Yield
-
గుళి సామ.. ఎకరానికి 11 క్వింటాళ్లు!
ఉత్తరాంధ్రలోని అల్లూరి సీతారామ జిల్లాలో సామ పంట విస్తృతంగా సాగవుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇతర చిరుధాన్యాలతో పాటు సామలకు మంచి గిరాకీ ఏర్పడటంతో గిరిజన రైతుల్లో ఈ పంట సాగుపై ఆసక్తి పెరుగుతోంది. దీంతో ఈ పంట విస్తీర్ణం కూడా విస్తరిస్తోంది. సేంద్రియ పద్ధతిలో పండించడానికి శ్రమ, పెట్టుబడి పెద్దగా అవసరం లేనిది సామ. అందువల్ల గిరిజనులందరూ ఎంతోకొంత విస్తీర్ణంలో ఈ పంటను పండించి, తాము తింటూ, మిగతా సామలు అమ్ముకుంటూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. పూర్వం సామ ధాన్యాన్ని తిరగలిలో మరపట్టి బియ్యంలా మార్చుకొని సామ అన్నం, ఉప్మా, జావ వంటి సాంప్రదాయ వంటలు వండుకునే వారు. ఈ మధ్య మైదాన ప్రాంతాల ప్రజల్లో కూడా చిరుధాన్యాల వినియోగం పెరగడం, వీటితో బిస్కట్లు, కేక్ వంటి వివిధ రకాల చిరు తిండి ఉత్పత్తులను తయారుచేసి అమ్మడం వల్ల చిరుధాన్యాల ధరలు పెరిగి రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి.అప్పుడు చోడి, ఇప్పుడు సామ ఈ క్రమంలో వికాస స్వచ్చంద సంస్థ 2016లో చోడి /రాగి పంటలో గుళి సాగు పద్ధతిని ప్రవేశపెట్టింది. సాధారణంగా రైతులు చిరుధాన్యాల విత్తనాలను వెదజల్లే పద్ధతిలో పండిస్తుంటారు. నారు పెంచి, పొడి దుక్కిలో వరుసల్లో గుంతలు తీసి నాట్లు వేసుకునే పద్ధతిలో పండించడాన్నే ‘గుళి’ (గుళి అంటే గిరిజన భాషలో గుంట అని అర్థం) పద్ధతిగా పిలుస్తున్నారు. గుళి చోడిని పద్ధతిలో పండిస్తూ గిరిజన రైతులు దిగుబడిని ఎకరాకు 400 కేజీల నుంచి దాదాపు 1000 కేజీల వరకు పెంచుకోగలిగారు. ఈ క్రమం లోనే వికాస సంస్థ 2024 ఖరీఫ్ పంట కాలంలో గుళి పద్ధతిలో సామ పంటను సాగు చేయటానికి 54 మంది గిరిజన రైతులకు తోడ్పాటునందించింది.30–35 రోజుల మొక్క నాటాలిప్రధాన పొలం చివరి దుక్కిలో 200 కేజీల ఘన జీవామృతాన్ని చల్లడం వల్ల భూమికి బలం చేకూరి, రైతులు మంచి దిగుబడి సాధించారు. సామ పంట ముఖ్యంగా పెద్ద సామ రకం బాగా ఎత్తు పెరుగుతుంది. అందువల్ల మొక్కలు నాటిన తర్వాత 30 నుండి 35 రోజుల మధ్య వెన్ను రాక ముందే తలలు తుంచాలి. దీని వల్ల పంట మరీ ఎత్తు పెరగకుండా, దుబ్బులు బలంగా పెరుగుతాయి. గాలులకు పడిపోకుండా ఉంటుంది. దుంబ్రీగూడ మండలం లోగిలి గ్రామంలో కొర్రా జగబంధు అనే గిరిజన రైతు పొలంలో గుళి పద్ధతిలో పండించిన పెద్ద సామ పంటలో క్రాప్ కటింగ్ ప్రయోగాన్ని నిర్వహించారు. రైతులు, వికాస సిబ్బంది, నాబార్డ్ జిల్లా అధికారి చక్రధర్ సమక్షంలో సామలను తూకం వేసి చూస్తే.. ఎకరాకు దాదాపు 1,110 కేజీల (11.1 క్వింటాళ్ల) దిగుబడి నమోదైంది. ఈ పొలానికి పక్కనే రైత్వారీ పద్ధతిలో వెదజల్లిన సామ పొలంలో దిగుబడి ఎకరాకు 150 కేజీల నుంచి 200 కేజీలు మాత్రమే! గుళి సాగు ప్రత్యేకత ఏమిటి?రైత్వారీ పద్ధతిలో ఎక్కువ విత్తనం వెదజల్లటం, నేలను తయారు చేసే సమయంలో ఎటువంటి ఎరువు వేయక΄ోవడం, ఒక ఎకరాకు ఉండాల్సిన మొక్కల కన్నా మూడు నాలుగు రెట్లు ఎక్కువ సాంద్రతలో మొక్కలు ఉండటంతో పంట బలంగా పెరగలేకపోతోంది. గుళి పద్ధతిలో లేత నారును పొలంలో వరుసల మధ్య అడుగున్నర దూరం, మొక్కల మధ్య అడుగు ఉండేలా నాటుతారు. రైత్వారీ వెద పద్ధతిలో ఎకరానికి 3 నుంచి 4 కేజీల విత్తనం అవసరం. దీనికి బదులు మొక్కలు నాటడం వల్ల ఎకరానికి 300 నుంచి 400 గ్రాముల విత్తనం (దాదాపు పది శాతం మాత్రమే) సరిపోతుంది. నారు పెంచుకొని 15 నుంచి 20 రోజుల వయసు మొక్కల్ని పొలంలో నాటుకోవడం వల్ల విత్తన ఖర్చు దాదాపుగా 90 శాతం తగ్గుతోంది. మొక్కల సాంద్రత తగినంత ఉండి, మొక్కలు పెరిగే సమయంలో ప్రతి మొక్కకూ చక్కగా ఎండ తగలుతుంది. ఘన జీవామృతం వల్ల నేల సారవంతమై సామ మొక్కలు బలంగా పెరిగి, మంచి దిగుబడి వస్తున్నట్టు గమనించామని వికాస సిబ్బంది వెంకట్, నాగేశ్వర రావు, తవుడన్న చెబుతున్నారు. దూరంగా నాటడం వల్ల దుక్కి పశువులతో కానీ, సైకిల్ వీడర్‌తో కానీ కలుపు తొందరగా, సులభంగా తియ్యవచ్చు. మొక్కలు బలంగా , ఏపుగా పెరగటం వల్ల కోత సమయంలో వంగి మొదలు నుంచి కోసే బదులు, నిలబడి వెన్నులు కొయ్యడం వల్ల సమయం ఆదా అవడమే కాక సులభంగా పంట కోత జరుగుతుండటం మరో విశేషం. మున్ముందు వరిగ, ఊద కూడా..అల్లూరి సీతారామ జిల్లాలో సామ పంటను ఈ సంవత్సరం ప్రయోగాత్మకంగా గుళి పద్ధతిలో పండించిన గిరిజన రైతులకు ఎకరానికి 11 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రైత్వారీ వెద పద్ధతిలో 2 క్వింటాళ్లకు మించలేదు. కనువిందు చేస్తున్న ఈ పొలాలను చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులను, మహిళలకు చూపిస్తున్నాం. వారు కూడా వచ్చే సంవత్సరం నుంచి మొక్కలు నాటే పద్ధతిని అనుసరించేలా ్ర΄ోత్సహిస్తున్నాం. ఇప్పటికే గిరిజన రైతులు చోడి సాగులో గుళి పద్ధతిని ΄ాటిస్తున్నారు. దీని వల్ల తక్కువ సమయంలోనే సామ రైతులు గుళి పద్ధతికి మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో వరిగ, ఊద పంటల్ని కూడా గుళి పద్ధతిలో సాగు చేయిస్తాం. – డా. కిరణ్ (98661 18877), వికాస స్వచ్ఛంద సంస్థ, అల్లూరి సీతారామరాజు జిల్లా -
దొండతో దండిగా ఆదాయం!
ప్రణాళికాబద్ధంగా కష్టపడితే వ్యవసాయం సహా ఏ రంగంలోనైనా రాణించొచ్చు అంటున్నారు ప్రకాశం జిల్లా కంభం పట్టణానికి చెందిన యంజి బీఈడి కళాశాల కరస్పాండెంట్ గఫార్ అలిఖాన్ బీఈడీ కళాశాల పనులపై ఇతర ప్రాంతాలు వెళ్లి వచ్చే క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలో పండ్ల తోటల్లో అంతర పంటలుగా కూరగాయలు సాగు చేస్తున్న పొలాలు కంటపడ్డాయి. ఆ పంటలను చూసిన తర్వాత వ్యవసాయంపై మక్కువ కలిగింది. అక్కడి రైతులతో మాట్లాడి వ్యవసాయం లాభదాయకంగా ఎలా చెయ్యాలో తెలుసుకున్నారు. కందులాపురం వద్ద తనకున్న 2.2 ఎకరాల భూమిలో రెండేళ్ళ క్రితం బత్తాయి మొక్కలు నాటారు. అందులో 12 రకాల అంతర పంటలు సాగు చేస్తూ సత్ఫలితాలు పొందుతున్నారు గఫార్.బత్తాయి తోట కాపునకు వచ్చే సరికి నాలుగేళ్ళ కాలం పడుతుంది. ఈలోగా అంతర పంటలు వేసుకొని సాగు లాభదాయకమని ప్రధాన అంతర పంటగా టొమాటోను ఫెన్సింగ్ పద్ధతిలో సాగు చేస్తూ మంచి దిగుబడి పొందుతున్నారు. బత్తాయి తోట చుట్టూ సుమారు 20 సెంట్లలో పందిళ్లు వేసి దొండ మొక్కలు నాటారు. 4 నెలలకే పంట చేతికి వస్తున్నది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ దొండ రూ. 50 వరకు పలుకుతున్నది. ఇప్పటికే రూ. లక్షన్నరకు పైగా లాభం వచ్చిందని గఫార్ వివరించారు. దొండ పందిళ్ల కింద క్యాబేజీ, బీట్రూట్ సాగు చేస్తున్నారు. పొలం చుట్టూ వేసిన ఫెన్సింగ్‌కు సైతం సొరకాయ చెట్లను పాకించారు. సొర తీగలు కాయలనివ్వటంతో పాటు చీడపీడలను అడ్డుకునే జీవకంచెగా ఉపయోగ పడుతున్నాయన్నారు. కొత్తిమీర, కాకర, మెంతి, కాకర, మిరప, మునగ, కాళీఫ్లవర్, బీర ఇంకా తదితర అంతర పంటలు సాగు చేస్తున్నారు. రెండు ఎకరాల్లో 15 ట్రాక్టర్ల మాగిన పశువుల ఎరువుతో పాటు వర్మీ కం΄ోస్టు, జీవామృతం, వేప పిండి, కానుగ పిండి, ఆముదం పిండి, జీవన ఎరువులను వినియోగిస్తున్నారు. బత్తాయిలో సాగు చేసే అంతర పంటలకు పెట్టుబడి తక్కువగానే ఉంటుంది. పందిళ్లు వేసి విత్తనాలు నాటితే చాలు దిగుబడినిస్తాయి. దొండలో వచ్చిన ఆదాయం బత్తాయితో పాటు ఇతర అన్ని పంటల పెట్టుబడికి సరి΄ోతుందని గఫార్ స్వీయానుభవంగా చెబుతున్నారు. బీర, సొరకాయ, క్యాబేజీ, ఇతర కూరగాయల సాగు కూడా మంచి లాభదాయకమేనన్నారు. తక్కువ విస్తీర్ణంలో అంతర పంటలతో మేలు: రెండెకరాల లేత బత్తాయి తోటలో అంతర పంటలుగా కూరగాయలు సాగు చేస్తున్నాను. భూమిని ఖాళీగా వదలకుండా అంతర పంటలు వేశాం. తోటల్లో అంతర పంటలుగా కూరగాయ పంటలు సాగు చేసుకుంటే మంచి లాభాలు ఉంటాయని నా అనుభవంలో తెలుసుకున్నాను. అంతర పంటలకు పెట్టుబడి తక్కువే. శ్రమ అధికంగా ఉంటుంది. అందుకని రైతులు తక్కువ విస్తీర్ణంలో అంతర పంటలు వేసుకోవటం లాభదాయకం. – గఫార్ అలీఖాన్, కంభం – ఖాదర్ బాష, సాక్షి, కంభం -
వెజి‘ట్రబుల్’కు విరుగుడు.. టమాటా, ఉల్లిపాయల ప్రాసెసింగ్‌తో దీర్ఘకాలం నిల్వ
-పల్లా రవికిరణ్, ఏపీ సెంట్రల్ డెస్క్ నిన్నటిదాకా వినియోగదారులను ఏడిపించిన టమాటా నేడు రైతన్నలతో కన్నీళ్లు పెట్టిస్తోంది! టమాటాతో పోటీగా ఎగబాకిన పచ్చి మిర్చి ధరలు సగానికిపైగా పతనమయ్యాయి! ఈదఫా ‘ఉల్లిపాయ’ బాంబు పేలటానికి సిద్ధమైంది!! సామాన్యుడిని ఠారెత్తించిన కూరగాయల ధరలు ఇప్పుడు దిగి వచ్చినా కొద్ది నెలలు దేశ ప్రజలకు చుక్కలు చూపించాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా టమాటాలే. ఐదారు రోజులకు మించి నిల్వ ఉంటే పాడవుతాయి. అకాల వర్షాలకు ఉల్లిపాయలు కుళ్లిపోతాయి. చాలాసార్లు కనీస ఖర్చులు కూడా దక్కకపోవడంతో టమాటాలను రోడ్లపై పారబోసి నిరసన తెలిపిన ఘటనలున్నాయి. అయితే అనావృష్టి లేదంటే అతివృష్టి..! మరి ఏం చేయాలి? సీజన్లో సద్వినియోగం.. వాతావరణ మార్పుల కారణంగా అకాల వర్షాలతో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడం నిజమే అసలు కారణం సరైన నిల్వ, ప్రాసెసింగ్ సదుపాయాలు లేకపోవడమే. వరద వచ్చినప్పుడే ఒడిసి పట్టుకోవాలి! టమాటా, ఉల్లి లాంటివి కూడా సీజన్లో విరివిగా, చౌకగా లభ్యమవుతాయి. మరి సమృద్ధిగా దొరికినప్పుడు సేకరించుకుని ప్రాసెస్ చేసి వాడుకుంటే? రాష్ట్రంలో ఇప్పుడు అదే ప్రక్రియ మొదలైంది. సరైన పద్ధతిలో నిల్వ చేయడం, నాణ్యతను సంరక్షించడం కీలకం. అందుకే ప్రాసెసింగ్ యూనిట్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. గ్రామ స్థాయిలో పొదుపు మహిళల ద్వారా వీటిని ఏర్పాటు చేయడంతోపాటు భారీ ప్లాంట్లపై కూడా దృష్టి పెట్టింది. ఒకవైపు ధరలు పతనమైనప్పుడు మార్కెట్ జోక్యంతో అన్నదాతలను ఆదుకుంటూనే మరోవైపు వీటిని అందుబాటులోకి తెస్తోంది. దీనివల్ల ధరల మంటకు, దళారుల దందాకు తెర పడుతుంది! ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు షేక్‌జుబేదా బీ. పొదుపు సంఘంలో సభ్యురాలు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లెకు చెందిన ఈమె ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సహకారంతో టమాటా, ఉల్లిపాయల ప్రాసెసింగ్, డ్రయ్యింగ్ ద్వారా నెలకు రూ.18,000 వరకు ఆదాయాన్ని పొందుతోంది. బ్యాంకు లోన్‌తో యంత్రాలు, షెడ్‌ను సమకూర్చుకోగా సబ్సిడీగా రూ.70,000 అందాయి. తన వాటాగా రూ.20 వేలు జత చేసింది. సోలార్ డ్రయ్యర్లు, డీ హైడ్రేషన్ యూనిట్లతో రోజూ 200 కిలోల కూరగాయలను ఇంట్లోనే ప్రాసెసింగ్ చేస్తోంది. వీటిని సరఫరా చేస్తూన్న ‘ఎస్4 ఎస్’ అనే కంపెనీ ప్రాసెసింగ్ అనంతరం తిరిగి ఆమె వద్ద నుంచి సేకరిస్తోంది. 50 కిలోలు ప్రాసెసింగ్ చేసినందుకు రూ.125 చెల్లిస్తుండగా కరెంట్ చార్జీల కింద మరో రూ.20 చొప్పున కంపెనీ ఇస్తోంది. ప్రతి నెలా రూ.4,000 బ్యాంకు కిస్తీ పోనూ నికరంగా నెలకు రూ.14,000 వరకు ఆదాయం లభిస్తోంది. డ్రయ్యర్లతో డీ హైడ్రేషన్ యూనిట్లు.. ఉద్యాన రైతులకు గిట్టుబాటు ధర, మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం లక్ష్యంగా సోలార్ డ్రయ్యర్లతో కూడిన డీ హైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సహిస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద కర్నూలు జిల్లా తడకనపల్లిలో గతేడాది ఆగస్టులో 35 శాతం సబ్సిడీతో పది యూనిట్లు ఏర్పాటు కాగా కొద్ది రోజుల్లోనే మరిన్ని అందుబాటులోకి వచ్చాయి. రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తూ ఇప్పటి వరకు 1,200 టన్నుల టమాటా, ఉల్లిని ప్రాసెస్ చేశారు. ఈ ఏడాది జూలైలో మరో వంద యూనిట్లను ప్రారంభించారు. పైలెట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా రూ.84 కోట్లతో 5 వేల యూనిట్ల ఏర్పాటుకు బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అవగాహన ఒప్పందం చేసుకుంది. వీటిలో 3,500 యూనిట్లను రాయలసీమ జిల్లాల్లోనే నెలకొల్పుతున్నారు. ప్రతి 100 సోలార్ యూనిట్లను ఒక క్లసర్ కిందకు తెచ్చి రైతుల నుంచి రోజూ 20 టన్నులు టమాటా, ఉల్లిని సేకరించి రెండు టన్నుల ఫ్లేక్స్ తయారు చేయనున్నారు. కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతంలో ఇప్పటికే 900 మంది లబ్ధిదారులను గుర్తించారు. సెప్టెంబరు నాటికి 500 యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, కళ్యాణదుర్గం, సత్యసాయి జిల్లా తనకల్లు ప్రాంతాల్లోనూ లబ్ధిదారులను గుర్తిస్తున్నారు. పత్తికొండలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ కర్నూలు జిల్లా పత్తికొండలో రూ.10 కోట్లతో భారీ స్థాయిలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులకు త్వరలో భూమి పూజ జరగనుంది. ఈ యూనిట్లో స్టోరేజీ, సార్టింగ్, గ్రేడింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. పల్పింగ్ లైన్, డీ హైడ్రేషన్ లైన్ ఉంటాయి. కెచప్, జామ్, గ్రేవీ లాంటి అదనపు విలువతో కూడిన ఉత్పత్తులు తయారవుతాయి. రాజంపేటలో రూ.294.92 కోట్లతో, నంద్యాలలో రూ.165.32 కోట్లతో ఇంటిగ్రేటెడ్ గుజ్జు, ఐక్యూఎఫ్ (టమాటా) పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారు. రైతన్నకు ‘మద్దతు’.. మహిళలకు ఉపాధి ఉల్లి, టమాటా రైతులకు ఏడాది పొడవునా గిట్టుబాటు ధరలతో పాటు పొదుపు సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం. కర్నూలు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద నెలకొల్పిన 100 యూనిట్లు విజయవంతం కావడంతో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.84 కోట్ల అంచనాతో 5 వేల యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం. ఈమేరకు బ్యాంక్ ఆఫ్ బరోడాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. ఒక్కో యూనిట్ రూ.1.68 లక్షల అంచనాతో ఏర్పాటు చేస్తున్నాం. లబ్ధిదారుల గుర్తింపు చురుగ్గా సాగుతోంది. – ఎల్.శ్రీధర్‌రెడ్డి, సీఈవో, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ -
నయా టమాటా
సాక్షి, అమరావతి: కొత్త రకం టమాటా వంగడాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. యూఎస్–6242, అన్సోల్, జువేల్ వంటి హైబ్రీడ్ రకాలను రబీలో పైలట్ ప్రాజెక్ట్ కింద సాగు చేయగా.. సూపర్ సక్సెస్ కావడంతోపాటు రైతులకు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. దీంతో నూతన వంగడాల సాగును ప్రోత్సహించేందుకు ఉద్యాన శాఖ సన్నాహాలు చేస్తోంది. ఏడాది పొడవునా టమాటాలు పండుతున్నా.. మార్కెట్ ధరల్లో తీవ్రమైన వ్యత్యాసాలు ఉంటున్నాయి. కొన్ని రోజులు రైతులకు లాభాలు వస్తుండగా.. కొన్ని రోజులు కనీసం పెట్టుబడి కూడా దక్కడం గగనంగా మారుతోంది. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ.. స్థానిక వెరైటీలకు ప్రత్యామ్నాయంగా యూఎస్–6242, అన్సోల్, జువేల్ వంటి హైబ్రీడ్ రకాలను ఉద్యాన శాఖ అందు బాటులోకి తెచ్చింది. గుజ్జు ఎక్కువ.. ధర మక్కువ లోకల్ వెరైటీ టమాటా రకాల్లో గుజ్జు శాతం ఎక్కువ లేకపోవడం వల్ల ప్రాసెసింగ్‌కు పూర్తిస్థాయిలో పనికిరావడం లేదు. విధిలేని పరిస్థితుల్లో రైతుల నుంచి తక్కువ ధరకు ప్రాసెసింగ్ కంపెనీలు వీటిని కొనుగోలు చేస్తున్నాయి. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ గుజ్జు శాతం అధికంగా ఉండి ప్రాసెసింగ్‌తోపాటు స్థానికంగా వినియోగించుకునేందుకు వీలుగా ఉండే ఈ హైబ్రీడ్ రకాలను ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ సంకల్పించింది. ఒకవేళ మార్కెట్లో కనీస ధర లేకపోయినప్పటికీ కిలోకు రూ.6 తక్కువ కాకుండా రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా సేకరించి ప్రాసెసింగ్ కంపెనీలకు విక్రయించేలా అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వేసవిలో చిత్తూరు జిల్లా పలమనేరు, వి.కోట మండలాల్లో 136 మంది రైతులను గుర్తించి వారి ద్వారా 250 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా హైబ్రీడ్ రకాలను సాగు చేశారు. సాగును ప్రోత్సహించేందుకు వివిధ రూపాల్లో హెక్టార్‌కు రూ.68,225 సబ్సిడీ ఇచ్చారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా లోకల్ వెరైటీలైన సాహో, సాహితీ రకాలకు ఆశించిన స్థాయిలో పూత రాలేదు. వచ్చిన పూత, పిందె రాలిపోవడంతో ఎకరాకు 15–20 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. ఇదే సమయంలో హైబ్రీడ్ టమాటాలు 35–40 టన్నుల వరకు దిగుబడులొచ్చాయి. వైరస్‌ను తట్టుకుని తీవ్రమైన ఉష్ణోగ్రతల సమయంలో కూడా ఆశించిన స్థాయిలో దిగుబడులొచ్చాయి. మరోవైపు లోకల్ వెరైటీ టమాటాలు 15 కేజీల బాక్స్ రూ.70–రూ.80 ధర లభించగా.. హైబ్రీడ్ వెరైటీలకు రూ.190–రూ.200 వరకు ధర పలికింది. హైబ్రీడ్ రకాలకు రెట్టింపు ధరలు రావడంతో రైతులు మంచి లాభాలను ఆర్జించారు. దీంతో రానున్న రబీలోనూ ఈ రకాలను ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ సంకల్పించింది. హైబ్రీడ్ రకాలకు ఊతం సంప్రదాయ నాటు వెరైటీలకు ప్రత్యామ్నాయంగా హైబ్రీడ్ వెరైటీలను అందుబాటులోకి తీసుకొచ్చాం. రబీలో పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో రానున్న రబీలో కూడా హైబ్రీడ్ రకాల సాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకున్నాం. ధర లేకపోతే ప్రాసెసింగ్ కంపెనీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం.– డి.మధుసూదనరెడ్డి, డీహెచ్ఓ, చిత్తూరు జిల్లా -
సిద్దిపేట జిల్లాలో ముగిసిన యాసంగి ధాన్యం కొనుగోళ్లు...
సాక్షి, సిద్దిపేట: జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఒడిదుడుకుల మధ్య ముగిసింది. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో జిల్లా యంత్రాంగం 416 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 3.55లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. బుధవారంతో జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు ముగిశాయి. సీజన్ ప్రారంభంలో 5లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం వస్తుందని జిల్లా యంత్రాంగం అంచనా వేశారు. ఈ సారి యాసంగిలో కోతల సమయంలో వడగళ్లు, అకాల వర్షాలతో దిగుబడి తగ్గింది. కొందరు రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసువచ్చిన తర్వాత సైతం వర్షాలు కురవడంతో రైతులు యాసంగి ధాన్యాన్ని అమ్మడం కోసం అష్టకష్టాలు పడ్డారు. తడిసిన వడ్లకు కాంట పెట్టకపోవడంతో ఆరబెట్టిన ధాన్యం తీసుకున్నారు. తగ్గిన ధాన్యం జిల్లాలో యాసంగిలో 3.31లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. కోత దశలో వడగళ్లు, అకాల వర్షాలతో దిగుబడి పడిపోయింది. జిల్లా వ్యాప్తంగా 416 కొనుగోలు కేంద్రాల ద్వారా 85,411 మంది రైతుల దగ్గరి నుంచి రూ.732.15కోట్ల విలువ చేసే 3,55,413 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ● గతేడాది కంటే యాసంగి సీజన్లో సాగు పెరిగినప్పటికీ దిగుబడి తగ్గింది. గతేడాది 2.62లక్షల ఎకరాలు సాగయితే 3.92లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ సారి 37,055 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు తగ్గాయి. రూ.111 కోట్లు పెండింగ్ ధాన్యం కొనుగోలు చేసిన పది నుంచి 15రోజులకు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో డబ్బులు చేతిలో లేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. ● రూ.732.15 కోట్ల విలువ చేసే ధాన్యం కొనుగోలు చేయగా రూ.720.66కోట్ల విలువ చేసే ధాన్యం ట్యాబ్ ఎంట్రీ అయ్యాయి. ట్రక్ షీట్లు రూ.678.92కోట్ల విలువ చేసే ధాన్యంకు జనరేట్ అయ్యాయి. రూ.678.92 కోట్ల విలువ చేసే ధాన్యంకు మిల్లర్లు ఒకె చెప్పారు. ఇప్పటి వరకూ రైతులకు రూ.620.85కోట్లను చెల్లించారు. ఇంకా రూ.111.30కోట్లను రైతులకు చెల్లించాల్సి ఉంది. విజయవంతం యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముగిశాయి. మంత్రి హరీశ్ రావు, కలెక్టర్, అదనపు కలెక్టర్ ఆదేశాలతో ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా పూర్తి చేశాం. పెండింగ్‌లో ఉన్న ధాన్యం డబ్బుల చెల్లింపులు రెండు నుంచి మూడు రోజుల్లో పూర్తి అవుతుంది. – హరీశ్, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ -
అరవై ఏళ్లు.. 239 రకాలు..
సాక్షి, అమరావతి: దేశంలో ప్రతీ ముగ్గురిలో ఒకరు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ పది మందిలో తొమ్మిది మందికి ఈ విశ్వవిద్యాలయం అన్నం పెడుతోంది. అంటే.. ఆ వర్సిటీ అభివృద్ధి చేసిన రకాలనే దేశంలో మూడోవంతు ప్రజలు ఆహారంగా తీసుకుంటున్నారు. అదే మన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ) ప్రత్యేకత. దేశంలోనే పురాతనమైన వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఈ వర్సిటీకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అరవై ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఈ వర్సిటీ సాధించిన విజయాలెన్నో.. ఎన్నెన్నో. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి.. రెట్టింపు ఆదాయం లక్ష్యంగా ఏటా పదుల సంఖ్యలో కొత్త వరి రకాలను మార్కెట్లోకి తీసుకొస్తోంది. తెగుళ్లు, కీటకాలు, చీడపీడలు, వాతావరణ స్థితిగతులను తట్టుకునే వంగడాలను అభివృద్ధి చేయడమే కాదు.. సన్నరకాల సృష్టికర్తగా ఖ్యాతి గడించింది. ఫలితంగా దశాబ్దాలుగా వరి వినియోగంలో వర్సిటీ సృష్టించిన రకాలే ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. దేశంలో సాగయ్యే వరిలో మూడోవంతు.. దేశంలో వరి సాగవుతున్న 46 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో 14 మిలియన్ హెక్టార్లలో ‘ఆంగ్రూ’ రకాలే సాగవుతున్నాయంటే ఏ స్థాయిలో ఈ వర్సిటీ రైతుల మన్ననలు చూరగొందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. జాతీయ స్థాయి వరి ఉత్పత్తి (131 మిలియన్ టన్నులు)లో 33.15 శాతం (37.76 మిలియన్ టన్నులు) ఈ వర్సిటీ రకాలే కావడం గమనార్హం. సగటు దిగుబడి జాతీయ స్థాయిలో హెక్టార్‌కు 2,832 కిలోలు.. ఏపీలో హెక్టార్‌కు 5,048 కిలోలు ఉంటే, ఈ వర్సిటీ రూపొందించిన రకాలు ఏకంగా హెక్టార్‌కు 5,669 కిలోల దిగుబడినివ్వడమే కాదు జాతీయ స్థాయిలో రూ.62,317 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్నాయి. 60 ఏళ్లలో 239 రకాల సృష్టి.. 1964 జూన్ 12న ఏర్పాటైన ఈ వర్సిటీ.. వ్యవసాయ, అనుబంధ రంగాలలో ఉత్పత్తి, ఉత్పాదకత, లాభదాయకతను పెంచడంలో నిరంతరం కృషిచేస్తోంది. 60 ఏళ్లలో 123 అధిక దిగుబడినిచ్చే వరి రకాలతో పాటు 47 రకాల పప్పు ధాన్యాలు, 29 రకాల నూనె గింజలు, 21 రకాల వాణిజ్య పంటలు, 19 రకాల చిరుధాన్యాలను ‘ఆంగ్రూ’ అభివృద్ధి చేసింది. ఈ స్థాయిలో నూతన వంగడాలను అభివృద్ధి చేసిన వర్సిటీ దేశంలో మరొకటి లేదనే చెప్పాలి. వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా, తెగుళ్లు, చీడపీడలు, కీటకాలను ఎదుర్కొనే రకాలను అభివృద్ధి చేయడంలో వర్సిటీ క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. ఈ కోవలో అభివృద్ధి చేసిన ఎంటీయూ 7029 (స్వర్ణ), బీపీటీ 5204 (సాంబా మసూరి) వరి రకాలు జాతీయ స్థాయిలో ప్రజాదరణ పొందాయి. దేశంలోనే మొట్టమొదటి బూజు తెగులు నిరోధక మినుము రకం ఎల్బీజీ 17 (కృష్ణయ్య)తో పాటు ప్రసిద్ధి చెందిన కే6, నారాయణి, లేపాక్షి వంటి వేరుశనగ రకాలు సైతం వర్సిటీ అభివృద్ధి చేసినవే. ఆంగ్రూ రకాలతో రూ.25వేల కోట్ల ఆదాయం.. ♦ ఆంధ్రలో 90.29 శాతం అంటే అక్షరాల 21.78 లక్షల హెక్టార్లలో వర్సిటీ సృష్టించిన వరి రకాలే సాగవుతున్నాయి. ♦ సాగు విస్తీర్ణంలో 72.63 శాతం, ఉత్పత్తిలో 87.27 శాతం వర్సిటీ రకాలే. ♦ పప్పు ధాన్యాల సాగులో 35.63 శాతం, ఉత్పత్తిలో 32.16 శాతం వర్సిటీ రూపొందించినవే.. ♦ వేరుశనగ ఉత్పత్తిలో 94.03 శాతం వర్సిటీ రకాలే. ఒక్క కే6 రకమే 82 శాతం అందిస్తోంది. ♦ నువ్వుల సాగులో కూడా 87.50 శాతం ఆంగ్రూ రకాలదే కావడం విశేషం. ♦ వరి రకాల ద్వారా రూ.20,243 కోట్లు, అపరాల ద్వారా రూ.2,113 కోట్లు, నూనెగింజల ద్వారా రూ.2,862 కోట్లు కలిపి.. మొత్తం రూ.25వేల కోట్లకుపైగా ఆదాయాన్ని రాష్ట్ర రైతులు ఆర్జిస్తున్నారు. ఏటా రూ.8వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం.. ఇక ఎగుమతుల్లో బాస్మతేతర బియ్యం రకాలదే సింహభాగం. వీటిలో మూడోవంతు ‘ఆంగ్రూ’ అభివృద్ధి చేసినవే. ఉదా.. దేశం నుంచి 2021–22లో బియ్యం ఎగుమతుల ద్వారా రూ.46,914.28 కోట్ల విదేశీ మారక ద్రవ్యం దేశానికి వచ్చింది. ఈ బియ్యం ఎగుమతుల్లో 33 శాతం (రూ.15,481.71కోట్లు) ఆంగ్రూ అభివృద్ధి చేసిన రకాలకు చెందిన బియ్యమే. అలాగే, మిగతా కాలంలో ఏటా ఆంగ్రూ రకాల బియ్యం ఎగుమతి ద్వారా సగటున రూ.8,073 కోట్ల ఆదాయం సమకూరుతోందంటే ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుందో స్పష్టమవుతోంది. 12న మెగా సీడ్ మేళా.. వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 12న గుంటూరు లాంలోని వర్సిటీ ప్రాంగణంలో ‘మన రైతు కోసం మన నాణ్యమైన విత్తనం’ అనే నినాదంతో విత్తన మహోత్సవం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో సాగయ్యే, వర్సిటీ అభివృద్ధి చేసిన వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించిన విత్తనాలను ప్రదర్శన, అమ్మకానికి ఉంచుతూ రైతు మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పెట్టుబడికి ఢోకాలేదు ఆంగ్రూ అభివృద్ధి చేసిన వివిధ రకాల సాగుతో పెట్టుబడికి ఢోకాలేదని నిరూపితమైంది. ఇటీవలే ఆంగ్రూ రకాల రాబడి–ఖర్చులను విశ్లేíÙంచాం. ఖరీఫ్ కంటే రబీలో నికర రాబడులు ఎక్కువగా ఉన్నాయి. సాగుకోసం రైతులు ఖర్చుచేసే ప్రతీ రూ.100కు, వరికి రూ.103, మినుముకి రూ.132, కందికి రూ.133, మిరపకి రూ.160, శనగకి రూ.102, వేరుశనగకి రూ. 124ల చొప్పున ఆదాయం వస్తోందని గుర్తించాం. – డాక్టర్ జి. రఘునాథరెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త, ప్రాంతీయ పరిశోధనా స్థానం, లాం సీజన్ ఏదైనా మన రకాలదే ఆధిపత్యం.. ప్రధాన పంటలలో అధిక దిగుబడినిచ్చే రకాలను అభివృద్ధి చేసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో విడుదల చేయడంలో ‘ఆంగ్రూ’ ముఖ్యపాత్ర పోషిస్తోంది. ‘ఆంగ్రూ’ వరి రకాలు హెక్టారుకు 5,669 కిలోల దిగుబడిని సాధిస్తుండగా, ఇది రాష్ట్ర సగటు దిగుబడి (హెక్టారుకు 5,048 కిలోలు) కంటే ఎక్కువ. వరిలోనే కాదు అపరాలు, నూనె గింజల సాగులో కూడా ఆంగ్రూ రకాలదే సింహభాగం. దాదాపు రెండు సీజన్లలోనూ వర్సిటీ రకాలకున్న డిమాండ్ ఇతర రకాలకు లేదనే చెప్పాలి. – డాక్టర్ ఎల్. ప్రశాంతి, పరిశోధనా సంచాలకులు ఏటా రూ.2,967 కోట్ల లాభాలు.. జాతీయ స్థాయి వరి ఉత్పత్తిలో మూడో వంతు ఆంగ్రూ రకాలదే. అలాగే, జాతీయ స్థాయిలో 40 శాతం మంది రైతులు ఈ రకాలనే సాగు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతీ రైతు ఈ వర్సిటీ రకాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఏటా వరితో పాటు ఇతర పంటల్లో కూడా పెద్ద సంఖ్యలో కొత్త వంగడాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాం. సంప్రదాయ వరి రకాల కంటే ఆంగ్రూ రకాల సాగువలన ఏటా రూ.2,967 కోట్ల లాభాలను రైతులు ఆర్జిస్తున్నారు. – డాక్టర్ ఆదాల విష్ణువర్థన్‌రెడ్డి, వైస్ చాన్సలర్ -
AP: రికార్డులు బ్రేక్ చేసిన ఉద్యాన పంటల ఉత్పత్తులు
సాక్షి, అమరావతి: ఉద్యాన పంటల సాగు.. దిగుబడుల్లో ఆంధ్రప్రదేశ్ రికార్డులు తిరగరాస్తోంది. పండ్ల దిగుబడుల్లో అయితే రాష్ట్రం జాతీయ స్థాయిలో మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. లాభసాటి కాని వ్యవసాయ పంటల స్థానంలో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 44 నెలలుగా తీసుకున్న చర్యలు, ఇస్తున్న ప్రోత్సాహకాల ఫలితంగా సాగు విస్తీర్ణం పెరిగింది. ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో నిర్వహిస్తున్న తోటబడుల ద్వారా ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించేలా చేయడంతో దిగుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో 17% వృద్ధి 2021–22లో ఉద్యాన పంటల తుది దిగుబడి అంచనాలను ప్రభుత్వం విడుదల చేసింది. 2020–21లో 44.90 లక్షల ఎకరాల్లో సాగవగా, 314.78 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి. ∙అదే 2021–22లో 45.60 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవగా ఏకంగా 368.83 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. ♦ 2020–21తో పోలిస్తే సాగు విస్తీర్ణం 70వేల ఎకరాల్లో పెరిగితే దిగుబడులు ఏకంగా 54 లక్షల టన్నుల మేర పెరిగాయి. ♦ ఇలా ఏకంగా 17% వృద్ధి రేటుతో ఆల్‌టైం రికార్డు నమోదైంది. ♦ ఏడాదిలో దిగుబడులు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ♦ 2022–23లో 400 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. పంట పండిన పండ్లు.. గుబాళించిన పూలు.. ఇక పండ్ల దిగుబడుల్లో ఏపీ తన స్థానాన్ని పదిలపర్చుకుంది. 2020–21లో 178.86 లక్షల టన్నుల దిగుబడులు నమోదైతే.. 2021–22లో ఏకంగా 203.35 లక్షల టన్నులు దిగుబడులొచ్చాయి. ఇది కూడా ఓ రికార్డు అని చెబుతున్నారు. అలాగే, గతంలో ఎన్నడూ లేనివిధంగా పూలు కూడా గుబాళించాయి. పండ్లతో పోటీపడేలా వీటి దిగుబడులొచ్చాయి. 2020–21లో 44వేల ఎకరాల్లో పూల మొక్కలు సాగవగా, 2.80 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి. అదే 2021–22లో సాగు విస్తీర్ణం 1.04 లక్షల ఎకరాలకు పెరగగా, దిగుబడులు ఏకంగా 8.67 లక్షల టన్నులు నమోదయ్యాయి. ఇక ఆయిల్‌పామ్, కొబ్బరి, జీడిమామిడి, కోకో వంటి ప్లాంటేషన్ పంటల దిగుబడులు 2020–21లో 43.52 లక్షల టన్నులు నమోదైతే 2021–22లో ఏకంగా 57.56 లక్షల టన్నులు నమోదయ్యాయి. ఇక కూరగాయల విషయానికొస్తే 2020–21లో 72.92 లక్షల టన్నుల దిగుబడులొస్తే 2021–22లో 77 లక్షల టన్నులు నమోదయ్యాయి. దిగుబడులు పెరగడానికే కారణాలు.. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాల్లో మార్పులు తీసుకురావడంతో పాటు నాణ్యమైన దిగుబడులు సాధించేందుకు ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో సాగులో మెళకువలు నేర్పేందుకు పెద్దఎత్తున తోటబడులు నిర్వహించింది. పంటలకు అదనపు విలువ జోడించేందుకు గ్రామస్థాయిలో మౌలిక వసతులు కల్పించడం, మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపర్చడం వంటి చర్యలు సత్ఫలితాలిచ్చాయి. ఈ కారణంగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా 4 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. మరోవైపు.. స్ట్రాబెర్రీ, నట్మెగ్, సిన్నామన్, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, జామూన్, కరండ, చెర్రీ వంటి విదేశీ పండ్ల సాగు కూడా విస్తరిస్తోంది. -
బొప్పాయి పంట.. లాభాలే లాభాలు.. టన్ను ధర ఎంతంటే?
పెద్దపప్పూరు(అనంతపురం జిల్లా): రైతులు ఏటా వేరుశనగ సాగు చేసి, దిగుబడి రాక, పెట్టుబడి కూడా దక్కక నష్టాలు చవిచూస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో ప్రత్యామ్నాయంగా బొప్పాయి పంట సాగు చేసి, లాభాలు పండిస్తున్నారు. తెగుళ్ల ప్రభావంతో పంట దిగుబడి తగ్గినా, మార్కెట్లో ఆశించిన ధర పలుకుతుండడంతో రాబడి పెరిగిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని పెద్దపప్పూరు, యాడికి, పెద్దవడుగూరు, తాడిపత్రి మండలాల్లోని పలు గ్రామాల్లో దాదాపు 181 ఎకరాల్లో బొప్పాయి పంట సాగు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. చదవండి: సీజన్ వచ్చేసింది.. వణికించే వ్యాధుల జాబితా! లక్షణాలు, ముందు జాగ్రత్తలు నేల స్వభావాన్ని బట్టి దిగుబడి రైతులు ఎక్కువగా తైవాన్ 786 రకం బొప్పాయి మొక్కలను సాగు చేస్తున్నారు. ఎకరాకు 1000 మొక్కల చొప్పున సాగు చేస్తున్నారు. ఏటా జూన్ నెలలో సాగు చేస్తే ఏడు నెలలకు తొలి పంట కోత ప్రారంభమవుతుంది. ఎకరానికి రైతులు రూ.1.50 లక్ష పెట్టుబడి పెట్టారు. పంట కాలం పూర్తయ్యేలోపు నేల స్వభావాన్ని బట్టి ఎకరానికి 25 నుంచి 30 టన్నుల దిగుబడి వస్తుందని రైతులు చెప్తున్నారు. రైతుల చెంతకే వ్యాపారులు : ఇక్కడి రైతులు పండించిన పంటను ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాల మార్కెట్లకు ఎక్కువగా తరలిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అక్కడి మార్కెట్లలో డిమాండ్‌ను బట్టి అనంతపురం, నెల్లూరు, తాడిపత్రి పట్టణాలకు చెందిన వ్యాపారులే స్వయంగా రైతుల చెంతకు వచ్చి టన్ను రూ.8 వేల నుంచి రూ. 10 వేలకు కొనుగోలు చేస్తున్నారు. లాభదాయక పంట ఏటా జూన్ నెలలో పంట సాగు చేయాలి. అక్టోబర్‌లో సాగు చేయడంతో పంట దెబ్బతిన్నా.. తిరిగి కోలుకుంది. మూడెకరాల్లో పంట సాగు చేసినా. ఎకరానికి రూ.1.50 చొప్పున పెట్టుబడి వచ్చింది. పెట్టుబడి పోనూ రూ.లక్ష ఆదాయం వచ్చింది. మరో రెండు నెలల పాటు పంట దిగుబడి వస్తుంది. మార్కెట్లో కాయ నాణ్యతను బట్టి టన్ను రూ.8 నుంచి రూ.10 వేల వరకు ధర పలుకుతోంది. వ్వాపారులు కొందరు మావద్దకే వచ్చి పంట కొనుగోలు చేస్తున్నారు. – రైతు బాసూ సాహెబ్, చింతరపల్లి, పెద్దపప్పూరు మండలం జాగ్రత్తలు పాటిస్తే లాభాలు బొప్పాయి పంటకు ఎక్కువగా తెగుళ్లు ఆశించడంతో ఆకులు రాలిపోతాయి. పూత, పిందెలు నేలరాలతాయి. తెగుళ్లు ప్రారంభ దశలోనే గుర్తించి నివారణకు మందులు పిచికారీ చేయాలి. నేల స్వభావాన్ని బట్టి పంట దిగుబడి వస్తుంది. కాయలు నాణ్యతను బట్టి ధర పలుకుతుంది. రైతులకు పంట సాగులో ఎలాంటి సందేహాలున్నా, తెగుళ్లు వ్యాపించినా వెంటనే సమాచారం అందించాలి. క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఏ మందులు పిచికారీ చేయాలో స్వయంగా తెలియజేస్తాం. – ఉమాదేవి, ఉద్యాన అధికారిణి, తాడిపత్రి -
జీన్స్, టీషర్ట్స్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్...!
జీన్స్, టీ షర్ట్స్ అంటే యువతకు విపరీతమైన మోజు. ఏదైనా షాపింగ్ మాల్స్‌కు వెళ్లినప్పుడు మనలో ఎక్కువగా ఫ్రీఫర్ చేసేది జీన్స్, టీషర్ట్సే...! కాగా రానున్న రోజుల్లో జీన్స్, టీషర్ట్స్ ధరలకు రెక్కలు వచ్చేలా ఉన్నాయి.దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా కాటన్ ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, షిప్పింగ్ కంపెనీలు కాటన్ రవాణాకు భారీగా ఛార్జీలను వసూలు చేస్తుండటంతో కాటన్ ధరలు విపరీతంగా పెరిగాయి. చదవండి: భారీ డిస్కౌంట్లతో ముందుకువస్తోన్న షావోమీ..! సుమారు రూ. 75 వేల వరకు తగ్గింపు..! భారత్‌తో సహా, అమెరికా లాంటి దేశాల్లో పత్తి పంటకు భారీ సమస్యలు తలెత్తడంతో కాటన్ దిగుబడి తగ్గిపోయింది. అంతేకాకుండా చైనా, మెక్సికో దేశాలు రికార్డు స్ధాయిలో కాటన్‌ను కొనుగోలు చేస్తున్నాయి. గత ఏడాది నుంచి ఈ దేశాల నుంచి అమెరికా పూర్తిగా దిగుమతులను నిలిపివేసింది. భారీ మొత్తంలో కాటన్‌ను కొనుగోలు చేసి కృత్రిమ కొరతను సృష్టించేలా చైనా ముందుకు సాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత పదేళ్లలో తొలిసారి కాటన్ ఫ్యూచర్స్ పౌండ్ (సుమారు 453 గ్రాములు)కు ఒక డాలర్‌కు చేరింది. అంతర్జాతీయంగా కాటన్ ధరలు పెరగడంతో పలు జీన్స్, టీ షర్ట్స్ కంపెనీలు త్వరలోనే భారీగా ధరలను పెంచేందుకు సిద్దమైతున్నట్లు తెలుస్తోంది. కాటన్ ధరల పెరుగుదల లివైస్ స్ట్రాస్లాంటి పెద్ద కంపెనీలకు భారీ ఎత్తున్న ప్రభావితం చేస్తున్నాయి. న్యూయర్క్‌లో డిసెంబర్ నెలలో కాటన్ షిప్పింగ్ ఛార్జీలు ఒక పౌండ్‌కు 3.6 శాతం పెరిగి 1.0155 డాలర్లకు చేరుకుంది. 2011, నవంబర్ తర్వాత ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ఈ ఏడాది మొత్తంగా ధర 28 శాతం పెరిగింది. ఎందుకైనా మంచిది ఈ పండుగ సీజన్లో ఓ నాలుగైదు జీన్స్ ఎక్కువ కొనుక్కోవడం మంచిందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: Netflix: ఓటీటీలో సినిమా, వెబ్సిరీస్లేకాదు..గేమ్స్ కూడా..! -
ఓ సామాన్య రైతు విజయగాథ.. నెలకు రూ.1.50 లక్షల ఆదాయం
నాతవరం( విశాఖపట్నం): ఓ రైతు సంకల్పానికి ప్రభుత్వ సాయం తోడ్పడింది. కరోనా విసిరిన సవాళ్లతో వారి కృషి మరింత రాటు దేలింది. ఇప్పుడు వారు ఇతరులకు ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదిగారు. విశాఖ జిల్లా నాతవరం మండలంలో పుట్టగొడుగుల పెంపకం చేపట్టిన ఓ సామాన్య రైతు విజయగాథ ఇది. వెదురుపల్లి గ్రామానికి చెందిన చిత్రాడ వెంకటేశ్వరరావుకు చిన్నప్పట్నుంచీ పుట్టగొడుగుల పెంపకం అంటే అమితాసక్తి. పుట్టగొడుగుల (మష్రూమ్స్) ఉత్పత్తిపై అవగాహన పెంచుకున్నారు. తన ఇంటి సమీపంలో ఉన్న 26 సెంట్ల భూమిలో 2018లో శ్రీతులసి పుట్టగొడుగుల యూనిట్ ఏర్పాటు చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో రుణం ఇచ్చేందుకు బ్యాంకర్లు నిరాకరించడంతో వడ్డీలకు అప్పు చేసి యూనిట్ ఏర్పాటు చేసుకున్నారు. బెంగళూరు నుంచి విత్తనాలు కొనుగోలు చేసి స్ధానికంగా లభ్యమయ్యే వ్యవసాయ వ్యర్ధాలతో తన కుమారుడు దుర్గాప్రసాద్ సాయంతో 2019లో పాల రకం పుట్టగొడుగుల (మిల్కీ మష్రూమ్స్) పెంపకాన్ని ప్రారంభించారు. మొదట్లో రోజుకు 20 కేజీల పుట్టగొడుగులను ఉత్పత్తి చేసి విక్రయాలు చేసేవారు. వీరి పుట్టగొడుగుల పెంపకం గురించి తెలుసుకున్న ఉద్యానవనశాఖ అధికారులు యూనిట్‌ను స్వయంగా పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా రాయితీపై రుణం ఇస్తామని అధికారులు సూచించారు. వెంకటేశ్వరరావు కుమారుడు దుర్గాప్రసాద్ యూనిట్ ఏర్పాటు కావలసిన డీపీఆర్ తయారు చేసి ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ క్రమబదీ్ధకరణ పథకంలో రుణానికి దరఖాస్తు చేసారు. ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసి దాంట్లో రూ.8 లక్షలు (40 శాతం) రాయితీని ఇచి్చంది. ప్రభుత్వ సాయంతో ఇప్పుడు నెలకు సరాసరి 1000 కేజీల పుట్టగొడుగులు తయారు చేస్తున్నారు. వీటిని విశాఖపట్నం, నర్సీపట్నం, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, తుని తదితర ప్రాంతాలలో ఉన్న హోల్‌సేల్ షాపులకు సరఫరా చేస్తున్నారు. మార్కెట్లో డిమాండ్‌ను బట్టి కేజీ ఒక్కంటికి రూ 200 నుంచి 220 వరకు విక్రయాలు చేస్తున్నారు. పెట్టుబడితోపాటు కూలి సొమ్ము పోగా నెలకు లక్షా 50 వేల రూపాయల వరకు ఆదాయం వస్తుందని దుర్గాప్రసాద్ చెప్పారు. విత్తనాల తయారీ యూనిట్ ఏర్పాటు మొదట్లో విత్తనాలను బెంగళూరు నుంచి కేజీ ఒక్కంటికి రూ.120ల చొప్పున నెలకు 100 కేజీలకు పైగా కొనుగోలు చేసేవారు. కరోనా కారణంగా వాహనాల రవాణా నిలిచిపోవడంతో విత్తనాల సమస్య ఏర్పడి ఆరు నెలలపాటు పుట్టగొడుగుల తయారీ నిలిచిపోయింది. వెంకటేశ్వరరావు ఇద్దరు కుమారులు కరోనా కారణంగా కాలేజీ లేక పుట్టగొడుగులు తయారీ పనిలో ఉన్నారు. తమిళనాడుకు చెందిన సీనియర్ శాస్త్రవేత రామాంజనేయులు, రాష్ట్ర ఉద్యానవనశాఖ అధికారులను ఆన్లైన్లో పరిచయం చేసుకున్నారు. ఇద్దరు కుమారులు రెండు నెలలపాటు విత్తనాల తయారీ విధానాన్ని ఆన్లైన్ ద్వారా తెలుసుకున్నారు. విత్తనాల తయారీ యూనిట్‌ను రూ.10 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఈ యంత్రం ద్వారా డిగ్రీ చదువుతున్న వెంకటేశ్వరరావు పెద్ద కుమారుడు దుర్గాప్రసాద్, బి.ఫార్మసీ చేస్తున్న సాయిరామ్ విత్తనాలు తయారు చేస్తున్నారు. విశాఖ జిల్లాలో పుట్టగొడుగు విత్తనాల తయారీ యూనిట్లు ఎక్కడా లేవు. ఇక్కడ తయారు చేసిన పుట్టగొడుగు విత్తనాలను కేజీ ఒక్కంటికి రూ.80లకు సరఫరా చేస్తున్నారు. వీటిని విశాఖ జిల్లాతోపాటు విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాలలో గల పుట్టగొడుగుల తయారీ యూనిట్లకు సరఫరా చేస్తున్నారు. విత్తనాల తయారీ యూనిట్ ఏర్పాటు మొదట్లో విత్తనాలను బెంగళూరు నుంచి కేజీ ఒక్కంటికి రూ.120ల చొప్పున నెలకు 100 కేజీలకు పైగా కొనుగోలు చేసేవారు. కరోనా కారణంగా వాహనాల రవాణా నిలిచిపోవడంతో విత్తనాల సమస్య ఏర్పడి ఆరు నెలలపాటు పుట్టగొడుగుల తయారీ నిలిచిపోయింది. వెంకటేశ్వరరావు ఇద్దరు కుమారులు కరోనా కారణంగా కాలేజీ లేక పుట్టగొడుగులు తయారీ పనిలో ఉన్నారు. తమిళనాడుకు చెందిన సీనియర్ శాస్త్రవేత రామాంజనేయులు, రాష్ట్ర ఉద్యానవనశాఖ అధికారులను ఆన్లైన్లో పరిచయం చేసుకున్నారు. ఇద్దరు కుమారులు రెండు నెలలపాటు విత్తనాల తయారీ విధానాన్ని ఆన్లైన్ ద్వారా తెలుసుకున్నారు. విత్తనాల తయారీ యూనిట్‌ను రూ.10 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఈ యంత్రం ద్వారా డిగ్రీ చదువుతున్న వెంకటేశ్వరరావు పెద్ద కుమారుడు దుర్గాప్రసాద్, బి.ఫార్మసీ చేస్తున్న సాయిరామ్ విత్తనాలు తయారు చేస్తున్నారు. విశాఖ జిల్లాలో పుట్టగొడుగు విత్తనాల తయారీ యూనిట్లు ఎక్కడా లేవు. ఇక్కడ తయారు చేసిన పుట్టగొడుగు విత్తనాలను కేజీ ఒక్కంటికి రూ.80లకు సరఫరా చేస్తున్నారు. వీటిని విశాఖ జిల్లాతోపాటు విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాలలో గల పుట్టగొడుగుల తయారీ యూనిట్లకు సరఫరా చేస్తున్నారు. చదవండి: పరుగులు తీసి.. ప్రాణం కాపాడి.. -
తెలంగాణ: పంట పండింది
సాక్షి, హైదరాబాద్ : ఈసారి యాసంగిలో రైతన్నను అదృష్టం ‘వరి’ంచింది.. పొలాలన్నీ సిరుల కళ్లాలయ్యాయి. నిన్నటివరకు పచ్చగా కళకళలాడిన వరిపొలాల తెలంగాణ మాగాణి.. నేడు బంగారు వర్ణపు కంకులతో మెరిసిపోతూ రైతింట ‘పంట పండించింది’. నేల ఈనిందా.. బంగారం పండిందా అన్నట్టుగా.. ఎటుచూసినా పొలాల్లో కోతల కోలాహలం.. కళ్లాల్లో నిండారబోసిన ధాన్యపు రాశులు.. ఆనందంతో మురిసిపోతున్న రైతన్న కోతల వేగాన్ని పెంచాడు. కరోనా నేపథ్యంలో రైతుకు ఏ చిన్నకష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకున్న ప్రభుత్వం.. రైతు చెంతనే 7వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు పకడ్బందీ చర్యలు తీసుకుంది. నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తోంది. ఊపిరిలూదిన ప్రాజెక్టులు, చెరువులు రాష్ట్రంలో గతేడాది జూన్‌లో విస్తారంగా వర్షాలు కురవడంతో ఎస్సారెస్పీ, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎల్లంపల్లి నీటితో నిండాయి. దీనికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 60 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోసి ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్ మానేరు ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. దీంతో సాగునీటి ప్రాజెక్టుల కింద ఏకంగా 40లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. ఎస్సారెస్పీ మొదటి, రెండో దశల కిందే 12 లక్షల ఎకరాలు సాగు కాగా, నాగార్జునసాగర్ కింద 6.40లక్షల ఎకరాల్లో పూర్తిస్థాయిలో సాగు జరిగింది. ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసి దాదాపు 5వేల చెరువులు నింపారు. దీంతో భూగర్భ జలాలు పెరిగాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో భూగర్భజల సగటు మట్టం గతేడాది 12 మీటర్ల వరకు ఉండగా, అది ఈ ఏడాది ఏకంగా 7 మీటర్లకు చేరింది. దీంతో బోర్ల కింద సాగు పెరిగింది. ఇందులో ఎక్కువగా వరి పంటే సాగైంది. గతేడాది యాసంగిలో మొత్తంగా 18.57లక్షల ఎకరాలలో వరి సాగవగా, అది ఈ ఏడాది ఏకంగా 40లక్షల ఎకరాలకు పెరిగింది. పంటకు ఎక్కడా నీటి కొరత లేకుండా ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిలో చివరి తడి వరకు నీటిని అందించడంతో దిగుబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఇబ్బడిముబ్బడిగా దిగుబడులు ప్రస్తుతం కరీంనగర్, జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో వరికోతలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ ఎకరాకి కొన్నిచోట్ల 30 – 32 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. మిగతాచోట్ల ఎకరాకు 27 – 29 క్వింటాళ్ల ధాన్యం వస్తోంది. ఈ క్రమంలోనే కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో కనీసంగా 91లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. గతేడాది యాసంగిలో 37లక్షల మెట్రిక్ టన్నులు, మొన్నటి ఖరీఫ్‌లో 47.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, ఇప్పుడది రెట్టింపైంది. ‘అన్నపూర్ణ’ జిల్లాలివి.. ప్రాజెక్టుల్లో నీటి లభ్యత మెరుగ్గా ఉండటం, కాళేశ్వరం జలాలతో నీటి ఎత్తిపోతలు పెరగడంతో గోదావరి పరివాహక జిల్లాలైన ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్‌తో పాటు కష్ణా పరివాహకంలోని నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో గణనీయంగా పంటలు సాగయ్యాయి. – ఉమ్మడి కరీంగనర్ జిల్లాలో 2018–19 యాసంగిలో వరిసాగు విస్తీర్ణం 3.72లక్షల ఎకరాలు కాగా, అది ఈ ఏడాది 7.92లక్షల ఎకరాలకు పెరిగింది. ధాన్యం దిగుబడి 9.14లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా, అది ఈ ఏడాది 15.95లక్షల వరకు ఉంటుందని అంచనా. – దేవాదుల, ఎస్సారెస్పీ–2 ప్రాజెక్టుల ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరందడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ సీజన్లో 4,38,033 ఎకరాల్లో వరి సాగైంది. 9.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఖరీఫ్‌లో 557 కేంద్రాలను ఏర్పాటు చేయగా ప్రస్తుతం 1,031 పెట్టాలని భావిస్తున్నారు. అవసరమైతే వీటి సంఖ్యను పెంచుతారు. – పూర్వ నల్లగొండ జిల్లాలో సాగర్, ఎస్సారెస్పీ–2 కింద నింపిన చెరువుల పరిధిలో ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుత నల్లగొండ జిల్లాలోనే గత సీజన్లో 1.75లక్షల ఎకరాల్లో సాగు జరగ్గా, ప్రస్తుతం 3.75లక్షల ఎకరాలు సాగయ్యాయి. ఈ ఏడాది ఇక్కడ 7.58లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం వస్తుందని అంచనా. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే ముగిసిన ఖరీఫ్‌లో 1.15లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, ఈ ఏడాది 8.64 లక్షల టన్నుల మేరకు సేకరిస్తారని అంచనా. – ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 14లక్షల మెట్రిక్ టన్నులు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో 8.50లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేశారు. పది రోజుల్లోనే 3.81లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు.. ఈ నెల మొదటి వారం నుంచి మొదలైన ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కేవలం పది రోజుల్లోనే ఏకంగా 3,516 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.81లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పుడిప్పుడే కొనుగోళ్లు పుంజుకుంటుండటంతో ఇకపై సేకరణ మరింత ముమ్మరం కానుంది. కొనుగోలు కేంద్రాల్లో పరిమిత దూరం పాటించాలని రైతులకు సూచిస్తున్నారు. ఖరీఫ్‌లో చెల్లించిన మద్దతు ధర మాదిరే ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ.1,835, సాధారణ రకానికి రూ.1,815గా చెల్లిస్తున్నారు. ఇప్పటికే రూ.500 కోట్ల మేర చెల్లింపుల ప్రక్రియ పూర్తయింది. ఇక కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లింగ్ కేంద్రాలకు తరలించేలా రవాణా ఏర్పాట్లు చేశారు. (కేస్ స్టడీ) ఈ ఫొటోలోని రైతు పేరు గాదె మహేందర్‌రెడ్డి. రుద్రగూడెం (వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలం) గ్రామానికి చెందిన ఈయన నాలుగు ఎకరాల్లో రబీలో వరి సాగు చేశాడు. గత ఖరీఫ్, రబీలో వరి పంటలకు భారీగా తెగుళ్లు ఆశించడంతో అనుకున్న స్థాయిలో దిగుబడి రాలేదు. ప్రస్తుత రబీలో చెరువు, బావి నీటి ఆధారంగా వరి సాగు చేశాడు. అదృష్టవశాత్తూ తెగుళ్లు సోకలేదు. పంట ఆశాజనకంగా ఉంది. మరో వారంలో కోతకు సిద్ధమవుతున్నట్టు ఆనందంగా చెప్పాడు. ఈయనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా పలువురు రైతులు రబీలో వచ్చే దిగుబడులతో అప్పులు సైతం తీర్చుకోవచ్చనే సంతోషంతో ఉన్నారు. కేస్ స్టడీ–2: ఈ రైతు పేరు గంగాధరి రమేష్. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌కు చెందిన ఈయన పాకాల ఆయకట్టు, బావి కింద 12 ఎకరాల్లో వరి సాగు చేశాడు. గత ఖరీఫ్‌లో 35 బస్తాల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం రబీలో 40 – 45 బస్తాల దిగుబడి వస్తుందనే ఆశతో ఉన్నాడు. పాకాల సరస్సులోని నీటి లభ్యత ఆధారంగా వరి.. ఈసారి సిరులు కురిపించనుందని రమేష్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. నీళ్లకు లోటులేదు.. పంటకు కొదవలేదు ఈసారి చెరువుల నీళ్లు మంచిగున్నయి. గతేడాది కన్నా బోర్లు కూడా మంచిగ పోసినయ్. అందుకే ధాన్యం గింజలు మంచిగెళ్లింది. గతంల 25 క్వింటాళ్లు ఎకరాకు వస్తే ఈ ఏడాది 28 నుంచి 30 క్వింటాళ్లు వస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇప్పుడిప్పుడే ధాన్యం తరలిస్తున్నం. – సురేందర్, మాటూరు, నాగిరెడ్డిపేట, కామారెడ్డి జిల్లా నాలుగు పుట్లు పండినయ్.. గతేడాది ఎకరం నేలలో వరి పంట వేస్తే మూడు పుట్ల వడ్లు పండాయి. తిండికోసం ఇంటికే వాడుకున్నా. ఈ ఏడాది అంతే విస్తీర్ణంలో వరి పంట వేస్తే నాలుగు పుట్ల వడ్లు పండినయ్. పుష్కలంగా నీళ్లుండటంతో పంట దిగుబడి పెరిగింది. – కొర్ర శంకర్. గుండ్రాతిమడుగు పెద్దతండా, కురవి మండలం, వరంగల్ జిల్లా -
కరువు సీమలో ఖర్జూర సిరులు!
కరువు సీమగా పేరుగాంచిన అనంతపురం జిల్లాలో ఖర్జూరపు సిరులు కురుస్తున్నాయి. బెంగళూరులో సాప్ట్వేర్ రంగంలో స్థిరపడి.. ఉద్యోగం చేస్తూనే సరికొత్త పంటల సాగుకు శ్రీకారం చుట్టారు సుధీర్‌నాయుడు. అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడ గ్రామానికి చెందిన రైతు వెంకటనారాయణ కుమారుడు సుధీర్ ఉద్యోగం చేసుకుంటూ.. వారాంతంలో వ్యవసాయం పనులు చూసుకోవడం విశేషం. ఈత వనం మాదిరిగా ఉండే ఈ వినూత్న పంటలో రెండేళ్లుగా మంచి దిగుబడులు సాధిస్తున్నారు. పంట సాగు గురించి రైతు సుధీర్‌నాయుడు మాటల్లోనే విందాం.. ఎడారి పంటగా పేరున్న ఖర్జూరం తోటలు మన దేశంలో గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో కొంత విస్తీర్ణంలో సాగులో ఉన్నాయి. కుటుంబ సభ్యులతో తమిళనాడులోని మధుర ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లినప్పుడు అక్కడ రహదారి పక్కన అమ్ముతున్న ఖర్జూరపు పండ్లను రుచిచూశాను. ఆ పండ్లు ఎవరు పండిచారని ఆరాతీసి ధర్మపురి జిల్లాకు చేరి నిజాముద్దీన్ అనే ఖర్జూరం రైతును కలిసి ఉత్తేజితుడనై.. అవగాహన పెంచుకొని సాగుకు ఉపక్రమించాను. వెబ్సైట్లు, యూట్యూబ్‌లను శోధించి పంట సాగు, యాజమాన్యం, లాభనష్టాల గురించి అవగాహన చేసుకున్నాను. ఖర్జూరపు తోటలు సాగు చేయాలంటే తొలి సంవత్సరం పెట్టుబడులు ఖర్చులు ఎక్కువగా భరించాల్సి ఉంటుంది. నాణ్యమైన మొక్కలు కొనుగోలు చేయటం, నాటడం, డ్రిప్, భూమి చదును, ఎరువులు, కూలీల ఖర్చుల రీత్యా మొదటి సంవత్సరం ఎకరాకు రూ. 5 లక్షల వరకు పెట్టుబడి అయ్యింది. రెండో సంవత్సరం నుంచి ఎకరాకు రూ. లక్ష వరకు ఖర్చు వస్తున్నది. నాలుగో ఏడాది నుంచి దిగుబడి ప్రారంభమైంది. ఒకసారి నాటుకుంటే 40 నుంచి 50 ఏళ్ల వరకు పంట తీసుకోవచ్చు. ఎకరానికి 234 మొక్కలు.. తమిళనాడుకు చెందిన నిజాముద్దీన్ సహకారంతో 2013లో ఇజ్రాయెల్ నుంచి మూడు సంవత్సరాల వయస్సున్న ‘బర్హీ’ రకం టిష్యూకల్చర్ ఖర్జూరపు మొక్కలు తెప్పించి ఎకరాకు 78 చొప్పన మూడు ఎకరాల్లో 28“28 అడుగుల దూరంలో 234 మొక్కలు నాటుకున్నాను. అప్పట్లో ఒక్కో మొక్క ఖరీదు రూ. 4,150 పెట్టాను. ఇప్పుడు మొక్క రూ.3,500కే దొరుకుతోంది. ఒకటిన్నర అడుగు లోతు గుంతలు తీసి.. వేపచెక్క, ఆముదం చెక్క వేశాను. చెట్టుకు ఇరువైపులా డబుల్ లాటరల్ డ్రిప్ అమర్చి రోజూ నీటి తడులు ఇచ్చాను. ఒకసారి మాత్రమే చెట్టుకు 10 కిలోల చొప్పున కోళ్ల ఎరువు వేశాను. అంతకు మించి ఎలాంటి సేంద్రియ, రసాయన ఎరువులు వాడలేదు. నిజాముద్దీన్ అనుభవం గురించి తెలుసుకోవడంతో పాటు యూట్యూబ్ వీడియోలు, వెబ్సైట్లలో ఉన్న సమాచారాన్ని బట్టి ముందు జాగ్రత్తగా నెలకోసారి ఒక పురుగుమందును పిచికారీ చేశాను. క్రమం తప్పకుండా కలుపు నివారణ చర్యలు చేపట్టా. అలా మూడేళ్లు కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాను.రెండు రకాల పురుగులు ఈ పంటను ఆశిస్తాయని తెలుసుకున్నాను. రైనోసిరస్ పురుగు వ్యాపిస్తే పెద్దగా నష్టం ఉండదు. రెడ్వివల్ అనే పురుగులు వ్యాపిస్తే మాత్రం నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగు చెట్టు మొదలు వద్ద రంధ్రం చేసుకుని లోపలి గుజ్జును తినడం వల్ల దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయట. నాలుగేళ్లకు దిగుబడి ప్రారంభం.. మూడేళ్లు జాగ్రత్తగా పెంచితే నాలుగో సంవత్సరం నుంచి ఖర్జూర చెట్లు కాపునకు వస్తాయి. ఫిబ్రవరి రెండో పక్షం నుంచి మార్చి మొదటి పక్షంలోనే పూత వస్తుంది. పూత వచ్చే నెల రోజులు ముందుగా నీటి తడులు ఆపేస్తే వాడుకు వచ్చి.. మంచి పూత, పిందె పడుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. తోటలో ఎకరాకు కనీసం 10 నుంచి 12 మగ ఖర్జూర చెట్లు నాటుకోవాలి. మగ చెట్లు కేవలం పూత పూస్తాయి. వాటికి పూసిన పూల రెమ్మల పుప్పొడితో.. ఆడ చెట్ల పూతతో పరపరాగ సంపర్కం చేయించాలి. ప్రతి గెలకు జాగ్రత్తగా ఈ ప్రక్రియను పూర్తిచేయాల్సి వుంటుంది. ఒకవేళ మగ చెట్లు తక్కువగా ఉన్నా లేకున్నా.. దాని కోసం ప్రత్యేకంగా ఒక పొడి లభిస్తుంది. కిలో రూ. 18 వేలకు లభించే పాలినేషన్ పౌడర్ ఎకరాకు కిలో సరిపోతుంది. గెల వేసిన తర్వాత డ్రిప్ ద్వారా డీఏపీ, పొటాష్ పోషకాలు ఇచ్చాను. పిందెలు వచ్చిన తర్వాత గెలలకు చిన్నపాటి వలల్లాంటి దోమ తెరలు కప్పాను. జూలై, ఆగస్టులో పసుపు రంగులోకి మారి పంట కోతకు వస్తుంది. ఇప్పుడు మా తోటలో చెట్టుకు ఆరు నుంచి ఏడు గెలలు ఉన్నాయి. వయసు పెరిగే కొద్దీ చెట్టుకు 15 వరకు గెలలు వస్తాయి. ఒక్కో గెల బరువు 10–15 కిలోల వరకు ఉంటుంది. ఖర్జూరపు పంటపై స్థానిక ప్రజల్లో అవగాహన లేనందున.. తొలి దిగుబడిని తమిళనాడులోని కోయంబత్తూరు మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మాను. గత ఏడాది తొలిపంట ద్వారా మూడు ఎకరాలకు 12–13 టన్నుల దిగుబడి వచ్చింది. సగటున టన్ను ధర రూ.ఒక లక్ష. ఆ ప్రకారం రూ.13 లక్షల వరకు ఆదాయం వచ్చింది. ఇపుడు జిల్లాలో కూడా కొంత అవగాహన రావడంతో డిమాండ్ కనిపిస్తోంది. వ్యాపారులు తోట దగ్గరకే వస్తున్నందున కిలో రూ. 150 ప్రకారం గిట్టుబాటవుతోంది. మార్కెట్లో టన్ను ధర ఎపుడూ రూ.లక్షకు తగ్గే పరిస్థితి ఉండదు. ఏటా చెట్టుకు 10 గెలలు వచ్చినా రూ.10 వేలకు తగ్గకుండా ఆదాయం వస్తుంది. మరో రెండున్నర ఎకరాల్లో.. ఖర్జూరపు పంటకు మంచి భవిష్యత్తు ఉన్నట్లు గుర్తించి ప్రస్తుతం ఉన్న మూడెకరాల ‘బర్హీ’ రకం తోటకు తోడుగా.. మరో రెండున్నర ఎకరాల్లో ‘కమిదీ’ రకం ఖర్జూరపు మొక్కలు నాటాను. వచ్చే సంవత్సరం మరో ఐదు ఎకరాల్లో కూడా ఖర్జూరం మొక్కలు నాటాలనుకుంటున్నాను. ఉష్ణమండలపు పంట కావడంతో అనంతపురంతో పాటు కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల్లో కూడా పంట సాగుకు అనుకూలమేనని అనుకుంటున్నాను. హెక్టారుకు రూ. 2 లక్షల రాయితీ ఖర్జూరపు తోటల సాగుకు ముందుకు వచ్చే రైతులకు హెక్టారుకు రూ.2 లక్షల వరకు రాయితీ కల్పించి ప్రోత్సహిస్తామని నార్పల ఉద్యాన శాఖాధికారి దేవానంద్ తెలిపారు. సుధీర్నాయుడుకు కూడా ఇటీవల రాయితీ వర్తింపజేశామన్నారు. ఆసక్తి గల రైతులు ఉద్యానశాఖ డీడీ, ఏడీ, హెచ్‌వో కార్యాలయాల్లో సంప్రదిస్తే నాణ్యమైన మొక్కలు, పంట సాగు యాజమాన్యం, మార్కెటింగ్ అంశాల గురించి తెలియజేస్తామన్నారు. (ఖర్జూర రైతు సుధీర్‌నాయుడు: 86394 56337) – గంగుల రామలింగారెడ్డి, సాక్షి, అనంతపురం ఫోటోలు: జి.వీరేష్ -
విపత్తేనా..!
⇒జిల్లాలో 70 శాతం మేరకు కే–6 వేరుశనగ విత్తనాల కేటాయింపు ⇒ఆగస్టు బెట్టను తట్టుకోలేకపోతున్న కదిరిరకం ⇒ఈ కారణంగానే ఏటా నష్టాలంటున్న రైతులు ⇒సొంత విత్తనాల వైపు మొగ్గు ఏటా కే–6 రకం విత్తనాలతో వేరుశనగ రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం మాత్రం తన మొండివైఖరి మార్చుకోవడం లేదు. శాస్త్రవేత్తల సూచనలను సైతం పెడచెవిన పెడుతూ ఈ ఏడాది కూడా ఇదే రకం విత్తనాలను దాదాపు 70 శాతం మేరకు విక్రయించేం దుకు సిద్ధమైంది. ఫలితంగా ఈసారీ దిగుబడి అంతంతమాత్రమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. చేసేది లేక సొంత విత్తనాలతోనే సాగుకు సన్నద్ధమవుతున్నారు. పలమనేరు: ప్రభుత్వం గతేడాది రైతులకు పంపిణీ చేసిన సబ్సిడీ వేరుశనగ విత్తన కాయలు రైతులను నట్టేట ముంచేశాయి. అధికారుల నిర్లక్ష్యంతో కరువుకు తట్టుకోలేని, పెద్దగా నాణ్యత లేని కే–6(కదిరి–6) విత్తనాలను సర్కారు అందజేసింది. వర్షాభావ పరిస్థితులను తట్టుకోలేక ఈరకం చెట్లు భారీగా చనిపోయాయి. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యంతో వేరుశనగ రైతులు నష్టాలపాలయ్యారు. ఈదఫా కూడా కే–6 రకం విత్తనకాయలనే రైతులకు అందజేస్తున్నట్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. గత ఏడాది కే–6 విత్తనాలను వేసి చేతులు కాల్చుకున్న రైతులు ఈదఫా సొంతవిత్తనాలవైపే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. జిల్లాకు సంబంధించి ఈదఫా ఖరీఫ్‌లో వేరుశనగ సాగు 1.20 లక్షల హెక్టార్లుగా ఉంది. ఇందుకోసం వ్యవసాయశాఖ 90 వేల క్వింటాళ్ల విత్తనకాయలను పంపిణీ చేసేందుకు అధికారులు అలాట్మెంట్ సిద్ధం చేశారు. ఈనెల 15 నుంచి జిల్లాలోని పంపిణీ కేంద్రాలకు స్టాకు చేరనుంది. ఆపై కలెక్టర్, వ్యవసాయ శాఖ జేడీ సమావేశమై విత్తనాల పంపిణీ తేదీని ఖరారు చేయనున్నారు. ఏటా నాణ్యత ప్రమాణాలు గాలికే.. ఏపీ ఆయిల్ ఫెడ్ నుంచి కదిరి–6 అనే రకం విత్తనాలను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. మా మూలుగా 100 గ్రాముల విత్తన కాయలను వొలి స్తే దాదాపు 70 గ్రాముల గింజలు బరువు వస్తేనే అవి నాణ్యంగా ఉన్నట్టు లెక్క. దీంతోపాటు సీడ్ జర్మినేషన్ 70 శాతంగా ఉండాలని నిబంధనలున్నాయి. లోడ్ల వారీగా ఇక్కడికందే విత్తన కాయలను చిత్తూరులోని సీడ్ టెస్టింగ్ ల్యాబరేటరీ లో మొలక శాతం, విత్తనాల నాణ్యతను పరీక్షిం చాల్సి ఉంది. కానీ ఇదంతా పేరుకుమాత్రమే. గతేడాది కూడా విత్తన పరీక్షలు తూతూమంత్రంగానే జరిగాయి. కనీసం ఈ సారైనా జరుగుతుందో లేదో కూడా అర్థం కావడం లేదు. గతేడాది రైతులకు దాదాపు 300 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఆగస్టు బెట్టను కే–6 తట్టుకోదు.. వర్షాభావానికి తట్టుకోని కే–6 ఈ ప్రాంతానికి సరిపోదని ఇప్పటికే వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు తెలిపింది. గతంలో కూడా వ్యవసాయశాఖ ఈ సమస్య కారణంగానే ఈ ప్రాంతంలో కే–6ను పంపిణీ చేయలేదు. కానీ తక్కువ ధరకే ఇవి దొరుకుతుండడంతో ప్రభుత్వం కొన్నేళ్లుగా వీటిని రైతులకు అంటగడుతోంది. గతేడాది సైతం ఈ రకం విత్తనాలు వేసిన రైతులకు పంట చేతికందలేదు. ముఖ్యంగా ఆగస్టులో వచ్చేబెట్ట ( డ్రై స్పెల్స్)ను ఈ రకం తట్టుకోదు. అప్పట్లోనే పలువురు రైతులు ఈ విషయమై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇదంతా పైస్థాయిలో జరిగే ప్రక్రియ అంటూ చేతులు దులుపుకున్నారు. దీంతో రైతులు సొంత విత్తనాలవైపు మొగ్గు చూపుతున్నారు. శాస్త్రవేత్తలు సూచించినా పట్టించుకోలేదు.. రెండేళ్ల క్రితం వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు కుప్పం మండలంలోని పీబీ నత్తం, వి.కోట మండలంలోని కొమ్మరమడుగు, శాంతిపురం మండలం లోని అబకలదొడ్డిలలో కే–6 పంట నష్టంపై పంటకోత ప్రయోగాలను చేపట్టింది. ఇందులో 250 గ్రాముల నుంచి 400 గ్రాముల వరకు దిగుబడి వచ్చినట్టు తేల్చారు. అంటే ఎకరాకు 40 కిలోల మాత్రమే వచ్చినట్టు. దీని ఆధారంగా 90 శాతం పంట నష్టపోయినట్టు వ్యవసాయశాఖ నిర్ధారించింది. ఇదే ప్రాంతంలో ప్రయోగాత్మకంగా సాగుచేసిన ధరణి, నారాయణి రకాలు బెట్టను తట్టుకుని మంచి దిగుబడిని ఇవ్వడాన్ని గుర్తిం చారు. దీంతో ధరణి తదితర రకాలను ఈదఫా రైతులు పంపిణీ చేయాలని సూచించారు. కానీ అధికారులు ఈ దఫా 70శాతం కే–6 మిగిలిన 30శాతం మాత్రమే ధరణి, ఐసీజీఎస్–91114ను అందజేయనున్నట్టు తెలిసింది. -
‘క్యాబేజా’ర్
ధరలేక నిండా మునిగిన క్యాబేజీ రైతు కొనేవారు లేక తోటల్లోనే పంట పెద్దనోట్ల రద్దుతో పడిపోయిన వ్యాపారం ఈ ఒక్క సీజన్లోనే రూ.2 కోట్లదాకా నష్టం పంట ఏపుగా పెరిగిందని మురిసిపోయారు. దిగుబడి ఆశించిన స్థాయిలో వచ్చిందని సంబరపడ్డారు. ఇక కష్టాలు తీరినట్టేనని కాలరెగరేశారు. కానీ పెద్దనోట్ల రద్దు ప్రభావం వారి జీవితాలను సర్వనాశనం చేసింది. క్యాబేజీ వ్యాపారాన్ని కోలుకోనీయకుండా చేసింది. పంట కోతకొచ్చినా కొనేవాళ్లు కరువవ్వడంతో పొలాల్లోనే వదిలేశారు. పెట్టుబడి రాక.. అప్పులు తీరక రైతులు పుట్టెడు కష్టాల్లో కూరుకుపోయారు. పలమనేరు : జిల్లాలోని పడమటి మండలాల్లో గత ఏడాది క్యాబేజీ సాగుచేసిన రైతులు లక్షాధికారులయ్యారు. ఈ దఫా పంట సాగు విస్తీర్ణం పెరిగినా.. ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చినా కోలుకోలేకపోతున్నారు. గత నవంబర్‌లో పెద్దనోట్ల రద్దుతో మొదలైన కష్టాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. భారీగా పంట సాగువిస్తీర్ణం జిల్లాలో క్యాబేజీసాగు మదనపల్లె డివిజన్లో ఎక్కువ. ఇక్కడి శీతలవాతావరణం పంటసాగుకు అనుకూలం. పంట కొనేదిక్కు లేదు గత ఏడాది ధరలు చూసి ఈదఫా రెండున్నరెకరాల్లో క్యాబేజీ వేశా. మొత్తం రూ.1.20 లక్షలదాకా ఖర్చుపెట్టా. పంట దిగుబడి పెరిగింది. ధరతోపాటు కొనేవారు లేరు. పంట మొత్తం పొలంలోనే వదిలేశా. – ఉమాశంకర్‌రెడ్డి, రైతు, నక్కపల్లె, పలమనేరు మండలంపుంగనూరు, రామసముద్రం, పలమనేరు, గంగవరం, వీకోట, బైరెడ్డిపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పంట ఎక్కువగా సాగవుతోంది. పలమనేరు డివిజన్ పరిధిలో ఏటా సాధారణ పంట సాగు విస్తీర్ణం వెయ్యి ఎకరాలు కాగా ఈదఫా 1,625 ఎకరాల్లో సాగైంది. వాతావరణం అనుకూలించడంతో ఎకరాకు 30 టన్నులదాకా దిగుబడి వచ్చింది. రూ.రెండు కోట్లదాకా నష్టం ఎకరా విస్తీర్ణంలో పంట సాగుచేయాలంటే రూ.60 వేలదాకా ఖర్చవతుంది. ఎకరాకు 30 టన్నుల దిగుబడి వస్తే ప్రస్తుత ధర ప్రకారం (టన్ను రూ.1,600) రూ.48 వేలు దక్కుతుంది. ఆ లెక్కన ఎకరాకు రూ.12వేలు నష్టం. డివిజన్ పరిధిలోని 1,625 ఎకరాలకు రూ.2కోట్ల దాకా నష్టం వాటిల్లింది. కొనుగోలుకు ముందుకురాని వ్యాపారులు స్థానికంగా పండే క్యాబేజీకి కోల్కత్తా, భువనేశ్వర్, ఢిల్లీ, కటక్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. అక్కడి నుంచి ఏటా వ్యాపారులు వచ్చి పొలాలవద్దే పంటను కొనుగోలు చేసేవారు. ఈ ఏడాది నోట్ల ఎఫెక్ట్‌తో బ్యాంకుల నుంచి నగదుపై ఆంక్షలుండడంతో వ్యాపారులు రావడం మానేశారు. రైతులకు చెక్కులిచ్చి పంట కొన్నా ఇక్కడి నుంచి సరుకును రవాణా చేయడానికి వీలు కావడం లేదు. కోల్‌కత్తాకు లారీ లోడ్డు వెళ్లాలంటే డీజల్‌కు రూ.40 వేలు, డ్రైవర్ బత్తా, టోల్గేట్లు ఇతరత్రాలకు రూ.60 వేలు ఖర్చవుతోంది. నోట్ల రద్దు కారణంగా వ్యాపారులు ఈ మొత్తాన్ని సమకూర్చలేకపోతున్నారు. ఫలితంగా రవాణా పూర్తిగా ఆగిపోయింది. చేలల్లోనే పంట క్యాబేజీని కొనేవారులేరు. పంట చేలల్లోనే వదిలేశారు. ఒబ్బిడి గడువుమీరి చాలా తోటల్లో పంట ఎందుకూ పనికిరాకుండా పోయింది. స్థానికంగా కొంతవరకు అమ్ముడైనా సరుకు మొత్తం కొనేవారు లేరు. -
యాజమాన్య పద్ధతులతోనే దిగుబడి
అనంతపురం అగ్రికల్చర్ : అరటిలో సుస్థిరమైన నాణ్యమైన దిగుబడుల కోసం నాటిన నాటి నుంచి పంట కోత వరకు సకాలంలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని రేకులకుంట ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి.శ్రీనివాసులు తెలిపారు. స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో ప్రిన్సిపల్ ఎస్.చంద్రశేఖర్‌గుప్తా ఆధ్వర్యంలో శుక్రవారం అరటి సాగుపై రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో శాస్త్రవేత్త శ్రీనివాసులుతో పాటు ముంబైకి చెందిన ఐఎన్ఐ ఫార్మ్ జనరల్ మేనేజర్ డాక్టర్ అజిత్‌కుమార్ హాజరై అవగాహన కల్పించారు. ‘అనంత’ అనుకూలం వాతావరణ పరిస్థితులు, నేలలు అరటి తోటల సాగుకు ‘అనంత’ అనుకూలం.. గతంలో దుంపల ద్వారా ప్రవర్ధనం చేసిన అరటి మొక్కలు సాగు చేస్తుండగా ఇపుడు టిష్యూకల్చర్ పద్ధతి మొక్కలు అందుబాటులోకి వచ్చాయి. టిష్యూకల్చర్ ద్వారా నులిపురుగులు, వైరస్ వల్ల వ్యాపించే తెగుళ్లు తగ్గిపోయి దిగుబడులు పెరిగాయి. ఎకరాకు 1400 మొక్కలు నాటుకోవాలి. రెండు అడుగులు గుంతలు తవ్వి ఒక్కో గుంతకు 10 కిలోల పశువుల ఎరువు, 300 గ్రాములు సింగిల్‌సూపర్‌ఫాస్పేట్, అర కిలో వేపపిండి వేసుకుని నాటుకోవాలి. సింగిల్‌సూపర్‌ఫాస్పేట్ వేయడం వల్ల వేరువ్యవస్థ బలపడుతుంది. పంట కాలంలో ఒక్కో అరటి మొక్కకు 300 గ్రాములు యూరియా, 300 గ్రాములు పొటాష్ ఎరువులు వేసుకోవాలి. డ్రిప్ ద్వారా ఎరువులు శ్రేయస్కరం జింక్, బోరాన్, ఇనుము తదితర సూక్ష్మపోషకాల (మైక్రోన్యూట్రియంట్స్) లోపం తలెత్తకుండా ఎప్పటికపుడు వీటిని ఫర్టిగేషన్ ద్వారా ఇవ్వాలి. 19–19–19, 13–0–45 ఎరువులు లేదంటే యూరియా, వైట్ పొటాష్ ఎరువులు డ్రిప్ ద్వారా నేరుగా మొక్కలకు అందజేయాలి. మొక్కల కింద పెరిగే పిలకలు ఎప్పటికపుడు తీసివేస్తూ ప్రధాన మొక్క గెల వేసిన నెల తర్వాత ఒక పిలక ఉంచాలి. ఒకేసారి గెల అరటి గెల ఒకేసారి పక్వానికి వచ్చి అన్ని హస్తాలు అభివృద్ధి చెందాలంటే.. గెలలో హస్తాలు ఏర్పడిన తరువాత గెల కింద భాగాన ఉండే మగపువ్వును తీసేయాలి. 10 గ్రాములు 13–0–45 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. రెండో దఫా కింద 5 గ్రాములు సల్ఫేట్ ఆఫ్ పొటాష్ (ఎస్వోపీ) లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే 1 గ్రాము బావిస్టన్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే గెలలో అన్ని కాయలు సమానంగా నాణ్యతగా వస్తాయి. గెల సిలెండర్ షేపులో వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి. సస్యరక్షణ – వర్షాకాలంలో ఆశించే సిగటోకమచ్చ తెగులును డైథేనియం–45 మందుతో నివారించుకోవాలి. పండుఈగ కనిపిస్తే మిథైల్ యూజినాల్ ఎర ఏర్పాటు చేసుకోవాలి. నత్రజనితో పొటాష్ ఎరువులు వేయాలి. మార్చి–ఏప్రిల్ నెలల్లో సంభవించే అకాల వర్షాలు, వడగళ్లవాన, ఈదురుగాలుల నుంచి అరటి తోటను కాపాడుకునే క్రమంలో తోట చుట్టూ అవిశె, సరుగుడు లాంటి చెట్లను నాటుకుంటే గాలివేగాన్ని కొంతవరకు నివారిస్తాయి. -
భారీగా పెరిగిన ఉల్లి దిగుబడులు
2 కోట్ల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి.. గతం కంటే 14 లక్షల మెట్రిక్ టన్నులు అదనం 9 లక్షల మెట్రిక్ టన్నులు తగ్గిన కూరగాయల ఉత్పత్తి 2015-16 ఉద్యాన పంటల ఉత్పత్తి అంచనాలు విడుదల చేసిన కేంద్రం హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉల్లి దిగుబడులు భారీగా పెరిగాయి. గత ఏడాది ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గడం.. ధరలు ఆకాశానికి ఎగబాకడంతో కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. 2015-16 సీజన్లో ఉద్యాన పం టల ఉత్పత్తి మొదటి అంచనా నివేదికను కేం ద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఆ నివేదిక వివరాలను తెలంగాణ ఉద్యానశాఖకు పంపించింది. 2014-15లో 29.32 లక్షల ఎకరాల్లో ఉల్లి సాగు చేయగా... అప్పట్లో 1.89 కోట్ల మెట్రిక్ టన్నుల ఉల్లి దిగుబడి వచ్చింది. 2015-16 సీజన్లో 29.45 లక్షల ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. గతేడాది కంటే అదనంగా 13 లక్షల ఎకరాల్లో ఉల్లి సాగు విస్తీర్ణం పెరిగింది. దీంతో 2.03 కోట్ల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అయింది. గత ఏడాది కంటే అదనంగా 14 లక్షల మెట్రిక్‌టన్నుల దిగుబడి వచ్చింది. తెలంగాణ ఉద్యానశాఖ కూడా ఉల్లి సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు కృషి చేసింది. గతంలో రాష్ట్రంలో 37,500 ఎకరాల్లో ఉల్లిసాగు విస్తీర్ణం ఉం డగా... ఈ ఏడాది అదనంగా మరో 25 వేల ఎకరాల్లో విస్తీర్ణాన్ని పెంచేందుకు కృషి జరి గింది. పైగా ఉల్లిసాగు చేసే రైతులకు ఎకరానికి రూ.5 వేల సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. కూరగాయలపై కరువు దెబ్బ కరువు పరిస్థితుల నేపథ్యంలో సాగు విస్తీర్ణం తగ్గడంతో కూరగాయల దిగుబడులు తగ్గాయి. 2014-15లో కూరగాయల సాగు విస్తీర్ణం 2.38 కోట్ల ఎకరాల్లో ఉండగా.. ఆ ఏడాది 16.94 కోట్ల మెట్రిక్ టన్నులు పండాయి. 2015-16లో 2.36 కోట్ల ఎకరాల్లో కూరగాయల సాగు జరగ్గా.. దిగుబడి 16.85 కోట్లకు పడిపోయింది. గత ఏడాది కంటే 9 లక్షల మెట్రిక్ టన్నులు తగ్గింది. వంకాయ, క్యాబేజీ, బీన్స్, క్యాప్సికం తదితర వాటి ఉత్పత్తి భారీగా పడిపోయింది. ఆలుగడ్డ, టమాట దిగుబడులు మాత్రం పెరిగాయి. టమాట 1.82 కోట్ల మెట్రిక్ టన్నులు పండింది. గత ఏడాది కంటే టమాట 19 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా పండటం గమనార్హం. ఆలుగడ్డ 4.80 కోట్ల మెట్రిక్ టన్నులు పండింది. కూరగాయల దిగుబడులు తగ్గడంతో వాటి ధరలు పెరిగే అవకాశం ఉందని గమనించిన కేంద్రం నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది. 24 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా పండ్ల దిగుబడి దేశవ్యాప్తంగా పండ్ల దిగుబడి గత ఏడాది కంటే 24 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా ఉండటం గమనార్హం. 2014-15లో అన్ని రకాల పండ్ల దిగుబడి 8.66 కోట్ల మెట్రిక్ టన్నులు ఉండగా... 2015-16లో 8.90 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగింది. గత ఏడాది కంటే సాగు విస్తీర్ణం పెరగడమే ఇందుకు కారణం. ఇదిలావుంటే సుగంధ ద్రవ్యాలు గత ఏడాది 28.09 కోట్ల మెట్రిక్ టన్నులు కాగా... ఈ ఏడాది 28.24 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగింది. -
ఉల్లికిపాట్లు
కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు రైతుబజార్లలో బారులు తీరుతున్న ప్రజలు రోజురోజుకూ ఎగబాకుతున్న ధర విశాఖపట్నం: ఉల్లి కష్టాలు నానాటికీ పెరుగుతున్నాయి. ధర సామాన్యులకు అందుబాటులో లేదు. దిగుబడి తగ్గిన నేపథ్యంలోకొంతమంది హోల్‌సేల్ వ్యాపారులు అనధికారికంగా నిల్వ చేస్తూ కృత్రిమ కొరత సృష్టించడంతో బహిరంగ మార్కెట్లో ఉల్లిధరలు అమాంతం పెరిగి పోతున్నాయి. సాధారణంగా రోజుకు జిల్లా వ్యాప్తంగా వంద మెట్రిక్ టన్నుల వరకు అవసరం ఉంటుంది. ఒక్క నగర పరిధి లోనే 60 నుంచి 80 మెట్రిక్ టన్నుల వరకు విక్రయాలు జరుగుతుంటాయి. జూన్ నెలాఖరు వరకు కిలో రూ.20 ఉన్న ఉల్లి ప్రస్తుతం రైతుబజార్లలోనే రూ.50పలుకుతోంది. బహిరంగ మార్కెట్లో మేలురకం కిలో రూ.70 వరకు విక్రయిస్తున్నారు. డిమాండ్ తగ్గట్టుగా దిగుబడులు లేకపోవడంతో ధర ఆకాశానికి ఎగబాకింది. జిల్లాయంత్రాంగం చర్యలు తీసుకున్నా కొంతమంది అక్రమార్కులు చేస్తున్న ఉల్లిదందా వల్ల ధరలు అదుపులోకి రావడం లేదు. కృత్రిమ కొరతను నివారించేందుకు దాడులు చేయాల్సిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు పత్తా లేకుండా ఉన్నారు. మెరుపు దాడులు కాదు కదా..కనీసం తనిఖీలు చేసిన పాపాన పోవడం లేదు. ఇండెంట్‌కు తగ్గట్టుగా రాని ఉల్లి ప్రస్తుతం రోజుకు రెండులారీల ఉల్లి(40 ఎంటీలు)ను ర ప్పిస్తున్నారు. ఆదివారం 60 ఎంటీలు ..మిగిలిన రోజుల్లో 40ఎంటీల ఉల్లి అవసర మవుతాయంటూ మార్కెట్‌శాఖ ఇండెంట్ పెడుతున్నప్పటికీ ఆ స్థాయిలో లోడు రావడం లేదు. కర్నూల్లో ఆదివారం సెలవు కావడంతో ఆ రోజు లోడు మరీ తగ్గిపోతుంది. గత వారం రోజులుగా ఇండెంట్‌కు తగ్గట్టుగా కర్నూల్ నుంచి లోడు రాకపోవడంతో రైతుబజార్లలో సైతం ఉల్లి కోసం సిగపట్లు పట్టాల్సి వస్తోంది. ప్రస్తుతం రోజుకు 25ఎంటీల నుంచి 30 ఎంటీల లోపే వస్తుందని చెబుతున్నారు. రైతుబజార్లలో కొంతమంది కింద స్థాయి సిబ్బంది ఉల్లి హోల్‌సేల్ వ్యాపారులతో కుమ్మక్కై వచ్చిన సరుకును దారిమళ్లిస్తున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. గ్రామీణ ప్రజలను పట్టని అధికారులు రైతుబజార్ల ద్వారామాత్రమే సబ్సిడీఉల్లి విక్రయించాలని సర్కార్ ఆదేశాలివ్వడం..మన జిల్లాలో నగర పరిధిలోనే రైతుబజార్లు ఉండడంతో సబ్సిడీ ఉల్లి విక్రయాలు పూర్తిగా నగర వాసులకే పరిమితమవుతున్నాయి.గ్రామీణ వాసులకు సబ్సిడీ ఉల్లి దొరకని పరిస్థి తి నెలకొంది. వారు బహిరంగ మార్కెట్లో రూ.50 నుంచి 70లకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. -
వ్యర్థ పదార్థాలతో వర్మీ కంపోస్ట్
ఖర్చు తక్కువ..దిగుబడి ఎక్కువ ఏడాదికి ఆరుసార్లు తయారు చేయవచ్చు ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్ల ఎరువు ఉపయోగించాలి పీలేరు: వానపాముల్ని సేంద్రియ వ్యర్థ పదార్థా ల మీద ప్రయోగించి తయారు చేసే ఎరువునే వర్మీ కంపోస్టు అంటారు. మామూలుగా తయా రు చేసే ఎరువు కన్నా వర్మీ కంపోస్టులో ఎన్నో సుగుణాలున్నాయి. వర్మీ కంపోస్టులో పోషక విలువ ఎక్కువ. పశువుల పెంటలో సరాసరి నత్రజని, భాస్వరం, పొటాష్, పోషకాలు వరుసగా 0.75, 0.55 శాతం ఉండగా వర్మీ కంపోస్టులో సరాసరి ఇవి 1.60, 5.04, 0.80 శాతం గా ఉంటాయి. వర్మీ కంపోస్టులో సూక్ష్మ పోషకా లు పశువుల ఎరువు కన్నా దాదాపు 50 శాతం అధికంగా ఉంటాయని పీలేరు మండల వ్యవసాయాధికారి షణ్ముగం(8886612565) తెలిపారు. వర్మీ కంపోస్టుకు అవసరమైనవి వ్యవసాయ ఉత్పత్తుల శేష వ్యర్థ పదార్థాలు, ముఖ్యంగా చెత్త, ఆకులు, పేడ, పండ్ల తొక్కలు, కూరగాయల వ్యర్థ పదార్థాలు వర్మీ కంపోస్టు తయారీకి ఉపయోగపడుతాయి. ఇతర అవసరాలు వానపాములు ఎండను తట్టుకోలేవు. కాబట్టి వాటి రక్షణ కోసం తగిన నీడను కల్పించాలి. ఇం దుకు పందిరి వేయటానికి వరిగడ్డి, తాటి ఆకులు, పాత గోనె సంచు లు, పాలిథీన్ సంచులను ఉపయోగించవచ్చు. పందిరి వేయటం వల్ల వానపాములకు నీడనివ్వటమేకాక ఎరువు నుంచి తేమ తొందరగా ఆవిరైపోకుండా కాపాడుకోవ చ్చు. వర్మీ కంపోస్టు బెడ్లను తయారు చేయటం భూమికి సమాంతరంగా 3 అడుగులు వెడల్పు ఉంటేటట్లు వర్మీ కంపోస్టు బెడ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ బెడ్ల అడుగుబాగం గట్టిగా ఉంటే మంచిది. శాశ్వతంగా ఏర్పాటు చేసుకున్న బెడ్లపై సుమారుగా 45 సెంటీమీటర్ల ఎత్తువరకు వర్మీ కంపోస్టు చేయాలనుకుంటే కుళ్లుతున్న వ్యర్థ పదార్థాలను(చెత్త, ఆకులు, పేడ మున్నగున్నవి) వేయాలి. ఈ వ్యర్థ పాదార్థాలపైన 5 నుంచి 10 సెంటీమీటర్ల మందం వరకు పేడ వేయాలి. వ్యర్థ పదార్థాలు, పేడ వేసేటపుడు బెడ్‌పై నీరు చల్లాలి. ఇలా ఒక వారం వరకు నీరు అడపాదడపా చ ల్లుతుండాలి. వారం తరువాత పైన సూచించిన వానపాములను వదలాలి. వానపాములను వదిలేటపుడు బెడ్‌ను కదిలించి వదిలితే మంచిది. ఈ వానపాములు ఆహారాన్ని తీసుకుంటాయి. ప్రతి చదరపు మీటరుకు వెయ్యి వరకు వానపాములను వదలాలి. బెడ్‌పైన పాత గోనె సంచులు, వరిగడ్డి పర్చాలి. ఇలా చేయడం వలన తేమను కాపాడటమే కాక కప్పలు, పక్షులు, చీమల నుంచి రక్షణ కల్పించవచ్చు. వానపాములు వదిలిన బెడ్లపై ప్రతిరోజూ నీరు పలుచగా చల్లాలి. బెడ్ నుంచి వర్మీ కంపోస్టును తీయడానికి నాలుగైదు రోజుల ముందుగా నీరు చ ల్లటం ఆపివేయాలి. వానపాములు తేమను వెతుకుతూ లోపలికి వెల్లి అడుగు భాగానికి చేరుతాయి. బెడ్‌పైన కప్పిన గోనె సంచులు, వరిగడ్డిని తీసివేయాలి. ఎరువును శంఖాకారంగా చిన్నచిన్న కుప్పలుగా చేయాలి. వానపాములు లేని ఎరువును 2-3 ఎమ్ఎమ్ జల్లెడతో జల్లించి సంచుల్లో నింపి నీడగల ప్రదేశంలో నిల్వ ఉంచుకోవచ్చు. ఎరువును తొలగించిన బెడ్లపైన వ్యర్థ పదార్థాలను 45 సెంటీమీటర్ల ఎత్తువరకు పరచి కంపోస్టును తయారు చేసుకోవచ్చు. ఇలా సంవత్సరానికి 6 సార్లు వర్మీ కంపోస్టును తయారు చేసుకోవచ్చు. ఎకారాకు 8 నుంచి 12 క్వింటాళ్లు వాడవచ్చు వర్మీ కంపోస్టును రైతులు ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్లు వరకు వివిధ పంటకు వాడవచ్చును. పండ్ల తోటలకు బాగా ఉపకరిస్తుంది. ప్రతి చె ట్టుకు 5 నుంచి 10 కిలోల వరకు ఈ ఎరువును వేయడంవల్ల మంచి దిగుబడి సాధించవచ్చు. సంవత్సరానికి రెండు సార్లు వర్మీ కంపోస్టును వాడవచ్చు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందవచ్చు. -
గిర్ గోవు @ రోజుకు 77 లీటర్లు
బ్రెజిల్లో గిర్, కాంక్రెజ్ జాతి ఆవులు ఇటీవల అత్యధిక పాల దిగుబడితో సరికొత్త ప్రపంచ రికార్డులను నెల కొల్పాయి. బ్రెజిల్‌లోని మొర్రిన్హాస్ నగరంలో అల్మ వివ లుమియర్ అనే పేరు గల గిర్ ఆవు రోజుకు 77 లీటర్ల పాల దిగుబడినిచ్చి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ‘మెగా లెటీ-2015’ పాల పోటీల్లో ‘యూటీఏ ఎఫ్ఐవీ’ అనే పేరు గల కాంక్రెజ్ ఆవు రోజుకు 51 లీటర్ల పాల దిగుబడినిచ్చి రికార్డు సృష్టించింది. బ్రెజిల్ వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఎంబ్రాప) అధ్యక్షుడు డా. మారిసియో అంటోనియో లోప్స్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గిర్ ఆవు రోజుకు 77 లీటర్ల పాల దిగుబడితో ప్రపంచ రికార్డు నెలకొల్పడం పశుపోషణ రంగంలో తమ దేశం సాధించిన అద్భుతమని అభివర్ణించారు. బాస్ ఇండికస్ కుటుంబానికి చెందిన ఒంగోలు, గిర్, కాంక్రెజ్ తదితర భారతీయ పశు జాతులను బ్రెజిల్ గత ఐదారు దశాబ్దాలుగా శ్రద్ధగా పోషిస్తున్నది. ఈ పశుజాతులే ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలుగా మారాయని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ వ్యాఖ్యానించడం విశేషం. -
చక్కని పురుగులమందు ‘చేపల కునపజలం’!
మిగిలిపోయిన చేపలు/రొయ్యలు.. వీటి వ్యర్థాలూ వాడొచ్చు ఏ పంటలపైనైనా పిచికారీ చేయొచ్చు సేంద్రియ సాగు ద్వారా ఆరోగ్యదాయకమైన, రుచికరమైన, సకల పోషకాలతో కూడిన సహజాహారాన్ని పండించే క్రమంలో సేంద్రియ ద్రవరూప ఎరువుల పాత్ర చాలా కీలకమైనది. పంటల దిగుబడిని పెంచేందుకు ‘కునపజలం’ అనే ద్రావణ ఎరువును మన పూర్వీకులు పంటలకు వాడేవారని వెయ్యేళ్ల నాటి సురాపాలుడి రచన ‘వృక్షాయుర్వేదం’ చెబుతోంది. స్థానికంగా రైతుకు అందుబాటులో ఉండే వనరులతో తయారు చేసుకోవడంతో పాటు.. ఏ దశలో ఉన్న పంటకైనా వాడటానికి అనువైనదై ఉండటం కునపజలం (వివరాలకు.. 2014-10-09 నాటి ‘సాగుబడి’ పేజీ) ప్రత్యేకత. ఆసియన్ అగ్రికల్చర్ హిస్టరీ ఫౌండేషన్(ఏఏహెచ్‌ఎఫ్) ‘వృక్షాయుర్వేదా’న్ని వెలుగులోకి తెచ్చిన తర్వాత కొందరు రైతులు సేంద్రియ ద్రావణ ఎరువుగా కునపజలాన్ని వాడుతున్నారు. అయితే, సాధారణ ‘కునపజలం’ దిగుబడి పెంచుకోవడానికి ఉపయోగపడితే, ‘చేపల కునపజలం’ ప్రభావశీలమైన పురుగుల మందుగా ఉపయోగపడుతుందని డా. వీ ఎల్ నెనె (ఏఏహెచ్‌ఎఫ్ గౌరవాధ్యక్షులు, ‘ఇక్రిశాట్’ మాజీ డిప్యూటీ డెరైక్టర్ జనరల్) ‘సాక్షి’తో చెప్పారు. ‘చేపల కునపజలం’ తయారీకి కావలసినవి: 2:10 నిష్పత్తిలో చేపలు, ఆవు మూత్రం. అంటే.. 2 కిలోల చేపలు లేదా చేపల వ్యర్థాలకు 10 లీటర్ల ఆవు మూత్రం కలిపి పులియబెట్టాలి. చేపల మార్కెట్లో లభ్యమయ్యే వ్యర్థాలు లేదా స్వల్ప ధరకు లభించే అమ్ముడుపోని లేదా మెత్తబడిపోయిన చిన్న/పెద్ద చేపలను, రొయ్యల వ్యర్థాలను కూడా వాడొచ్చు. ఆవు మూత్రానికి బదులు మనుషుల మూత్రం కూడా వాడొచ్చు. నత్రజని, అమినో ఆమ్లాలు అధికంగా ఉంటాయి కాబట్టి మాంసాహారి మూత్రం మరింత ప్రభావశీలంగా ఉంటుంది. నీడన ఏర్పాటు చేసిన డ్రమ్ములో లేదా తొట్టిలో చేపలు/చేపల వ్యర్థాలను మూత్రంతో కలిపి(ఉడకబెట్టాల్సిన పని లేదు) పులియబెట్టాలి. రోజూ ఉదయం, సాయంత్రం ఒక నిమిషం పాటు కలియదిప్పాలి. వారం రోజుల తర్వాత ద్రావణాన్ని వడకట్టి నిల్వచేసుకోవాలి. ఇలా సిద్ధమైన చేపల కునపజలంతో సిద్ధం చేసుకున్న 5% ద్రావణాన్ని పంటలపై పిచికారీ చేయాలి. అంటే.. 5 లీటర్ల చేపల కునపజలాన్ని 95 లీటర్ల నీటిలో కలిపి.. పిచికారీ చేయాలి. ఏ పంటలపైనైనా పిచికారీ చేయొచ్చు. ఇలా పిచికారీ చేస్తే పెద్ద పురుగులను సైతం సమర్థవంతంగా అరికట్టవచ్చనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని డా. నెనె తెలిపారు. చేపల కునప జలాన్ని 3 నెలల వరకు నిల్వ ఉంచుకొని వాడుకోవచ్చు. డా. నెనెను 040 27755774 నంబరులో సంప్రదించవచ్చు. -
గానుగాట ప్రశ్నార్థకం
తగ్గిన చెరకు దిగుబడి షాషింగ్ లక్ష్యం 11లక్షల టన్నులు {పస్తుతమున్న చెరకు 7 లక్షల టన్నులే.. నాన్ మెంబర్ల నుంచి సేకరణకు సిద్ధమవుతున్న ఫ్యాక్టరీలు సహకార చక్కెర మిల్లుల పరిస్థితి దయనీయంగా ఉంది. లక్ష్యం మేరకు గానుగాటకు చెరకు లభ్యమవుతుందో లేదో అన్న బెంగ ఆయా యాజమాన్యాలను పీడిస్తోంది. దిగుబడి తగ్గిపోవడం ఇందుకు కారణం. పదేళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది జిల్లాలో చెరకు సాగు విస్తీర్ణం భాగా పెరిగింది. క్రషింగ్‌కు ఢోకా ఉండదని అంతా మురిసిపోయాయి. ఇటు పంచదార, అటు బెల్లం దిగుబడి బాగుంటుందని ఆశించారు. హుద్‌హుద్ కక్కిన విషంతో అంతా తలకిందులైంది. లక్ష్యం మేరకు క్రషింగ్ ప్రశ్నార్థకంగా మారింది. చోడవరం: జిల్లాలో చెరకు సాగు సాధారణ విస్తీర్ణం 40,353 హెక్టార్లు. ఈ ఏడాది సుమారు 45 వేల హెక్టార్లలో రైతులు ఈ పంటను చేపట్టారు. నాలుగు ఫ్యాక్టరీల్లో చోడవరం, ఏటికొప్పాక, తాండవ 11ల క్షల టన్నులకు మించి క్రషింగ్‌కు లక్ష్యంగా పెట్టుకున్నాయి. తుమ్మపాల పరిస్థితి దయనీయంగా ఉన్నవిషయం తెలిసిందే. దానిని తప్పిస్తే ఒక్క గోవాడ ఫ్యాక్టరీయే గతేడాది 5.48లక్షల టన్నుల చెరకు గానుగాడింది. ఈ ఏడాది 6లక్షల టన్నుల వరకు క్రషింగ్ చేయగలమని ఆశించింది. ఇందు కోసం ఈ ఏడాది ముందుగానే క్రషింగ్‌ను మూడు ఫ్యాక్టరీలు ప్రారంభించాయి. పంట పెరుగుదల సమయంలో హుద్‌హుద్ పంజా విసిరింది. దాని ధాటికి ఇటు ఫ్యాక్టరీలు, అటు చెరకు పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. సుగర్స్‌కు ఈ పరిణామం కోలుకోలేని దెబ్బ అయింది. అత్యధికంగా చెరకు పండించే చోడవరం, మాడుగుల, యలమంచిలి, అనకాపల్లి, పాయకరావుపేట నియోజకవర్గాల్లోనే తుఫాన్‌కు చెరకు తోటలన్నీ నేలమట్టమయ్యాయి. అనంతరం వర్షాల జాడలేకుండా పోయింది. దిగుబడి ఘోరంగా తగ్గిపోయింది. గోవాడ ఫ్యాక్టరీ పరిధిలో పక్వానికి వచ్చిన 2లక్షల టన్నుల చెరకు తోటలు నేలకొరిగి నీరుపట్టాయి. జడచుట్టు దశలోని వేలాది ఎకరాల్లో తోటలు ఒరిగిపోవడంతో చెరకు గెడ ఎదుగుదల తగ్గిపోయింది. ఎకరాకు సాధారణంగా 25 నుంచి 35టన్నులు, మంచి పల్లం భూముల్లో అయితే 45టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఈ ఏడాది ఎకరాకు 20టన్నులకు మించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిపై సర్వేచేసిన ఫ్యాక్టరీలు తాము పెట్టుకున్న క్రషింగ్ లక్ష్యాలను ఎలా ఛేదించాలనే ఆలోచనలో పడ్డాయి. నాలుగు ఫ్యాక్టరీలు కలిసి ఈ సీజన్లో 7లక్షల టన్నులైనా క్రషింగ్చేయలే ని దుస్థితి. భారీక్ష్యాలతో క్రషింగ్ ప్రారంభించిన గోవాడ ఫ్యాక్టరీ 3.5లక్షలకు మించి గానుగాడలేని పరిస్థితి. ఇక తాండవ, ఏటికొప్పాక, పరిస్థితి నామమాత్రం. తుమ్మపాల పరిధిలో మరీ ఘోరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది నాన్ మెంబర్ల నుంచి కూడా చెరకు తీసుకోవాలని ఫ్యాక్టరీలు భావిస్తున్నాయి. ఇప్పటికే ప్రకటనలు కూడా చేశాయి. దిగుబడి తగ్గడంతో ఫ్యాక్టరీలు ఈ విధంగా బాధపడుతుంటే పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితిలేదని రైతులు వాపోతున్నారు. పెట్టుబడి రాదు నాది మాడుగుల మండలం కేజేపురం. నాలుగు ఎకరాల్లో చెరకు తోట వేశాను. తుఫాన్‌కు సగానికి పైగా తోట నేలకొరిగిపోయింది. తర్వాత వర్షాలులేక ఎదుగుదల లేకుండా పోయింది. సుమారు రూ.1.3లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. ఎకరాకు 20టన్నులు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గిట్టుబాటు ధర ఎంత ఇస్తారో తెలియదు. ఈ ఏడాది కనీసం టన్నుకు రూ.2500 నుంచిరూ.3వేలు వరకు మద్దతు ధర ఇస్తే తప్పా పెట్టుబడి కూడా దక్కేలా లేదు. -జి. అప్పలనాయుడు, చెరకు రైతు -
రైతులుగా మనం చేస్తున్నదేమిటి?
ప్రకృతి వనరుల పట్ల నిర్లక్ష్యం రైతు ప్రాణాల మీదకొస్తోంది. భారీ పెట్టుబడులతో వాణిజ్య పంటలు వేయడంతో వ్యవసాయం జూదంలా మారింది. రసాయనిక ఎరువులు భూసారాన్ని, నీటి ఎద్దడిని తట్టుకునే శక్తిని నశింపజేస్తే.. జన్యుమార్పిడి పత్తి పంట తేనెటీగలను మింగేస్తోంది. రైతులు ప్రాథమ్యాలు మార్చుకుంటేనే భవిష్యత్తు బాగుపడుతుందంటున్నారు సరస్వతి కవుల. ఈ ఏడాది వ్యవసాయం కరువు హెచ్చరికల మధ్య మొదలై రైతులను నట్టేట ముంచింది. రోహిణీ కార్తెలో మంచి వర్షంతో ఖరీఫ్ మొదలైంది. మే ఆఖరులోనే పొలాలు దున్ని విత్తనాలేశారు. కానీ చినుకు జాడ లేక మొలిచిన పంటలు ఎండిపోయాయి. ఆగస్టు నెల సగంలో వర్షం పడితే, మరోసారి విత్తనాలేశారు. మళ్లీ వర్షాలు మొహం చాటేశాయి. హుదూద్ తుపాను వచ్చినప్పుడు జల్లులు తప్ప సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు వర్షాల్లేవు. రైతులు భారీ పెట్టుబడులు పెట్టి నష్టపోయారు. మాది రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తి. అదృష్టం కొద్దీ నేను ఆగస్టులో కంది పంట వేశాను. మాది సేంద్రియ వ్యవసాయం కావటంతో.. మళ్లీ వర్షం పడే వరకు భూమిలో తేమ నిలిచే ఉంది. పూత కూడా బాగావచ్చింది. అయితే, ఇటీవల కురిసిన దట్టమైన మంచు దెబ్బకు పూత రాలిపోయింది! గుడ్డిలో మెల్ల ఏమిటంటే.. ఎకరానికి నేను పెట్టిన పెట్టుబడి రూ. 3 వేలు మాత్రమే. మా పక్కన పొలం గల రైతు పత్తి, మొక్కజొన్న, టొమాటోలు వేశాడు. ఎకరానికి రూ. 70 వేల నుంచి లక్ష వరకు ఖర్చు పెట్టి.. భారీగా నష్టపోయాడు. ఎకరానికి రూ. పది వేలు తిరిగొచ్చినా వచ్చినట్లే అన్నట్లుంది పరిస్థితి. వాన దేవుడు కరుణించలేదు.. బోర్లన్నీ ఎండిపోయాయంటూ జీవనాధారం కోల్పోయి రైతులు బాధపడుతున్నారు. అయితే, భూమాతను, ప్రకృతిని మనం ఏనాడైనా పట్టించుకున్నామా? అని నా తోటి రైతులందర్నీ నేను నిలదీసి అడగదలచుకున్నాను. మనం చేస్తున్న తప్పిదాలేమిటి? ఎక్కువ దిగుబడి, ఎక్కువ ఆదాయం వస్తుందన్న ఆశతో యూరియా, డీఏపీ వంటి రసాయనిక ఎరువులను భూమిలో చాలా ఎక్కువ వేసేస్తున్నాం. రసాయనిక ఎరువులు విడుదల చేసే కర్బన ఉద్గారాలే భూమి వేడెక్కడానికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పచ్చని చెట్లు కరువైపోతున్నాయి. మా ప్రాంతంలో గట్టు మీద చెట్టు కనిపిస్తే చాలు.. నరికి అమ్మేసి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. దీన్ని ఆపకుండా ఉష్ణోగ్రత మరీ ఎక్కువగా ఉందని మొత్తుకోవడంలో అర్థం ఏముంది? ఈ ఏడాది బెట్టకు మెట్ట పంటలు నిలువునా ఎండిపోయాయి. కూరగాయల రైతులు తమ తోటలను కాపాడుకోవడానికి పదేపదే తడులు పెట్టాల్సి వస్తున్నది. క్వారీలు గుట్టలను గుల్ల చేస్తున్నాయి. ఈ కాలుష్యం వల్ల రేడియేషన్ ఎక్కువై వేడి పెరిగిపోతోంది. ఈ కారణంగా భూగర్భ నీటి పాయలు చెదిరిపోతున్నాయి. వాటర్షెడ్లన్నీ దెబ్బతిని చెరువులు నిండని దుస్థితి వచ్చింది. రైతులు ఈ విషయాన్ని కూడా ఆలోచించాలి. కాస్త నీళ్లుంటే నాట్లెయ్యడమేనా? బోరులో కాస్త నీళ్లున్నాయంటే వెనుకా ముందూ చూడకుండా వరి నాట్లేస్తున్నారు. నీటి వాడకం ఎక్కువై భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. బోర్ల మీద బోర్లు వేస్తూ రైతులు అప్పులపాలవుతున్నారు. వర్షం నీటిని సంరక్షించుకొని భూమిలోకి ఇంకింపజేస్తేనే తిరిగి నీరు వాడుకోవడానికి ఇబ్బంది ఉండదు. గుట్టలు, చెరువులు, అడవులతోపాటు చెట్టు చేమను కంటికి రెప్పల్లా కాపాడుకోవాలి. ఈ విషయాలను బొత్తిగా పట్టించుకోకుండా బోర్లు ఎండిపోకుండా బాగుంటాయా? చెప్పండి! నీళ్లు లేకుండా పంటలెట్ల పండిస్తం అనుకోవచ్చు. కానీ, కందులు, పెసలు, మినుములు, కొర్రలు, ఉలవలు, ఆముదాల వంటి సంప్రదాయ పంటలు వేసుకుంటే తక్కువ నీళ్లతోనే చక్కగా పండుతాయి కదా. భూమి అతిగా వేడెక్కడానికి రసాయనిక ఎరువుల వాడకం ఓ ముఖ్య కారణం. వీటిని వాడకపోతే వాతావరణ మార్పులూ సమసిపోతాయి. రసాయనిక ఎరువులు వేయకుండా వ్యవసాయం చేస్తే.. వానపాములు, మట్టిలో ఉండే మేలు చేసే సూక్ష్మజీవులు చైతన్యవంతమై భూమిని సారవంతం చేస్తాయి. పచ్చిరొట్ట లేదా పశువుల ఎరువులు వేస్తే చాలు. అప్పుల బారిన పడాల్సిన అవసరం అంతగా ఉండదు. ఏతావాతా చెప్పేదేమంటే.. చెట్లను, అడవులను, భూములను రక్షించుకుంటూ.. తక్కువ నీటితో పండే పంటలనే సాగు చేసుకోవాలి. మిశ్రమ పంటలు, అంతర పంటలు వేసుకుంటూ.. పంటల మార్పిడి చేస్తే భూమి సారవంతమవుతుంది. జన్యుమార్పిడి పత్తి సాగు వల్ల తేనెటీగలు, ఇతర జీవులు అంతరించిపోతున్న విషయం స్వయంగా గుర్తించాను. రెండేళ్ల క్రితం మా పక్కన పొలంలో బీటీ పత్తి సాగు మొదలైంది. ఈ ఏడాది తేనెటీగల జాడే లేదు. అవి లేకపోతే పంటల్లో పరపరాగ సంపర్కం జరిగేదెలా? పశ్చిమ బెంగాల్లో ఈ సమస్యను అధిగమించడానికి రైతులు తేనెటీగల మాదిరిగా తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి ఆడ, మగ మొక్కల పూలను చేతులతో రుద్దుతున్నారట. కానీ, ప్రకృతిసిద్ధంగా తేనెటీగలు చేసే పనిని మనం ఎంతని చేయగలుగుతాం చెప్పండి? ఇది లాభదాయకమైన వ్యవసాయమేనా? ఇంకో మౌలికమైన ప్రశ్న నా మదిలో మెదులుతూ ఉంది. రసాయనిక వ్యవసాయం లాభదాయకమైనదేనా? జూదంలా మారిన వ్యవసాయం రైతుల ఉసురు తీస్తున్నది. ఆహార పంటలు వేసుకుంటే ఇక్కడి మార్కెట్లోనే అమ్ముకోవచ్చు. పత్తి వంటి అంతర్జాతీయ వాణిజ్య పంటలు పండిస్తే.. అంతర్జాతీయ మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుంది. మరోవైపు, రసాయనాలతో పండించిన ఈ ఆహారం మనల్ని రోగగ్రస్తులుగా మార్చుతోంది. ఆస్పత్రి ఖర్చులు పెచ్చుమీరిపోయాయి. గర్భసంచిలో గడ్డలు, కీళ్లనొప్పులు, కిడ్నీ జబ్బులు.. కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు ఎక్కువైపోయాయి. రసాయనిక వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రతిఫలంగా దక్కుతున్నదేమిటో మనకు అర్థమవుతోందా? ఇటువంటి రోగగ్రస్థ వాతావరణంలో మన భావి తరాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలమా? అందుకే మన ప్రాథమ్యాలపై పునరాలోచన చేయాలి. భూమిని ‘డబ్బు యంత్రం’లా కాకుండా.. తరతరాలకు జీవంపోసే ‘నేలతల్లి’గా పరిగణించాలి. (వ్యాసకర్త: సేంద్రియ మహిళా రైతు, సామాజిక కార్యకర్త) -
ఆదాయ పంట.. అలసంద
పంట సాగుకు ఇదే అదును రబీలో ఈ పంట వేసుకోవడానికి నవంబర్ నెల నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు విత్తుకోవచ్చు. తేలికపాటి నేలలు, ఇసుకతో కూడిన బరువైన నేలలు, ఎర్రనేలలు, మురుగు నిల్వ ఉండని ఒండ్రు మట్టి నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఒక ఎకరాలో అలసంద సాగు చేయాలంటే 8 నుంచి 10 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. అదే అంతర పంటగా సాగు చేయాలంటే 3 నుంచి 4 కిలోల వరకు సరిపోతాయి. సాళ్ల మధ్య 45 సెంటి మీటర్లు మొక్కల మద్యల 20 సెంటిమీటర్లు ఉందేలా విత్తుకొవాలి. నాగలితో గాని గొర్రుతో వేసుకోవాలి. సేంద్రియ ఎరువుతో అధిక దిగుబడి రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులు వాడితే విత్తన నాణ్యత పెరుగుతుంది. దిగుబడి అధికంగా వస్తుంది. రసాయనిక ఎరువులైతే.. ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 10 కిలోల పొటాష్ ఎరువులు చివరి దుక్కిలో వేయాలి. అంతర పంటగా సాగు చేసినట్లయితే ఈ ఎరువులు ఏవీ వాడాల్సిన అవసరం లేదు. ప్రధాన పంటకు వేసిన ఎరువులే సరిపోతాయి. చీడపీడల నుంచి రక్షణ ఇలా : చిత్త పురుగులు : పైరు రెండు ఆకుల దశలో ఉన్నప్పుడు ఈ పురుగులు ఆకులపై రంగులు చేసి నష్టపరుస్తాయి. వీటి వల్ల మొక్క బలహీనపడి పెరుగుదల ఆగిపోతుంది. చిత్త పురుగుల నివారణకు ఇమిడాక్లోప్రిడ్ మిల్లీలీటర్ మందుతో కిలో విత్తనాలను శుద్ధి చేసుకోవాలి. క్లోరోఫైరిఫాస్ 2 మిల్లీలీటర్ గానీ ఎసిఫేట్ 1.5 గ్రాముల మందును గానీ లీటరు నీటికి కలిపి పంటకు పిచికారీ చేయాలి. పేనుబంక : పేనుబంకతో అలసందకు ఎక్కువ నష్టం కలుగుతుంది. ఈ పురుగులు మొక్కల అన్ని భాగాలనూ ఆశించి రసం పీల్చి, ఎదుగుదలను తగ్గిస్తాయి. నివారణకు ఇమిడాక్లో ప్రిడ్ గానీ కార్డ్బోసల్ఫాన్ మందుతో విత్తనశుద్ధి చేయాలి. పైరులో పేనుబంకను గమనిస్తే డైమిథోయేట్ 2.0 మి.లీ. గానీ, మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వేరుకుళ్లు తెగులు ఈ తెగులు సోకిన మొక్కలు, ఆకుల వాడిపోయి ఎండిపోతాయి. విత్తిన 3 వారాల్లో ఎండిపోయిన మొక్కలు పొలంలో పలచగా అక్కడక్కడా కనిపిస్తాయి. ట్రైకోడెర్మావిరిడీ 4 గ్రాములు, థైరామ్ 3 గ్రాములను కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేసుకుంటే వేరుకుళ్లు రాకుండా చేయవచ్చు. వేరుకుళ్లు సోకితే కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3.0 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్లు తడిసేలా పోయాలి. బొబ్బర్ల సాగులో ఈ యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులకు ఖర్చులు పోనూ రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు నికర ఆదాయం లభిస్తుంది. విత్తనాల రకాలు : జీసీ-3 : ఈ రకం విత్తనాలు వేస్తే 85-90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 3-4క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. వీ-2 : ఈ రకం విత్తనం ఎకరాకు 5 నుంచి 7 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.పంట 90 నుంచి 95 రోజుల్లో దిగుబడి వస్తుంది. కో-7 : ఈ విత్తనం 70 నుంచి 80 రోజుల్లో చేతికి వస్తుంది. పంట దిగుబడి 4 నుంచి 5 క్వింటాళ్ల వరకు వస్తుంది. సీ 152 : ఈ రకం విత్తనంతో 90 నుంచి 100 రోజులో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. టీపీటీసీ-29 : ఈ రకం విత్తనం 85 నుంచి 90 రోజుల్లో కోతకు వస్తుంది. ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల వరక దిగుబడి వస్తుంది. -
అరటిలో పోషక లోపం.. దిగుబడిపై ప్రభావం
ఒంగోలు టూటౌన్ : ‘అరటి చెట్లలో పోషకాలు లోపిస్తే ఎదుగుదల ఉండదు. దిగుబడి తగ్గుతుంద’ని ఉద్యానశాఖ ఏడీ బీ రవీంద్రబాబు(83744 49050) తెలిపారు. పోషక లోపాలను సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపడితే దిగుబడి పెరుగుతుందని పేర్కొన్నారు. పోషక లోపాలను ఎలా గుర్తించాలి, రైతులు తీసుకోవాల్సిన నివారణ చర్యలపై ‘సాక్షి’కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రశ్న : అరటిలో ఏఏ పోషకాలు లోపిస్తాయి? జ : జింక్, బోరాన్, ఇనుము, మాంగనీస్ లాంటి సూక్ష్మ పోషకాలు లోపిస్తాయి. ప్ర : జింకు లోపాన్ని గుర్తించడం ఎలా. నివారణ చర్యలేంటి? జ : అరటి ఆకుల ఈనెల వెంట తెల్లని చారలు మొదలై ఆకులు పాలిపోతాయి. దీని నివారణకు మొక్కకు 10 గ్రాముల చొప్పున జింక్ సలే ్ఫట్ను భూమిలో వేయాలి. 2 గ్రా.జింక్ సల్ఫేట్‌ను లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. ప్ర : బోరాన్ లోపాన్ని ఎలా గుర్తించాలి. నివారణ మార్గాలు? జ : ఆకులపై ఈనెలు ఉబ్బెత్తుగా తయారై, పెలుసుగా మారతాయి. ఆకులపై నిలువు చారలు ఏర్పడతాయి. దీని నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము బోరాక్స్ మందు కలిపి ఆకులపై 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ప్ర : అన్నబేధి మందును ఏ ధాతు లోపానికి వాడతారు? జ : ఇనుప ధాతు లోప నివారణకు వాడతారు. మొక్కలో ఇనుప ధాతువు లోపిస్తే లేత ఆకులపై తెలుపు చారలు ఏర్పడతాయి. చెట్టు ఎదుగుదల ఆగిపోతుంది. దీని నివారణకు 5 గ్రాముల అన్నబేధిని లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. మాంగనీస్ లోపిస్తే.. ముదురు ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు 2 గ్రాముల మాంగనీస్ సల్ఫేట్‌ను లీటరు నీటికి కలిపి ఆకులన్నీ తడిసేలా పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేస్తే లోపించిన పోషకాలు మెరుగుపడతాయి. -
పల్లి సాగుకు తరుణమిదే
బాల్కొండ : వేరుశనగ దిగుబడిలో విత్తే సవుయుం కూడా ప్రాధాన్యత వహిస్తుంది. జిల్లాలో సెప్టెంబర్ మధ్యలోనుంచే విత్తుకుంటున్నారు. వచ్చేనెల 15వ తేదీ వరకు పల్లీలను విత్తుకోవచ్చు. నీరు నిలువని ఇసుక నేలలు, ఎర్ర నేలలు అనుకూలం. నల్లరేగడి నేలల్లో పంట వేయుకపోవడం వుంచిది. విత్తనశుద్ధి వుంచి కాయులను విత్తనాలుగా ఎంపిక చేసుకోవాలి. వుుడతలు పడిన, పగిలిన, రంగు వూరిన గింజలు పనికిరావు. మంచి విత్తనాలను ఎంపిక చేసుకుని, కిలో విత్తనానికి గ్రావుు కార్బండైజమ్‌తో శుద్ధి చేసి 24 గంటలు నీడలో ఆరబెట్టిన తర్వాత విత్తుకోవాలి. నేల తయారీ వేరుశనగ పంట వేసే భూమిలో ఎలాంటి కలుపు మొక్కలు ఉండకుండా ట్రాక్టర్‌తో లేదా నాగలితో మూడు నుంచి నాలుగు సార్లు దున్నాలి. సాధారణంగా జిల్లాలో మొక్కజొన్న పంట కోసిన తర్వాత రెండుసార్లు ట్రాక్టర్‌తో దున్నుతారు. పల్లి విత్తనాలను చల్లిన తర్వాత మరోసారి దున్నుతారు. కొందరు రైతులు నాగలితో దున్నుతూ సాళ్లలో విత్తనాలు వేస్తారు. విత్తనాలు వేసేముందే ఎకరానికి 4 నుంచి 5 టన్నుల పశువుల ఎరువు వేసి, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ చల్లుకోవాలి. విత్తే సమయంలో 18 కిలోల యూరియాను, విత్తన 30 రోజుల తర్వాత 9 కిలోల యూరియాను వేయాలి. తగినంత తేమ ఉన్నప్పుడే నేలలో విత్తనాలు వేయాలి. విత్తన 15 రోజుల తర్వాత నీటిని అందించాలి. నేల స్వభావాన్ని బట్టి తర్వాతి తడులను అందించాలి. సాధారణంగా ఎనిమిదినుంచి తొమ్మిది తడుల్లో పంట చేతికి వస్తుంది.