చెరకు సాగు
పెరుగుతోంది
Published Mon, Aug 22 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
జిల్లాలో 2274 హెక్టార్లలో పెరిగిన చెరకు సాగు
రెండు జిల్లాల్లో రైతులకు చెల్లించాల్సిన పాత బకాయి రూ. 9.85 కోట్లు
క్రషింగుకు ముందే చెల్లించాలంటున్నఅన్నదాత
బొబ్బిలి : జిల్లాలో చెరకు సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. నాలుగైదు ఏళ్లుగా బకాయిల కోసం ధర్మయుద్దం చేసిన అన్నదాతలకు ఇప్పుడు యాజమాన్య వైఖరిపై నమ్మకం కుదిరింది. జిల్లాలోని సీతానగరం మండలం లచ్చయ్యపేట ఎన్‌సీఎస్ సుగర్ ఫ్యాక్టరీలో రైతులకు చెల్లించాల్సిన బకాయిలు కోట్లతో ఉండడం, యాజమాన్యం వైఖరి వల్ల అవి తీరకపోవడం, పైగా రైతుల పేరుతో యాజమాన్యం కోట్ల రూపాయల బినామీ రుణాలు వాడుకోవడం వంటివి చోటు చేసుకోవడంతో రైతులు తిరగబడ్డారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేసింది. గత ఏడాది వరకూ ఎన్‌సీఎస్ చక్కెర ఫ్యాక్టరీ పరిధిలోని 18 మండలాల్లో 4335 హెక్టార్లలో సాగులో ఉండే చెరకు ఈ ఏడాది గణనీయంగా ఒకే సారి 2274 హెక్టార్లు పెరిగింది. గత ఏడాది సాగు చేసిన చెరుకుకు యాజమాన్యం టన్నుకు రూ.‡2300ల ధరను నిర్ణయించింది. దానికి సంబంధించి రూ. 2 వేల వరకూ చెరుకును సరçఫరా చేసిన రైతులకు చెల్లించారు. చెల్లింపులు జరగడంతో ఉత్సాహంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెంచారు. ఈ ఏడాది 3 లక్షల 60 వేల టన్నుల చెరుకును క్రషింగుచేయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలోని జామి మండలం భీమసింగి చక్కెర కర్మాగారం పరిధిలో గత ఏడాది కంటే ఈ ఏడాది చెరుకు సాగు విస్తీర్ణం తగ్గింది. గతేడాది 2208 హెక్టార్లలో చెరుకు సాగయితే ఈ ఏడాది 2061 విస్తీర్ణంలో వేశారు. లక్షా 3 వేల టన్నుల చెరకు ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సంకిలి ఫ్యాక్టరీ పరిధిలోనూ ఈ ఏడాది విస్తీర్ణం తగ్గింది.
]
ఎన్‌సీఎస్ బకాయి 4 కోట్లు
ఎన్‌సీఎస్ ఇంకా టన్నుకు రూ. 3 వందల బకాయి రైతులకు చెల్లించాల్సి ఉంది. గతేడాది 2 లక్షల 20 వేల టన్నులకు రూ. 2300లు వంతున చెల్లించాల్సి ఉండగా... రూ. 2 వేలు వంతునే చెల్లించారు. దాదాపు వెయ్యి మందికి రూ. 4 కోట్లు చెల్లించాల్సి ఉంది. మరో రెండు నెలల్లో క్రషింగు సీజను మొదలు కానుండడంతో ఆ లోగా చెల్లించాలని యాజమాన్యం యోచిస్తోంది.
కొనుగోలు పన్ను బకాయి రూ. 5.85 కోట్లు
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని మూడు ఫ్యాక్టరీల పరిధిలో రూ. 5 కోట్ల 85 లక్షల వరకూ కొనుగోలు పన్ను బకాయిలు రైతుల ఖాతాల్లోకి వెళ్లాల్సి ఉంది. టన్నుకు 60 రూపాయలు చొప్పున ఫ్యాక్టరీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బును రైతులకు అందాలి. ఎన్‌సీఎస్ చక్కెర ఫ్యాక్టరీ పరిధిలో 2.27 లక్షల టన్నులకు రూ. 1.36 కోట్లు, భీమసింగిలో 91 వేల టన్నులకు రూ. 54 లక్షలు, శ్రీకాకుళం జిల్లా సంకిలిలో 6 లక్షల 58 వేల టన్నులకు రూ. 3 కోట్ల 95 లక్షలు రైతులకు చెల్లించాలి. వీటిని చెల్లించాలంటూ ప్రభుత్వం జీఓ విడుదల చేయాల్సి ఉంది. వాటికోసం రైతులు ఎదురు చూస్తున్నారు.
Advertisement
Advertisement