కాళేశ్వరం చూపించి ఓట్లడుగు | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం చూపించి ఓట్లడుగు

Published Thu, Nov 23 2023 4:38 AM

PCC chief Revanth Reddy challenges KCR - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌/గజ్వేల్‌/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: దశాబ్దాల క్రితం కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్మించిన శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులు చెక్కు చెదరకుండా ఉంటే.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇటీవల కట్టిన కాళేశ్వరం కూలిపోతోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేడిగడ్డ కుంగింది.. అన్నారం పగిలింది. కేసీఆర్‌.. నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు చూపించి ఓట్లడుగు.. నేను శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్‌ చూపించి ఓట్లడుగుతా.

నీకు చేతనైతే రా..’అంటూ సవాల్‌ విసిరారు. ‘నేను ఏకలింగాన్ని, బుక్కెడు బువ్వోన్ని’అంటూ గజ్వేల్‌కు వచ్చిన కేసీఆర్, ఇప్పుడు ఎట్లుండో ప్రజలకు తె లుసునని అన్నారు. బక్కోడ్ని అని చెప్పుకునే కేసీఆర్‌ రూ.లక్ష కోట్లు దిగమింగడంతో పాటు, 10 వేల ఎకరాలు ఆక్రమించుకున్నారని, వందల ఎకరాలున్న ఫామ్‌హౌస్‌ చుట్టూ కాళేశ్వరం కాల్వలు నిర్మించుకున్నాడని ఆరోపించారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రూ.లక్ష కోట్ల అవినీతి సొమ్ము కక్కిస్తామని అన్నారు. బుధవారం నిజామాబాద్‌ జిల్లా నిజామాబాద్‌ రూ రల్‌ నియోజకవర్గంలోని దర్పల్లి, సిద్దిపేట జిల్లా గజ్వే ల్, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ సభల్లో ఆయన ప్రసంగించారు. 

అందుకే కామారెడ్డికి కేసీఆర్‌ 
‘కాంగ్రెస్‌కు 20 సీట్లు కూడా రావని కేసీఆర్‌ అంటున్నారు. నిజామాబాద్‌ సాక్షిగా కేసీఆర్‌కు చెబుతున్నా.. కాంగ్రెస్‌ ఒక్క సీటు కూడా తగ్గకుండా 80 సీట్లు వస్తాయి. కేసీఆర్‌ ఓటమి భయంతో ఆగమవుతున్నారు. గజ్వేల్‌లో ఓడిపోతాననే భయంతోనే కామారెడ్డిలో పోటీ చేయడానికి వచ్చారు. కానీ కామారెడ్డిలోనూ ముఖ్యమంత్రికి అసలైన వేట తప్పదు. కన్యాకుమారి వెళ్లినా.. శంకరగిరి మాన్యాలకు వెళ్లినా పట్టుకొని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు..’అని రేవంత్‌రెడ్డి చెప్పారు.  

అధికారంలోకి వస్తే అండగా ఉంటాం 
‘బక్కటోన్ని అని చెప్పుకునే కేసీఆర్‌ తింటే బకాసురుడు, పడుకుంటే కుంభకర్ణుడు. ప్రజాధనాన్ని లూటీ చేసి, భూములను కాజేశారు. నేను గజ్వేల్‌ వస్తున్నానని తెలిసి కొడంగల్‌కు పోయిన కేసీఆర్‌.. రేవంత్‌ నోరు తెరిస్తే కంపుకొడుతది అనడం విడ్డూరంగా ఉంది. మనమిద్దరం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్ష చేయించుకుంటే ఎవరి నోరు కంపు కొడుతుందో తెలుస్తుంది. నేను సుక్క ముట్టెటోన్ని కాదు.. నీకు సుక్క లేంది నడవదు.. ఇలాంటి మతిలేని మాటలు మాట్లాడొద్దు.

కాంగ్రెస్‌ వస్తే మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు అండగా ఉంటాం. పోడు భూములకు పట్టాలు ఇస్తాం. తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులిచ్చి సీసీరోడ్లు, డ్రైనేజీలు వంటి అభివృద్ధి పనులు చేపడతాం. గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు రుణమాఫీ చేస్తాం. నన్ను అసెంబ్లీకి పంపి ఇందిరమ్మ రాజ్యం వచ్చేలా చేయాలి. ఇచ్చిన హామీలు నెరవేర్చని కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి. భూములు గుంజుకునే దోపిడీ దొరల రాజ్యాన్ని ప్రజలు సాగనంపాలి..’అని రేవంత్‌ విజ్ఞప్తి చేశారు.  

వైఎస్‌ మాదిరిగా సంక్షేమం 
‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో దళితులు, గిరిజనులకు అసైన్డ్‌ భూములు పంపిణీ చేశారు. అలాగే వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్లు.. ఇలా నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. అదే మాదిరిగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తాం’అని రేవంత్‌ హామీ ఇచ్చారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement