సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు మంజూరు చేసిన రుణాల్లో ఆంధ్రప్రదేశ్‌లోనే వ్యవసాయ రుణాల వాటా అధికంగా ఉంది. దేశంలో మొత్తం రుణాల్లో వ్యవసాయ రుణాల వాటా 13.70 శాతం కాగా దక్షిణాది రాష్ట్రాల్లో 20.04 శాతం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రుణాల వాటా ఏకంగా 32.55 శాతం ఉంది. 2019 నుంచి ఏపీలో ఏటా రుణ పరపతి కూడా పెరుగుతోంది. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో వాణిజ్య బ్యాంకుల రుణాలు రూ.3.73 లక్షల కోట్లు ఉండగా 2021 మార్చి నాటికి రూ. 4.86 లక్షల కోట్లకు పెరిగాయి. ఏపీలో వ్యవసాయ రంగంలో రుణాలు కూడా పెరిగాయి. వివిధ రాష్ట్రాలో రంగాలవారీగా బ్యాంకు రుణాలపై ఆర్బీఐ నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
విరివిగా మంజూరు..
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు రైతులకు అవసరమైన అన్నింటినీ గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తోంది. సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ కింద ఇప్పటివరకు రూ.1,674 కోట్లు చెల్లించింది. క్రమం తప్పకుండా సున్నా వడ్డీని వర్తింపచేయడంతో సకాలంలో రుణాలు చెల్లిస్తున్న రైతుల సంఖ్య పెరిగిందని ఇటీవల రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు. దీంతో బ్యాంకులు కూడా రైతులకు విరివిగా రుణాలు మంజూరు చేస్తున్నాయి.
దేశంలో రుణాలు ఇలా...
► దేశవ్యాప్తంగా ఈ ఏడాది మార్చి నాటికి వాణిజ్య బ్యాంకులు ఇచ్చిన మొత్తం రుణాలు రూ.1,10,78,050 కోట్లు. ఇందులో వ్యవసాయ రంగానికి ఇచ్చిన రుణాలు రూ.15,18,112 కోట్లు.
► దక్షిణాది రాష్ట్రాలకు ఇచ్చిన బ్యాంకు రుణాలు రూ.33,32,055 కోట్లు. ఇందులో వ్యవసాయ రంగానికి ఇచ్చిన రుణాలు రూ.6,67,805 కోట్లు.
► ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగానికి ఇచ్చిన రుణాలు రూ.1,58,371 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment