ప్రణాళికాబద్ధంగా కష్టపడితే వ్యవసాయం సహా ఏ రంగంలోనైనా రాణించొచ్చు అంటున్నారు ప్రకాశం జిల్లా కంభం పట్టణానికి చెందిన యంజి బీఈడి కళాశాల కరస్పాండెంట్ గఫార్ అలిఖాన్ బీఈడీ కళాశాల పనులపై ఇతర ప్రాంతాలు వెళ్లి వచ్చే క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలో పండ్ల తోటల్లో అంతర పంటలుగా కూరగాయలు సాగు చేస్తున్న పొలాలు కంటపడ్డాయి. ఆ పంటలను చూసిన తర్వాత వ్యవసాయంపై మక్కువ కలిగింది. అక్కడి రైతులతో మాట్లాడి వ్యవసాయం లాభదాయకంగా ఎలా చెయ్యాలో తెలుసుకున్నారు. కందులాపురం వద్ద తనకున్న 2.2 ఎకరాల భూమిలో రెండేళ్ళ క్రితం బత్తాయి మొక్కలు నాటారు. అందులో 12 రకాల అంతర పంటలు సాగు చేస్తూ సత్ఫలితాలు పొందుతున్నారు గఫార్.
బత్తాయి తోట కాపునకు వచ్చే సరికి నాలుగేళ్ళ కాలం పడుతుంది. ఈలోగా అంతర పంటలు వేసుకొని సాగు లాభదాయకమని ప్రధాన అంతర పంటగా టొమాటోను ఫెన్సింగ్ పద్ధతిలో సాగు చేస్తూ మంచి దిగుబడి పొందుతున్నారు. బత్తాయి తోట చుట్టూ సుమారు 20 సెంట్లలో పందిళ్లు వేసి దొండ మొక్కలు నాటారు.
4 నెలలకే పంట చేతికి వస్తున్నది. ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ దొండ రూ. 50 వరకు పలుకుతున్నది. ఇప్పటికే రూ. లక్షన్నరకు పైగా లాభం వచ్చిందని గఫార్ వివరించారు. దొండ పందిళ్ల కింద క్యాబేజీ, బీట్‌రూట్ సాగు చేస్తున్నారు. పొలం చుట్టూ వేసిన ఫెన్సింగ్‌కు సైతం సొరకాయ చెట్లను పాకించారు. సొర తీగలు కాయలనివ్వటంతో పాటు చీడపీడలను అడ్డుకునే జీవకంచెగా ఉపయోగ పడుతున్నాయన్నారు. కొత్తిమీర, కాకర, మెంతి, కాకర, మిరప, మునగ, కాళీఫ్లవర్, బీర ఇంకా తదితర అంతర పంటలు సాగు చేస్తున్నారు. రెండు ఎకరాల్లో 15 ట్రాక్టర్ల మాగిన పశువుల ఎరువుతో పాటు వర్మీ కం΄ోస్టు, జీవామృతం, వేప పిండి, కానుగ పిండి, ఆముదం పిండి, జీవన ఎరువులను వినియోగిస్తున్నారు.
బత్తాయిలో సాగు చేసే అంతర పంటలకు పెట్టుబడి తక్కువగానే ఉంటుంది. పందిళ్లు వేసి విత్తనాలు నాటితే చాలు దిగుబడినిస్తాయి. దొండలో వచ్చిన ఆదాయం బత్తాయితో పాటు ఇతర అన్ని పంటల పెట్టుబడికి సరి΄ోతుందని గఫార్ స్వీయానుభవంగా చెబుతున్నారు. బీర, సొరకాయ, క్యాబేజీ, ఇతర కూరగాయల సాగు కూడా మంచి లాభదాయకమేనన్నారు.
తక్కువ విస్తీర్ణంలో అంతర పంటలతో మేలు: రెండెకరాల లేత బత్తాయి తోటలో అంతర పంటలుగా కూరగాయలు సాగు చేస్తున్నాను. భూమిని ఖాళీగా వదలకుండా అంతర పంటలు వేశాం. తోటల్లో అంతర పంటలుగా కూరగాయ పంటలు సాగు చేసుకుంటే మంచి లాభాలు ఉంటాయని నా అనుభవంలో తెలుసుకున్నాను. అంతర పంటలకు పెట్టుబడి తక్కువే. శ్రమ అధికంగా ఉంటుంది. అందుకని రైతులు తక్కువ విస్తీర్ణంలో అంతర పంటలు వేసుకోవటం లాభదాయకం. – గఫార్ అలీఖాన్, కంభం
– ఖాదర్ బాష, సాక్షి, కంభం
Comments
Please login to add a commentAdd a comment