గానుగాట ప్రశ్నార్థకం | Ganugata questionable | Sakshi
Sakshi News home page

గానుగాట ప్రశ్నార్థకం

Published Wed, Dec 24 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM

Ganugata questionable

తగ్గిన చెరకు దిగుబడి
షాషింగ్ లక్ష్యం 11లక్షల టన్నులు
{పస్తుతమున్న చెరకు 7 లక్షల టన్నులే..
నాన్ మెంబర్ల నుంచి సేకరణకు సిద్ధమవుతున్న ఫ్యాక్టరీలు

 
సహకార చక్కెర మిల్లుల పరిస్థితి దయనీయంగా ఉంది. లక్ష్యం మేరకు గానుగాటకు చెరకు లభ్యమవుతుందో లేదో అన్న బెంగ ఆయా యాజమాన్యాలను పీడిస్తోంది. దిగుబడి తగ్గిపోవడం ఇందుకు కారణం. పదేళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది జిల్లాలో చెరకు సాగు విస్తీర్ణం భాగా పెరిగింది. క్రషింగ్‌కు ఢోకా ఉండదని అంతా మురిసిపోయాయి. ఇటు పంచదార, అటు బెల్లం దిగుబడి బాగుంటుందని ఆశించారు. హుద్‌హుద్ కక్కిన విషంతో అంతా తలకిందులైంది. లక్ష్యం మేరకు క్రషింగ్ ప్రశ్నార్థకంగా మారింది.

చోడవరం: జిల్లాలో చెరకు సాగు సాధారణ విస్తీర్ణం 40,353 హెక్టార్లు. ఈ ఏడాది సుమారు 45 వేల హెక్టార్లలో రైతులు ఈ పంటను చేపట్టారు. నాలుగు ఫ్యాక్టరీల్లో చోడవరం, ఏటికొప్పాక, తాండవ 11ల క్షల టన్నులకు మించి క్రషింగ్‌కు లక్ష్యంగా పెట్టుకున్నాయి.   తుమ్మపాల పరిస్థితి దయనీయంగా ఉన్నవిషయం తెలిసిందే. దానిని తప్పిస్తే ఒక్క గోవాడ ఫ్యాక్టరీయే గతేడాది 5.48లక్షల టన్నుల చెరకు గానుగాడింది. ఈ ఏడాది 6లక్షల టన్నుల వరకు క్రషింగ్ చేయగలమని ఆశించింది. ఇందు కోసం ఈ ఏడాది ముందుగానే క్రషింగ్‌ను మూడు ఫ్యాక్టరీలు ప్రారంభించాయి. పంట పెరుగుదల సమయంలో హుద్‌హుద్ పంజా విసిరింది. దాని ధాటికి ఇటు ఫ్యాక్టరీలు, అటు చెరకు పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. సుగర్స్‌కు ఈ పరిణామం కోలుకోలేని దెబ్బ అయింది. అత్యధికంగా చెరకు పండించే చోడవరం, మాడుగుల, యలమంచిలి, అనకాపల్లి, పాయకరావుపేట నియోజకవర్గాల్లోనే తుఫాన్‌కు చెరకు తోటలన్నీ నేలమట్టమయ్యాయి. అనంతరం వర్షాల జాడలేకుండా పోయింది. దిగుబడి ఘోరంగా తగ్గిపోయింది. గోవాడ ఫ్యాక్టరీ పరిధిలో పక్వానికి వచ్చిన 2లక్షల టన్నుల చెరకు తోటలు నేలకొరిగి నీరుపట్టాయి.

జడచుట్టు దశలోని వేలాది ఎకరాల్లో తోటలు ఒరిగిపోవడంతో చెరకు గెడ ఎదుగుదల తగ్గిపోయింది. ఎకరాకు సాధారణంగా 25 నుంచి 35టన్నులు, మంచి పల్లం భూముల్లో అయితే 45టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఈ ఏడాది ఎకరాకు 20టన్నులకు మించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిపై సర్వేచేసిన ఫ్యాక్టరీలు తాము పెట్టుకున్న క్రషింగ్ లక్ష్యాలను ఎలా ఛేదించాలనే ఆలోచనలో పడ్డాయి. నాలుగు ఫ్యాక్టరీలు కలిసి ఈ సీజన్‌లో 7లక్షల టన్నులైనా క్రషింగ్‌చేయలే ని దుస్థితి. భారీక్ష్యాలతో క్రషింగ్ ప్రారంభించిన గోవాడ ఫ్యాక్టరీ 3.5లక్షలకు మించి గానుగాడలేని పరిస్థితి. ఇక తాండవ, ఏటికొప్పాక, పరిస్థితి నామమాత్రం. తుమ్మపాల పరిధిలో మరీ ఘోరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో  ఈ ఏడాది నాన్ మెంబర్ల నుంచి కూడా చెరకు తీసుకోవాలని ఫ్యాక్టరీలు భావిస్తున్నాయి. ఇప్పటికే ప్రకటనలు కూడా చేశాయి. దిగుబడి తగ్గడంతో ఫ్యాక్టరీలు ఈ విధంగా బాధపడుతుంటే పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితిలేదని రైతులు వాపోతున్నారు.
 
పెట్టుబడి రాదు
 
నాది మాడుగుల మండలం కేజేపురం. నాలుగు ఎకరాల్లో చెరకు తోట వేశాను. తుఫాన్‌కు సగానికి పైగా తోట నేలకొరిగిపోయింది. తర్వాత వర్షాలులేక ఎదుగుదల లేకుండా పోయింది. సుమారు రూ.1.3లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. ఎకరాకు 20టన్నులు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గిట్టుబాటు ధర ఎంత ఇస్తారో తెలియదు. ఈ ఏడాది కనీసం టన్నుకు రూ.2500 నుంచిరూ.3వేలు వరకు మద్దతు ధర ఇస్తే తప్పా పెట్టుబడి కూడా దక్కేలా లేదు.
 -జి. అప్పలనాయుడు, చెరకు రైతు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement