సాక్షి, సిద్దిపేట: జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఒడిదుడుకుల మధ్య ముగిసింది. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో జిల్లా యంత్రాంగం 416 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 3.55లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. బుధవారంతో జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు ముగిశాయి. సీజన్ ప్రారంభంలో 5లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం వస్తుందని జిల్లా యంత్రాంగం అంచనా వేశారు. ఈ సారి యాసంగిలో కోతల సమయంలో వడగళ్లు, అకాల వర్షాలతో దిగుబడి తగ్గింది. కొందరు రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసువచ్చిన తర్వాత సైతం వర్షాలు కురవడంతో రైతులు యాసంగి ధాన్యాన్ని అమ్మడం కోసం అష్టకష్టాలు పడ్డారు. తడిసిన వడ్లకు కాంట పెట్టకపోవడంతో ఆరబెట్టిన ధాన్యం తీసుకున్నారు.
తగ్గిన ధాన్యం
జిల్లాలో యాసంగిలో 3.31లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. కోత దశలో వడగళ్లు, అకాల వర్షాలతో దిగుబడి పడిపోయింది. జిల్లా వ్యాప్తంగా 416 కొనుగోలు కేంద్రాల ద్వారా 85,411 మంది రైతుల దగ్గరి నుంచి రూ.732.15కోట్ల విలువ చేసే 3,55,413 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు.
● గతేడాది కంటే యాసంగి సీజన్‌లో సాగు పెరిగినప్పటికీ దిగుబడి తగ్గింది. గతేడాది 2.62లక్షల ఎకరాలు సాగయితే 3.92లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ సారి 37,055 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు తగ్గాయి.
రూ.111 కోట్లు పెండింగ్
ధాన్యం కొనుగోలు చేసిన పది నుంచి 15రోజులకు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో డబ్బులు చేతిలో లేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు.
● రూ.732.15 కోట్ల విలువ చేసే ధాన్యం కొనుగోలు చేయగా రూ.720.66కోట్ల విలువ చేసే ధాన్యం ట్యాబ్ ఎంట్రీ అయ్యాయి. ట్రక్ షీట్‌లు రూ.678.92కోట్ల విలువ చేసే ధాన్యంకు జనరేట్ అయ్యాయి. రూ.678.92 కోట్ల విలువ చేసే ధాన్యంకు మిల్లర్లు ఒకె చెప్పారు. ఇప్పటి వరకూ రైతులకు రూ.620.85కోట్లను చెల్లించారు. ఇంకా రూ.111.30కోట్లను రైతులకు చెల్లించాల్సి ఉంది.
విజయవంతం
యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముగిశాయి. మంత్రి హరీశ్ రావు, కలెక్టర్, అదనపు కలెక్టర్ ఆదేశాలతో ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా పూర్తి చేశాం. పెండింగ్‌లో ఉన్న ధాన్యం డబ్బుల చెల్లింపులు రెండు నుంచి మూడు రోజుల్లో పూర్తి అవుతుంది.
– హరీశ్, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్
Comments
Please login to add a commentAdd a comment