చిమ్నీ ఎక్కిన కార్మికులు
వేతన సవరణ చేశాకే ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బుధవారం బోధన్ చక్కెర కర్మాగారం (ఎన్‌డీఎస్‌ఎల్)లో పలువురు కార్మికులు పొగ గొట్టం పైకి ఎక్కారు. తమ డిమాండును అంగీకరించపోతే దూకుతామని హెచ్చరించారు. వారికి మద్దతుగా సీఐటీయూ, ప్రజా సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న ఎన్‌డీఎస్‌ఎల్ వైస్ ప్రెసిడెంట్ జానకీ మనోహర్, బల్దియా చైర్మన్ ఆనంపల్లి ఎల్లం అక్కడి చేరుకొని కార్మిక సంఘాల నాయకులతో మాట్లా డారు. జనవరి 31 లోగా మధ్యంతర భృతి, బాయిలు చెల్లిస్తామని, వేతన సవరణ కూడా చేస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు కిందికి దిగి వచ్చారు.
- పొగ గొట్టం ఎక్కిన ఎన్డీఎస్‌ఎల్ కార్మికులు
- జనవరి 31 వరకు అమలు చేస్తామని అసిస్టెంట్ కేన్ కమిషనర్ హామీ
బోధన్ టౌన్ : యాజమాన్యం వేతన సవరణను దాటవేస్తూ కార్మికులను విస్మరిస్తోందని ఎన్‌డీఎస్‌ఎల్ కర్మాగారంలో బుధవారం కార్మికులు ఆందోళన చేపట్టారు. పొగగొట్టం పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. సీఐ టీయూ కార్మిక సంఘం, ప్రజా సంఘాల నాయకులు ఫ్యాక్టరీలో ఆందోళనకు దిగారు. వేతన సవరణ చేపట్టాకే ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో విధులకు వచ్చిన కార్మికులు సాయిలు, శ్రీనివాస్ కర్మాగారంలో 160 ఫీట్లు గల పొగ గొట్టం ఎక్కి వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు.
కార్మికులు, సీటీయూ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు అక్కడికి చేరుకొని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొనగా, సీఐ రామకృష్ణ వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. యాజమాన్యం దిగి వచ్చి వేతన సవరణ చేయాలని పట్టుబట్టారు. సమాచారం తెలుసుకున్న ఎన్‌డీఎస్‌ఎల్ వైస్ ప్రెసిడెంట్ జానకీ మనోహర్, బల్దియా చైర్మన్ ఆనం పల్లి ఎల్లం అక్కడికి చేరుకొని కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడారు. నేరుగా యాజమాన్యంతో మాట్లాడి తమకు వేతన సవరణపై హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామన్నారు.
వేతన సవరణపై స్పష్టమైన హా మీ ఇవ్వాలని యాజమాన్యాన్ని బల్దియా చైర్మన్ ఎల్లం, టీఆర్‌ఎస్ నాయకులు, కౌన్సిలర్లు కోరారు. దీంతో వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఇటీవల హైదరాబాద్‌లో కార్మిక సంఘంతో యాజమాన్యం చర్చ లు జరిపిందన్నారు. చర్చల్లో కార్మికులు 14 నెలల ఐఆర్, ఏరియర్స్ నాలుగు విడతలుగా ఇవ్వాలని, మార్చి అనంతరం వేతన సవరణ చేపట్టాలని యాజమాన్యానికి సూచించారని తెలిపారు. దీనికి కార్మిక సంఘం నాయకులు, యాజమాన్యం ఒప్పుకున్నాయన్నారు. అయినా కార్మికులు ససేమిరా అన్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు కుమార స్వామి, ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ తమకు వేతన సవరణపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అనంతరం చెరకు ఉత్పత్తి దారుల సంఘం నాయకులు మాట్లాడుతూ.. కార్మిక సంఘాల నాయకులు క్రషింగ్‌కు సహకరించాలని, రైతుల శ్రేయస్సు దృష్ట్యా ఆలోచించాలన్నారు. తాముసైతం కార్మికులకు అండగా ఉండి వేతన సవరణ అయ్యే వరకు పోరాడుదామని కార్మికులను సముదాయించే ప్రయత్నం చేశారు. కార్మికులు ససేమిరా అనడంతో చర్చించి సమస్య పరిష్కరించుకుందామని తెలిపారు. ప్రజా సంఘాల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ ఇవ్వాలని సూచించారు. దీంతో అసిస్టెంట్ కేన్ కమిషనర్ జాన్ విక్టర్ కర్మాగారానికి చేరుకొని చర్చలు జరిపారు. కార్మికులకు నాలుగు విడతలుగా ఇస్తామన్న ఐఆర్, ఏరియర్స్ రెండు విడతల్లో జనవరి 31 వరకు చెల్లిస్తామని, దీంతో పాటు వేతన సవరణ సైతం అప్పటి వరకు చేస్తామని హామీ ఇచ్చారు. క్రషింగ్ కు అందరు సహకరించాలని కోరారు. దీంతో కార్మికులు ఆందోళన విరమించారు.