గిర్ గోవు @ రోజుకు 77 లీటర్లు
బ్రెజిల్‌లో గిర్, కాంక్రెజ్ జాతి ఆవులు ఇటీవల అత్యధిక పాల దిగుబడితో సరికొత్త ప్రపంచ రికార్డులను నెల కొల్పాయి. బ్రెజిల్‌లోని మొర్రిన్హాస్ నగరంలో అల్మ వివ లుమియర్ అనే పేరు గల గిర్ ఆవు రోజుకు 77 లీటర్ల పాల దిగుబడినిచ్చి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ‘మెగా లెటీ-2015’ పాల పోటీల్లో ‘యూటీఏ ఎఫ్‌ఐవీ’ అనే పేరు గల కాంక్రెజ్ ఆవు రోజుకు 51 లీటర్ల పాల దిగుబడినిచ్చి రికార్డు సృష్టించింది.
బ్రెజిల్ వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఎంబ్రాప) అధ్యక్షుడు డా. మారిసియో అంటోనియో లోప్స్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గిర్ ఆవు రోజుకు 77 లీటర్ల పాల దిగుబడితో ప్రపంచ రికార్డు నెలకొల్పడం పశుపోషణ రంగంలో తమ దేశం సాధించిన అద్భుతమని అభివర్ణించారు. బాస్ ఇండికస్ కుటుంబానికి చెందిన ఒంగోలు, గిర్, కాంక్రెజ్ తదితర భారతీయ పశు జాతులను బ్రెజిల్ గత ఐదారు దశాబ్దాలుగా శ్రద్ధగా పోషిస్తున్నది. ఈ పశుజాతులే ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలుగా మారాయని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ వ్యాఖ్యానించడం విశేషం.