NDSL Factory
-
అమ్మకానికి బోధన్ నిజాం షుగర్స్
బోధన్: నిజాం దక్కన్ షుగర్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్) అమ్మకానికి సిద్ధమైంది. ఈ మేరకు లిక్విడేషన్ (దివాళా)కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బ్రాంచ్ ఈ నెల 3న ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడ్డా యి. ఇప్పటి వరకు ట్రిబ్యునల్ ఐఆర్‌పీగా వ్యవ హరించిన రాచర్ల రామకృష్ణగుప్తాను లిక్విడేటర్‌గా నియమించింది. తాజాగా ఎన్సీఎల్టీ ఉత్తర్వుల ప్రకారం షుగర్ ఫ్యాక్టరీని అమ్మకానికి వేలం పాట నిర్వహించే ప్రక్రియ ఉంటుందని స్పష్టమవుతోంది. ఎన్సీఎల్టీ జ్యుడీషియల్ మెం బర్ అనంత పద్మనాభ స్వామి ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్యాక్టరీ ఆస్తులను వేలం వేసి క్రెడిటర్స్ కు బకాయిలు చెల్లించే ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఎన్సీఎల్టీ లిక్విడేషన్ ఆర్డర్స్ ప్రకారం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కూడా అవకాశాలుంటాయి. ఇప్పటికైనా ఫ్యాక్టరీ పునరుద్ధరణకు (నడిపించేందుకు) ముందుకు వచ్చే కంపెనీలకు అవకాశం కల్పించేందుకు అవకాశం ఉం టుంది. ఎన్సీఎల్టీ లిక్విడేషన్ ఉత్తర్వులు ఈ ప్రాంత చెరుకు రైతులు, కార్మికులకు చేదు కబురులా మారింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద వ్యవసాయధార పరిశ్రమంగా ఖ్యాతి పొందిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని 2002లో చంద్రబాబు హయాంలో ప్రైవేట్ కంపెనీ భాగస్వామ్యంతో ప్రైవేటీకరించారు. దీంతో ఎన్‌డీఎస్‌ఎల్‌గా రూపాంతరం చెందింది. ఈ క్రమంలో ప్రైవేట్ యాజమాన్యం 2015 డిసెంబర్ 23న లేఆఫ్ ప్రకటించి బోధన్‌తో పాటు ముత్యంపేట(జగిత్యాల ) ముంబోజిపల్లి ( మెదక్) యూనిట్లను మూసివేసింది. కార్మిక సంఘాలు, కార్మిక సంక్షేమ శాఖ 2016లో అనేక దఫాలుగా చర్చలు జరిగినా ఫలితం కలుగ లేదు. చర్చల నివేదికను ప్రభుత్వానికి నివేదించగా, ప్రభుత్వం లేబర్ కోర్టుకు నివేదించి ఆరు నెలల్లో తేల్చాలని ఉత్తర్వులు జారీ చేసింది. 2017 ఆగస్టు 31న ప్రభుత్వ ప్రిన్సిపుల్ సెక్రెటరీ శశాంక్ గోయల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్యాక్టరీ లేఆఫ్ సమస్య ఆఖరికి లేబర్ కోర్టు చెంతకు చేరింది. ప్రస్తుతం లేబర్ కోర్టులో విచారణలో ఉంది. ఫ్యాక్టరీ మూసివేతతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని అఖిల పక్షాలు, నిజాంషుగర్స్ రక్షణ కమిటీ అనేక రూపాల్లో ఆందోళనకు చేపట్టింది. ఎన్సీఎల్టీ రంగ ప్రవేశం విచారణ ఎన్డీఎస్ఎల్ సమస్య పరిష్కారం, ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ఎన్సీఎల్టీ 2017 సెప్టెంబర్ మాసంలో రంగ ప్రవేశం చేసింది. ఈ ట్రిబ్యునల్ హైదరాబాద్ బ్రాంచ్ ఐపీఆర్‌గా రాచర్ల రామక్రిష్ణగుప్తా నియామకమై, ఇదే ఏడాది అక్టోబర్ మాసంలో బోధన్‌తో పాటు ముత్యంపేట, ముంబోజిపల్లి ఫ్యాక్టరీలను సందర్శించి ఇక్కడి స్థితిగతులు, వివిధ వాణిజ్యబ్యాంకులు, కార్మికులకు చెల్లించాల్పిన బకాయిలు, ఆస్తుల వివరాలను సేకరించారు. విచారణ ప్రక్రియ తీరును అప్పట్లో ఐపీఆర్ వివరించారు. ప్రస్తుత ప్రైవేట్ యాజమాన్యం కాని లేదా ప్రభుత్వం ఫ్యాక్టరీని నడిపించేందుకు ముందుకు వస్తే వారికి అప్పగిస్తామని, రాని పక్షంలో ప్రైవేట్ కంపెనీలకు ఆహ్వానిస్తామని, ప్రైవేట్ కంపెనీలు కూడా రాని పక్షంలో ఫ్యాక్టరీ ఆస్తులు విక్రయించి బ్యాంకులు, కార్మికుల బకాయిలు చెల్లించే ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్సీఎల్టీలో ఏడాదిన్నరగా ఎన్డీఎస్ఎల్ సమస్య విచారణలో కొనసాగుతోంది. పలు దఫాలుగా ప్రైవేట్ యాజమాన్యం, బ్యాంకు అధికారులు, రాష్ట్ర షుగర్ కేన్ కమిషనర్ వాదనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని విచారణ కొనసాగించింది. ఆఖరుకు ఎన్డీఎస్ఎల్ లిక్విడేషన్‌కు ఎన్సీఎల్టీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్సీఎల్టీ ఆర్డర్ ప్రకారం ఫ్యాక్టరీ ఆస్తులను విక్రయించి బకాయి పడిన బ్యాంక్‌రుణాలు, కార్మికుల వేతనాలు చెల్లించే ప్రక్రియ ఉంటుంది. లిక్విడేషన్ ఆర్డర్స్ ప్రకారం ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కూడా అవకాశాలుంటాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎన్డీఎస్ఎల్ను స్వాధీనం చేసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం 2015 ఏప్రిల్ 29న జీవో నంబర్ 28 జారీ చేసింది. ఈ క్రమంలో ఆరుగురు ఐఏఎస్ రాష్ట్ర స్థాయి అధికారులతో ఫ్యాక్టరీ స్వాధీనం సాధ్యాసాధ్యాలు , సాంకేతిక, న్యాయ పరమైన సమస్యల అధ్యయనానికి కమిటీని వేసింది.ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదించింది. ఈ కమిటీ నివేదిక బహిర్గతం కాలేదు. సీఎం కేసీఆర్ 2015 జనవరి 5న రాష్ట్ర సచివాలయంలో మూడు ఫ్యాక్టరీల చెరుకు రైతులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ, స్వాధీనం కోసం చేసిన ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్డీఎస్ఎల్ లిక్విడేషన్ ఉత్తర్వులు వాస్తవమే.. ఎన్డీఎస్ఎల్ యూనిట్ల లిక్విడేషన్‌కు ఎన్సీఎల్టీ ఉత్తర్వులు జారీ చేసింది వాస్తవమేనని ట్రిబ్యునల్ ఐపీఆర్ రాచర్ల రామక్రిష్ణ గుప్తా తెలిపారు. ఎన్డీఎస్ఎల్ లిక్విడేటర్‌గా తానే నియామకమయ్యాయని పేర్కొన్నారు. లిక్విడేషన్ ఉత్తర్వుల ప్రకారం ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కూడా అవకాశాలుంటాయని, ప్రైవేట్ కంపెనీలు, లేదా ప్రభుత్వం ముందుకు వస్తే ఫ్యాక్టరీని అప్పగించడం జరుగుతోందని వివరించారు. -
చెరుకు రైతుకు తీపి కరువేనా?
2002లో ఫ్యాక్టరీ ప్రైవేటీకరణతో నిజాంషుగర్ ఫ్యాక్టరీ ఎన్‌డీఎస్‌ఎల్‌గా రూపాంతరం చెందిన విషయం తెలిసిందే. బోధన్‌లోని శక్కర్‌నగర్, ముత్యంపేట (కరీంనగర్) ముంబోజీపల్లి (మెదక్) యూనిట్లు ప్రైవేట్ కంపెనీ గుప్పెట్లోకి వెళ్లాయి. వారి లాభాపేక్షతో చెరుకు రైతుల బతుకులు చితికిపోతున్నాయి. ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం 2015–16 క్రషింగ్ సీజన్ నడుపకుండా చేతులెత్తెసింది. ప్రతి ఏటా నవంబర్– డిసెంబర్ నెలల్లో క్రషింగ్ ప్రారంభమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీల నిర్వహణకు వెనుకంజ వేసింది. ఫ్యాక్టరీ నిర్వహణ అసాధ్యమనే నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం.. ఈ ప్రాంతంలో సాగు చేసిన చెరుకును ప్రైవేట్ ఫ్యాక్టరీలకు మళ్లించేందుకు నిర్ణయం తీసుకుంది. 2015 నవంబర్ 23న హైదరాబాద్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెరుకు రైతుల సమావేశం నిర్వహించారు. ఇందులో బోధన్, ముత్యంపేట, ముంబోజీపల్లి ఫ్యాక్టరీల పరిధిలోని చెరుకును అడ్లూర్ ఎల్లారెడ్డిలోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ, నిజాంసాగర్ మండలంలోని మాగి ఫ్యాక్టరీలకు మళ్లించాలని నిర్ణయించారు. రైతులపై భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వమే రవాణా చార్జీలు చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆయా ప్రైవేట్ ఫ్యాక్టరీలకు చెరుకును తరలించారు. లక్ష మెట్రిక్ టన్నుల చెరుకు సరఫరా బోధన్, ముత్యంపేట, ముంబోజీపల్లి ఫ్యాక్టరీల పరిధిలోని రైతులు గాయత్రి, మాగి ఫ్యాక్టరీలకు చెరుకును తరలించారు. గాయత్రి ఫ్యాక్టరీకి 65 వేల మెట్రిక్ టన్నులు, మాగి ప్యాక్టరీకి 43 వేల పైచిలుకు మెట్రిక్ టన్నుల చెరుకును రైతులు సరఫరా చేసినట్టు అధికారులు చెబుతున్నారు. రవాణా చార్జీల చెల్లింపు ఎప్పుడో.. రైతులు ట్రాక్టర్లు, లారీల ద్వారా చెరుకును తరలించారు. చెరుకు తోట నుంచి ఫ్యాక్టరీకి దూరా న్ని పరిగణనలోకి తీసుకుని చార్జీలు చెల్లించాల్సి ఉంది. టన్నుకు రూ. 170 నుంచి రూ. 300 వరకు రవాణా చార్జీలను నిర్ణయించారు. కానీ బోధన్ నుంచి పిట్లం మండలంలోని మాగి ఫ్యాక్టరీ సుమారు 70 కిలో మీటర్ల దూరంలో ఉంది. మంజీర నదీ తీరాన ఉన్న మారుమూల గ్రామాలైన బోధన్ మండలంలోని ఖాజాపూర్, హున్సా, మందర్న రైతులు చెరుకు తరలించేం దుకు పడ్డకష్టాలు వర్ణనాతీతం. ఈ మూడు గ్రామాల కొందరు రైతులు పొరుగున ఉన్న నాందేడ్ జిల్లా పరిధిలోని నార్సి, నాయగావ్ పట్టణ కేంద్రాలకు సమీపంలో ఉన్న కుంటూర్ సహకార చక్కెర ఫ్యాక్టరీకి చెరుకును తరలించారు. సుమారు 16 వేల టన్నులకుపైగా చెరుకును తరలించారు. ఈ ఫ్యాక్టరీ సుమారు 75 కిలో మీటర్ల దూరంలో ఉంది. తరలించేందు కు టన్నుకు రూ. 400 వరకు ఖర్చు అయ్యింద ని, 12 టన్నుల లోడ్ ట్రాక్టర్‌కు సుమారు రూ. 5 వేల వరకు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని రైతులు చెబుతున్నారు. జిల్లాలోని చెరుకు ఫ్యాక్టరీలకు తరలించిన లక్షకుపైగా టన్నుల చెరుకుకు సంబంధించి రైతులకు రవాణా చార్జీల కింద సుమారు రూ. 2 కోట్ల 45 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మాగి ఫ్యాక్టరీ ఫిబ్రవరి 28, అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రి ఫ్యాక్టరీలో మార్చి 28న క్రషింగ్ ముగిసింది. క్రషింగ్ సీజన్ ముగిసి నాలుగు నెలలు గడిచిపోయినా రవాణా చార్జీల చెల్లింపుపై ప్రభుత్వం స్పందించడం లేదు. రవాణా చార్జీలను ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితితో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మహారాష్ట్ర ఫ్యాక్టరీలకు చెరుకు తరలించిన రైతుల పరిస్థితి అయోమయంగా ఉంది. రవాణా చార్జీలు ప్రభుత్వం చెల్లిస్తుందో లేదోనని వారు ఆందోళన చెందుతున్నారు. కోట్లలో చెరుకు కొనుగోలు పన్ను బకాయిలు.. చెరుకు రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రైతులకు టన్నుకు రూ. 60 చొప్పున కొనుగోలు పన్ను చెల్లిస్తోంది. ఫ్యాక్టరీ యాజమాన్యాలు ప్రభుత్వ కొనుగోలు పన్నును కలుపుకుని టన్ను ధరను చెల్లిస్తూ వస్తున్నాయి. 2015–16 క్రషింగ్ సీజన్‌కుగాను అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రి ఫ్యాక్టరీ టన్నుకు రూ. 2,766, మాగి ఫ్యాక్టరీ యాజమాన్యం టన్నుకు రూ. 2,600 చెల్లించాయి. ఇందులో చెరుకు కొనుగోలు పన్నును కలపలేదని రైతులు అంటున్నారు. ఫ్యాక్టరీలు సుమారు రూ. 4 కోట్ల వరకు చెరుకు కొనుగోలు పన్ను చెల్లించాల్సి ఉంది. అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రి ఫ్యాక్టరీ పరిధిలో రూ. 2 కోట్ల 53 లక్షల 58 వేల 225, మాగి ఫ్యాక్టరీ పరిధిలో రూ. కోటీ 44 లక్షల 55 వేల 260 వరకు రైతులకు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వానికి అధికార యంత్రాంగం నివేదికలిచ్చారు. కొనుగోలు పన్ను బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేయాల్సి ఉంటుందని అధికారులంటున్నారు. వెంటనే బకాయిలు చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మహారాష్ట్రకు తరలించాను.. మాగి ఫ్యాక్టరీ సకాలంలో పర్మిట్లు ఇవ్వలేదు. దీం తో చెరుకు ఎండిపోతుందని మహారాష్ట్రలోని కుం టూర్ ఫ్యాక్టరీకి తీసుకెళ్లాను. మా ఊరు నుంచి 75 కిలో మీటర్ల దూరంలో ఈ ఫ్యాక్టరీ ఉంది. అక్కడ టన్ను ధర రూ. 2,600 చెల్లిస్తామన్నారు. ఇప్పటి వరకు రూ. 2,200 చెల్లించారు. బకాయిలు బిల్లు లు చెల్లించడంలేదు. 12 టన్నుల లోడ్ ట్రాక్టర్‌ను ఫ్యాక్టరీకి తరలించేందుకు రూ. 4,800 వరకు ఖర్చుఅయ్యింది. సర్కారు మాకు రవాణా ఖర్చులు ఇవ్వాలి. – చిదురపు లక్ష్మణ్, చెరుుకు రైతు, ఖాజాపూర్, బోధన్ మండలం నివేదిక పంపించాం చెరుకు రవాణా చార్జీలకు సంబంధించిన పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందించాం. అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రి, నిజాంసాగర్ మాగి ఫ్యాక్టరీలకు మూడు ఎన్డీఎస్ఎల్ యూనిట్ల నుంచి లక్ష మెట్రిక్ టన్నుల వరకు చెరుకు సరఫరా అయ్యింది. రైతులకు రవాణా చార్జీల రూపంలో సుమారు రూ. 2 కోట్ల 45 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ కొనుగోలు పన్నుతో కలిపి రైతులకు చెల్లించాల్సిన బకాయిలపై కేన్ కమిషనర్ కార్యాలయానికి నివేదిక పంపించాం. – సీహెచ్ వెంకట రవి, అసిస్టెంట్ కేన్ కమిషనర్, బోధన్ మంత్రి దృష్టికి తీసుకెళ్లాం చెరుకు రవాణా చార్జీలు, కొనుగోలు పన్ను బకాయిల చెల్లింపు అంశాలను ఇటీవల మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. బకాయిలు ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కొనుగోలు పన్ను బకాయిలు త్వరలోనే విడుదల అవుతాయని మంత్రి తెలిపారు. – శ్రీనివాస్‌రెడ్డి, చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు, బోధన్ -
గానుగాడేనా?
తీపి చెరకును పండించే రైతుల బతుకులు చేదుగా మారుతున్నాయి. సీజన్ ముంచుకొస్తున్నా... అందుబాటులో ఉన్న ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీ ఈయేడు నడుస్తుందో? లేదో తెలియని సందిగ్ధంలో చెరకు రైతులు ఉన్నారు. ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేయాలన్న మంత్రుల కమిటీ నివేదిక అమలుకు నోచుకుంటుందా? లేక పాత యాజమాన్యమే నడిపిస్తుందా? అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. మరోవైపు ఇక్కడ పండించిన చెరకును బోధన్‌కు తరలిస్తారన్న ప్రచారం రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. మెదక్: మెతుకుసీమలోని 12 మండలాల చెరకు రైతుల ప్రయోజనార్థం మంభోజిపల్లిలో నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీ సేవలందిస్తోంది. ఇప్పటివరకు ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్న ఈ ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేయాలంటూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలోని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ గత జనవరి 17న అప్పటి ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అప్పట్లో టీఆర్ఎస్ కూడా ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేయాలని డిమాండ్ చేసింది. అయితే అప్పటికే 2014-15 సంవత్సరానికి సంబంధించి యాజమాన్యంతో చెరకు రైతులు అగ్రిమెంట్ కుదుర్చుకోవడంతో ఈయేడు ప్రభుత్వపరమయ్యే సూచనలు కనిపించడం లేదు. కాగా ఈసారి ప్రైవేట్ యాజమాన్యమే ఫ్యాక్టరీని నడపాలని ఇటీవల మెదక్‌కు వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ముందుకు సాగని మర మ్మతులు: సాధారణంగా ప్రతియేడు నవంబర్‌లో చెరకు క్రషింగ్ ప్రారంభమవుతోంది. అయితే ఫ్యాక్టరీని మరమ్మతులు చేయడానికి సుమారు రెండు నెలలు పడుతుందని సమాచారం. కాని ఇంతవరకు మరమ్మతులు మొదలు కాలేదని రైతులు చెబుతున్నారు. పైగా ఫ్యాక్టరీతో చెరకు అగ్రిమెంట్లు ఉన్న వివరాలను తిరిగి సేకరిస్తున్నారని వారు తెలిపారు. దీంతో క్రషింగ్ కోసం ఇతర ఫ్యాక్టరీలకు తరలిస్తారా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది బోనస్‌కు సంబంధించి బకాయిపడ్డ రూ.4 కోట్లను వెంటనే చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. బోధన్ కేంద్రంగా మూడు ఫ్యాక్టరీల క్రషింగ్? తెలంగాణ పరిధిలోని మంభోజిపల్లి, బోధన్, మెట్పల్లి ఫ్యాక్టరీలు ఒకే ప్రైవేట్ యాజమాన్యంలో పనిచేస్తున్నాయి. వీటికింద ఈయేడు సుమారు 3 లక్షల టన్నుల చెరకు క్రషింగ్ అయ్యే అవకాశం ఉంది. ప్రతియేటా ఈ మూడు ఫ్యాక్టరీలను మరమ్మతులు చేసి నడపాలంటే సుమారు రూ.18 కోట్లనుంచి 20 కోట్ల ఖర్చు వస్తుందని రైతు నాయకులు చెబుతున్నారు. అందుకే బోధన్ ఫ్యాక్టరీని ప్రారంభించి మిగతా రెండు ఫ్యాక్టరీల పరిధిలోని చెరకును అక్కడికి తరలిస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెరకును నరికి దూర ప్రాంతాలకు తరలించడం వల్ల రవాణాలో జాప్యం జరగడం వల్ల తూకంలో నష్టం వాటిల్లుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వమే చక్కెర ఫ్యాక్టరీని నడపాలని చెరకు రైతుల పోరాట సమితి కార్యదర్శి నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డికి కూడా విన్నవించామన్నారు. ఎలాంటి ఆదేశాలు రాలేదు ఈయేడు క్రషింగ్ విషయంపై ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఆదేశాలు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం. గత యేడాది చెరకు బిల్లులు చెల్లించాం. బోనస్ బిల్లులు మాత్రమే చెల్లించాల్సి ఉంది. - నాగరాజు, జీఎం, ఎన్డీఎస్ఎల్, మంభోజిపల్లి