అమ్మకానికి బోధన్‌ నిజాం షుగర్స్‌ | NSDL Factory Sale Nizamabad | Sakshi
Sakshi News home page

అమ్మకానికి ఎన్డీఎస్‌ఎల్‌ ?

Published Thu, Jun 13 2019 11:02 AM | Last Updated on Thu, Jun 13 2019 1:05 PM

NSDL Factory Sale Nizamabad - Sakshi

బోధన్‌: నిజాం దక్కన్‌ షుగర్‌ లిమిటెడ్‌ (ఎన్‌డీఎస్‌ఎల్‌) అమ్మకానికి సిద్ధమైంది. ఈ మేరకు లిక్విడేషన్‌ (దివాళా)కు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ హైదరాబాద్‌ బ్రాంచ్‌ ఈ నెల 3న ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడ్డా యి. ఇప్పటి వరకు ట్రిబ్యునల్‌ ఐఆర్‌పీగా వ్యవ హరించిన రాచర్ల రామకృష్ణగుప్తాను లిక్విడేటర్‌గా నియమించింది. తాజాగా ఎన్‌సీఎల్‌టీ ఉత్తర్వుల ప్రకారం షుగర్‌ ఫ్యాక్టరీని అమ్మకానికి వేలం పాట నిర్వహించే ప్రక్రియ ఉంటుందని స్పష్టమవుతోంది. ఎన్‌సీఎల్‌టీ జ్యుడీషియల్‌ మెం బర్‌ అనంత పద్మనాభ స్వామి ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్యాక్టరీ ఆస్తులను వేలం వేసి క్రెడిటర్స్‌ కు బకాయిలు చెల్లించే ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఎన్‌సీఎల్‌టీ లిక్విడేషన్‌ ఆర్డర్స్‌ ప్రకారం షుగర్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కూడా అవకాశాలుంటాయి. ఇప్పటికైనా ఫ్యాక్టరీ పునరుద్ధరణకు (నడిపించేందుకు) ముందుకు వచ్చే కంపెనీలకు అవకాశం కల్పించేందుకు అవకాశం ఉం టుంది. ఎన్‌సీఎల్‌టీ లిక్విడేషన్‌ ఉత్తర్వులు ఈ ప్రాంత చెరుకు రైతులు, కార్మికులకు  చేదు కబురులా మారింది.

ఆసియా ఖండంలోనే అతిపెద్ద వ్యవసాయధార పరిశ్రమంగా ఖ్యాతి పొందిన నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని 2002లో చంద్రబాబు హయాంలో ప్రైవేట్‌ కంపెనీ భాగస్వామ్యంతో ప్రైవేటీకరించారు. దీంతో ఎన్‌డీఎస్‌ఎల్‌గా రూపాంతరం చెందింది. ఈ క్రమంలో ప్రైవేట్‌ యాజమాన్యం 2015 డిసెంబర్‌ 23న లేఆఫ్‌ ప్రకటించి బోధన్‌తో పాటు ముత్యంపేట(జగిత్యాల ) ముంబోజిపల్లి ( మెదక్‌) యూనిట్లను మూసివేసింది. కార్మిక సంఘాలు, కార్మిక సంక్షేమ శాఖ  2016లో అనేక దఫాలుగా చర్చలు జరిగినా ఫలితం కలుగ లేదు. చర్చల నివేదికను ప్రభుత్వానికి నివేదించగా, ప్రభుత్వం లేబర్‌ కోర్టుకు నివేదించి ఆరు నెలల్లో తేల్చాలని ఉత్తర్వులు జారీ చేసింది. 2017 ఆగస్టు 31న ప్రభుత్వ ప్రిన్సిపుల్‌ సెక్రెటరీ శశాంక్‌ గోయల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్యాక్టరీ లేఆఫ్‌ సమస్య ఆఖరికి లేబర్‌ కోర్టు చెంతకు చేరింది. ప్రస్తుతం లేబర్‌ కోర్టులో విచారణలో ఉంది. ఫ్యాక్టరీ మూసివేతతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని అఖిల పక్షాలు, నిజాంషుగర్స్‌ రక్షణ కమిటీ అనేక రూపాల్లో ఆందోళనకు చేపట్టింది.
 
ఎన్‌సీఎల్‌టీ రంగ ప్రవేశం విచారణ
ఎన్‌డీఎస్‌ఎల్‌ సమస్య పరిష్కారం, ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ఎన్‌సీఎల్‌టీ 2017 సెప్టెంబర్‌ మాసంలో రంగ ప్రవేశం చేసింది. ఈ ట్రిబ్యునల్‌ హైదరాబాద్‌ బ్రాంచ్‌ ఐపీఆర్‌గా రాచర్ల రామక్రిష్ణగుప్తా నియామకమై, ఇదే ఏడాది అక్టోబర్‌ మాసంలో బోధన్‌తో పాటు ముత్యంపేట, ముంబోజిపల్లి ఫ్యాక్టరీలను సందర్శించి ఇక్కడి స్థితిగతులు, వివిధ వాణిజ్యబ్యాంకులు, కార్మికులకు చెల్లించాల్పిన బకాయిలు, ఆస్తుల వివరాలను సేకరించారు. విచారణ ప్రక్రియ తీరును అప్పట్లో ఐపీఆర్‌ వివరించారు. ప్రస్తుత ప్రైవేట్‌ యాజమాన్యం కాని లేదా ప్రభుత్వం ఫ్యాక్టరీని నడిపించేందుకు ముందుకు వస్తే వారికి అప్పగిస్తామని, రాని పక్షంలో ప్రైవేట్‌ కంపెనీలకు ఆహ్వానిస్తామని, ప్రైవేట్‌ కంపెనీలు కూడా రాని పక్షంలో ఫ్యాక్టరీ ఆస్తులు విక్రయించి బ్యాంకులు, కార్మికుల బకాయిలు చెల్లించే ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్‌సీఎల్‌టీలో ఏడాదిన్నరగా ఎన్‌డీఎస్‌ఎల్‌ సమస్య విచారణలో కొనసాగుతోంది. పలు దఫాలుగా ప్రైవేట్‌ యాజమాన్యం, బ్యాంకు అధికారులు, రాష్ట్ర షుగర్‌ కేన్‌ కమిషనర్‌ వాదనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని విచారణ కొనసాగించింది. ఆఖరుకు ఎన్‌డీఎస్‌ఎల్‌ లిక్విడేషన్‌కు ఎన్‌సీఎల్‌టీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్‌సీఎల్‌టీ ఆర్డర్‌ ప్రకారం ఫ్యాక్టరీ ఆస్తులను విక్రయించి బకాయి పడిన బ్యాంక్‌రుణాలు, కార్మికుల వేతనాలు చెల్లించే ప్రక్రియ ఉంటుంది. లిక్విడేషన్‌ ఆర్డర్స్‌ ప్రకారం ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కూడా అవకాశాలుంటాయి.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎన్‌డీఎస్‌ఎల్‌ను స్వాధీనం చేసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం 2015 ఏప్రిల్‌ 29న జీవో నంబర్‌ 28 జారీ చేసింది. ఈ క్రమంలో ఆరుగురు ఐఏఎస్‌ రాష్ట్ర స్థాయి అధికారులతో ఫ్యాక్టరీ స్వాధీనం సాధ్యాసాధ్యాలు , సాంకేతిక, న్యాయ పరమైన సమస్యల అధ్యయనానికి కమిటీని వేసింది.ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదించింది. ఈ కమిటీ నివేదిక బహిర్గతం కాలేదు. సీఎం కేసీఆర్‌ 2015 జనవరి 5న రాష్ట్ర సచివాలయంలో మూడు ఫ్యాక్టరీల చెరుకు రైతులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ, స్వాధీనం కోసం చేసిన ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించలేదు.

ఎన్‌డీఎస్‌ఎల్‌ లిక్విడేషన్‌ ఉత్తర్వులు వాస్తవమే.. 
ఎన్‌డీఎస్‌ఎల్‌ యూనిట్ల లిక్విడేషన్‌కు ఎన్‌సీఎల్‌టీ ఉత్తర్వులు జారీ చేసింది వాస్తవమేనని ట్రిబ్యునల్‌ ఐపీఆర్‌ రాచర్ల రామక్రిష్ణ గుప్తా తెలిపారు. ఎన్‌డీఎస్‌ఎల్‌ లిక్విడేటర్‌గా తానే నియామకమయ్యాయని పేర్కొన్నారు. లిక్విడేషన్‌ ఉత్తర్వుల ప్రకారం ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కూడా అవకాశాలుంటాయని, ప్రైవేట్‌ కంపెనీలు, లేదా ప్రభుత్వం ముందుకు వస్తే ఫ్యాక్టరీని అప్పగించడం జరుగుతోందని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement