సాక్షి, అమరావతి: ఉద్యాన పంటల సాగు.. దిగుబడుల్లో ఆంధ్రప్రదేశ్ రికార్డులు తిరగరాస్తోంది. పండ్ల దిగుబడుల్లో అయితే రాష్ట్రం జాతీయ స్థాయిలో మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. లాభసాటి కాని వ్యవసాయ పంటల స్థానంలో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 44 నెలలుగా తీసుకున్న చర్యలు, ఇస్తున్న ప్రోత్సాహకాల ఫలితంగా సాగు విస్తీర్ణం పెరిగింది. ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో నిర్వహిస్తున్న తోటబడుల ద్వారా ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించేలా చేయడంతో దిగుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి.
రికార్డు స్థాయిలో 17% వృద్ధి
2021–22లో ఉద్యాన పంటల తుది దిగుబడి అంచనాలను ప్రభుత్వం విడుదల చేసింది. 2020–21లో 44.90 లక్షల ఎకరాల్లో సాగవగా, 314.78 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి. ∙అదే 2021–22లో 45.60 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవగా ఏకంగా 368.83 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి.
♦ 2020–21తో పోలిస్తే సాగు విస్తీర్ణం 70వేల ఎకరాల్లో పెరిగితే దిగుబడులు ఏకంగా 54 లక్షల టన్నుల మేర పెరిగాయి.
♦ ఇలా ఏకంగా 17% వృద్ధి రేటుతో ఆల్‌టైం రికార్డు నమోదైంది.
♦ ఏడాదిలో దిగుబడులు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి.
♦ 2022–23లో 400 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
పంట పండిన పండ్లు.. గుబాళించిన పూలు..
ఇక పండ్ల దిగుబడుల్లో ఏపీ తన స్థానాన్ని పదిలపర్చుకుంది. 2020–21లో 178.86 లక్షల టన్నుల దిగుబడులు నమోదైతే.. 2021–22లో ఏకంగా 203.35 లక్షల టన్నులు దిగుబడులొచ్చాయి. ఇది కూడా ఓ రికార్డు అని చెబుతున్నారు. అలాగే, గతంలో ఎన్నడూ లేనివిధంగా పూలు కూడా గుబాళించాయి. పండ్లతో పోటీపడేలా వీటి దిగుబడులొచ్చాయి. 2020–21లో 44వేల ఎకరాల్లో పూల మొక్కలు సాగవగా, 2.80 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి.
అదే 2021–22లో సాగు విస్తీర్ణం 1.04 లక్షల ఎకరాలకు పెరగగా, దిగుబడులు ఏకంగా 8.67 లక్షల టన్నులు నమోదయ్యాయి. ఇక ఆయిల్‌పామ్, కొబ్బరి, జీడిమామిడి, కోకో వంటి ప్లాంటేషన్ పంటల దిగుబడులు 2020–21లో 43.52 లక్షల టన్నులు నమోదైతే 2021–22లో ఏకంగా 57.56 లక్షల టన్నులు నమోదయ్యాయి. ఇక కూరగాయల విషయానికొస్తే 2020–21లో 72.92 లక్షల టన్నుల దిగుబడులొస్తే 2021–22లో 77 లక్షల టన్నులు నమోదయ్యాయి.
దిగుబడులు పెరగడానికే కారణాలు..
ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాల్లో మార్పులు తీసుకురావడంతో పాటు నాణ్యమైన దిగుబడులు సాధించేందుకు ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో సాగులో మెళకువలు నేర్పేందుకు పెద్దఎత్తున తోటబడులు నిర్వహించింది. పంటలకు అదనపు విలువ జోడించేందుకు గ్రామస్థాయిలో మౌలిక వసతులు కల్పించడం, మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపర్చడం వంటి చర్యలు సత్ఫలితాలిచ్చాయి. ఈ కారణంగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా 4 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. మరోవైపు.. స్ట్రాబెర్రీ, నట్‌మెగ్, సిన్నామన్, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, జామూన్, కరండ, చెర్రీ వంటి విదేశీ పండ్ల సాగు కూడా విస్తరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment