ఎన్డీఎస్‌ఎల్ కథ కంచికేనా?
- లేఆఫ్ ప్రకటించి...కార్మికుల వేతనాలను నిలిపివేసిన యాజమాన్యం
- ఈయేడు కూడా క్రషింగ్ భరోసాలేదు
- ఫ్యాక్టరీ పరిధిలో 20వేల ఎకరాల్లో చెరకుసాగు
- గానుగకు దగ్గర పడుతున్న సమయం
- ఆధారం కోసం దిక్కులు చూస్తున్న అన్నదాతలు
మెదక్: ఎన్డీఎస్‌ఎల్ యాజమాన్యం రెండేళ్లుగా క్రషింగ్ నిలిపివేయడంతో చెరకు రైతులు అయోమయంలో పడ్డారు. యాజమాన్యం ఏడు నెలల క్రితం లే ఆఫ్ ప్రకటించి ఫ్యాక్టరీని మూసివేసి కార్మికులకు వేతనాలను నిలిపివేసింది. దీంతో కార్మికులు అప్పటినుంచి ఫ్యాక్టరీ గేటు ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వంకాని, యాజమాన్యంగాని స్పందంచడంలేదు. మంభోజిపల్లి శివారులోని ఎన్డీఎస్‌ఎల్ ఫ్యాక్టరీ పరిధిలో మెదక్, కొల్చారం, పాపన్నపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట, చేగుంట, వెల్దుర్తి, కౌడిపల్లి, టేక్మాల్‌తో పాటు 12 మండలాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో సాగునీటి వనరులు లేకపోవడంలో రైతులు చెరకు సాగు చేస్తున్నారు.
ఫ్యాక్టరీ ప్రారంభంలో సీజన్‌లో 5లక్షల మెట్రిక్ టన్నుల చెరకు గానుగాడేది. 600 మంది కార్మికులు పనిచేసేవారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నష్టాలను సాకుగా చూపి మెదక్, బోధన్, మెట్‌పల్లి యూనిట్లను ప్రైవేట్ సంస్థకు 51 శాతం వాటాను అప్పగించారు. నాటి నుంచి కార్మికులకు, రైతులకు కష్టాలు మొదలయ్యాయి. గతేడాది చెరుకు సీజన్‌లో ఫ్యాక్టరీని ప్రారంభించక పోవడంతో లక్షలాది టన్నుల చెరుకు ఖండసారి ఫ్యాక్టరీలకు తరలించి నష్టపోయారు. ఈసారి క్రషింగ్‌కు నెలన్నర సమయమే ఉన్నందున గత ఏడాది పరిస్థితే కొనసాగుతుందా.. అనే ఆందోళనలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.
పట్టించుకోని ప్రభుత్వం
ఫ్యాక్టరీలో ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్నా ఫ్యాక్టరీ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా లేఆఫ్ ప్రకటించడం, కార్మికులకు వేతనాలు ఎగ్గొట్టడం, క్రషింగ్ చేపట్టక పోవడం, కార్మికులు దాచుకున్న పీఎఫ్ డబ్బులు ఇవ్వక పోవడం వంటి అకృత్యాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గతేడాది కార్మికులతో ఫ్యాక్టరీ లోపల పిచ్చిమొక్కలు, గడ్డిని తొలగించే పనులు చేయించారు. అయినప్పటికీ కార్మికులు కూలీలు చేసే పనులు చేశారు.
ఇదే సమయంలో ఎన్డీఎస్‌ఎల్ నుంచి ఆరుగురు కార్మికులు పదవీవిరమణ చేశారు. ఆ సమయంలో వారు దాచుకున్న పీఎఫ్ డబ్బులు ఇవ్వక పోవడంతో ముగ్గురు కార్మికులు గుండె ఆగి చనిపోయారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో కార్మికులకు, రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.