రైతులుగా మనం చేస్తున్నదేమిటి? | farmers we are doing? | Sakshi
Sakshi News home page

రైతులుగా మనం చేస్తున్నదేమిటి?

Published Thu, Dec 11 2014 12:08 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

రైతులుగా మనం చేస్తున్నదేమిటి? - Sakshi

ప్రకృతి వనరుల పట్ల నిర్లక్ష్యం రైతు ప్రాణాల మీదకొస్తోంది. భారీ పెట్టుబడులతో వాణిజ్య పంటలు వేయడంతో వ్యవసాయం జూదంలా మారింది. రసాయనిక ఎరువులు భూసారాన్ని, నీటి ఎద్దడిని తట్టుకునే శక్తిని నశింపజేస్తే.. జన్యుమార్పిడి పత్తి పంట తేనెటీగలను మింగేస్తోంది. రైతులు ప్రాథమ్యాలు మార్చుకుంటేనే భవిష్యత్తు బాగుపడుతుందంటున్నారు సరస్వతి కవుల.
 
ఈ ఏడాది వ్యవసాయం కరువు హెచ్చరికల మధ్య మొదలై రైతులను నట్టేట ముంచింది. రోహిణీ కార్తెలో మంచి వర్షంతో ఖరీఫ్ మొదలైంది. మే ఆఖరులోనే పొలాలు దున్ని విత్తనాలేశారు. కానీ చినుకు జాడ లేక మొలిచిన పంటలు ఎండిపోయాయి. ఆగస్టు నెల సగంలో వర్షం పడితే, మరోసారి విత్తనాలేశారు. మళ్లీ వర్షాలు మొహం చాటేశాయి. హుదూద్ తుపాను వచ్చినప్పుడు జల్లులు తప్ప సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు వర్షాల్లేవు. రైతులు భారీ పెట్టుబడులు పెట్టి నష్టపోయారు. మాది రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తి. అదృష్టం కొద్దీ నేను ఆగస్టులో కంది పంట వేశాను. మాది సేంద్రియ వ్యవసాయం కావటంతో.. మళ్లీ వర్షం పడే వరకు భూమిలో తేమ నిలిచే ఉంది. పూత కూడా బాగావచ్చింది. అయితే, ఇటీవల కురిసిన దట్టమైన మంచు దెబ్బకు పూత రాలిపోయింది! గుడ్డిలో మెల్ల ఏమిటంటే.. ఎకరానికి నేను పెట్టిన పెట్టుబడి రూ. 3 వేలు మాత్రమే. మా పక్కన పొలం గల రైతు పత్తి, మొక్కజొన్న, టొమాటోలు వేశాడు. ఎకరానికి రూ. 70 వేల నుంచి లక్ష వరకు ఖర్చు పెట్టి.. భారీగా నష్టపోయాడు. ఎకరానికి రూ. పది వేలు తిరిగొచ్చినా వచ్చినట్లే అన్నట్లుంది పరిస్థితి. వాన దేవుడు కరుణించలేదు.. బోర్లన్నీ ఎండిపోయాయంటూ జీవనాధారం కోల్పోయి రైతులు బాధపడుతున్నారు. అయితే, భూమాతను, ప్రకృతిని మనం ఏనాడైనా పట్టించుకున్నామా? అని నా తోటి రైతులందర్నీ నేను నిలదీసి అడగదలచుకున్నాను.

మనం చేస్తున్న తప్పిదాలేమిటి?

ఎక్కువ దిగుబడి, ఎక్కువ ఆదాయం వస్తుందన్న ఆశతో యూరియా, డీఏపీ వంటి రసాయనిక ఎరువులను భూమిలో చాలా ఎక్కువ వేసేస్తున్నాం. రసాయనిక ఎరువులు విడుదల చేసే కర్బన ఉద్గారాలే భూమి వేడెక్కడానికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పచ్చని చెట్లు కరువైపోతున్నాయి. మా ప్రాంతంలో గట్టు మీద చెట్టు కనిపిస్తే చాలు.. నరికి అమ్మేసి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. దీన్ని ఆపకుండా ఉష్ణోగ్రత మరీ ఎక్కువగా ఉందని మొత్తుకోవడంలో అర్థం ఏముంది? ఈ ఏడాది బెట్టకు మెట్ట పంటలు నిలువునా ఎండిపోయాయి. కూరగాయల రైతులు తమ తోటలను కాపాడుకోవడానికి పదేపదే తడులు పెట్టాల్సి వస్తున్నది. క్వారీలు గుట్టలను గుల్ల చేస్తున్నాయి. ఈ కాలుష్యం వల్ల రేడియేషన్ ఎక్కువై వేడి పెరిగిపోతోంది. ఈ కారణంగా భూగర్భ నీటి పాయలు చెదిరిపోతున్నాయి. వాటర్‌షెడ్లన్నీ దెబ్బతిని చెరువులు నిండని దుస్థితి వచ్చింది. రైతులు ఈ విషయాన్ని కూడా ఆలోచించాలి.
 
కాస్త నీళ్లుంటే నాట్లెయ్యడమేనా?

బోరులో కాస్త నీళ్లున్నాయంటే వెనుకా ముందూ చూడకుండా వరి నాట్లేస్తున్నారు. నీటి వాడకం ఎక్కువై భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. బోర్ల మీద బోర్లు వేస్తూ రైతులు అప్పులపాలవుతున్నారు. వర్షం నీటిని సంరక్షించుకొని భూమిలోకి ఇంకింపజేస్తేనే తిరిగి నీరు వాడుకోవడానికి ఇబ్బంది ఉండదు. గుట్టలు, చెరువులు, అడవులతోపాటు చెట్టు చేమను కంటికి రెప్పల్లా కాపాడుకోవాలి. ఈ విషయాలను బొత్తిగా పట్టించుకోకుండా బోర్లు ఎండిపోకుండా బాగుంటాయా? చెప్పండి! నీళ్లు లేకుండా పంటలెట్ల పండిస్తం అనుకోవచ్చు. కానీ, కందులు, పెసలు, మినుములు, కొర్రలు, ఉలవలు, ఆముదాల వంటి సంప్రదాయ పంటలు వేసుకుంటే తక్కువ నీళ్లతోనే చక్కగా పండుతాయి కదా.
 
భూమి అతిగా వేడెక్కడానికి రసాయనిక ఎరువుల వాడకం ఓ ముఖ్య కారణం. వీటిని వాడకపోతే వాతావరణ మార్పులూ సమసిపోతాయి. రసాయనిక ఎరువులు వేయకుండా వ్యవసాయం చేస్తే.. వానపాములు, మట్టిలో ఉండే మేలు చేసే సూక్ష్మజీవులు చైతన్యవంతమై భూమిని సారవంతం చేస్తాయి. పచ్చిరొట్ట లేదా పశువుల ఎరువులు వేస్తే చాలు. అప్పుల బారిన పడాల్సిన అవసరం అంతగా ఉండదు. ఏతావాతా చెప్పేదేమంటే.. చెట్లను, అడవులను, భూములను రక్షించుకుంటూ.. తక్కువ నీటితో పండే పంటలనే సాగు చేసుకోవాలి.  మిశ్రమ పంటలు, అంతర పంటలు వేసుకుంటూ.. పంటల మార్పిడి చేస్తే భూమి సారవంతమవుతుంది.
 జన్యుమార్పిడి పత్తి సాగు వల్ల తేనెటీగలు, ఇతర జీవులు అంతరించిపోతున్న విషయం స్వయంగా గుర్తించాను. రెండేళ్ల క్రితం మా పక్కన పొలంలో బీటీ పత్తి సాగు మొదలైంది. ఈ ఏడాది తేనెటీగల జాడే లేదు. అవి లేకపోతే పంటల్లో పరపరాగ సంపర్కం జరిగేదెలా? పశ్చిమ బెంగాల్‌లో ఈ సమస్యను అధిగమించడానికి రైతులు తేనెటీగల మాదిరిగా తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి ఆడ, మగ మొక్కల పూలను చేతులతో రుద్దుతున్నారట. కానీ, ప్రకృతిసిద్ధంగా తేనెటీగలు చేసే పనిని మనం ఎంతని చేయగలుగుతాం చెప్పండి?
 
ఇది లాభదాయకమైన వ్యవసాయమేనా?


ఇంకో మౌలికమైన ప్రశ్న నా మదిలో మెదులుతూ ఉంది. రసాయనిక వ్యవసాయం లాభదాయకమైనదేనా? జూదంలా మారిన వ్యవసాయం రైతుల ఉసురు తీస్తున్నది. ఆహార పంటలు వేసుకుంటే ఇక్కడి మార్కెట్లోనే అమ్ముకోవచ్చు. పత్తి వంటి అంతర్జాతీయ వాణిజ్య పంటలు పండిస్తే.. అంతర్జాతీయ మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుంది. మరోవైపు, రసాయనాలతో పండించిన ఈ ఆహారం మనల్ని రోగగ్రస్తులుగా మార్చుతోంది. ఆస్పత్రి ఖర్చులు పెచ్చుమీరిపోయాయి. గర్భసంచిలో గడ్డలు, కీళ్లనొప్పులు, కిడ్నీ జబ్బులు.. కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు ఎక్కువైపోయాయి. రసాయనిక వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రతిఫలంగా దక్కుతున్నదేమిటో మనకు అర్థమవుతోందా? ఇటువంటి రోగగ్రస్థ వాతావరణంలో మన భావి తరాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలమా? అందుకే మన ప్రాథమ్యాలపై పునరాలోచన చేయాలి. భూమిని ‘డబ్బు యంత్రం’లా కాకుండా.. తరతరాలకు జీవంపోసే ‘నేలతల్లి’గా పరిగణించాలి.  
 (వ్యాసకర్త: సేంద్రియ మహిళా రైతు, సామాజిక కార్యకర్త)
 

Advertisement
Advertisement