యాజమాన్య పద్ధతులతోనే దిగుబడి
అనంతపురం అగ్రికల్చర్ : అరటిలో సుస్థిరమైన నాణ్యమైన దిగుబడుల కోసం నాటిన నాటి నుంచి పంట కోత వరకు సకాలంలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని రేకులకుంట ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి.శ్రీనివాసులు తెలిపారు. స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో ప్రిన్సిపల్ ఎస్.చంద్రశేఖర్‌గుప్తా ఆధ్వర్యంలో శుక్రవారం అరటి సాగుపై రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో శాస్త్రవేత్త శ్రీనివాసులుతో పాటు ముంబైకి చెందిన ఐఎన్‌ఐ ఫార్మ్ జనరల్ మేనేజర్ డాక్టర్ అజిత్‌కుమార్ హాజరై అవగాహన కల్పించారు.
‘అనంత’ అనుకూలం
వాతావరణ పరిస్థితులు, నేలలు అరటి తోటల సాగుకు ‘అనంత’ అనుకూలం.. గతంలో దుంపల ద్వారా ప్రవర్ధనం చేసిన అరటి మొక్కలు సాగు చేస్తుండగా ఇపుడు టిష్యూకల్చర్ పద్ధతి మొక్కలు అందుబాటులోకి వచ్చాయి. టిష్యూకల్చర్ ద్వారా నులిపురుగులు, వైరస్ వల్ల వ్యాపించే తెగుళ్లు తగ్గిపోయి దిగుబడులు పెరిగాయి. ఎకరాకు 1400 మొక్కలు నాటుకోవాలి. రెండు అడుగులు గుంతలు తవ్వి ఒక్కో గుంతకు 10 కిలోల పశువుల ఎరువు, 300 గ్రాములు సింగిల్‌సూపర్‌ఫాస్పేట్, అర కిలో వేపపిండి వేసుకుని నాటుకోవాలి. సింగిల్‌సూపర్‌ఫాస్పేట్ వేయడం వల్ల వేరువ్యవస్థ బలపడుతుంది. పంట కాలంలో ఒక్కో అరటి మొక్కకు 300 గ్రాములు యూరియా, 300 గ్రాములు పొటాష్ ఎరువులు వేసుకోవాలి.
డ్రిప్ ద్వారా ఎరువులు శ్రేయస్కరం
జింక్, బోరాన్, ఇనుము తదితర సూక్ష్మపోషకాల (మైక్రోన్యూట్రియంట్స్) లోపం తలెత్తకుండా ఎప్పటికపుడు వీటిని ఫర్టిగేషన్ ద్వారా ఇవ్వాలి. 19–19–19, 13–0–45 ఎరువులు లేదంటే యూరియా, వైట్ పొటాష్ ఎరువులు డ్రిప్ ద్వారా నేరుగా మొక్కలకు అందజేయాలి. మొక్కల కింద పెరిగే పిలకలు ఎప్పటికపుడు తీసివేస్తూ ప్రధాన మొక్క గెల వేసిన నెల తర్వాత ఒక పిలక ఉంచాలి.
ఒకేసారి గెల
అరటి గెల ఒకేసారి పక్వానికి వచ్చి అన్ని హస్తాలు అభివృద్ధి చెందాలంటే.. గెలలో హస్తాలు ఏర్పడిన తరువాత గెల కింద భాగాన ఉండే మగపువ్వును తీసేయాలి. 10 గ్రాములు 13–0–45 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. రెండో దఫా కింద 5 గ్రాములు సల్ఫేట్ ఆఫ్ పొటాష్ (ఎస్‌వోపీ) లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే 1 గ్రాము బావిస్టన్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే గెలలో అన్ని కాయలు సమానంగా నాణ్యతగా వస్తాయి.
గెల సిలెండర్ షేపులో వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి. సస్యరక్షణ – వర్షాకాలంలో ఆశించే సిగటోకమచ్చ తెగులును డైథేనియం–45 మందుతో నివారించుకోవాలి. పండుఈగ కనిపిస్తే మిథైల్ యూజినాల్ ఎర ఏర్పాటు చేసుకోవాలి. నత్రజనితో పొటాష్ ఎరువులు వేయాలి. మార్చి–ఏప్రిల్ నెలల్లో సంభవించే అకాల వర్షాలు, వడగళ్లవాన, ఈదురుగాలుల నుంచి అరటి తోటను కాపాడుకునే క్రమంలో తోట చుట్టూ అవిశె, సరుగుడు లాంటి చెట్లను నాటుకుంటే గాలివేగాన్ని కొంతవరకు నివారిస్తాయి.