మధుమేహ చికిత్సకు కొత్త పద్ధతి..! | US Scientists Discover New Method For Diabetes Treatment | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 20 2020 2:50 PM | Last Updated on Fri, Nov 20 2020 2:52 PM

US Scientists Discover New Method For Diabetes Treatment - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మధుమేహాన్ని నియంత్రణలో ఉంచేందుకు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌ మాడిసన్‌ పరిశోధకులు ఓ కొత్త పద్ధతిని గుర్తించారు. కాలక్రమంలో క్లోమగ్రంధి కణాలు (బీటా సెల్స్‌) నశించిపోవడం వల్ల టైప్‌–2 మధుమేహుల్లో ఇన్సులిన్‌ కొరత ఏర్పడుతుంటుంది. సాధారణ పరిస్థితుల్లో ఈ కణాలు ఇన్సులిన్‌ను విడుదల చేయడం ద్వారా రక్తంలో చక్కెర మోతాదులను నియంత్రిస్తుంటాయి. బీటా సెల్స్‌ రక్తంలోని చక్కెర మోతాదులను ఏ రకంగా గుర్తించి.. ఇన్సులిన్‌ ఉత్పత్తిని ఎలా చేపడతాయో తెలుసుకునేందుకు విస్కాన్సిన్‌ మాడిసన్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేపట్టారు. ఈ క్రమంలోనే కణాల్లోని మైటోకాండ్రియా ద్వారా ఇన్సులిన్‌ ఉత్పత్తవుతుందన్న దశాబ్దాల అంచనా తప్పని స్పష్టమైంది. ఇన్సులిన్‌ విడుదలైన తర్వాత కూడా మైటోకాండ్రియా చురుకుగా ఉండటాన్ని బట్టి వారు ఈ అంచనాకు వచ్చారు. (చదవండి: పచ్చి ఉల్లిపాయను తిని చూడండి..)

మైటోకాండ్రియాతో ఏమాత్రం సంబంధం లేని పైరువేట్‌ కైనేస్‌ అనే ఎంజైమ్‌ చక్కెరలను శక్తిగా మార్చేస్తోందని, ఏడీపీ (ఒక రకమైన శక్తి) కొరత ఏర్పడేలా చేస్తోందని గుర్తించారు. ఈ క్రమంలో క్లోమగ్రంధిలోని బీటా సెల్స్‌ ఇన్సులిన్‌ ఉత్పత్తిని మొదలుపెడుతున్నాయని తాము గుర్తించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మెరిన్స్‌ తెలిపారు. ఎలుకలు, మానవ కణాలపై తాము పైరువేట్‌ కైనేస్‌ తరహా ఎంజైమ్‌ ఉన్న మందులు ప్రయోగించినప్పుడు ఇన్సులిన్‌ మోతాదు 4 రెట్లు అయ్యిందని, తగినంత చక్కెర మోతాదులు ఉన్నప్పుడు ఇలా జరగడాన్ని తాము గుర్తించామని తెలిపారు. ఈ ప్రయోగాల ఆధారంగా పైరువేట్‌ కైనేస్‌ ఎంజైమ్‌ను చైతన్యవంతం చేసే మందులతో మధుమేహాన్ని మెరుగ్గా నియంత్రించొచ్చని తాము అంచనా వేశామని వెల్లడించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement