new methods
-
మధుమేహ చికిత్సకు కొత్త పద్ధతి..!
సాక్షి, హైదరాబాద్: మధుమేహాన్ని నియంత్రణలో ఉంచేందుకు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మాడిసన్ పరిశోధకులు ఓ కొత్త పద్ధతిని గుర్తించారు. కాలక్రమంలో క్లోమగ్రంధి కణాలు (బీటా సెల్స్) నశించిపోవడం వల్ల టైప్–2 మధుమేహుల్లో ఇన్సులిన్ కొరత ఏర్పడుతుంటుంది. సాధారణ పరిస్థితుల్లో ఈ కణాలు ఇన్సులిన్‌ను విడుదల చేయడం ద్వారా రక్తంలో చక్కెర మోతాదులను నియంత్రిస్తుంటాయి. బీటా సెల్స్ రక్తంలోని చక్కెర మోతాదులను ఏ రకంగా గుర్తించి.. ఇన్సులిన్ ఉత్పత్తిని ఎలా చేపడతాయో తెలుసుకునేందుకు విస్కాన్సిన్ మాడిసన్ వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేపట్టారు. ఈ క్రమంలోనే కణాల్లోని మైటోకాండ్రియా ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తవుతుందన్న దశాబ్దాల అంచనా తప్పని స్పష్టమైంది. ఇన్సులిన్ విడుదలైన తర్వాత కూడా మైటోకాండ్రియా చురుకుగా ఉండటాన్ని బట్టి వారు ఈ అంచనాకు వచ్చారు. (చదవండి: పచ్చి ఉల్లిపాయను తిని చూడండి..) మైటోకాండ్రియాతో ఏమాత్రం సంబంధం లేని పైరువేట్ కైనేస్ అనే ఎంజైమ్ చక్కెరలను శక్తిగా మార్చేస్తోందని, ఏడీపీ (ఒక రకమైన శక్తి) కొరత ఏర్పడేలా చేస్తోందని గుర్తించారు. ఈ క్రమంలో క్లోమగ్రంధిలోని బీటా సెల్స్ ఇన్సులిన్ ఉత్పత్తిని మొదలుపెడుతున్నాయని తాము గుర్తించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మెరిన్స్ తెలిపారు. ఎలుకలు, మానవ కణాలపై తాము పైరువేట్ కైనేస్ తరహా ఎంజైమ్ ఉన్న మందులు ప్రయోగించినప్పుడు ఇన్సులిన్ మోతాదు 4 రెట్లు అయ్యిందని, తగినంత చక్కెర మోతాదులు ఉన్నప్పుడు ఇలా జరగడాన్ని తాము గుర్తించామని తెలిపారు. ఈ ప్రయోగాల ఆధారంగా పైరువేట్ కైనేస్ ఎంజైమ్‌ను చైతన్యవంతం చేసే మందులతో మధుమేహాన్ని మెరుగ్గా నియంత్రించొచ్చని తాము అంచనా వేశామని వెల్లడించారు. -
ఇష్టం మీది...పుస్తకం మాది!
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచేందుకు మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎప్పుడూ పాఠ్యపుస్తకాలతో కుస్తీ పట్టడమే కాకుండా సామాజిక అంశాలు, చరిత్ర, కరెంట్ అఫైర్స్ తదితరాలు తెలుసుకునే వీలుగా ప్రతి గురుకులంలో గ్రంథాలయ అభివృద్ధికి ఉపక్రమించింది. విద్యార్థులు ఇష్టపడే పుస్తకాలను తెప్పించేందుకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ ట్రస్ట్‌తో అవగాహన కుదుర్చుకుంది. సొసైటీ పరిధిలో 251 గురుకుల పాఠశాలలు, 29 జూనియర్ కళాశాలలతో పాటు మరో డిగ్రీ కాలేజీ ఉంది. వీటి పరిధిలో 1.15లక్షల మంది విద్యార్థులున్నారు. ఏ పుస్తకం అడిగినా ఓకే... గురుకుల విద్యాలయాల లైబ్రరీల్లో ప్రస్తుతం ఉన్న పుస్తకాలతో పాటు అదనంగా తెప్పించేందుకు ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ ప్రిన్స్‌పాళ్లకు అవకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యా సంస్థల్లో హైదరాబాద్ బుక్‌ఫెయిర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రదర్శన చేపట్టారు. వీటిలో నచ్చిన పుస్తకాల జాబితాలను ఆయా ప్రిన్స్‌పాళ్లకు అందించారు. విద్యార్థుల ఆసక్తి, అభిరుచికి తగిన పుస్తకాల జాబితాలను వారే సొసైటీకి అందించాలి. అక్కడ అనుమతి తీసుకున్న తర్వాత కొనుగోలు చేయొచ్చు. సంస్కృతి, చరిత్ర, ప్రస్తుత అంశాలతో పాటు పోటీ పరీక్షలు, సివిల్ సర్వీసెస్ తదితర రంగాలకు చెందిన అన్ని పుస్తకాలు గ్రంథాలయంలో ఉంచుతున్నట్లు సొసైటీ వర్గాలు చెబుతున్నాయి. అవసరాలకు తగ్గ కొనుగోలు ప్రతి గురుకుల విద్యా సంస్థలో ఒక గ్రంథాలయం ఉంది. ప్రస్తుతం కొన్ని పుస్తకాలు అందుబాటులో ఉండగా.. విద్యార్థుల ఆసక్తికి తగిన పుస్తకాలు కొనుగోలు చేసే వీలు కల్పిస్తుంది. విద్యార్థులు ఏయే పుస్తకాలు కోరారో.. వాటిని హైదరాబాద్ బుక్‌ఫెయిర్ సొసైటీకి జాబితా ఇస్తాం. గరిష్టంగా 50% రాయితీపై వారు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. పుస్తకాల కొనుగోలుకు గురుకుల విద్యా సంస్థకు రాష్ట్ర కార్యాలయం నుంచే అనుమతులిస్తున్నాం.– మల్లయ్య భట్టు,కార్యదర్శి, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ -
కొట్టేసిన పర్సులు @ పోస్ట్‌బాక్స్
చెన్నై: జేబు దొంగలు కొత్త పద్ధతి కనుగొన్నారు. కొట్టేసిన పర్సులను తెలివిగా వదిలించుకుంటున్నారు. ఐడీ కార్డులున్న పర్సులను వదిలించుకునేందుకు పోస్టు బాక్సులను స్వర్గధామంగా వాడుకుంటున్నారని చెన్నైలోని పోస్టల్ డిపార్ట్మెంట్ చెబుతోంది. గత ఆరు నెలలుగా ఇలాంటివి చాలా కేసులు తమ దృష్టికి వచ్చాయని తెలిపింది. పర్సుల నుంచి డబ్బులు తీసుకున్నాక వాటిని పోస్టు బాక్సుల్లో వేస్తున్నారని, అందులో ఐడీ కార్డులను మాత్రం ముట్టుకోకుండా అలాగే ఉంచేస్తున్నారని చెన్నై పోస్టల్ అధికారి ఒకరు తెలిపారు. గత ఆరు నెలల్లో చెన్నై సిటీ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 70 కేసులు తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. పర్సుల్లో ఆధార్, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్సుల వంటివి ఉంటున్నట్లు తమ సిబ్బంది గుర్తించిందని చెప్పారు. అందులో ఉన్న ఐడీ కార్డులు సరైన అడ్రస్‌కు చేరుకునేలా తమ సిబ్బంది చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, అలా చేయడం వల్ల తమకేం ఆదాయం రాదని, అయినా ఇదో సేవలాగా తాము ఈ పనిచేస్తున్నామని వివరించారు. ఐడీ కార్డుల్లో ఫోన్ నంబర్ తదితర వివరాలుంటే వారిని సంప్రదించి సంబంధిత పోస్టాఫీసుల్లో తీసుకోవాలని సూచిస్తున్నారు. -
యాజమాన్య పద్ధతులతోనే దిగుబడి
అనంతపురం అగ్రికల్చర్ : అరటిలో సుస్థిరమైన నాణ్యమైన దిగుబడుల కోసం నాటిన నాటి నుంచి పంట కోత వరకు సకాలంలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని రేకులకుంట ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి.శ్రీనివాసులు తెలిపారు. స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో ప్రిన్సిపల్ ఎస్.చంద్రశేఖర్‌గుప్తా ఆధ్వర్యంలో శుక్రవారం అరటి సాగుపై రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో శాస్త్రవేత్త శ్రీనివాసులుతో పాటు ముంబైకి చెందిన ఐఎన్ఐ ఫార్మ్ జనరల్ మేనేజర్ డాక్టర్ అజిత్‌కుమార్ హాజరై అవగాహన కల్పించారు. ‘అనంత’ అనుకూలం వాతావరణ పరిస్థితులు, నేలలు అరటి తోటల సాగుకు ‘అనంత’ అనుకూలం.. గతంలో దుంపల ద్వారా ప్రవర్ధనం చేసిన అరటి మొక్కలు సాగు చేస్తుండగా ఇపుడు టిష్యూకల్చర్ పద్ధతి మొక్కలు అందుబాటులోకి వచ్చాయి. టిష్యూకల్చర్ ద్వారా నులిపురుగులు, వైరస్ వల్ల వ్యాపించే తెగుళ్లు తగ్గిపోయి దిగుబడులు పెరిగాయి. ఎకరాకు 1400 మొక్కలు నాటుకోవాలి. రెండు అడుగులు గుంతలు తవ్వి ఒక్కో గుంతకు 10 కిలోల పశువుల ఎరువు, 300 గ్రాములు సింగిల్‌సూపర్‌ఫాస్పేట్, అర కిలో వేపపిండి వేసుకుని నాటుకోవాలి. సింగిల్‌సూపర్‌ఫాస్పేట్ వేయడం వల్ల వేరువ్యవస్థ బలపడుతుంది. పంట కాలంలో ఒక్కో అరటి మొక్కకు 300 గ్రాములు యూరియా, 300 గ్రాములు పొటాష్ ఎరువులు వేసుకోవాలి. డ్రిప్ ద్వారా ఎరువులు శ్రేయస్కరం జింక్, బోరాన్, ఇనుము తదితర సూక్ష్మపోషకాల (మైక్రోన్యూట్రియంట్స్) లోపం తలెత్తకుండా ఎప్పటికపుడు వీటిని ఫర్టిగేషన్ ద్వారా ఇవ్వాలి. 19–19–19, 13–0–45 ఎరువులు లేదంటే యూరియా, వైట్ పొటాష్ ఎరువులు డ్రిప్ ద్వారా నేరుగా మొక్కలకు అందజేయాలి. మొక్కల కింద పెరిగే పిలకలు ఎప్పటికపుడు తీసివేస్తూ ప్రధాన మొక్క గెల వేసిన నెల తర్వాత ఒక పిలక ఉంచాలి. ఒకేసారి గెల అరటి గెల ఒకేసారి పక్వానికి వచ్చి అన్ని హస్తాలు అభివృద్ధి చెందాలంటే.. గెలలో హస్తాలు ఏర్పడిన తరువాత గెల కింద భాగాన ఉండే మగపువ్వును తీసేయాలి. 10 గ్రాములు 13–0–45 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. రెండో దఫా కింద 5 గ్రాములు సల్ఫేట్ ఆఫ్ పొటాష్ (ఎస్వోపీ) లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే 1 గ్రాము బావిస్టన్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే గెలలో అన్ని కాయలు సమానంగా నాణ్యతగా వస్తాయి. గెల సిలెండర్ షేపులో వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి. సస్యరక్షణ – వర్షాకాలంలో ఆశించే సిగటోకమచ్చ తెగులును డైథేనియం–45 మందుతో నివారించుకోవాలి. పండుఈగ కనిపిస్తే మిథైల్ యూజినాల్ ఎర ఏర్పాటు చేసుకోవాలి. నత్రజనితో పొటాష్ ఎరువులు వేయాలి. మార్చి–ఏప్రిల్ నెలల్లో సంభవించే అకాల వర్షాలు, వడగళ్లవాన, ఈదురుగాలుల నుంచి అరటి తోటను కాపాడుకునే క్రమంలో తోట చుట్టూ అవిశె, సరుగుడు లాంటి చెట్లను నాటుకుంటే గాలివేగాన్ని కొంతవరకు నివారిస్తాయి. -
’ఆంధ్రా‘లో ఆధునిక గుండె శస్త్రచికిత్సలు
లబ్బీపేట : ఛాతీ ఎముకలను కత్తిరించకుండా గుండె శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రా హాస్పిటల్స్ ఎం.డీ. డాక్టర్ పీవీ రమణమూర్తి చెప్పారు. ఆదివారం సూర్యారావుపేటలోని ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌లో విలేకరుల సమావేశంలో ఆ ఆధునిక శస్త్ర చికిత్సల వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం మినిమిల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ(ఎంఐసీఎస్) అనే పద్దతిలో ఛాతీకి పక్కభాగంలో పక్కటెముకల మధ్యతో కేవలం 4 నుంచి 5 సెంటీమీటర్లు కోతతో గుండె శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీంతో వలన ఛాతీ ఎముకను కట్ చేయాల్సిన అవసరం ఉండదన్నారు. సాధారణ పద్ధతిలో అయితే గుండెకు ఉన్న బాధకన్నా..ఎముకను కత్తిరించిన బాధ ఎక్కువగా ఉంటుందన్నారు. కార్డియో థోరాసిక్ సర్జన్ డాక్టర్ దిలీప్‌కుమార్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ఉలవపాడుకు చెందిన తిరుపతమ్మ(18 ) గుండె కవాటం మూసుకుపోయి ఆయాసంతో బాధపడుతోందన్నారు. ఆమెకు ఓపెన్‌హార్ట్ సర్జరీ చేయాల్సి ఉందని కొందరు వైద్యులు చెప్పారన్నారు. తాము పక్కటెముకల మధ్య అతి చిన్న రంధ్రం చేసి చెడిపోయిన కవాటాన్ని తొలగించి, కృత్రిమ కవాటాన్ని అమర్చినట్లు తెలిపారు. మూడు రోజుల్లో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు తెలిపారు. మరో ఇద్దరికి ఇలాంటి పద్ధతిలోనే ఆపరేషన్లు నిర్వహించామన్నారు. ఈ సమావేశంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ, కార్డియాక్ అనస్థీషియా డాక్టర్ జవ్వాది రమేష్‌లు పాల్గొన్నారు. -
తప్పించుకు తిరగలేరు!
కొత్త విధానంలో ట్రాఫిక్ సిబ్బంది తనిఖీలు పాత పద్ధతికి స్వస్తి నగరంలో 200 తనిఖీ పాయింట్లు ప్రత్యేక బారికేడ్లు సిద్ధం సాక్షి, సిటీబ్యూరో: ఇకపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులు పోలీసు తనిఖీల నుంచి తప్పించుకు తిరగలేరు. దీనికోసం పోలీసులు కొత్త పద్ధతులు పాటించబోతున్నారు. ప్రస్తుతం అవలంబిస్తున్న ట్రాఫిక్ పోలీసుల తనిఖీలలో సమూల మార్పులు చేయాలని ఎమ్.మహేందర్‌రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా ఎక్కడ పడితే అక్కడ కాకుండా, వాహనదారులు, పాదచారులకు అసౌకర్యం కలుగకుండా క్రమపద్ధతిలో తనిఖీలు చేయాలని అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ అన్ని ట్రాఫిక్ ఠాణా ఎస్హెచ్ఓలకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలో కొత్త తనిఖీ విధానానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేసిన బారికేడ్లు వచ్చేశాయి. ఇదీ ప్రస్తుతపద్ధతి మలక్‌పేట్‌కు చెందిన రవి తన బైక్‌పై కోఠి వైపు దూసుకెళ్తున్నాడు. చాదర్‌ఘాట్ దాటిన తరువాత ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ చేయి చూపించి వాహనాన్ని ఆపమన్నాడు. రవి సడన్‌గా బ్రేక్ వేశాడు. అంతే.. వెనుక నుంచి వచ్చిన మరో వాహనం రవిని ఢీ కొట్టింది...నగరంలో తరచూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఒక్కోసారి ట్రాఫిక్ పోలీసులు వాహనాన్నిఆపమంటే చోదకులు ఆపకుండా, వేగంగా దూసుకెళ్లి ప్రమాదాల బారినపడిన దాఖలాలూ కోకొల్లలు. కొన్ని సందర్భాలలో మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయి. చెకింగ్ సమయంలో ఉన్నట్టుండి వాహనాన్ని నిలిపే క్రమంలో పోలీసులు, వాహనదారులకు ముష్టియుద్ధాలు జరిగిన సంఘటనలూ ఉన్నాయి. ఇక ముందు ఇలాంటి ఘటనలకు తావులేకుండా జాగ్రత్త వహించనున్నారు. కొత్త విధానమిదీ... ‘ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులను తనిఖీ చేస్తున్నాం. వాహనదారులు సహకరించాలి’ అని తెలిపే బారికేడ్లు వంద మీటర్ల దూరం నుంచే వాహనదారుడికి కనబడేలా దర్శనమిస్తాయి. వీటి వద్ద ట్రాఫిక్ పోలీసులు మర్యాదగా, గౌరవంగా, చెయ్యి చూపించి వాహనాన్ని ఆపేస్తారు. ఆ సమయంలో ఆ వాహనం వెనుక నుంచి వచ్చే ఇతర వాహనదారులు వేగాన్ని తగ్గించుకుంటారు. దీని వల్ల ప్రమాదాలను నివారించవచ్చు. ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని ఆపమన్నా తప్పించుకునేందుకు అవకాశం ఉండదు. బారికేడ్లు పెట్టడం వల్ల వాహన వేగం పెంచలేక తనిఖీలకు తప్పనిసరి సహకరించాల్సిందే. దీనివల్ల నిబంధనలు ఉల్లంఘించే వారు తనిఖీలలో పట్టుబడడం ఖాయం. కొంతమంది ట్రాఫిక్ సిబ్బంది ఎటువంటి ఆదేశాలు లేకున్నా సందుగొందుల్లో తనిఖీలు చేసి జేబులు నింపుకుంటున్నారు. ఇలాంటి అక్రమాలకు కూడా కొత్త పద్ధతితో బ్రేక్‌పడుతుంది. ఈ బారికేడ్లు లేకుండా తనిఖీలు చేయరాదని కమిషనర్ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. 200 ప్రాంతాల్లో... నగర కమిషనరేట్ పరిధిలో 25 ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. ఒక్కో స్టేషన్ పరిధిలో భౌగోళికతను దృష్టిలో పెట్టుకుని ఏడు నుంచి పది వరకు తనిఖీ పాయింట్లను గుర్తించారు. ట్రాఫిక్ తనిఖీల కోసం నగరంలో మొత్తం 200 ప్రాంతాలను గుర్తించారు. ప్రతి తనిఖీ పాయింట్ వద్ద బారికేడ్లు ఉంటాయి.