క్రషింగ్‌కు సిద్ధమవుతున్న ఎన్‌సీఎస్
బొబ్బిలి : చెరకు రైతుల అనుమానాలకు అధికారులు తెరదించారు. లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం పరిధిలో ఉన్న వేలాది ఎకరాల చెరకును అదే ఫ్యాక్టరీలో క్రషింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రైతుల కష్ట, నష్టాలు, ఇబ్బందులను గుర్తించిన అధికారులు స్వీయ పర్యవేక్షణలో ఈ ఏడాది క్రషింగ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు చెరకు అభివృద్ధి మండలి అధికారులు, ఉద్యోగులు దగ్గరుండి మిల్లు అయిలింగ్ పనులను చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ యాజ మాన్యం మూడేళ్లగా బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం, ఈ ఏడాది జనవరి నుంచి బిల్లులు చెల్లింపు పూర్తిగా నిలిపి చేయడంతో ఏపీ చెరకు రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన సంగతి విధితమే. రైతులతో పాటు, బ్యాంకులు, కార్మికులు, కూలీలకు దాదాపు రూ.50 కోట్ల వరకూ యాజమాన్యం చెల్లించవలసి ఉంది.
ఆర్‌ఆర్ యాక్టు ప్రకారం ఎన్‌సీఎస్ ఆస్తులను వేలంవేయడానికి కూడా రెవెన్యూ శాఖ సిద్ధమైంది. ఫ్యాక్టరీ ఎండీ., డైరక్టర్లును పోలీసులు అరె స్టు చేశారు. దాదాపు 20రోజుల తరువాత వారు బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈఫ్యాక్టరీలో క్రషింగ్ జరిగే పరిస్థితి కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. వేలాది ఎకరాల్లో చెరుకు పండించామని ఇప్పుడు తమగతేంకానని వా పోరారు. దీంతో అధికారులు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు వైపు దృష్టి సారించారు. జిల్లాలో బీమసింగి వద్ద సహకార రంగంలో నడుస్తున్న చక్కెర కర్మాగారంలో లచ్చయ్యపేట పరిధిలోని రైతులు సంబంధించిన చెరకును రోజుకు రెండు వందల టన్నులు ఆడేవిధంగా ఏర్పాట్లు చేశారు. అయితే దీనివల్ల రవాణా ఖర్చు పెరగడంతో పాటు చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందులు మరీ అధికమవుతాయని భావించిన అధికారులు లచ్చయ్యపేట ఫ్యాక్టరీ ద్వారా ఈ ఏడాది చెరుకును క్రషింగ్ చేయించాలని నిర్ణయించారు.
ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా ఈ ఏడాది చెరుకును క్రషింగ్ చేయడానికి సుముఖత వ్యక్తంచేస్తూ ఈ నెల 3న అధికారులకు లేఖ పంపింది. దీంతో చెరకు అభివృద్ధి మండలి అధికారులు దగ్గరుండి ఆయిలింగ్ పనులు చేయిస్తున్నారు. ఫ్యాక్టరీలో కొన్ని ప్రధానమైన భాగాలు పాడైతే వాటిని ఇతర ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారు. ఈ ఆయిలింగ్ పనులకు దాదాపు కోటీ 25 లక్షల రూపాయల వరకూ ఖర్చు కానుంది. ఎండీ, డైరక్టర్లు బెయిల్‌పై బయటకు వచ్చేశారు కాబట్టి ఫ్యాక్టరీని క్రషింగు చేయడానికి, ఇతర విషయాలపై ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ఈఏడాది క్రషింగ్‌కు చెరుకు తీసుకువచ్చిన వారికి బిల్లులు వెంట వెంటనే చెల్లించే విధంగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ పరిధిలో 17 మండలాలకు చెందిన దాదాపు 16 వేల మంది రైతులు 6వేల 900 హెక్టార్లలో చెరకు పంటను వేశారు. దాని ద్వారా సుమారు 3 లక్షల 61 వేల టన్నుల దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం రోజుకు 4 వేల నుంచి 4200 టన్నుల వరకూ క్రషింగును చేస్తుంది.