంటే నోట చేదు గుళికలు వేశారు. ‘ఆమదాలవలస చక్కెర కర్మాగారాన్ని తెరిచే పరిస్థితి లేదు. ఫ్యాక్టరీ భూమిలో ఐటీ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేస్తాం’ అని కుండబద్దలు కొట్టారు. 2001లోనే ఈ ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టిన ఆయనే 2014 ఎన్నికల ప్రచారం సమయంలో పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడం గమనార్హం. 2019 జూన్ 10 నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో తొలి కేబినెట్ సమావేశం జరిగింది. ఆయన తీసుకున్న పలు సంచలన నిర్ణయాల్లో మూతపడిన సహకార రంగ చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ కూడా ఒకటి. గత ఏడాది నవంబరు నెలలో ఆమదాలవలస మీదుగా సాగిన ప్రజాసంకల్పయాత్రలో రైతులకు మాట ఇచ్చారు. సహకార రంగంలో చక్కెర కర్మాగారాలను తిరిగి తెరిపిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కేబినెట్ తొలి సమావేశంలోనే సానుకూల సంకేతాలు ఇచ్చారు. భారం తడిసిమోపెడు... 2001లో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ నాడు చక్కెర కర్మాగారం డైరెక్టరుగా ఉన్న లక్ష్మీనాయుడు హైకోర్టును ఆశ్రయించారు. సహకార చట్టం ప్రకారం కోఆపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీ ఆస్తులు అమ్మడానికి ప్రభుత్వానికి అధికారం లేదని న్యాయస్థానం ఇచ్చిన తీర్పు నుంచి తప్పించుకోవడానికి ఏకంగా ఆ చట్టంలోనే మార్పులు చేసింది చంద్రబాబు సర్కారు! వేలంలో జీఎమ్మార్ అనుబంధ సంస్థ అంబికా లామినేషన్స్ రూ.6.20 కోట్లకు దక్కించుకుంది. అది కూడా కర్మాగారాన్ని నడపలేదు సరికదా పూర్తిగా మూతవేసింది. ఈ బదలాయింపును సవాలు చేస్తూ కో–ఆపరేటివ్ సభ్యులు, రైతులు మరోసారి హైకోర్టును ఆశ్రయించి 2016 మార్చిలో సానుకూలంగా తీర్పు సాధించారు. కొనుగోలు సంస్థతో ఆర్థిక లావాదేవీలను పరిష్కరించేందుకు ఐఏఎస్ అధికారి కె.సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. ఆ ప్రకారం చక్రవడ్డీతో కలిపి మొత్తం రూ.22 కోట్లను అంబికా లామినేషన్స్‌కు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ద్వారా చెల్లించాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్యాక్టరీకి చెందిన దాదాపు 74 ఎకరాల భూమి ఏపీఐఐసీ ఆధీనంలోకి రావడంతో అక్కడ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తానని గత ఏడాది జూన్‌లో జరిగిన ఏరువాక కార్యక్రమంలో చంద్రబాబు ప్రకటించి రైతులను నిరాశకు గురిచేశారు. డామిట్ కథ అడ్డం తిరిగింది... విశాఖ–హౌరా రైల్వే మార్గంలో, అలాగే జాతీయ రహదారికి సమీపంలోనున్న ఆమదాలవలస పట్టణం దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ పట్టణానికి ఆనుకొనే ఉన్న ఫ్యాక్టరీకి చెందిన 74 ఎకరాలపైనా టీడీపీ నాయకులు కన్నేశారు. మార్కెట్ రేటు ప్రకారం దాదాపు రూ.600 కోట్ల విలువైన ఈ భూమిని హస్తగతం చేసుకొనేందుకు చురుగ్గా పావులు కదిపారు. అదే సమయంలో ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆమదాలవలస వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని రైతులు కలిశారు. చక్కెర కర్మాగారాన్ని రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్ల వ్యయంతో పునరుద్ధరిస్తే ఆమదాలవలస, శ్రీకాకుళం, నరసన్నపేట, పాతపట్నం, పాలకొండ నియోజకవర్గాల్లో రైతులకు మేలు జరుగుతుందని విన్నవించారు. వంశధార ప్రాజెక్టు పూర్తయితే సాగునీరు కూడా పుష్కలంగా లభిస్తుందని, చెరకు సాగుకు కలిసివస్తుందని వారి ఆశ. జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో టీడీపీ నేతల పథకం పారలేదు. సహకార రంగంలో మూతపడిన చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కేబినెట్ తొలి సమావేశంలోనే నిర్ణయించడం రైతులకు తీపికబురే! రైతుల కల నెరవేరనుంది మూతబడిన చక్కెర ఫ్యాక్టరీని తెరిపించుకోవాలనే రైతుల కల యువ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో సాధ్యమవుతోంది. ఆయన ఆదేశాలు శుభ పరిణామం. ఆమదాలవలసకు పూర్వవైభవం రానుంది. వరి సాగుతో నష్టపోతున్న రైతులు చెరుకు ప్రత్యామ్నాయంగా సాగుచేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. – చల్లా సింహాచలం, రైతు, రామచంద్రాపురం, ఆమదాలవలస మండలం రాజన్న రాజ్యం చూడబోతున్నాం.... మంత్రివర్గ తొలి సమావేశంలోనే రైతన్నలకు జగన్ తీపి కబురు వినిపించారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి గతంలో చాలా మంది నేతలు గెలిచినా తర్వాత చక్కెర ఫ్యాక్టరీ కోసం పట్టించుకోలేదు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం జగనన్న సానుకూలంగా స్పందించారు. మళ్లీ రాజన్న రాజ్యం చూడబోతున్నాం. – అన్నెపు నీలాద్రిరావు, రైతు, తొగరాం, ఆమదాలవలస మండలం -
తేలని గానుగాట
సాంకేతికంగా సాధ్యం కాదని తేల్చిన చక్కెర శాఖ అధికారులు క్రషింగ్ పై ఎమ్మెల్యే ఆశ నేడు ఆప్కాబ్ అధికారుల చర్చలు రేపు కేబినెట్ సమావేశంలో మరింత స్పష్టత అనకాపల్లి: రాష్ట్రంలో ఈ సీజన్లో క్రషింగ్‌కు అనుమతి పొందని సహకార చక్కెర కర్మాగారాల్లో ఒకటైన తుమ్మపాల కర్మాగారం భవితవ్యంపై ఇంకా స్పష్టత రాలేదు. మిగిలిన సహకార చక్కెర కర్మాగారాల గానుగాట మూహూర్తాలు ఖరారు కావడంతో సన్నాహాలు జరుగుతుండగా తుమ్మపాలలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. నేడు, రేపు కీలకం... తుమ్మపాల చక్కెర కర్మాగార క్రషింగ్‌పై ఇప్పటికే చక్కెర శాఖ ఉన్నతాధికారులు అనుమతి నిరాకరించడంతో డోలాయమానంలో పడిన కర్మాగార ఎండీ వాస్తవాలను బయటకు చెప్పలేక బంతిని ఎమ్మెల్యే కోర్టులోకి నెట్టివేశారు. ప్రస్తుతం తుమ్మపాల చక్కెర కర్మాగార భవితవ్యం అనకాపల్లి ఎమ్మెల్యే పీలాకు చిక్కుముడిని తెచ్చిపెట్టింది. సాంకేతికంగా ఈ సీజన్లో క్రషింగ్‌కు అవకాశాలు ఏమాత్రం లేనప్పటికీ గతంలో ఎమ్మెల్యే పీలా ఇచ్చిన హామీ మేరకు కడదాకా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి నుంచి కూడా సానుకూల స్పందన రాకపోవడం ఎమ్మెల్యేకు ఇబ్బందులను రెట్టింపు చేసింది. ఈ ప్రతికూల పరిణాల నేపథ్యంలో అనకాపల్లి నియోజకవర్గ ప్రజల నుంచి ముఖ్యంగా రైతుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోలేక తుమ్మపాల క్రషింగ్ ఎలాగైనా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే చెబుతూ ఉంటే చక్కెర శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు తుమ్మపాల కర్మాగార యాజమాన్యం సన్నాహాలపై నీళ్లు చల్లారు. ఇక్కడ నెలకొన్న నైరాశ్యం వీడాలంటే ఆర్థిక చిక్కుముళ్లు తొలగిపోవాలి. ఈ క్రమంలో తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని ఆప్కాబ్ ఏజీఎం సోమవారం సందర్శించి ఇక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. కర్మాగార ఆర్థిక స్థితిగతుల తోపాటు గోదాముల్లో ఉన్న చక్కెర నిల్వలపై తనిఖీలు జరిపారు. మంగళవారం విశాఖలో ఆప్కాబ్ అధికారులు నిర్వహించనున్న సమావేశంలో తుమ్మపాల అంశంపై చర్చించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే తుమ్మపాల కర్మాగారం అప్పులు ఆప్కాబ్‌కు సైతం చికాకు తెప్పిస్తుంటే కొత్తగా ఎలా అప్పులివ్వాలని ఆప్కాబ్ అధికారులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ఈనెల 16న జరిగే కేబినెట్ సమావేశంలో సహకార చక్కెర కర్మాగారాలపై చర్చకు వచ్చే అవకాశముంది. అదే సమయంలో తుమ్మపాలపై పూర్తి స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. అసెంబ్లీయే ఆఖరి అవకాశం తుమ్మపాల చక్కెర కర్మాగారంలో ఈ సీజన్‌కు క్రషింగ్ జరగకపోతే పరిణామాలు మూతపడే స్థితికి చేరుస్తాయని కర్మాగార వర్గాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్రషింగ్ జరుగుతుందని హామీలు వస్తున్నా తుమ్మపాల పరిధిలోని చెరకును ఏటికొప్పాక కర్మాగారానికి తరలించవచ్చనే ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయని తెలిసింది. ఈ ఏడాది గానుగాటకు సంబంధించి సుగర్కేన్ కమిషనర్ సూచనలు ప్రతికూలంగా ఒకవైపు ఉంటే గానుగాటపై తమ భవితవ్యాన్ని ఊహించుకుంటూ కార్మికులు, రైతులు తీపికబురు కోసం ఎదురు చూస్తున్నారు. కార్మికుల దయనీయ స్థితి తుమ్మపాల చక్కెర కర్మాగారంలో ఈ సీజన్‌కు సంబంధించి 30 మంది రెగ్యులర్ కార్మికులు, 150 మంది ఎన్ఎంఆర్ కార్మికులు పనిచేస్తున్నారు. గానుగాటపై దారులు మూసుకున్న నేపథ్యంలో ఓవర్‌హాలింగ్ కోసం ఖర్చు చేసిన 40 లక్షలు, ఎన్‌ఎంఆర్‌లకు చెల్లించాల్సిన జీతాలు మరింత భారం కానున్నాయి. ఇదే సమయంలో కార్మికుల ఉద్యోగ బకాయిలు 2.76 కోట్లు, రైతులకు చెల్లించాల్సిన బకాయిలు 2 కోట్లు, కార్మికుల పీఎఫ్ కోటి 40 లక్షలు, గ్రాడ్యుటీ కోటి 15 లక్షలు, ఆప్కాబ్ రుణం 3.5 కోట్లు, ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన 4 కోట్లతో పాటు, విద్యుత్ చార్జీలు, పెండింగ్ బిల్లులు లక్షల్లో పేరుకుపోయాయి. దీంతో ఆర్థికంగా పరపతి కోల్పోయిన తుమ్మపాల చక్కెర కర్మాగారంలో ఆర్థిక కష్టాలు మరింత జటిలమయ్యాయి. ఈ కారణంగా భవితవ్యంపై ఆందోళనతో ఉన్న కొందరు ఎన్ఎంఆర్ కార్మికులు జీతాలు లేక అలమటిస్తూ రాత్రుళ్లు పరవాడ ఫార్మాసిటీలో అదనంగా విధులు నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. -
సుగర్ పెరుగుతోంది..
వ్యాట్ పోటుతో కొనుగోళ్ల స్తంభన గణనీయంగా పడిపోయిన ధర గోదాముల్లో భారీగా పంచదార నిల్వలు సహకార చక్కెర కర్మాగారాలు నష్టాలతో అవస్థలు పడుతున్నాయి. టన్నుల కొద్దీ పేరుకుపోయిన పంచదార నిల్వలు భారంగా మారాయి. వాటిని వదిలించుకునే మార్గం లేక జిల్లాలోని సుగర్ ఫ్యాక్టరీలు సతమతమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మోపిన వ్యాట్, ఎగుమతి సుంకాలు పంచదార కొనుగోళ్లకు గుదిబండగా మారాయి. విశాఖపట్నం: యూపీఏ ప్రభుత్వంలో అప్పటి కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు క్వింటాలు పంచదార ధర రూ.3 వేలకు పైనే ఉండేది. పంచదార ఉత్పత్తి వ్యయం రూ.3 వేలవుతోంది. ఇతర ఆదాయ వనరులతో సుగర్ ఫ్యాక్టరీలు ఆర్థికంగా లాభపడ్డాయి. కానీ ఏడాది నుంచి పరిస్థితి తారుమారయ్యింది. క్వింటాలు పంచదార రూ.2200లకు పడిపోయింది. ఇప్పుడది మరింతగా దిగజారి రూ.2050లు పలుకుతోంది. అంటే ఏడాది క్రితంతో పోల్చుకుంటే క్వింటాలు వద్ద రూ.వెయ్యి చొప్పున జిల్లాలోని నాలుగు చక్కెర కర్మాగారాలకు రూ.80 కోట్ల నష్టం వాటిల్లుతోందన్న మాట! దీంతో రైతులకు నెలల తరబడి బకాయిలు తీర్చలేని పరిస్థితి తలెత్తింది. వాస్తవానికి కర్మాగారం యాజమాన్యాలు తమ వద్ద ఉన్న పంచదార నిల్వలపై అప్పు తెచ్చి రైతుల బకాయిలు చెల్లిస్తుంటాయి. పంచదార అమ్మకం జరిగాక అప్పులు తీరుస్తుంటాయి. అయితే ఈ సంవత్సరం నిల్వలు అమ్ముదామంటే కొనేవారే కరువయ్యారు. జిల్లాలోని గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో 4.65 లక్షల క్వింటాళ్లు, ఏటికొప్పాకలో 1.40 లక్షలు, తాండవలో 1.60 లక్షలు, తుంపాలలో 20 వేల క్వింటాళ్ల వెరసి దాదాపు ఎనిమిది లక్షల క్వింటాళ్ల పంచదార నిల్వలున్నాయి. ఎందుకిలా? రాష్ట్ర ప్రభుత్వం పంచదార కొనుగోళ్లపై వ్యాట్, కొత్తగా ఎగుమతి సుంకాలను విధిస్తోంది. దీంతో క్వింటాలుపై వ్యాట్ చార్జి కింద రూ.150లు, ఎగుమతి సుంకం కింద రూ.60-70లు చొప్పున కొనుగోలుదారుడు ప్రభుత్వానికి అదనంగా చెల్లించాల్సి వస్తోంది. పొరుగున ఉన్న కర్నాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్రల్లో ఈ బాదుడు లేదు. దీంతో బడా వర్తకులు మన పంచదారను కాదని ఆయా రాష్ట్రాల వైపే మొగ్గు చూపుతున్నారు. స్థానికంగా కొనుగోలు చేసే వారు కూడా తక్కువ ధరకే దొరికే పొరుగు రాష్ట్రాల పంచదార వైపే ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా జిల్లాలోని ఫ్యాక్టరీల్లో నిల్వలు కొండల్లా పేరుకుపోతున్నాయి. చక్కెర కర్మాగారాలను సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో చాలా సుగర్ ఫ్యాక్టరీలు నష్టాల్లో చిక్కుకుని మూతపడ్డాయి. మరికొన్ని ఆ దిశగా పయనిస్తున్నాయి. ఎప్పుడూ లాభాల్లో నడిచే గోవాడ ఫ్యాక్టరీ కూడా ఆర్థిక సంక్షోభంలో పడింది. మరోవైపు రైతులకు గత సీజను బకాయిలతో పాటు రాయితీపై ఇచ్చే ఎరువులను కూడా కర్మాగారాలు రైతులకు అందించలేక పోతున్నాయి. దీంతో ఖరీఫ్ సీజనులో పెట్టుబడులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం చెరకు రైతులకు రూ.6 వేల కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆ సొమ్మును రైతుల ఖాతాల్లో నేరుగా వేయనుంది. ఇది కొంతవరకు రైతులకు ఊరటినిచ్చే అంశం. ప్రభుత్వం ఆదుకోవాలి.. సంక్షోభంలో ఉన్న చక్కెర కర్మాగారాలను ప్రభుత్వం ఆదుకోవాలి. చక్కె ర ధర పెంచాలి. మార్కెట్ ధరను స్థిరీకరించాలి. క్వింటాలుకు కనీసం రూ.3 వేలు చేయాలి. వ్యాట్ రద్దు చేస్తే కొనుగోలుదార్లు ముందుకొస్తారు. దాంతో నిల్వలు క్లియర్ అవుతాయి. లేదంటే సుగర్ ఫ్యాక్టరీల మనుగడకు ప్రభుత్వం గ్రాంటు రూపంలో ఆర్థిక సాయం అందించాలి. -వి.వి.రమణారావు, ఎమ్.డి., గోవాడ సుగర్స్.