సాక్షి, అమరావతి: రెండేళ్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఈ ఏడాది వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి ధర పలుకుతోంది. ముఖ్యంగా అపరాలతో పాటు పత్తి, మిరప, పసుపు వంటి వాణిజ్య పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కు మించి రైతుకు లభిస్తోంది. కోవిడ్ నేపథ్యంలోనూ రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.3 వేల కోట్లతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధితో ఎమ్మెస్పీ దక్కని వ్యవసాయ, వాణిజ్య పంటలను కొనుగోలు చేసింది. పొగాకుతో సహా ప్రధాన వ్యవసాయ, వాణిజ్య పంటలైన జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, మొక్కజొన్న, కందులు, పెసలు, మినుము, వేరుశనగ, పత్తి, పసుపు, ఉల్లి, టమాట తదితర పంటలకు మార్కెట్ జోక్యంతో కనీస మద్దతు ధర దక్కేలా చేసింది. ఆ ప్రభావం ఈ ఏడాది వ్యవసాయ, వాణిజ్య పంటల ధరలపై కన్పిస్తోంది.
ప్రభుత్వ జోక్యం వల్లే వ్యాపారుల మధ్య పోటీ
► మార్క్‌ఫెడ్ ద్వారా 2019–20లో 3,16,610 మంది రైతుల నుంచి రూ.3,735.56 కోట్ల విలువైన 9,83,189 మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులతో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.103.45 కోట్ల విలువైన 12.93 మిలియన్ కిలోల పొగాకును కిలో రూ.81 చొప్పున కొనుగోలు చేసింది.
► 2020–21లో 1,23,652 మంది రైతుల నుంచి రూ.2,420.09 కోట్ల విలువైన 8,28,211.55 మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను కొనుగోలు చేసింది. ధర తగ్గిన ప్రతీసారి ప్రభుత్వం మార్కెట్‌లో జోక్యం చేసుకుంటుండడంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది.
► ఈ కారణంగా ఈ ఏడాది ఊహించని విధంగా వ్యవసాయ, వాణిజ్య పంటలకు రైతులకు మార్కెట్‌లో మంచి ధర లభిస్తోంది. గత మూడేళ్లలో దక్కని ధరలు లభిస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2021–22 సీజన్‌లో ఇప్పటి వరకు కేవలం 1,766 మంది రైతుల నుంచి రూ.14.62 కోట్ల విలువైన 3,665 టన్నుల ఉత్పత్తులను మాత్రమే మార్క్‌ఫెడ్ కొనుగోలు చేయడమే ఇందుకు నిదర్శనం.
► ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహన్‌రెడ్డి ఆలోచన మేరకు సీజన్ ముగిసే సమయంలో ఎమ్మెస్పీ, క్వాలిటీ పట్ల రైతుల్లో అవగాహన కల్పించడం, కోతలకు ముందుగానే కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేయడం మార్కెట్‌లో వ్యాపారుల మధ్య పోటీకి కారణమైంది.
ఎగబాకుతున్న అపరాలు, వాణిజ్య పంటల ధరలు
► ఈ ఏడాది సీజన్ ఆరంభం నుంచే అపరాలు, వాణిజ్య పంటల ధరలు ఆకాశమే హద్దుగా ఎగబాకుతున్నాయి. ప్రధానంగా పత్తి, మిరప, పసుపు, మినుము, వేరుశనగ, టమాటా పంటలు రికార్డు స్థాయి ధర పలుకుతున్నాయి. అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్ కారణంగా పసుపు, పత్తి, మిరప పంటలకు ఈసారి మంచి ధర పలుకుతోంది.
► మిగిలిన పంటలకు సంబంధించి మార్కెట్‌లో డిమాండ్ ఉండడంతో కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధర ఇచ్చేందుకు వ్యాపారులు పోటీ పడుతున్నారు. పసుపు ఓ దశలో రూ.7,900 వరకు ధర పలికింది. ప్రస్తుతం రూ.7,250 వద్ద నిలకడగా ఉంది. ఇక పత్తి అయితే ఈసారి రైతులకు సిరులు కురిపించింది.
► తొలిసారి క్వింటాల్ రూ.9,600 మార్క్‌ను అందుకుంది. కొత్త ఏడాదిలో రూ.10 వేల మార్క్‌ను అందు కుంటుందని అంచనా వేస్తున్నారు. క్వాలిటీ మిరప తొలిసారిగా క్వింటాల్ రూ.20 వేల మార్క్‌ను అందుకుంటోంది. రూ.13 వేలతో మొదలై.. నెమ్మదిగా ఎగబాగుతోంది. తామర పురుగు ప్రభావంతో ఈసారి దిగుబడి గణనీయంగా పడిపోయింది. ఇది కూడా ధర పెరిగేందుకు దోహద పడిందంటున్నారు.
► వేరుశనగ ధర కూడా ఎమ్మెస్పీకి మించి పలుకుతోంది. ఓ దశలో కందులు, పెసల ధరలు పెరిగినప్పటికీ ప్రస్తుతం నిలకడగా కొనసాగుతున్నాయి. రెండేళ్లుగా కనీస మద్దతు ధర దక్కని మొక్క జొన్న మళ్లీ పుంజుకుంది. ప్రస్తుతం ఎమ్మెస్పీకి దీటుగానే పలుకుతోంది.
పత్తి బంగారమైంది..
పత్తికి మంచి ధర వస్తోంది. గతంలో ఎప్పుడూ ఇంత ధర చూడలేదు. ఆదోని మార్కెట్‌కు 4 క్వింటాళ్ల పత్తి తీసుకెళ్లా. వ్యాపారులు పోటీ పడి క్వింటాల్ రూ.9,611 చొప్పున కొన్నారు. చాలా ఆనందంగా ఉంది.
– కె.మహాలక్ష్మి, కౌతాలం, కర్నూలు జిల్లా
వ్యాపారులు పోటీపడ్డారు
నేను 5 క్వింటాళ్ల పత్తిని ఆదోని మార్కెట్ యార్డుకు తీసుకెళ్లా. క్వాలిటీ బాగుండడంతో వ్యాపారులు పోటీ పడ్డారు. క్వింటాల్ రూ.9,591 చొప్పున కొనుగోలు చేశారు. గతంలో ఎప్పుడూ ఇంత ధర పలకలేదు.
– ఈశ్వరప్ప, కమ్మలదిన్నె, కర్నూలు జిల్లా
మిరప రైతులకు మంచి రోజులు
గతేడాది మూడెకరాల్లో వేసిన మిరపను ఏసీ గోడౌన్‌లో భద్రపరిచాను. ప్రస్తుతం రేటు భారీగా పెరగడంతో మార్కెట్‌కు తీసుకెళ్లాను. క్వింటాల్ రూ.16 వేలు పలికింది. ఈ ఏడాది వేసిన పంట తామర పురుగు ప్రభావంతో దెబ్బతినింది. ఈ ఏడాది కూడా మంచి దిగుబడి వస్తే మంచి రేటు వచ్చేది.
– విఘ్నేశ్వరరెడ్డి, అంబాపురం, గుంటూరు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment