కాలువ నీటిపై తేలాడే ఇంటిపంటలు !
సృజనకు హద్దులు లేవని తెలిపేందుకు ఈ నీటిపై ఇంటిపంటల పెంపకం మంచి ఉదాహరణ. ప్రకృతి అందాలకు నెలవైన కేరళలో కాలువల్లోని నీటిపై ఇంటిపంటలు పండిస్తూ అబ్బురపరుస్తున్నాడు ఓ యువకుడు. ఇంటి పక్క నుంచి వెళుతున్న కాలువనే అతను ఇంటిపంటల సాగుకు వినియోగిస్తున్నాడు. మోకాలి లోతు నీరు గల కాలువలో వెదురు బొంగులతో తెప్పలు తయారు చేశాడు. వాటిపై చెక్క పెట్టెలు ఉంచి, జారిపోకుండా తాళ్లతో బిగించి కడతారు.
చెక్క పెట్టెల్లో మట్టి, సేంద్రియ ఎరువు మిశ్రమాన్ని నింపి ఇంటిపంటలు పెంచుతున్నారు. తెప్పకు నాలుగు వైపులా నిలువుగా కర్రలు కట్టి వాటి ఆసరాతో తీగెలు పైకి పాకేలా ఏర్పాటు చేశారు. ఇలా కాలువ నీటిలో తెప్పలపై పదుల సంఖ్యలో పెట్టెల్లో ఇంటిపంటలు పండిస్తూ చూపరులను ఆశ్చర్యచకితులను చేస్తున్నాడు.