కరువు సీమలో ఖర్జూర సిరులు! | date palm crop in Drought | Sakshi
Sakshi News home page

కరువు సీమలో ఖర్జూర సిరులు!

Published Tue, Aug 7 2018 6:20 AM | Last Updated on Mon, Oct 8 2018 3:08 PM

date palm crop in Drought - Sakshi

అనంతపురం జిల్లా బొందలవాడలో తన ఖర్జూర తోటలో సుధీర్‌ నాయుడు

కరువు సీమగా పేరుగాంచిన అనంతపురం జిల్లాలో ఖర్జూరపు సిరులు కురుస్తున్నాయి. బెంగళూరులో సాప్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడి.. ఉద్యోగం చేస్తూనే సరికొత్త పంటల సాగుకు శ్రీకారం చుట్టారు సుధీర్‌నాయుడు. అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడ గ్రామానికి చెందిన రైతు వెంకటనారాయణ కుమారుడు సుధీర్‌ ఉద్యోగం చేసుకుంటూ.. వారాంతంలో వ్యవసాయం పనులు చూసుకోవడం విశేషం. ఈత వనం మాదిరిగా ఉండే ఈ వినూత్న పంటలో రెండేళ్లుగా మంచి దిగుబడులు సాధిస్తున్నారు. పంట సాగు గురించి రైతు సుధీర్‌నాయుడు మాటల్లోనే విందాం..

ఎడారి పంటగా పేరున్న ఖర్జూరం తోటలు మన దేశంలో గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో కొంత విస్తీర్ణంలో సాగులో ఉన్నాయి. కుటుంబ సభ్యులతో తమిళనాడులోని మధుర ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లినప్పుడు అక్కడ రహదారి పక్కన అమ్ముతున్న ఖర్జూరపు పండ్లను రుచిచూశాను. ఆ పండ్లు ఎవరు పండిచారని ఆరాతీసి ధర్మపురి జిల్లాకు చేరి నిజాముద్దీన్‌ అనే ఖర్జూరం రైతును కలిసి ఉత్తేజితుడనై.. అవగాహన పెంచుకొని సాగుకు ఉపక్రమించాను. వెబ్‌సైట్లు, యూట్యూబ్‌లను శోధించి పంట సాగు, యాజమాన్యం, లాభనష్టాల గురించి అవగాహన చేసుకున్నాను.


ఖర్జూరపు తోటలు సాగు చేయాలంటే తొలి సంవత్సరం పెట్టుబడులు ఖర్చులు ఎక్కువగా భరించాల్సి ఉంటుంది. నాణ్యమైన మొక్కలు కొనుగోలు చేయటం, నాటడం, డ్రిప్, భూమి చదును, ఎరువులు, కూలీల ఖర్చుల రీత్యా మొదటి సంవత్సరం ఎకరాకు రూ. 5 లక్షల వరకు పెట్టుబడి అయ్యింది. రెండో సంవత్సరం నుంచి ఎకరాకు రూ. లక్ష వరకు ఖర్చు వస్తున్నది. నాలుగో ఏడాది నుంచి దిగుబడి ప్రారంభమైంది. ఒకసారి నాటుకుంటే 40 నుంచి 50 ఏళ్ల వరకు పంట తీసుకోవచ్చు.

ఎకరానికి 234 మొక్కలు..    
తమిళనాడుకు చెందిన నిజాముద్దీన్‌ సహకారంతో 2013లో ఇజ్రాయెల్‌ నుంచి మూడు సంవత్సరాల వయస్సున్న ‘బర్హీ’ రకం టిష్యూకల్చర్‌ ఖర్జూరపు మొక్కలు తెప్పించి ఎకరాకు 78 చొప్పన మూడు ఎకరాల్లో 28“28 అడుగుల దూరంలో 234 మొక్కలు నాటుకున్నాను. అప్పట్లో ఒక్కో మొక్క ఖరీదు రూ. 4,150 పెట్టాను. ఇప్పుడు మొక్క రూ.3,500కే దొరుకుతోంది. ఒకటిన్నర అడుగు లోతు గుంతలు తీసి.. వేపచెక్క, ఆముదం చెక్క వేశాను. చెట్టుకు ఇరువైపులా డబుల్‌ లాటరల్‌ డ్రిప్‌ అమర్చి రోజూ నీటి తడులు ఇచ్చాను. ఒకసారి మాత్రమే చెట్టుకు 10 కిలోల చొప్పున కోళ్ల ఎరువు వేశాను. అంతకు మించి ఎలాంటి సేంద్రియ, రసాయన ఎరువులు వాడలేదు.

నిజాముద్దీన్‌ అనుభవం గురించి తెలుసుకోవడంతో పాటు యూట్యూబ్‌ వీడియోలు, వెబ్‌సైట్లలో ఉన్న సమాచారాన్ని బట్టి ముందు జాగ్రత్తగా నెలకోసారి ఒక పురుగుమందును పిచికారీ చేశాను. క్రమం తప్పకుండా కలుపు నివారణ చర్యలు చేపట్టా. అలా మూడేళ్లు కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాను.రెండు రకాల పురుగులు ఈ పంటను ఆశిస్తాయని తెలుసుకున్నాను. రైనోసిరస్‌ పురుగు వ్యాపిస్తే పెద్దగా నష్టం ఉండదు.  రెడ్‌వివల్‌ అనే పురుగులు వ్యాపిస్తే మాత్రం నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగు చెట్టు మొదలు వద్ద రంధ్రం చేసుకుని లోపలి గుజ్జును తినడం వల్ల దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయట.

నాలుగేళ్లకు దిగుబడి ప్రారంభం..
మూడేళ్లు జాగ్రత్తగా పెంచితే నాలుగో సంవత్సరం నుంచి ఖర్జూర చెట్లు కాపునకు వస్తాయి. ఫిబ్రవరి రెండో పక్షం నుంచి మార్చి మొదటి పక్షంలోనే పూత వస్తుంది. పూత వచ్చే నెల రోజులు ముందుగా నీటి తడులు ఆపేస్తే వాడుకు వచ్చి.. మంచి పూత, పిందె పడుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. తోటలో ఎకరాకు కనీసం 10 నుంచి 12 మగ ఖర్జూర చెట్లు నాటుకోవాలి. మగ చెట్లు కేవలం పూత పూస్తాయి. వాటికి పూసిన పూల రెమ్మల పుప్పొడితో.. ఆడ చెట్ల పూతతో పరపరాగ సంపర్కం చేయించాలి. ప్రతి గెలకు జాగ్రత్తగా ఈ ప్రక్రియను పూర్తిచేయాల్సి వుంటుంది. ఒకవేళ మగ చెట్లు తక్కువగా ఉన్నా లేకున్నా.. దాని కోసం ప్రత్యేకంగా ఒక పొడి లభిస్తుంది. కిలో రూ. 18 వేలకు లభించే పాలినేషన్‌ పౌడర్‌ ఎకరాకు కిలో సరిపోతుంది.

గెల వేసిన తర్వాత డ్రిప్‌ ద్వారా డీఏపీ, పొటాష్‌ పోషకాలు ఇచ్చాను. పిందెలు వచ్చిన తర్వాత గెలలకు చిన్నపాటి వలల్లాంటి దోమ తెరలు కప్పాను. జూలై, ఆగస్టులో పసుపు రంగులోకి మారి పంట కోతకు వస్తుంది. ఇప్పుడు మా తోటలో చెట్టుకు ఆరు నుంచి ఏడు గెలలు ఉన్నాయి. వయసు పెరిగే కొద్దీ చెట్టుకు 15 వరకు గెలలు వస్తాయి. ఒక్కో గెల బరువు 10–15 కిలోల వరకు ఉంటుంది. ఖర్జూరపు పంటపై స్థానిక ప్రజల్లో అవగాహన లేనందున.. తొలి దిగుబడిని  తమిళనాడులోని కోయంబత్తూరు మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మాను.

గత ఏడాది తొలిపంట ద్వారా మూడు ఎకరాలకు 12–13 టన్నుల దిగుబడి వచ్చింది. సగటున టన్ను ధర రూ.ఒక లక్ష. ఆ ప్రకారం రూ.13 లక్షల వరకు ఆదాయం వచ్చింది. ఇపుడు జిల్లాలో కూడా కొంత అవగాహన రావడంతో డిమాండ్‌ కనిపిస్తోంది.  వ్యాపారులు తోట దగ్గరకే వస్తున్నందున కిలో రూ. 150 ప్రకారం గిట్టుబాటవుతోంది. మార్కెట్‌లో టన్ను ధర ఎపుడూ రూ.లక్షకు తగ్గే పరిస్థితి ఉండదు. ఏటా చెట్టుకు 10 గెలలు వచ్చినా రూ.10 వేలకు తగ్గకుండా ఆదాయం వస్తుంది.

 మరో రెండున్నర ఎకరాల్లో..
ఖర్జూరపు పంటకు మంచి భవిష్యత్తు ఉన్నట్లు గుర్తించి ప్రస్తుతం ఉన్న మూడెకరాల ‘బర్హీ’ రకం తోటకు తోడుగా.. మరో రెండున్నర ఎకరాల్లో ‘కమిదీ’ రకం ఖర్జూరపు మొక్కలు నాటాను. వచ్చే సంవత్సరం మరో ఐదు ఎకరాల్లో కూడా ఖర్జూరం మొక్కలు నాటాలనుకుంటున్నాను. ఉష్ణమండలపు పంట కావడంతో అనంతపురంతో పాటు కర్నూలు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో కూడా పంట సాగుకు అనుకూలమేనని అనుకుంటున్నాను.

హెక్టారుకు రూ. 2 లక్షల రాయితీ
ఖర్జూరపు తోటల సాగుకు ముందుకు వచ్చే రైతులకు హెక్టారుకు రూ.2 లక్షల వరకు రాయితీ కల్పించి ప్రోత్సహిస్తామని నార్పల ఉద్యాన శాఖాధికారి దేవానంద్‌ తెలిపారు. సుధీర్‌నాయుడుకు కూడా ఇటీవల రాయితీ వర్తింపజేశామన్నారు. ఆసక్తి గల రైతులు ఉద్యానశాఖ డీడీ, ఏడీ, హెచ్‌వో కార్యాలయాల్లో సంప్రదిస్తే నాణ్యమైన మొక్కలు, పంట సాగు యాజమాన్యం, మార్కెటింగ్‌ అంశాల గురించి తెలియజేస్తామన్నారు.
(ఖర్జూర రైతు సుధీర్‌నాయుడు: 86394 56337)
– గంగుల రామలింగారెడ్డి, సాక్షి, అనంతపురం
ఫోటోలు: జి.వీరేష్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement