
న్యూఢిల్లీ: ప్యాసింజర్ వెహికిల్స్ (పీవీ) విక్రయాల్లో దేశవ్యాప్తంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో 4 - 7 శాతం వృద్ధి అంచనా వేస్తున్నట్టు రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. డిమాండ్‌ను నడిపించే విభాగాలు తటస్థంగా లేదా అనుకూలంగా ఉంటాయని వివరించింది. ‘ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2023-24లో 42 లక్షల యూనిట్ల ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆటోమొబైల్ తయారీదారుల స్థిర ఉత్పత్తి కారణంగా హోల్‌సేల్స్ స్థిరంగా ఉన్నాయి. అయితే తగ్గుతున్న రీప్లేస్‌మెంట్ డిమాండ్, అధిక ఇన్వెంటరీ స్థాయిల నేపథ్యంలో పరిశ్రమ పరిమాణ వృద్ధి దాదాపు 2 శాతం వద్ద నిరాడంబరంగా ఉంది. ద్విచక్ర వాహనాల విభాగంలో 2024-25లో 11-14 శాతం వృద్ధి నమోదు కావొచ్చు. ఇది వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6–9 శాతం ఉండొచ్చు. మెరుగైన వర్షపాతం కారణంగా కొన్ని నెలలుగా గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమకు మంచి మద్దతు లభిస్తోంది.
రబీ సాగు ఇప్పటివరకు ఆరోగ్యంగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ బాగా పెరుగుతుందని అంచనా. దేశీయ వాణిజ్య వాహన పరిశ్రమ 2025–26లో స్వల్ప వృద్ధి నమోదు చేస్తుంది. ప్రభుత్వ పాత వాహనాలను తప్పనిసరిగా తుక్కుగా చేయడం, రీప్లేస్‌మెంట్ డిమాండ్ బస్‌ల విక్రయాల్లో వృద్ధిని పెంచుతాయి. ఎలక్ట్రిక్ త్రీవీలర్ల జోరు, ఈ–కామర్స్‌లో మందగమనంతో తేలికపాటి వాణిజ్య వాహనాల వృద్ధి తక్కువగా ఉంటుంది. మధ్య, భారీ వాణిజ్య వాహనాలు; తేలికపాటి వాణిజ్య వాహనాలు, బస్‌లు 2025–26లో వరుసగా 0–3 శాతం, 3–5, 8–10 శాతం దూసుకెళ్తాయని అంచనా’ అని ఇక్రా తెలిపింది.