’ఆంధ్రా‘లో ఆధునిక గుండె శస్త్రచికిత్సలు
’ఆంధ్రా‘లో ఆధునిక గుండె శస్త్రచికిత్సలు
Published Sun, Jul 31 2016 9:56 PM | Last Updated on Sat, Aug 18 2018 4:27 PM
లబ్బీపేట :
ఛాతీ ఎముకలను కత్తిరించకుండా గుండె శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రా హాస్పిటల్స్ ఎం.డీ. డాక్టర్ పీవీ రమణమూర్తి చెప్పారు. ఆదివారం సూర్యారావుపేటలోని ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌లో విలేకరుల సమావేశంలో ఆ ఆధునిక శస్త్ర చికిత్సల వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం మినిమిల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ(ఎంఐసీఎస్) అనే పద్దతిలో ఛాతీకి పక్కభాగంలో పక్కటెముకల మధ్యతో కేవలం 4 నుంచి 5 సెంటీమీటర్లు కోతతో గుండె శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీంతో వలన ఛాతీ ఎముకను కట్ చేయాల్సిన అవసరం ఉండదన్నారు. సాధారణ పద్ధతిలో అయితే గుండెకు ఉన్న బాధకన్నా..ఎముకను కత్తిరించిన బాధ ఎక్కువగా ఉంటుందన్నారు. కార్డియో థోరాసిక్ సర్జన్ డాక్టర్ దిలీప్‌కుమార్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ఉలవపాడుకు చెందిన తిరుపతమ్మ(18 ) గుండె కవాటం మూసుకుపోయి ఆయాసంతో బాధపడుతోందన్నారు. ఆమెకు ఓపెన్‌హార్ట్ సర్జరీ చేయాల్సి ఉందని కొందరు వైద్యులు చెప్పారన్నారు. తాము పక్కటెముకల మధ్య అతి చిన్న రంధ్రం చేసి చెడిపోయిన కవాటాన్ని తొలగించి, కృత్రిమ కవాటాన్ని అమర్చినట్లు తెలిపారు. మూడు రోజుల్లో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు తెలిపారు. మరో ఇద్దరికి ఇలాంటి పద్ధతిలోనే ఆపరేషన్లు నిర్వహించామన్నారు. ఈ సమావేశంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ, కార్డియాక్ అనస్థీషియా డాక్టర్ జవ్వాది రమేష్‌లు పాల్గొన్నారు.
Advertisement