సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: చెరకు రైతుల అంశం ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని 12 నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేయనుంది. పసుపు బోర్డు అంశం తరహాలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీల పరిధిలోని చెరకు రైతుల విషయం ఉత్తర తెలంగాణలో రాజకీయ పార్టీలకు ప్రధాన ప్రచారాస్త్రమైంది.
గత పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు అంశం నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాన్ని శాసించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో చెరకు పంట విస్తీర్ణం పెంపు అంశం కీలకం కానుంది. బోధన్ (ఉమ్మడి నిజామాబాద్), మంబోజిపల్లి (ఉమ్మడి మెదక్), ముత్యంపేట (ఉమ్మడి కరీంనగర్) జిల్లాల్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీలను రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే తెరిపిస్తామని ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కూడా ప్రకటించారు.
దేశవ్యాప్తంగా పెట్రోల్‌లో ఇథనాల్ వాడకం పెరిగిన నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారీకి ఆయా పరిశ్రమల ఏర్పాటుపై పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే అంశాన్ని బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రచారా్రస్తాలుగా చేసుకుంటున్నాయి.
2002లో చంద్రబాబు విక్రయం..
నిజాం షుగర్స్ యూనిట్లను 2002లో డెల్టా పేపర్ మిల్స్ అనే ప్రైవేటు కంపెనీకి చంద్రబాబు ప్రభుత్వం విక్రయించింది. 2014 ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ నిజాం షుగర్స్‌ను ప్రభుత్వపరం చేస్తామన్నారు. అయితే 2015 డిసెంబర్ 23న ఫ్యాక్టరీ మూడు యూనిట్లు లేఆఫ్ ప్రకటించాయి.
అయితే 2005–06లో చెరకు 35 వేల టన్నుల దిగుబడి ఉన్నప్పటికీ నడిపిన ఈ కర్మాగారాలను 2015లో లక్ష టన్నుల చెరకు దిగుబడి ఉన్నప్పటికీ మూసేయడం గమనార్హం. దీంతో రైతులు వరి వైపు మళ్లారు. నిజాం షుగర్స్ పరిధిలో చెరకు పండించే 12 నియోజకవర్గాల్లో గతంలో సుమారు 1.22 లక్షల ఎకరాల్లో చెరకు సాగు చేసేవారు. చెరకు రైతులే ప్రధానాంశంగా బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇది చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment