సుగర్ పెరుగుతోంది.. | Sugar is growing .. | Sakshi
Sakshi News home page

సుగర్ పెరుగుతోంది..

Published Wed, Jul 15 2015 11:42 PM | Last Updated on Sun, Sep 3 2017 5:33 AM

సుగర్  పెరుగుతోంది..

సుగర్ పెరుగుతోంది..

వ్యాట్ పోటుతో కొనుగోళ్ల స్తంభన
గణనీయంగా పడిపోయిన ధర
గోదాముల్లో భారీగా పంచదార నిల్వలు

 
సహకార చక్కెర కర్మాగారాలు నష్టాలతో అవస్థలు పడుతున్నాయి. టన్నుల కొద్దీ పేరుకుపోయిన పంచదార నిల్వలు భారంగా మారాయి. వాటిని వదిలించుకునే మార్గం లేక జిల్లాలోని సుగర్ ఫ్యాక్టరీలు సతమతమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మోపిన వ్యాట్, ఎగుమతి సుంకాలు పంచదార కొనుగోళ్లకు గుదిబండగా మారాయి.
 
విశాఖపట్నం: యూపీఏ ప్రభుత్వంలో అప్పటి కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు క్వింటాలు పంచదార ధర రూ.3 వేలకు పైనే ఉండేది. పంచదార ఉత్పత్తి వ్యయం రూ.3 వేలవుతోంది. ఇతర ఆదాయ వనరులతో సుగర్  ఫ్యాక్టరీలు ఆర్థికంగా లాభపడ్డాయి. కానీ ఏడాది నుంచి పరిస్థితి తారుమారయ్యింది. క్వింటాలు పంచదార రూ.2200లకు పడిపోయింది. ఇప్పుడది మరింతగా దిగజారి రూ.2050లు పలుకుతోంది. అంటే ఏడాది క్రితంతో పోల్చుకుంటే క్వింటాలు వద్ద రూ.వెయ్యి చొప్పున జిల్లాలోని నాలుగు చక్కెర కర్మాగారాలకు రూ.80 కోట్ల నష్టం వాటిల్లుతోందన్న మాట! దీంతో రైతులకు నెలల తరబడి బకాయిలు తీర్చలేని పరిస్థితి తలెత్తింది. వాస్తవానికి కర్మాగారం యాజమాన్యాలు తమ వద్ద ఉన్న పంచదార నిల్వలపై అప్పు తెచ్చి రైతుల బకాయిలు చెల్లిస్తుంటాయి. పంచదార అమ్మకం జరిగాక అప్పులు తీరుస్తుంటాయి. అయితే ఈ సంవత్సరం నిల్వలు అమ్ముదామంటే కొనేవారే కరువయ్యారు. జిల్లాలోని గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో 4.65 లక్షల క్వింటాళ్లు, ఏటికొప్పాకలో 1.40 లక్షలు, తాండవలో 1.60 లక్షలు, తుంపాలలో 20 వేల క్వింటాళ్ల  వెరసి దాదాపు ఎనిమిది లక్షల క్వింటాళ్ల పంచదార నిల్వలున్నాయి.

 ఎందుకిలా?
 రాష్ట్ర ప్రభుత్వం పంచదార కొనుగోళ్లపై వ్యాట్, కొత్తగా ఎగుమతి సుంకాలను విధిస్తోంది. దీంతో క్వింటాలుపై వ్యాట్ చార్జి కింద రూ.150లు, ఎగుమతి సుంకం కింద రూ.60-70లు చొప్పున కొనుగోలుదారుడు ప్రభుత్వానికి అదనంగా చెల్లించాల్సి వస్తోంది. పొరుగున ఉన్న కర్నాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్రల్లో ఈ బాదుడు లేదు. దీంతో బడా వర్తకులు మన పంచదారను కాదని ఆయా రాష్ట్రాల  వైపే మొగ్గు చూపుతున్నారు. స్థానికంగా కొనుగోలు చేసే వారు కూడా తక్కువ ధరకే దొరికే పొరుగు రాష్ట్రాల పంచదార వైపే ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా జిల్లాలోని ఫ్యాక్టరీల్లో నిల్వలు కొండల్లా పేరుకుపోతున్నాయి. చక్కెర కర్మాగారాలను సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో చాలా సుగర్ ఫ్యాక్టరీలు నష్టాల్లో చిక్కుకుని మూతపడ్డాయి. మరికొన్ని ఆ దిశగా పయనిస్తున్నాయి. ఎప్పుడూ లాభాల్లో నడిచే గోవాడ ఫ్యాక్టరీ కూడా ఆర్థిక సంక్షోభంలో పడింది. మరోవైపు రైతులకు గత సీజను బకాయిలతో పాటు రాయితీపై ఇచ్చే ఎరువులను కూడా కర్మాగారాలు రైతులకు అందించలేక పోతున్నాయి. దీంతో ఖరీఫ్ సీజనులో పెట్టుబడులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం చెరకు రైతులకు రూ.6 వేల కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆ సొమ్మును రైతుల ఖాతాల్లో నేరుగా వేయనుంది. ఇది కొంతవరకు రైతులకు ఊరటినిచ్చే అంశం.
 
 ప్రభుత్వం ఆదుకోవాలి..
 సంక్షోభంలో ఉన్న చక్కెర కర్మాగారాలను ప్రభుత్వం ఆదుకోవాలి. చక్కె ర ధర పెంచాలి. మార్కెట్ ధరను స్థిరీకరించాలి. క్వింటాలుకు కనీసం రూ.3 వేలు చేయాలి. వ్యాట్ రద్దు చేస్తే కొనుగోలుదార్లు ముందుకొస్తారు. దాంతో నిల్వలు క్లియర్ అవుతాయి. లేదంటే సుగర్ ఫ్యాక్టరీల మనుగడకు ప్రభుత్వం గ్రాంటు రూపంలో ఆర్థిక సాయం అందించాలి.
 -వి.వి.రమణారావు, ఎమ్.డి., గోవాడ సుగర్స్.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement