చెరుకు రైతుకు తీపి కరువేనా?
చెరుకు రైతుకు తీపి కరువేనా?
Published Tue, Aug 2 2016 12:08 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
2002లో ఫ్యాక్టరీ ప్రైవేటీకరణతో నిజాంషుగర్ ఫ్యాక్టరీ ఎన్‌డీఎస్‌ఎల్‌గా రూపాంతరం చెందిన విషయం తెలిసిందే. బోధన్‌లోని శక్కర్‌నగర్, ముత్యంపేట (కరీంనగర్) ముంబోజీపల్లి (మెదక్) యూనిట్లు ప్రైవేట్ కంపెనీ గుప్పెట్లోకి వెళ్లాయి. వారి లాభాపేక్షతో చెరుకు రైతుల బతుకులు చితికిపోతున్నాయి.
ఎన్‌డీఎస్‌ఎల్ యాజమాన్యం 2015–16 క్రషింగ్ సీజన్ నడుపకుండా చేతులెత్తెసింది. ప్రతి ఏటా నవంబర్– డిసెంబర్ నెలల్లో క్రషింగ్ ప్రారంభమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీల నిర్వహణకు వెనుకంజ వేసింది. ఫ్యాక్టరీ నిర్వహణ అసాధ్యమనే నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం.. ఈ ప్రాంతంలో సాగు చేసిన చెరుకును ప్రైవేట్ ఫ్యాక్టరీలకు మళ్లించేందుకు నిర్ణయం తీసుకుంది. 2015 నవంబర్ 23న హైదరాబాద్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెరుకు రైతుల సమావేశం నిర్వహించారు. ఇందులో బోధన్, ముత్యంపేట, ముంబోజీపల్లి ఫ్యాక్టరీల పరిధిలోని చెరుకును అడ్లూర్ ఎల్లారెడ్డిలోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ, నిజాంసాగర్ మండలంలోని మాగి ఫ్యాక్టరీలకు మళ్లించాలని నిర్ణయించారు. రైతులపై భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వమే రవాణా చార్జీలు చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆయా ప్రైవేట్ ఫ్యాక్టరీలకు చెరుకును తరలించారు.
లక్ష మెట్రిక్ టన్నుల చెరుకు సరఫరా
బోధన్, ముత్యంపేట, ముంబోజీపల్లి ఫ్యాక్టరీల పరిధిలోని రైతులు గాయత్రి, మాగి ఫ్యాక్టరీలకు చెరుకును తరలించారు. గాయత్రి ఫ్యాక్టరీకి 65 వేల మెట్రిక్ టన్నులు, మాగి ప్యాక్టరీకి 43 వేల పైచిలుకు మెట్రిక్ టన్నుల చెరుకును రైతులు సరఫరా చేసినట్టు అధికారులు చెబుతున్నారు.
రవాణా చార్జీల చెల్లింపు ఎప్పుడో..
రైతులు ట్రాక్టర్లు, లారీల ద్వారా చెరుకును తరలించారు. చెరుకు తోట నుంచి ఫ్యాక్టరీకి దూరా న్ని పరిగణనలోకి తీసుకుని చార్జీలు చెల్లించాల్సి ఉంది. టన్నుకు రూ. 170 నుంచి రూ. 300 వరకు రవాణా చార్జీలను నిర్ణయించారు. కానీ బోధన్ నుంచి పిట్లం మండలంలోని మాగి ఫ్యాక్టరీ సుమారు 70 కిలో మీటర్ల దూరంలో ఉంది. మంజీర నదీ తీరాన ఉన్న మారుమూల గ్రామాలైన బోధన్ మండలంలోని ఖాజాపూర్, హున్సా, మందర్న రైతులు చెరుకు తరలించేం దుకు పడ్డకష్టాలు వర్ణనాతీతం. ఈ మూడు గ్రామాల కొందరు రైతులు పొరుగున ఉన్న నాందేడ్ జిల్లా పరిధిలోని నార్సి, నాయగావ్ పట్టణ కేంద్రాలకు సమీపంలో ఉన్న కుంటూర్ సహకార చక్కెర ఫ్యాక్టరీకి చెరుకును తరలించారు. సుమారు 16 వేల టన్నులకుపైగా చెరుకును తరలించారు. ఈ ఫ్యాక్టరీ సుమారు 75 కిలో మీటర్ల దూరంలో ఉంది. తరలించేందు కు టన్నుకు రూ. 400 వరకు ఖర్చు అయ్యింద ని, 12 టన్నుల లోడ్ ట్రాక్టర్‌కు సుమారు రూ. 5 వేల వరకు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని రైతులు చెబుతున్నారు.
జిల్లాలోని చెరుకు ఫ్యాక్టరీలకు తరలించిన లక్షకుపైగా టన్నుల చెరుకుకు సంబంధించి రైతులకు రవాణా చార్జీల కింద సుమారు రూ. 2 కోట్ల 45 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
మాగి ఫ్యాక్టరీ ఫిబ్రవరి 28, అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రి ఫ్యాక్టరీలో మార్చి 28న క్రషింగ్ ముగిసింది. క్రషింగ్ సీజన్ ముగిసి నాలుగు నెలలు గడిచిపోయినా రవాణా చార్జీల చెల్లింపుపై ప్రభుత్వం స్పందించడం లేదు. రవాణా చార్జీలను ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితితో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మహారాష్ట్ర ఫ్యాక్టరీలకు చెరుకు తరలించిన రైతుల పరిస్థితి అయోమయంగా ఉంది. రవాణా చార్జీలు ప్రభుత్వం చెల్లిస్తుందో లేదోనని వారు ఆందోళన చెందుతున్నారు.
కోట్లలో చెరుకు కొనుగోలు పన్ను బకాయిలు..
చెరుకు రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రైతులకు టన్నుకు రూ. 60 చొప్పున కొనుగోలు పన్ను చెల్లిస్తోంది. ఫ్యాక్టరీ యాజమాన్యాలు ప్రభుత్వ కొనుగోలు పన్నును కలుపుకుని టన్ను ధరను చెల్లిస్తూ వస్తున్నాయి. 2015–16 క్రషింగ్ సీజన్‌కుగాను అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రి ఫ్యాక్టరీ టన్నుకు రూ. 2,766, మాగి ఫ్యాక్టరీ యాజమాన్యం టన్నుకు రూ. 2,600 చెల్లించాయి. ఇందులో చెరుకు కొనుగోలు పన్నును కలపలేదని రైతులు అంటున్నారు. ఫ్యాక్టరీలు సుమారు రూ. 4 కోట్ల వరకు చెరుకు కొనుగోలు పన్ను చెల్లించాల్సి ఉంది. అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రి ఫ్యాక్టరీ పరిధిలో రూ. 2 కోట్ల 53 లక్షల 58 వేల 225, మాగి ఫ్యాక్టరీ పరిధిలో రూ. కోటీ 44 లక్షల 55 వేల 260 వరకు రైతులకు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వానికి అధికార యంత్రాంగం నివేదికలిచ్చారు. కొనుగోలు పన్ను బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేయాల్సి ఉంటుందని అధికారులంటున్నారు. వెంటనే బకాయిలు చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
మహారాష్ట్రకు తరలించాను..
మాగి ఫ్యాక్టరీ సకాలంలో పర్మిట్లు ఇవ్వలేదు. దీం తో చెరుకు ఎండిపోతుందని మహారాష్ట్రలోని కుం టూర్ ఫ్యాక్టరీకి తీసుకెళ్లాను. మా ఊరు నుంచి 75 కిలో మీటర్ల దూరంలో ఈ ఫ్యాక్టరీ ఉంది. అక్కడ టన్ను ధర రూ. 2,600 చెల్లిస్తామన్నారు. ఇప్పటి వరకు రూ. 2,200 చెల్లించారు. బకాయిలు బిల్లు లు చెల్లించడంలేదు. 12 టన్నుల లోడ్ ట్రాక్టర్‌ను ఫ్యాక్టరీకి తరలించేందుకు రూ. 4,800 వరకు ఖర్చుఅయ్యింది. సర్కారు మాకు రవాణా ఖర్చులు ఇవ్వాలి.
– చిదురపు లక్ష్మణ్, చెరుుకు రైతు,
ఖాజాపూర్, బోధన్ మండలం
నివేదిక పంపించాం
చెరుకు రవాణా చార్జీలకు సంబంధించిన పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందించాం. అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రి, నిజాంసాగర్ మాగి ఫ్యాక్టరీలకు మూడు ఎన్‌డీఎస్‌ఎల్ యూనిట్ల నుంచి లక్ష మెట్రిక్ టన్నుల వరకు చెరుకు సరఫరా అయ్యింది. రైతులకు రవాణా చార్జీల రూపంలో సుమారు రూ. 2 కోట్ల 45 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ కొనుగోలు పన్నుతో కలిపి రైతులకు చెల్లించాల్సిన బకాయిలపై కేన్ కమిషనర్ కార్యాలయానికి నివేదిక పంపించాం.
– సీహెచ్ వెంకట రవి,
అసిస్టెంట్ కేన్ కమిషనర్, బోధన్
మంత్రి దృష్టికి తీసుకెళ్లాం
చెరుకు రవాణా చార్జీలు, కొనుగోలు పన్ను బకాయిల చెల్లింపు అంశాలను ఇటీవల మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. బకాయిలు ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కొనుగోలు పన్ను బకాయిలు త్వరలోనే విడుదల అవుతాయని మంత్రి తెలిపారు.
– శ్రీనివాస్‌రెడ్డి, చెరుకు ఉత్పత్తిదారుల
సంఘం అధ్యక్షుడు, బోధన్
Advertisement