Harvest Home
-
‘ఇంటిపంట.. ఒక రెవెల్యూషన్’!
‘‘నెల్లూరులో పుట్టింట్లో ఉన్నప్పుడు పదేళ్ల క్రితం ‘సాక్షి’లో ‘ఇంటిపంట’ కాలమ్ చదివి ఉత్సాహంతో ఇంటిపంటల సాగు ప్రారంభించాను. ఏడేళ్ల క్రితం అమెరికా వచ్చేశాం. నాలుగేళ్లు మంచు, చలి ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో ఉన్నాం. ఫ్లోరిడాలోని టాంప నగరానికి మారిన తర్వాత మూడేళ్లుగా మన దేశీ విత్తనాలతోనే సేంద్రియ ఇంటిపంటలు పండించుకొని తింటున్నాం. అపార్ట్మెంటు ఎదుట, స్కూలు ఆవరణలోని కమ్యూనిటీ గార్డెన్ ప్లాట్‌లో పంటలు పండిస్తున్నాం. సాక్షి ఇంటిపంట ఒక రెవెల్యూషన్ తెచ్చింది. అప్పటి ఇంటిపంట కాలమ్ క్లిప్పింగ్స్‌ను భద్రంగా దాచుకున్నాను..’’ అని ‘సాక్షి’తో అన్నారు శిల్ప, పట్టలేనంత సంతోషంగా! నేచురల్ ఎకో లివింగ్ గ్రూప్ సుధీర్ నిర్వహించిన వెబినార్ ద్వారా ఇటీవల శిల్ప తన కిచెన్ గార్డెనింగ్ అనుభవాలను పంచుకున్నారు. శిల్ప గృహిణి. ఆమె భర్త బొబ్బా హజ్రత్రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజినీర్. హర్షిణి(10), హైందవ్(5) వారి పిల్లలు. ఫ్లోరిడాలో సమశీతోష్ట వాతావరణ పరిస్థితులు ఉండటంతో ఏడాదిలో ఎక్కువ నెలలు ఇంటిపంటల సాగుకు అనుకూలంగా ఉందన్నారు. కరోనా వల్ల గత కొద్ది నెలలుగా అమెరికన్లలో చాలా మంది ఇంటి పెరట్లో కూరగాయలు సాగు చేసుకోవటం ప్రారంభించారని శిల్ప తెలిపారు. శిల్ప తమ అపార్ట్మెంట్ ఎదుట ఉన్న చోటులో 50 వరకు గ్రోబాగ్స్‌లో కూరగాయలు, ఆకుకూరలు పెంచుతున్నారు. దీంతోపాటు తమ కౌంటీలోని హైస్కూల్ ఆవరణలో గల కమ్యూనిటీ గార్డెన్లో 120 చదరపు గజాల ప్లాట్లు రెంటిని అద్దెకు తీసుకొని మరీ కూరగాయలు, ఆకుకూరలు పండించుకొని తింటున్నారు. సాధారణంగా ఒక కుటుంబానికి 30“4 చ.అ.ల ప్లాట్ కేటాయిస్తారు. అందుకు ఏడాదికి 110 డాలర్ల (రూ. 8,242) అద్దె చెల్లించాలి. ఎవరి ప్లాట్‌లో వాళ్లు తమకు నచ్చిన కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవచ్చు. గార్డెనింగ్ పరికరాలు అక్కడ ఉచితంగానే అందుబాటులో ఉంటాయి. రోజూ స్ప్రింక్లర్లతో మొక్కలకు స్కూలు సిబ్బందే నీటిని అందిస్తారు. మనం రోజూ ప్లాట్ దగ్గరకు వెళ్లక్కరలేదు. వీలున్నప్పుడు వెళ్లొచ్చు. మొక్కల బాగోగులను మనమే చూసుకోవాలి. గ్రంథాలయంలో నెలకోసారి విత్తనాలు కూడా ఉచితంగా ఇస్తారు. హైస్కూలు పిల్లలు కూడా పంటలు పండిస్తారు. అగ్రికల్చర్ టీచర్ వారికి నేర్పిస్తుంటారు. శిల్ప ఇంకా ఇలా వివరించారు.. మేం కమ్యూనిటీ గార్డెన్ ప్లాట్ తీసుకున్న మొదట్లో ఎక్కువ మంది ఆసక్తి చూపేవారు కాదు. ఇప్పుడు కరోనా ప్రభావంతో సేంద్రియ ఆహారం మనమే పెంచుకోవాలన్న ఆసక్తి ఎక్కువ మందిలో కలగటం సంతోషంగా ఉంది. ఈ ఆసక్తిని గమనించి ‘బ్యాక్ టు ఫార్మింగ్’ పేరిట యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించాను. అమెరికాలో మాదిరిగా మన దేశంలో కూడా కమ్యూనిటీ గార్డెన్లలో కుటుంబాలకు ప్లాట్లు కేటాయిస్తే.. ఇళ్ల దగ్గర అవకాశం లేని వారు కూడా ఇంటిపంటలు పండించుకోవటం సాధ్యమవుతుంది అన్నారు శిల్ప (+1 651 605 5269). నగరాల్లో సేంద్రియ ఇంటిపంటల ద్వారా ఆకలిని జయించిన క్యూబా దేశానికి అతి దగ్గర్లోనే ఫ్లోరిడా ఉండటం యాదృచ్చికం. wearebacktofarming@gmail.com -
ఉత్తమ పోషకాహారం@ ఇంటిపంట!
ఇది కెనడాలోని టొరొంటో నగరంలో ఆకాశ హర్మ్యంపైన సాగవుతున్న ‘ఇంటిపంట’ల దృశ్యం. ఉత్తర అమెరికా నగరాల్లో రూఫ్‌టాప్ కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసుకోవడం అనేది ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. భవంతుల రూపశిల్పులు రూఫ్‌టాప్ గార్డెన్లకు అధిక ప్రాధాన్యం ఇస్తుండడం విశేషం. స్థానికంగా పండించిన ఆహారాన్నే తినాలనే స్పృహ నగరవాసుల్లో పెరుగుతున్నకొద్దీ టైలన్నీ కిచెన్ గార్డెన్లతో నిండిపోతున్నాయి. భవంతులే కాదు స్టార్ హోటళ్లు కూడా ఇంటిపంటలపై ఆసక్తి చూపుతున్నాయి. కస్టమర్లకు ఔషధ విలువలున్న తాజా ఆహారాన్ని అందిస్తున్నాయి. టొరొంటోలోని చరిత్రాత్మక ఫెయిర్మోన్ట్ రాయల్ యోర్క్ హోటల్ చీఫ్ చెఫ్ కొల్లిన్ థార్న్టన్ రోజూ తమ అతిథులకు వడ్డించడానికి టై మీదికొచ్చి తాజా ఆకుకూరలను కత్తిరిస్తుంటారు. ‘పంటను నా చేతులతో కత్తిరించి.. గంట గడవకముందే వండి వడ్డించడం’ ఎంతో ఉత్సాహకరంగా ఉంద’ని అంటున్నారు. సేంద్రియ ఇంటిపంటల నుంచి వచ్చే ఆహారోత్పత్తులను అత్యధిక నాణ్యమైనవిగా తాము పరిగణిస్తున్నామని నార్త్ అమెరికాకు చెందిన గ్రీన్ రూఫ్స్ ఫర్ హెల్దీ సిటీస్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు స్టీవెన్ పెక్ అంటున్నారు. ‘నగరాల్లో ఇంటిపంటలపై ఆసక్తిని పెంచుతున్న ఈ ధోరణి వ్యవసాయదారుల పనిలో గొప్పతనాన్ని ప్రశంసిస్తున్నట్లుగా ఉంది. అంతేకాకుండా, ఆహారోత్పత్తి ప్రక్రియలో నగరవాసులు తమ వంతు పాత్రను పోషిస్తున్నట్లుగా కూడా ఉందని’ అని న్యూయార్క్‌లో అర్బన్ అగ్రికల్చర్ కన్సల్టెంట్ హెన్ర గోర్డొన్ స్మిత్ అన్నారు. ‘మా తరానికి ప్రకృతితో సంబంధం తెగిపోయింది. ప్రకృతితో తిరిగి మమేకం కావడానికి తిరిగి గ్రామాలకు వెళ్లక్కర్లేదు. నగరాల్లో మేడలపైనే ఇంటిపంటలు పండించుకుంటే చాల’ని స్మిత్ వ్యాఖ్యానించారు. టైల మీద గ్రీన్‌హౌస్‌లు ఏర్పాటు చేసి వాణిజ్య సరళిలో సలాడ్ లీవ్స్, ఆకుకూరలు, టమాటోలు.. సాగు చేసే అర్బన్ అగ్రికల్చర్ సంస్థలు సయితం ప్రపంచవ్యాప్తంగా పుట్టుకొస్తున్నాయి. మహానగరాల్లో మేడలపైన ఖాళీ స్థలాల్లో సేంద్రియ ఇంటిపంటల సాగు ఒక హాబీగానో, పచ్చదనం కోసమనో మాత్రమే కాకుండా ఔషధ విలువలు కలిగిన ఉత్తమ పోషకాహారానికి ముఖ్య అందుబాటు వనరుగా గుర్తింపు పొందుతుండడం శుభసూచకం. -
కాలువ నీటిపై తేలాడే ఇంటిపంటలు !
సృజనకు హద్దులు లేవని తెలిపేందుకు ఈ నీటిపై ఇంటిపంటల పెంపకం మంచి ఉదాహరణ. ప్రకృతి అందాలకు నెలవైన కేరళలో కాలువల్లోని నీటిపై ఇంటిపంటలు పండిస్తూ అబ్బురపరుస్తున్నాడు ఓ యువకుడు. ఇంటి పక్క నుంచి వెళుతున్న కాలువనే అతను ఇంటిపంటల సాగుకు వినియోగిస్తున్నాడు. మోకాలి లోతు నీరు గల కాలువలో వెదురు బొంగులతో తెప్పలు తయారు చేశాడు. వాటిపై చెక్క పెట్టెలు ఉంచి, జారిపోకుండా తాళ్లతో బిగించి కడతారు. చెక్క పెట్టెల్లో మట్టి, సేంద్రియ ఎరువు మిశ్రమాన్ని నింపి ఇంటిపంటలు పెంచుతున్నారు. తెప్పకు నాలుగు వైపులా నిలువుగా కర్రలు కట్టి వాటి ఆసరాతో తీగెలు పైకి పాకేలా ఏర్పాటు చేశారు. ఇలా కాలువ నీటిలో తెప్పలపై పదుల సంఖ్యలో పెట్టెల్లో ఇంటిపంటలు పండిస్తూ చూపరులను ఆశ్చర్యచకితులను చేస్తున్నాడు. -
మూడేళ్లుగా ఆకుకూరలు కొనలేదు!
18 అడుగుల మడిలో ఇంటిపంటల సాగు ఈ ఫొటోలో ఉన్న ఆకుపచ్చని ఇటుకల మడి.. ఒక చిన్న కుటుంబానికి సరిపడా ఆకుకూరలు అందిస్తోంది. 6 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు.. అంతా కలిపితే 18 చదరపు అడుగుల నేల. అయితేనేం.. ఈ చిన్న మడిలోనే కేతిరెడ్డి విజయశ్రీ(98495 27445) ముగ్గురితో కూడిన తమ కుటుంబానికి సరిపడా సేంద్రియ ఆకుకూరలు పండిస్తున్నారు. భర్త కృపాకర్‌రెడ్డి ఇంటిపంటల సాగులో ఆమెకు సహకరిస్తున్నారు. హైదరాబాద్‌లోని కల్యాణ్పురిలో తాము అద్దెకుంటున్న ఇంటి ముందున్న కొద్దిపాటి ఖాళీ స్థలంలో ఇటుకలతో చిన్న మడిని ఏర్పాటు చేసుకున్నారు. మెంతికూర, దుంప బచ్చలికూర, గోంగూర, పాలకూర, పుదీనా, వామాకు, కొత్తిమీర.. పెంచుతున్నారు. వీటితోపాటు కాకర, బీర తీగలను కుండీల్లో సాగు చేస్తున్నారు. మూడొంతులు ఎర్రమట్టి, ఒక వంతు పుట్ట మన్ను, ఒక వంతు పశువుల ఎరువును కలిపి తయారు చేసిన మట్టి మిశ్రమాన్ని వాడుతున్నారు. మొదట్లో ఎర్రమట్టి ఒక్కటే ఉపయోగించటంతో మొక్కలు సరిగ్గా ఎదగలేదని.. పుట్టమట్టి, పశువుల పేడ కలిపిన తర్వాత ఏపుగా పెరుగుతున్నాయని విజయశ్రీ వివరించారు. ‘గత మూడేళ్లుగా మేం ఏనాడూ ఆకుకూరలు కొనలేదు. అతి తక్కువ స్థలమే కావటంతో ఇంటి యజమానులు కూడా అభ్యంతరం చెప్పలేదు. పురుగులు, వాటి గుడ్లు కనిపిస్తే చేతులతోనే తీసివేస్తాను. రైతు కుటుంబంలో పుట్టి పెరట్లోనే ఆరోగ్యకరమైన ఆకుకూరలను పండించుకోవటం సంతృప్తిగా ఉందంటున్నారు విజయశ్రీ. -
మట్టి లేకుండా సేంద్రియ ఇంటిపంటలు!
టై మీద, పెరట్లో మట్టి వాడకుండా హైడ్రోపోనిక్స్ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలను సేంద్రియ పద్ధతుల్లో పెంచుకునే అవకాశం ఉంది. వీటితోపాటు మంచినీటి చేపలు లేదా అక్వేరియం చేపలను కూడా కలిపి ఆక్వాపోనిక్స్ పద్ధతిలో సాగు చేయవచ్చని స్వానుభవంతో చెబుతున్నారు డా. ఎన్ఎంకే సూరి. బాల్కనీల్లో, టైల పైన, పెరట్లో మట్టి లేకుండానే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఔషధ మొక్కలు పెంచుకోవాలంటే సులువైన విధానం హైడ్రోపోనిక్స్. కొబ్బరి పొట్టులో వర్మీకంపోస్టు(2:1 నిష్పత్తిలో) కలిపి సేంద్రియ ఇంటిపంటగా రసాయన రహిత ఆహారాన్ని పెంచుకోగల అవకాశాలు మెండు. తక్కువ నీటి వసతి ఉన్న చోట ఈ పద్ధతి బాగా ఉపయోగ పడుతుంది. ఆక్వాపోనిక్ పద్ధతి ద్వారానైతే.. ప్రత్యేకంగా నీరు పోయాల్సిన శ్రమ ఉండదు. అదనంగా చేపలు కూడా పెంచుకోవచ్చు. చేపలు పెంచుకోవడానికి అక్వేరియం ఒకటి ఏర్పాటు చేసుకొని, దానిలో నుంచి చేపల నీటిని పంపు ద్వారా మొక్కలకు అందేలా పైపు అమర్చుకోవాలి. అక్వేరియంలో నీటిని మార్చే శ్రమ కూడా వద్దనుకుంటే, మొక్కలకు అందించిన నీటినే తిరిగి అక్వేరియంలోకి చేరేలా మరో పైపును అమర్చి నిరంతర నీటి ప్రవాహం జరిగే ఏర్పాటు కూడా చేసుకోవచ్చు. అక్వేరియం, మొక్కల కుండీలు, మోటారు పంపు, పైపులు ఏ సైజులో ఎట్లా ఉండాలి? అనేది మీరు ఎంపికచేసుకునే స్థలాన్ని బట్టి ఉంటుంది. తినడానికి పనికివచ్చే మంచినీటి కార్పు చేపలు లేదా అక్వేరియానికి పనికి వచ్చే ఆర్నమెంటల్ ఫిష్ గానీ, మన అవసరాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. మొక్కలను కుండీల్లో పెట్టుకోవచ్చు లేదా వీలైన సైజులో ఒక గ్రోటబ్ను ఏర్పాటు చేసుకోవచ్చు. అందులో అక్వేరియం సామగ్రిని అమ్మే వారి వద్ద దొరికే స్టోన్స్(3/4‘)ను నింపుకొని.. ఆ టబ్‌లో ఆకుకూరలు, కూరగాయ మొక్కలను నాటుకోవచ్చు. పోషకాలు అందేదెలా? చేపల విసర్జితాలు కలిసే నీరే మొక్కలకు ప్రధాన పోషక వనరు. జీవామృతం లేదా వర్మీ వాష్ వంటి ద్రావణ ఎరువులను అదనంగా వాడొచ్చు. ఆకుకూరల మొక్కలకు వారానికోసారి, కూరగాయపంటలకు వారానికి రెండుసార్లు వాడాలి. సాధారణంగా చెరువుల్లో పెరిగే రోహు, తిలాపియా వంటి ఏ చేపలనైనా పెంచొచ్చు. ఇవి ఎదగడానికి 6-9 నెలల కాలం పడుతుంది. ట్యాంకు సైజు ఎంత పెద్దగా ఉంటే చేపలు అంత బాగా పెరుగుతాయి. ఆక్వాపోనిక్స్ను ఇంటి పెరట్లో ఏర్పాటు చేసుకుంటే మంచిది. స్టెయిన్లెస్ స్టీల్ ఆక్వాపోనిక్స్ వ్యవస్థను ఇంట్లో పెట్టుకోవచ్చు. మా టై మీద ప్లాస్టిక్ ట్యాంకులలో 4’్ఠ4’్ఠ4’ ప్రయోగాత్మకంగా ఆక్వాపోనిక్స్ వ్యవస్థను ఏర్పాటు చేసి సత్ఫలితాలు సాధించాను. దీన్ని 30’్ఠ20’ లకు విస్తరింపచేయబోతున్నాను. ఔత్సాహికులు చిన్న అక్వేరియం అంతటి పాత్రలను ఏర్పాటు చేసుకొని సేంద్రియ ఆక్వాపోనిక్స్ పద్ధతిలో అలవాటు చేసుకోవచ్చు. అక్వేరియం చేపలు, మొక్కల పెంపకం గురించి కొంత అవగాహన ఉన్న వారికి ఆక్వాపోనిక్స్ అంతగా కష్టమేమీ అనిపించదు. సేంద్రియ ఇంటిపంటల సాగుపై ఆసక్తి ఉన్న వారికి ఇదొక మంచి ప్రత్యామ్నాయం. - డా. ఎన్ఎంకే సూరి, నాగోల్, హైదరాబాద్ -
ఊరెళ్తున్నారా..?
ఇంటిల్లిపాదీ ఎక్కువ రోజులు ఊరెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు.. ప్రీతిపాత్రమైన ఇంటిపంటలను, పూలమొక్కలను, ఔషధమొక్కలను బతికించుకోవడం ఎలా? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఈ సమస్యకు ‘ఇంటిపంట’ బృంద సభ్యురాలు కాట్రగడ్డ వరూధిని సృజనాత్మకతను జోడించి.. ఖర్చులేని చక్కటి పరిష్కారాన్ని ఆవిష్కరించారు. ఆమె 4 పొడవాటి కుండీల్లో ఆకుకూరలు పెంచుతున్నారు. వీటికన్నా ఎత్తులో ఒక స్టూల్‌పైన బక్కెట్ ఉంచి.. అందులో నీటిని నింపారు. ఒక నూలు తాడును తీసుకొని.. ఒక చివరను బక్కెట్లో వేసి.. రెండో చివరను కుండీలోని మట్టిలో పెట్టారు. కదిలిపోకుండా చిన్న రాయిని కట్టారు. 4 కుండీలకూ ఇలాగే చేశారు. ఆ తాళ్ళ ద్వారా మొక్కల వేళ్లకు అవసరం మేరకు నీటి తేమ అందింది. 12 రోజుల తర్వాత ఆమె ఊరు నుంచి వచ్చి చూస్తే.. బక్కెట్లో చాలా నీరు ఖర్చయింది. ఆకుకూరలు ఏపుగా పెరుగుతూ పలకరించడంతో పట్టలేని సంతోషం కలిగింది! ఆ సంతోషాన్ని ఆమె ‘ఇంటిపంట’ ఫేస్బుక్ గ్రూప్ సభ్యులతో పంచుకున్నారు... ఇంకేముంది లైకుల పంట పండింది! -
పుట్టగొడుగుల సాగు
సేంద్రియ కూరగాయల కన్నా సులభం గ్రీన్హౌస్లో ఏడాది పొడవునా పెంచుకోవచ్చు శుభారంభానికి ఇదే తరుణం టై మీద ఆకుకూరలు, కూరగాయలే కాదు పౌష్టికాహారమైన పుట్టగొడుగులను కూడా సేంద్రియ పద్ధతుల్లో నిక్షేపంగా పెంచుకోవచ్చు. పుట్టగొడుగుల సాగు కష్టమేమో అనుకోకండి. నిజానికి కూరగాయలకన్నా వీటిని పెంచడమే సులభం అంటున్నారు పవిత్ర ప్రియదర్శిని. ‘ఇంటిపంట’ ఫేస్బుక్ గ్రూప్ సభ్యురాలైన పవిత్ర కోయంబత్తూరు నివాసి. రసాయనాలు వాడి పెంచిన పుట్టగొడుగులు కొని తినడం ఇష్టం లేక.. తన ఇంటిపైనే చిన్న గ్రీన్హౌస్ ఏర్పాటు చేసి సేంద్రియ పద్ధతుల్లో పుట్టగొడుగులు పెంచుతున్నారామె.. ‘కాస్త మనసు పెట్టి ప్రణాళికతో పనిచేస్తే చాలు.. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ ఇంటిపట్టునే పుట్టగొడుగుల పెంపకం చేపట్టవచ్చు. ఇంటర్నెట్ ద్వారా అధ్యయనం చేసిన జ్ఞానంతో.. ఆయిస్టర్ పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించా. బటన్ పుట్టగొడుగుల కంటే ఆయిస్టర్ పుట్టగొడుగులు పెంచడం తేలిక...’ అంటున్నారామె. తెల్ల, లేత ఎరుపు పుట్టగొడుగులను ఆమె పెంచుతుండడం విశేషం. టైపై సేంద్రియ పుట్టగొడుగుల పెంపకానికి కావాల్సినవి 1. వరి గడ్డి 2. ఆయిస్టర్ మష్రూమ్ స్పాన్(విత్తనం) 3. ప్లాస్టిక్ బ్యాగ్‌లు గడ్డి బ్యాగ్‌ల తయారీ ఇలా... వరి గడ్డిని చిన్న ముక్కలు చేయాలి. వాటిని పెద్ద పాత్రలో వేసి నీరుపోసి మూతపెట్టి.. చిన్న మంట మీద గంట సేపు ఉడకబెట్టాలి. చల్లారిన తర్వాత న్యూస్‌పేపర్ నేలపై పరచి.. దానిపై గడ్డిని వేసి.. నీరు పూర్తిగా కారిపోయే వరకు ఆరబెట్టాలి. ప్లాస్టిక్ బ్యాగ్‌లు తీసుకొని 3 అంగుళాల ఎత్తు వరకు గడ్డిని నొక్కి పెట్టాలి. గుప్పెడు స్పాన్‌ను తీసుకొని.. గడ్డి బ్యాగ్ అంచుల్లో వేయండి. ఆపైన 2 అంగుళాల మందాన మళ్లీ గడ్డిని నింపండి. గడ్డిపైన అంచుల్లో మళ్లీ స్పాన్ వేయండి... ఈ విధంగా 3 పొరలుగా వేయండి. చివ రన గడ్డి పొర వేసి ప్లాస్టిక్ బ్యాగ్ మూతిని బిగుతుగా కట్టేయాలి.ప్లాస్టిక్ బ్యాగ్‌పైన, చుట్టూతా, అడుగున కొన్ని బెజ్జాలు పెడితే గడ్డికి గాలి తగులుతుంది. పుట్టగొడుగుల పెంపకం ఇలా... మీ ఇంట్లో ఒక మూలన చీకటిగా, చల్లగా ఉండే చోటులో.. అది కాంక్రీటు షెల్ఫ్ కావచ్చు, కప్బోర్డు కావచ్చు లేదా మంచం కింద పెట్టె కావచ్చు.దాని శుభ్రం చేసి, దాని లోపల అంతటా డెటాల్ నీటితో శుభ్రం చేసి.. తడి ఆరనివ్వండి. గడ్డి బ్యాగ్‌లను అందులో పెట్టి... నల్లని వస్త్రం లేదా గోనెసంచితో కప్పండి.వాతావరణం వేడిగా ఉన్నట్లయితే.. ఆ వస్త్రం లేదా గోనెసంచిపై రోజుకు రెండుసార్లు నీటిని చిలకరించి తడిగా ఉండేలా చూడండి. 3,4 రోజుల్లో స్పాన్ ఉన్న చోట తెల్లని బూజులాంటిది(మైసీలియం) కనిపిస్తుంది. బ్యాగ్‌లో ఏమైనా ఆకుపచ్చని బుడిపెల్లాంటివి ఏమైనా కనిపిస్తున్నాయేమో చూడండి. అలాంటివి ఉంటే చెడిపోయినట్లు లెక్క. అటువంటి బ్యాగ్‌ను తీసి పక్కకు పెట్టేసి.. ఆకుపచ్చగా ఉన్న చోట బ్యాగును కత్తిరించి చిటికెడు ఉప్పును చల్లండి. అంతా సవ్యంగా ఉంటే.. 2 వారాల్లో బ్యాగ్ మొత్తం తెల్లగా పొరతో నిండిపోతుంది. అప్పుడు బ్యాగులను బయటకు తీసి, శుభ్రమైన కత్తి మొనతో బ్యాగ్‌పై ఎక్స్ ఆకారంలో గాట్లు పెట్టి.. ఇంట్లోనే నీడపట్టున కొంచెం వెలుతురుగా ఉండే చోట పెట్టాలి. రోజుకు 3-5 సార్లు నీటిని చిలకరించాలి.నేనైతే మేడ మీద గ్రీన్ షేడ్‌నెట్‌తో షెడ్డు వేశాను. షెడ్డులో ముందువైపు చాలా ఖాళీ వదిలేసి, ఒక మూలకు గ్రీన్షేడ్నెట్తో చిన్న గదిలాగా ఏర్పాటు చేశాను. దాని పైన, బయటి వైపు కొబ్బరి ఆకులు కప్పాను. లోపల గోనె సంచులను వేలాడదీశాను. గోనె సంచులను చల్లదనం కోసం మధ్యాహ్న వేళల్లో నీటితో తడుపుతూ ఉంటాను. బ్యాగ్‌లకు గాట్లు పెట్టిన చోట్ల బుడిపెలు పెరుగుతూ ఉంటాయి. అవి తేమ ఆరిపోకుండా రోజుకు 5 సార్లు నీటిని చల్లుతుండాలి. 3 నుంచి 5 రోజుల్లో ఈ బుడిపెలు పుట్టగొడుగులుగా విస్తరిస్తాయి.{Xన్హౌస్లో 28-30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూడాలి. వేడి వాతావరణంలోనూ పుట్టగొడుగులు పెంచవచ్చు. గ్రీన్హౌస్లో నేల మీద ఇసుకపోసి తడుపుతూ ఉంటే చల్లగా ఉంటుంది. పుట్టగొడుగుల అంచులు కిందికి వంగి ఉండగానే.. కోసి కూరవండుకుంటే రుచిగా ఉంటాయి. ముదిరితే అంచులు పైకి ముడుచుకుంటాయి. అప్పుడు రుచి తగ్గుతుంది. పుట్టగొడుగుల పెంపకంలో పరిశుభ్రత చాలా ముఖ్యం. పుట్టగొడుగుల పెంపకం ప్రారంభానికి అనువైనది శీతాకాలమే. ఇంకెందుకు ఆలస్యం..!(పుట్టగొడుగుల పెంపకంపై సందేహాలుంటే పవిత్ర ప్రియదర్శిను 099941 20017 నంబరులో ఏ రోజైనా మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆంగ్లంలో మాత్రమే సంప్రదించగలరు.) - సేకరణ: ఇంటిపంట డెస్క్ -
రైతులుగా మనం చేస్తున్నదేమిటి?
ప్రకృతి వనరుల పట్ల నిర్లక్ష్యం రైతు ప్రాణాల మీదకొస్తోంది. భారీ పెట్టుబడులతో వాణిజ్య పంటలు వేయడంతో వ్యవసాయం జూదంలా మారింది. రసాయనిక ఎరువులు భూసారాన్ని, నీటి ఎద్దడిని తట్టుకునే శక్తిని నశింపజేస్తే.. జన్యుమార్పిడి పత్తి పంట తేనెటీగలను మింగేస్తోంది. రైతులు ప్రాథమ్యాలు మార్చుకుంటేనే భవిష్యత్తు బాగుపడుతుందంటున్నారు సరస్వతి కవుల. ఈ ఏడాది వ్యవసాయం కరువు హెచ్చరికల మధ్య మొదలై రైతులను నట్టేట ముంచింది. రోహిణీ కార్తెలో మంచి వర్షంతో ఖరీఫ్ మొదలైంది. మే ఆఖరులోనే పొలాలు దున్ని విత్తనాలేశారు. కానీ చినుకు జాడ లేక మొలిచిన పంటలు ఎండిపోయాయి. ఆగస్టు నెల సగంలో వర్షం పడితే, మరోసారి విత్తనాలేశారు. మళ్లీ వర్షాలు మొహం చాటేశాయి. హుదూద్ తుపాను వచ్చినప్పుడు జల్లులు తప్ప సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు వర్షాల్లేవు. రైతులు భారీ పెట్టుబడులు పెట్టి నష్టపోయారు. మాది రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తి. అదృష్టం కొద్దీ నేను ఆగస్టులో కంది పంట వేశాను. మాది సేంద్రియ వ్యవసాయం కావటంతో.. మళ్లీ వర్షం పడే వరకు భూమిలో తేమ నిలిచే ఉంది. పూత కూడా బాగావచ్చింది. అయితే, ఇటీవల కురిసిన దట్టమైన మంచు దెబ్బకు పూత రాలిపోయింది! గుడ్డిలో మెల్ల ఏమిటంటే.. ఎకరానికి నేను పెట్టిన పెట్టుబడి రూ. 3 వేలు మాత్రమే. మా పక్కన పొలం గల రైతు పత్తి, మొక్కజొన్న, టొమాటోలు వేశాడు. ఎకరానికి రూ. 70 వేల నుంచి లక్ష వరకు ఖర్చు పెట్టి.. భారీగా నష్టపోయాడు. ఎకరానికి రూ. పది వేలు తిరిగొచ్చినా వచ్చినట్లే అన్నట్లుంది పరిస్థితి. వాన దేవుడు కరుణించలేదు.. బోర్లన్నీ ఎండిపోయాయంటూ జీవనాధారం కోల్పోయి రైతులు బాధపడుతున్నారు. అయితే, భూమాతను, ప్రకృతిని మనం ఏనాడైనా పట్టించుకున్నామా? అని నా తోటి రైతులందర్నీ నేను నిలదీసి అడగదలచుకున్నాను. మనం చేస్తున్న తప్పిదాలేమిటి? ఎక్కువ దిగుబడి, ఎక్కువ ఆదాయం వస్తుందన్న ఆశతో యూరియా, డీఏపీ వంటి రసాయనిక ఎరువులను భూమిలో చాలా ఎక్కువ వేసేస్తున్నాం. రసాయనిక ఎరువులు విడుదల చేసే కర్బన ఉద్గారాలే భూమి వేడెక్కడానికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పచ్చని చెట్లు కరువైపోతున్నాయి. మా ప్రాంతంలో గట్టు మీద చెట్టు కనిపిస్తే చాలు.. నరికి అమ్మేసి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. దీన్ని ఆపకుండా ఉష్ణోగ్రత మరీ ఎక్కువగా ఉందని మొత్తుకోవడంలో అర్థం ఏముంది? ఈ ఏడాది బెట్టకు మెట్ట పంటలు నిలువునా ఎండిపోయాయి. కూరగాయల రైతులు తమ తోటలను కాపాడుకోవడానికి పదేపదే తడులు పెట్టాల్సి వస్తున్నది. క్వారీలు గుట్టలను గుల్ల చేస్తున్నాయి. ఈ కాలుష్యం వల్ల రేడియేషన్ ఎక్కువై వేడి పెరిగిపోతోంది. ఈ కారణంగా భూగర్భ నీటి పాయలు చెదిరిపోతున్నాయి. వాటర్షెడ్లన్నీ దెబ్బతిని చెరువులు నిండని దుస్థితి వచ్చింది. రైతులు ఈ విషయాన్ని కూడా ఆలోచించాలి. కాస్త నీళ్లుంటే నాట్లెయ్యడమేనా? బోరులో కాస్త నీళ్లున్నాయంటే వెనుకా ముందూ చూడకుండా వరి నాట్లేస్తున్నారు. నీటి వాడకం ఎక్కువై భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. బోర్ల మీద బోర్లు వేస్తూ రైతులు అప్పులపాలవుతున్నారు. వర్షం నీటిని సంరక్షించుకొని భూమిలోకి ఇంకింపజేస్తేనే తిరిగి నీరు వాడుకోవడానికి ఇబ్బంది ఉండదు. గుట్టలు, చెరువులు, అడవులతోపాటు చెట్టు చేమను కంటికి రెప్పల్లా కాపాడుకోవాలి. ఈ విషయాలను బొత్తిగా పట్టించుకోకుండా బోర్లు ఎండిపోకుండా బాగుంటాయా? చెప్పండి! నీళ్లు లేకుండా పంటలెట్ల పండిస్తం అనుకోవచ్చు. కానీ, కందులు, పెసలు, మినుములు, కొర్రలు, ఉలవలు, ఆముదాల వంటి సంప్రదాయ పంటలు వేసుకుంటే తక్కువ నీళ్లతోనే చక్కగా పండుతాయి కదా. భూమి అతిగా వేడెక్కడానికి రసాయనిక ఎరువుల వాడకం ఓ ముఖ్య కారణం. వీటిని వాడకపోతే వాతావరణ మార్పులూ సమసిపోతాయి. రసాయనిక ఎరువులు వేయకుండా వ్యవసాయం చేస్తే.. వానపాములు, మట్టిలో ఉండే మేలు చేసే సూక్ష్మజీవులు చైతన్యవంతమై భూమిని సారవంతం చేస్తాయి. పచ్చిరొట్ట లేదా పశువుల ఎరువులు వేస్తే చాలు. అప్పుల బారిన పడాల్సిన అవసరం అంతగా ఉండదు. ఏతావాతా చెప్పేదేమంటే.. చెట్లను, అడవులను, భూములను రక్షించుకుంటూ.. తక్కువ నీటితో పండే పంటలనే సాగు చేసుకోవాలి. మిశ్రమ పంటలు, అంతర పంటలు వేసుకుంటూ.. పంటల మార్పిడి చేస్తే భూమి సారవంతమవుతుంది. జన్యుమార్పిడి పత్తి సాగు వల్ల తేనెటీగలు, ఇతర జీవులు అంతరించిపోతున్న విషయం స్వయంగా గుర్తించాను. రెండేళ్ల క్రితం మా పక్కన పొలంలో బీటీ పత్తి సాగు మొదలైంది. ఈ ఏడాది తేనెటీగల జాడే లేదు. అవి లేకపోతే పంటల్లో పరపరాగ సంపర్కం జరిగేదెలా? పశ్చిమ బెంగాల్లో ఈ సమస్యను అధిగమించడానికి రైతులు తేనెటీగల మాదిరిగా తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి ఆడ, మగ మొక్కల పూలను చేతులతో రుద్దుతున్నారట. కానీ, ప్రకృతిసిద్ధంగా తేనెటీగలు చేసే పనిని మనం ఎంతని చేయగలుగుతాం చెప్పండి? ఇది లాభదాయకమైన వ్యవసాయమేనా? ఇంకో మౌలికమైన ప్రశ్న నా మదిలో మెదులుతూ ఉంది. రసాయనిక వ్యవసాయం లాభదాయకమైనదేనా? జూదంలా మారిన వ్యవసాయం రైతుల ఉసురు తీస్తున్నది. ఆహార పంటలు వేసుకుంటే ఇక్కడి మార్కెట్లోనే అమ్ముకోవచ్చు. పత్తి వంటి అంతర్జాతీయ వాణిజ్య పంటలు పండిస్తే.. అంతర్జాతీయ మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుంది. మరోవైపు, రసాయనాలతో పండించిన ఈ ఆహారం మనల్ని రోగగ్రస్తులుగా మార్చుతోంది. ఆస్పత్రి ఖర్చులు పెచ్చుమీరిపోయాయి. గర్భసంచిలో గడ్డలు, కీళ్లనొప్పులు, కిడ్నీ జబ్బులు.. కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు ఎక్కువైపోయాయి. రసాయనిక వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రతిఫలంగా దక్కుతున్నదేమిటో మనకు అర్థమవుతోందా? ఇటువంటి రోగగ్రస్థ వాతావరణంలో మన భావి తరాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలమా? అందుకే మన ప్రాథమ్యాలపై పునరాలోచన చేయాలి. భూమిని ‘డబ్బు యంత్రం’లా కాకుండా.. తరతరాలకు జీవంపోసే ‘నేలతల్లి’గా పరిగణించాలి. (వ్యాసకర్త: సేంద్రియ మహిళా రైతు, సామాజిక కార్యకర్త) -
ఇక ద్రోన్ల శకం!
పంటల స్థితిగతులపై తాజా సమాచారాన్ని చప్పున తెలుసుకునేందుకు అత్యాధునిక ద్రోన్లను వినియోగించడం సంపన్న దేశాల్లోనే కాదు.. మన దేశంలోనూ ప్రారంభమైంది. బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ప్లాంట్‌పెథాలజీ విభాగం అద్దె పద్ధతిన ద్రోన్లను అందుబాటులోకి తెచ్చింది. చిన్న విమానం మాదిరిగా ఉండి గాలిలో ఎగురుతూ నిర్దేశిత పనిని చక్కబెట్టే ఈ పరికరాన్ని ద్రోన్ లేదా క్వాట్రా క్యాఫ్టర్ అని అంటారు. వేరుశెనగ వంటి చిన్న పంటల నుంచి కొబ్బరి, వక్క, కాఫీ వంటి ఉద్యాన తోటలకు చీడపీడలేమైనా సోకాయా? తీవ్రత ఎలా ఉంది? వంటి విషయాలను తక్కువ సమయంలో తెలుసుకోవచ్చని విశ్వవిద్యాలయం చెబుతోంది. 45 నిమిషాలు చార్జ్ చేస్తే ఈ పరికరం 20 నిమిషాల పాటు గాలిలో ఎగరగలుగుతుంది. గంటకు ఒక ఎకరా విస్తీర్ణంలోని పంటల పరిస్థితిని పరిశీలించవచ్చు. దీనికి అమర్చి ఉండే కెమెరా పంటను వీడియో తీసి ఎప్పటికప్పుడు పంపిస్తుంది. ఆ దృశ్యాలను కంప్యూటర్లో చూస్తూ పరిస్థితిని అంచనా వేయవచ్చు. విస్తారంగా కొబ్బరి, వక్క, సరుగుడు వంటి తోటలు సాగు చేసే రైతులకు.. వ్యవసాయ పరిశోధన, విస్తరణ సేవలకు ద్రోన్ ఉపయుక్తంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా కూడా ఈ ద్రోన్ను నియంత్రించవచ్చు. అతివృష్టి, అనావృష్టి వంటి సందర్భాల్లో పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి, రైతులు అప్పటికప్పుడు అనుసరించదగిన వ్యవసాయ సూచనలు, సలహాలివ్వడానికి.. బాధిత రైతులను త్వరితగతిన ఆదుకోవడానికి కూడా ద్రోన్ ఉపకరిస్తుందని చెబుతున్నారు. దీనికి రోజుకు అద్దె రూ. పది వేలు! ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు రైతులు దీని సేవలు వినియోగించుకున్నారట. మరిన్ని వివరాలకు: బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్లాంట్‌పెథాలజీ విభాగాన్ని సంప్రదించవచ్చు. ఫొన్: 080 23330153, 23636826 - సజ్జేంద్ర కిషోర్, సాక్షి, బెంగళూరు -
ఇంటిపంట’ స్ఫూర్తితో... మేడపైనే పండ్లు, కూరగాయలు!
ఆదిలాబాద్ పట్టణానికి చెందిన గృహిణి రేణుక తమ మేడపైన పచ్చని ఫుడ్ ఫారెస్ట్‌ను సృష్టించారు. వ్యవసాయ శాస్త్రంలో పట్టా పుచ్చుకున్న ఆమె ‘ఇంటిపంట’ స్ఫూర్తితో ఆర్గానిక్ కిచెన్ గార్డెన్ ప్రారంభించారు. తమ కుటుంబం కోసం ఆరోగ్యదాయకమైన పండ్లు, కూరగాయలను పండిస్తున్నారు. అప్పుడప్పుడూ ఇరుగు పొరుగు వారికీ రుచిచూపిస్తున్నారు. ఈ టై తోటను మెచ్చిన ‘చిన్న పిచ్చుక’ అందులోనే ఓ బుజ్జి గూడు కట్టుకుని.. సంతానం వృద్ధి చేసుకుంది! ఆదిలాబాద్‌లోని ద్వారకానగర్‌లో వ్యాపారి అరుణ్‌కుమార్ ఖత్రి (9849267774), రేణుక ఖత్రి కుటుంబం మూడంతస్తుల సొంత భవనంలో నివాసం ఉంటోంది. బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకొని గృహిణిగా జీవనం కొనసాగిస్తున్న రేణుకకు పూల మొక్కలంటే ఇష్టం. అయితే, నాలుగేళ్ల క్రితం ‘సాక్షి’లో ఇంటిపంట కాలమ్ చదివిన తర్వాత ఆమె దృష్టి సేంద్రియ ఇంటిపంటల వైపు మళ్లింది. హైదరాబాద్ కల్యాణ్‌నగర్‌కు చెందిన వేగేశ్న రామరాజు గారి టై గార్డెన్‌పై కథనం చదివి.. స్వయంగా వెళ్లి చూసి స్ఫూర్తి పొందానని ఆమె తెలిపారు. అప్పటి నుంచి తమ మేడ మీద సేంద్రియ పద్ధతుల్లో పండ్లు, కూరగాయలు సాగు చేయడం ప్రారంభించారు. ‘ఇంటిపంట’ కాలమ్ అందిస్తున్న మెలకువలు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయన్నారు. కాంక్రీటు మేడల మధ్య వీరి టై పచ్చగా అలరారుతోంది. 100 చదరపు గజాల టైపై 25 ప్లాస్టిక్ డ్రమ్ములు, 40 మట్టి కుండీలు ఏర్పాటు చేసి రేణుక నిక్షేపంగా ఇంటిపంటలు పండిస్తున్నారు. నల్లమట్టి, ఎర్రమట్టి, ఆవు పేడ ఎరువు, వరిపొట్టు, వేపపిండి, వర్మీకంపోస్టుతో కూడిన మట్టి మిశ్రమాన్ని వాడుతున్నారు. సీతాఫలం, జామ, నిమ్మ, బత్తాయి, దానిమ్మ, అల్లనేరేడు, ఉసిరి, సపోట, మామిడి, రేగు తదితర 15 రకాల పండ్ల చెట్లతోపాటు వివిధ కూరగాయ మొక్కలు, ఔషధ, సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన మొక్కలను సేంద్రియ పద్ధతుల్లో పెంచుతున్నారు. రెండేళ్లుగా సొంత పండ్లు, సొంత కూరగాయలపైనే ఎక్కువగా వాడుతున్నామని రేణుక వివరించారు. వంటింటి వ్యర్థాలతో తయారైన కంపోస్టుతోపాటు జీవామృతాన్ని సొంతంగా తయారు చేసి కిచెన్ గార్డెన్‌కు 15 రోజులకోసారి వాడుతున్నారు. నాటు విత్తనాలతోనే టమోటా, గోరుచిక్కుడు, మిరప, చిక్కుడు, బీర, కాకర, వంగ, బెండ, చేమగడ్డ, మునగ, గోంగూర, కొత్తిమీర, మెంతికూర, ఇతర ఆకుకూరలు సాగు చేస్తున్నారు. తమ ఇంటిపంటను అప్పుడప్పుడూ ఇరుగు పొరుగుకీ పంచుతున్నారు. భర్త సహాయ సహకారాల్లేకుండా ఇంటిపంటల సాగు సాధ్యమయ్యేది కాదని, ఆయన తోడ్పాటుతోనే హైదారాబాద్, కడియం నర్సరీల నుంచి కోరుకున్న మొక్కలు తెప్పించుకుంటున్నానన్నారు రేణుక. సంధ్యా సమయాల్లో టై తోట పక్షుల కిలకిలారావాలతో సందడిగా ఉంటుంది. పల్లెటూరు వాతావరణాన్ని తలపిస్తూ మానసికోల్లాసాన్ని కలిగిస్తోందన్నారు రేణుక. గత ఏడాది నాగమల్లి చెట్టుపై చిన్న పిచ్చుకలు గూడు పెట్టడం.. మూడు పిల్లల్ని చేయడం.. తమ ‘ఇంటిపంట’లో మరువలేని మధుర జ్ఞాపకంగా మిగిలిందని ఆమె తృప్తిగా చెప్పారు. - కొండా శ్రీనివాస్, ఆదిలాబాద్