Organic manure
-
బంజరు భూమిని బంగరు భూమి చేసింది
‘కలిసి ఉంటేనే కాదు కష్టపడితే కూడా కలదు సుఖం’ అని అనుభవపూర్వకంగా తెలుసుకుంది సంతోష్ దేవి.తన రెక్కల కష్టంతో బంజరు భూమిని బంగరు భూమిగా మార్చింది. ఎంతోమంది రైతులను తన మార్గంలో నడిపిస్తోంది.రాజస్థాన్‌లోని సికార్ జిల్లా బేరి గ్రామంలో... 1.25 ఎకరాల బంజరు భూమితో సంతోష్ దేవి ఖేదార్ ప్రయాణం ప్రారంభమైంది. కుటుంబం వీడిపోవడంతో తన భర్త వాటాగా 1.25 ఎకరం భూమి వచ్చింది. భర్త రామ్ కరణ్ హోంగార్డ్. చాలీచాలని జీతం. దీంతో వ్యవసాయం వైపు మొగ్గు చూపింది సంతోష్‌దేవి.‘పది, ఇరవై ఎకరాలు ఉన్నవారికే దిక్కు లేదు. ఎకరంతో ఏం సాధిస్తావు? అప్పులు తప్ప ఏం మిగలవు!’ అన్నారు చాలామంది. ఈ నేపథ్యంలో ‘వ్యవసాయం లాభసాటి వ్యాపారం’ అని నిరూపించడానికి రంగంలో దిగింది సంతోష్ దేవి.‘నేను చదువుకోవాలని మా నాన్న కోరుకున్నారు. గ్రామీణ వాతావరణాన్ని ఇష్టపడే నాకు చదువుల కంటే వ్యవసాయం అంటేనే ఇష్టం’ అంటుంది సంతోష్‌దేవి. తాతగారి పొలంలో ఎప్పుడూ రసాయనిక ఎరువులు వాడకున్నా మంచి దిగుబడి వచ్చేది. ఇక్కడ మాత్రం భిన్నమైన పరిస్థితి. చాలా ఏళ్లుగా రసాయనాలు వాడడం వల్ల పొలం నిస్సారంగా మారింది. చుట్టు పక్కల నీటి వనరులు లేకపోవడంతో జొన్న, సజ్జలాంటి సంప్రదాయ పంటలే పండించేవారు.కలుపు మొక్కలతో గందరగోళంగా ఉన్న పొలాన్ని ఒక దారికి తేవడంతో మొదటి అడుగు వేసింది. రసాయనిక ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువులు వాడాలని నిర్ణయించుకుంది. దానిమ్మ పండించమని, తక్కువ భూమిలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని సికార్ వ్యవసాయ అధికారి సలహా ఇచ్చాడు. ఆ సలహా వారి జీవితాన్నే మార్చేసింది.220 దానిమ్మ మొక్కలను కొనడానికి గేదెను అమ్మేయాల్సి వచ్చింది. మొక్కలు కొనగా మిగిలిన డబ్బుతో పొలంలో గొట్టపు బావిని వేయించింది. నీటి ఎద్దడి ఉన్న ఆప్రాంతంలో బిందు సేద్య పద్ధతిని నమ్ముకుంది. చుక్క నీరు కూడా వృథా చేయవద్దని నిర్ణయించుకుంది. జనరేటర్‌ను అద్దెకు తీసుకుంది. గ్రామంలోని ఎంతోమంది రైతుల సలహాలు తీసుకొని సేంద్రియ ఎరువు తయారీ మొదలుపెట్టింది. లేయర్ కటింగ్, సేంద్రియ పురుగు మందులకు బెల్లం కలపడంలాంటి రకరకాల టెక్నిక్‌ల గురించి తెలుసుకుంది. మూడేళ్ల కఠోర శ్రమ ద్వారా దానిమ్మ పండ్ల తొలి దిగుబడితో మూడు లక్షల లాభం వచ్చింది. సేంద్రియ ఎరువును ఎక్కువగా వాడడం వల్ల నేల సారవంతంగా మారింది.భర్త పోలీస్‌స్టేషన్ నుంచి వచ్చిన తరువాత, పిల్లలు స్కూలు నుంచి వచ్చిన తరువాత నేరుగా పొలానికే వెళ్లేవాళ్లు. ‘ఫలితం ఎలా ఉండబోతుందో తెలియదు. కాని బాగా కష్టపడాలనుకున్నాం’ అని ఆ రోజులను గుర్తు చేసుకుంది సంతోష్‌దేవి. పండ్లతోటను నిర్వహించే అనుభవం రావడంతో యాపిల్‌లాంటి ఇతర పండ్లను పండించడంపై దృష్టి పెట్టింది.దానిమ్మ మొక్కల మధ్య నిర్దిష్టమైన దూరం ఉండాలి. ఆ ఖాళీ స్థలంలో కలుపు లేకుండా చూడాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఖాళీల మధ్య మోసంబి మొక్కలు నాటింది. ఇది కూడా మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఆ తరువాత నిమ్మ నుంచి బెల్‌లాంటి ఎన్నో మొక్కలను నాటింది. పొలంలో సోలార్ ΄్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడంతో ఖర్చు తగ్గింది.‘మన దేశంలో రైతులు పడుతున్న కష్టాలకు కారణం వారు పండిస్తున్న దానికి సరైన ధర లభించకపోవడమే. దళారులు లాభాలన్నీ అనుభవిస్తున్నారు’ అంటున్న సంతోష్‌దేవి ఒక్క పండును కూడా దళారులకు అమ్మదు. అన్ని పండ్లూ నేరుగా పొలంలోనే అమ్ముతారు.సంతోష్ సాధించిన విజయాన్ని చూసి గ్రామంలోని ఇతర రైతులు కూడా దానిమ్మ మొక్కలను పెంచడంప్రారంభించారు. అయితే చాలామంది విఫలమయ్యారు. అలాంటి వారు సంతోష్‌దేవిని సలహా అడిగేవారు. నాణ్యమైన మొక్కల కొరత వల్లే వారు విఫలమవుతున్నారు అని గ్రహించిన సంతోష్ దేవి ఆ లోటును భర్తీ చేయడానికి కొత్త మొక్కల కోసం ‘షెకావది కృషి ఫామ్ అండ్ నర్సరీ’ప్రారంభించింది.కష్టఫలంనేను, నా భర్త, పిల్లలు మాత్రమే పొలంలో పనిచేసేవాళ్లం. కూలీలతో పనిచేయించే స్థోమత మాకు లేదు. అయితే ఎప్పుడూ కష్టం అనుకోలేదు. ఇంట్లో ఎలా సంతోషంగా ఉంటామో, పొలంలో అలాగే ఉండేవాళ్లం. కబుర్లు చెప్పుకుంటూనే కష్టపడేవాళ్లం. మా కష్టం ఫలించినందుకు సంతోషంగా ఉంది.– సంతోష్‌దేవి -
స్వచ్ఛ బడి.. సేంద్రియ సిరి
సాక్షి, సిద్దిపేట : సిద్దిపేటలో ఏర్పాటు చేసిన ‘స్వచ్ఛ బడి’ సత్ఫలితాలు ఇస్తోంది. పట్టణంలోని ఒకటి రెండు కాదు, ఏకంగా 3 వేలకు పైగా ఇళ్లలో చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. ఈ ఎరు వును ఇంటిమేడపై సాగు చేస్తున్న మిద్దె తోటలకు వినియోగిస్తున్నారు. స్వచ్ఛ బడి ద్వారా నేర్చుకున్న పాఠాలను ఆచరణలో పెట్టి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. చెత్త ఒక వ్యర్థం కాదని నిరూపిస్తు న్నారు. ఇదే విధానాన్ని అందరూ అవలంబిస్తే పర్యావరణ కాలుష్యానికి కళ్లెం వేయడంతో పాటు చెత్త, డంపింగ్ యార్డుల సమస్యను చాలావరకు అధిగమించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ స్వచ్ఛబడిని సందర్శించిన మంత్రి కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి బడులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. స్వచ్ఛ బడి అంటే.. సిద్దిపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2021 ఏప్రిల్ 10న ఈ స్వచ్ఛ బడిని ప్రారంభించారు. ఎకరానికి పైగా విస్తీర్ణంలో దేశంలోనే రెండోదైన స్వచ్ఛ బడిని మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేశారు. ఇది అ..అంటే అమ్మ, ఆ..అంటే ఆవు లాంటి పదాలు ఇతర పాఠాలు బోధించే బడి కాదు. పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, పునర్వినియోగంపై ఆరేళ్ల నుంచి అరవై ఏళ్ల వయసు గల వారికి పాఠాలు చెప్పే బడి. ఒకేసారి 50 మంది క్లాస్ వినే విధంగా దీనిని ఏర్పాటు చేశారు. వర్మీ కంపోస్టు యార్డు, పక్కనే పార్కు, డిజిటల్ తరగతి గది, హోం కమ్యూనిటీ కంపోస్టింగ్ ఏర్పాటు చేశారు. సేంద్రియ ఎరువుల ద్వారా పండించే కూరగాయల తోట పెట్టారు. ప్లాస్టిక్‌తో కలిగే అనర్థాల గురించి తెలిసేలా చిత్రాలను వేశారు. ఇందులో పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, పునర్వినియోగంపై బోధించడంతో పాటు పనికి రాని వస్తువులతో వివిధ రకాల వస్తువులను తయారు చేయడం, ఖాళీ సీసాలతో స్వాగత తోరణాలు, వెదురు బొంగులతో ప్రహరీ ఏర్పాటు చేయడంపై శిక్షణ ఇస్తున్నారు. ఫోర్ ఆర్ పై శిక్షణ.. తడి, పొడి, హానికరమైన చెత్తను వేరు చేయడం, ఫోర్ ఆర్.. అంటే రీయూజ్ (పునర్వినియోగం), రీసైకిల్ (తిరిగి తయారీ), రెఫ్యూజ్ (నిరాకరించడం), రెడ్యూస్ (తగ్గింపు) చేయడం కూడా నేర్పిస్తున్నారు. జీరో వేస్ట్ మేనేజ్మెంట్, తడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారీపై ప్రత్యక్షంగా వివరిస్తున్నారు. ఇలా ఒక్క క్లాస్ రెండున్నర గంటల పాటు ఉంటుంది. ఈ బడిలో ఇప్పటివరకు 8వేల మందికి పైగా పాఠాలు విన్నారు. రాష్ట్రం నలుమూ లల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల వారు విదేశీ యులు సైతం సందర్శించి స్వచ్ఛ బడి గురించి తెలుసుకుంటున్నారు. 15 మున్సి పాలిటీలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు క్లాస్‌లు విన్నారు. బెంగళూరుకు చెందిన డాక్టర్ శాంతి పర్యవేక్షణలో స్వచ్ఛ బడి కొనసాగు తోంది. తడి చెత్తతో ఎరువు.. ప్రతి రోజూ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెత్త బండ్లు పట్ట ణంలోని గృహాలకు తిరిగి తడి, పొడిచెత్తను వేర్వేరుగా సేకరిస్తుంటాయి. పట్టణంలోని 43 వార్డుల్లో 41,322 గృహాలు, 1,57,026 జనాభా ఉంది. ఇందులో 3 వేలకు పైగా ఇళ్లలో తడి చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. కేవలం పొడి, హానికరమైన చెత్తను మాత్రం చెత్తబండికి అందజేస్తున్నారు. ఇలా ఇంట్లోనే తయారు చేసే సేంద్రియ ఎరువుతో కూరగాయలు బాగా కాస్తుండటంతో పట్టణవాసులు క్రమంగా దీని తయారీకి మొగ్గు చూపుతున్నారు. సేంద్రియ ఎరువుతో కూరగాయల సాగు స్వచ్ఛ బడిలో పర్యావరణ పరిరక్షణ కోసం క్లాస్‌లు విన్నాను. అప్పటి నుంచి మా ఇంటి నుంచి తడి చెత్తను మున్సిపాలిటీ బండికి ఇవ్వడం మానేశా. దాన్ని ఉపయోగించి ఇంట్లోనే సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నా. దీనిని మిద్దెతోటలోని మొక్కలకు వేయడంతో కూరగాయలు, పూలు బాగా కాస్తున్నాయి. – గుడాల జ్యోతి, ప్రైవేట్ స్కూల్ టీచర్, సిద్దిపేట భవిష్యత్ తరాల కోసం.. బెంగళూరులో జీరో వేస్ట్ మేనేజ్ మెంట్ గురించి తెలుసుకు న్నాం. డాక్టర్ శాంతి చెప్పిన మాటలు మాకు స్ఫూర్తిని ఇచ్చాయి. మంత్రి హరీశ్‌రావు చొరవతో సిద్దిపేటలోస్వచ్ఛ బడిని ఏర్పాటు చేసి పట్టణవాసులకు అవగాహన కల్పిస్తు న్నాం. భవిష్యత్ తరాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని దీనికి శ్రీకారం చుట్టాం. – దీప్తి నాగరాజు, కౌన్సిలర్, స్వచ్ఛ బడి నిర్వాహకురాలు -
భూసారాన్ని కాపాడితేనే ఆరోగ్యం
సాక్షి, సిద్దిపేట: ‘భూమి బాగుంటే మనిషి బాగుంటాడు. రసాయనిక ఎరువులు ఎక్కువ వినియోగించడంతో సమాజంలో కేన్సర్ వేగంగా విస్తరిస్తోంది. భూ సారాన్ని కాపాడుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం’ అని ఆర్థిక, వైద్య, ఆరోగ్య మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట పత్తి మార్కెట్ ఆవరణలో భూ మిత్ర.. మన తడిచెత్త–మన సేంద్రియ ఎరువు – మన నేల అనే నినాదంతో ‘సిద్దిపేట కార్బన్ లైట్స్’ సేంద్రియ ఎరువును మార్కెట్లోకి మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇది సిద్దిపేట మున్సిపాలిటీలోని 41,322 మంది ప్రజల విజయమన్నారు. ఇదంతా నిత్యం తడి, పొడి, హానికరమైన చెత్త వేర్వేరుగా ఇవ్వడంతోనే సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్, జెడ్పీ చైర్పర్సన్ రోజారాధాకృష్ణ శర్మ, పర్యావరణవేత్త డాక్టర్ శాంతి పాల్గొన్నారు. తొలి బ్యాగ్ కొన్న మంత్రి.. సిద్దిపేట బ్రాండ్‌తో తయారైన జీవ సంపన్న సేంద్రియ ఎరువు తొలి బ్యాగును మంత్రి హరీశ్‌రావు కొనుగోలు చేశారు. సిద్దిపేట శివారులోని తన పొలంలో వినియోగించేందుకు రూ.37వేలు చెల్లించి 125 బ్యాగుల ఎరువును కొనుగోలు చేశారు. మా భూమి సారం పెరిగింది సార్ మాది చిన్న కోడూరు మండలం రామునిపట్ల గ్రామం. నా పేరు కృప మంత్రి హరీశ్‌రావు: ఎన్ని ఎకరాల భూమి ఉందమ్మ? కృప: నాకు నాలుగెకరాల భూమి ఉంది. మూడున్నర ఎకరాల్లో వరి, అరెకరంలో కూరగాయలు సాగు చేస్తున్న. మంత్రి: సేంద్రియ ఎరువుతో సాగు చేస్తున్నావా? కృప: అవును సార్.. ఆరు నెలల నుంచి సేంద్రియ ఎరువుతోనే పండిస్తున్న. మంత్రి: ఇప్పటివరకు ఎన్ని బస్తాలు తీసుకున్నావు కృప: శాంపిల్‌గా ఇచ్చిన 25 బస్తాలను తీసుకున్నాను సార్. సేంద్రియ ఎరువుతో సాగు చేయడంతో మార్కెట్లో మా కూరగాయలకు బాగా డిమాండ్ ఉంటుంది. ఇటీవల చిక్కుడు కాయ తెంపినం. మార్కెట్లో అందరూ కిలో రూ.35కు అమ్మితే నేను రూ.40కిలో అమ్మాను. మంత్రి: నీకు ఆదాయం పెరగడంతో పాటు ఆరోగ్యం కాపాడుతున్నావు అమ్మ. శభాష్.. -
కొబ్బరి పొట్టు.. సేంద్రియ కంపోస్టు!
పంట పొలంలో, కుండీ మట్టిలో నీటి తేమను ఎక్కువ కాలం పట్టి ఉంచడానికి శుద్ధి చేసిన కొబ్బరి పొట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. శుద్ధి చేసే ప్రక్రియలో గతంలో రసాయనాలను వాడేవారు. అయితే, కేంద్ర కాయిర్ బోర్డు రసాయనాలు వాడకుండా కొబ్బరి పొట్టును శుద్ధి చేసి సేంద్రియ ఎరువులా పంటలకు వాడుకునే వినూత్న పద్ధతిని ఇటీవల రూపొందించింది. కృషీవల కొబ్బరి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఈ పద్ధతిలో సేంద్రియ కంపోస్టును తయారు చేస్తూ.. కొబ్బరి రైతులకు మంచి మార్గాన్ని చూపుతోంది. కొబ్బరి పంట రైతుకు అనేక విధాలుగా ఆదాయాన్ని అందిస్తుంది. కాయలతోపాటు కాండం, ఆకులు, ఈనెలు, చిప్పలు, డొక్కలు.. ఇలా అన్నీ రైతులకు ఉపయోగపడుతూ ఆదాయాన్నందించేవే. కొబ్బరి డొక్కల నుంచి ‘పీచు’ తీసి.. ఆ పీచుతో అనేక ఉత్పత్తులను తయారు చేస్తారు. కేజీ పీచు తీసేటప్పుడు సుమారు 6 నుంచి 8 కేజీల కొబ్బరి పొట్టు వస్తుంది. ఇలా వచ్చిన పొట్టును నేరుగా వ్యవసాయంలో వినియోగించకూడదు. దీనిలో కర్బనం–నత్రజని నిష్పత్తి మొక్కలకు అనుకూలంగా ఉండదు. ‘లెగ్నిన్’ అధిక మోతాదులో ఉండటం వలన దీన్ని నేరుగా మొక్కలకు వేస్తే పంటలకు హాని జరుగుతుంది. ఎలక్ట్రిక్ కండక్టవిటీ(ఈసీ)ని తగ్గించాలి. దీన్ని శుద్ధి చేసి కంపోస్టుగా మార్చి వేసుకుంటే పంటలకు మేలు జరుగుతుంది. కొబ్బరి పొట్టు రైతుకు మేలు చేసే విధంగా తయారు చేసుకోవడంలో వివిధ పద్ధతులు, విధానాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. సెంట్రల్ కాయిర్ బోర్డు ‘ఫ్లూరోటస్ సాజర్ కాజూ’అనే శీలింధ్రాన్ని ఉపయోగించి పొట్టును వేగంగా కుళ్లబెట్టే ప్రక్రియను అభివృద్ధి చేసింది. తొలినాళ్లలో ఈ శిలీంధ్రం, రాతి భాస్వరం పొరలు, పొరలుగా వేసి కుళ్లబెట్టేవారు. తరువాత కొద్దిపాటి యూరియాను పొరల మధ్య చల్లడం ద్వారా మరింత వేగంగా పొట్టును కుళ్లబెట్టవచ్చని తేల్చారు. ఈ కొత్త పద్ధతిలో రసాయనిక పదార్థాలకు బదులు.. ఫ్లూరోటస్ సాజర్ కాజూ, అజోల్లా, వేపపిండిలను వినియోగిస్తూ వేగంగా కొబ్బరి పొట్టును కుళ్లబెట్టే విధానం అభివృద్ధి చేశారు. ఇటీవల కోనసీమలో కొంతమంది రైతులు ఏర్పాటు చేసుకున్న కృషీవల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో చేసిన ప్రయోగం సత్ఫలితాన్నిచ్చింది. కొబ్బరి పొట్టు కంపోస్టును తయారు చేసి రైతులకు, పట్టణాల్లో ఇంటిపంటల సాగుదారులకు అందించడానికి ఈ సంస్థ ఏర్పాట్లు చేసుకుంటున్నది. టన్ను కొబ్బరి పొట్టు (బేబీయార్న్ తొలగించింది), 10 కేజీల అజోల్లా, 30 కేజీల వేపపిండి, 5 కేజీల ఫ్లూరోటస్ సాజర్ కాజూ లను పొరలు, పొరలుగా వేసి తడపటం ద్వారా 30 రోజుల్లో మంచి నాణ్యమైన కొబ్బరి పొట్టు కంపోస్టును తయారు చేస్తున్నారు. ప్రతి రోజూ స్వల్పమోతాదులో నీరు చల్లాల్సి ఉంటుంది. అనంతరం ఈ కొబ్బరి పొట్టు బాగా కుళ్లి మంచి కంపోస్టు ఎరువుగా తయారవుతుంది. శిలీంధ్రం, అజోల్లాలతో శాస్త్రీయ పద్ధతిలో కుళ్లబెట్టిన కొబ్బరి పొట్టు కంపోస్టు వాడటం వల్ల అనేక లాభాలున్నాయి. – నిమ్మకాయల సతీష్‌బాబు, సాక్షి, అమలాపురం కొబ్బరి పొట్టు కంపోస్టుతో ప్రయోజనాలు ► మంచి నీటి నిల్వ సామర్థ్యం కలిగిన సేంద్రియ పదార్థం ► తక్కువ బరువు– విమానాల్లో సైతం రవాణాకు అనుకూలం ► విదేశాలకు ఎగుమతికి క్వారంటెయిన్ ఇబ్బందులు లేవు ► అధిక మోతాదులో పొటాషియంతోపాటు అనేక పోషకాలు కలిగిన సేంద్రియ ఎరువు ► జీవన ఎరువులు, శీలింధ్రనాశనులు కలిపి వినియోగానికి అనుకూల పదార్ధం ► అత్యంత తక్కువ ధరకు లభించే ఎరువు కొబ్బరి తోటలున్న ప్రాంతాల్లో లభించే వ్యర్థ పదార్థం ► సులువైన తయారీ విధానం నూతన ఉపాధి అవకాశాల కల్పనకు తోడ్పడుతోంది ► ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యం పొందవచ్చు ► మిద్దె పంటలు, ఇంటి పంటలకూ అనుకూలమైన సేంద్రియ ఎరువు. భూమిలో నీటి నిల్వ సామర్ధ్యం పెరుగుతుంది కొబ్బరి పొట్టు కంపోస్టును వినియోగించడం ద్వారా పంట భూమిలో నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచుకునే అవకాశముంది. మెట్ట, నీటి సౌలభ్యం తక్కువుగా ఉన్న మాగాణి భూముల్లో మంచి పంటలు పండించుకోవచ్చు. దీని తయారీ విధానం, ఖర్చు చాలా తక్కువ. మంచి పోషకాలు కలిగిన కంపోస్టును మొక్కలకు అందించేందుకు ఇది దోహదపడుతుంది. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే ఖరీదైన ఉత్పత్తులకన్నా.. కొబ్బరి పొట్టుతో పెద్దగా ఖర్చులేకుండా సేంద్రియ పద్ధతిలో కంపోస్టును తయారు చేసుకొని వినియోగించుకోవచ్చు. – అడ్డాల గోపాలకృష్ణ (94402 50552), కన్వీనర్, రైతుమిత్ర రూరల్ టెక్నాలజీ పార్కు, అమలాపురం అజొల్లా -
గుర్రపు డెక్కతో సేంద్రియ ఎరువు!
సరస్సులు, చెరువులు, సాగు నీటి కాలువల్లో ఇబ్బడిముబ్బడిగా పెరిగే గుర్రపు డెక్కతో చక్కని సేంద్రియ ఎరువు తయారు చేసే పద్ధతిని హైదరాబాద్‌లోని భారతీయ రసాయన సాంకేతిక సంస్థ(ఐ.ఐ.సి.టి.) శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ టెక్నాలజీతో తొట్టతొలిగా హైదరాబాద్‌లోని కాప్రా చెరువులో నుంచి తొలగించిన గుర్రపు డెక్క మొక్కలతో సేంద్రియ ఎరువును తయారు చేయడంలో ఖాన్ ఎనర్జీ సంస్థ సఫలీకృతమైంది. గుర్రపు డెక్క మొక్క మురుగు నీటిలో నుంచి విషపూరిత పదార్థాలను గ్రహిస్తుంది. అయితే, ఇది చెరువు మొత్తాన్నీ ఆక్రమించెయ్యడం వల్ల నీటి నాణ్యతకు, జలచరాల మనుగడకు గొడ్డలిపెట్టుగా మారింది. ఈ నేపధ్యంలో ఈ సమస్యాత్మక మొక్కలను పునర్వినియోగించడంపై ఐ.ఐ.సి.టి. శాస్త్రవేత్తలు రెండేళ్ల పాటు జరిపిన పరిశోధనలు విజయవంతమయ్యాయి. నీటిలోని విషపూరిత పదార్థాలను గుర్రపుడెక్క మొక్క తన వేర్లలోనే నిల్వ ఉంచుకుంటుంది. కాబట్టి, ఈ వేర్లతో తయారు చేసిన సేంద్రియ ఎరువు కేవలం పూల మొక్కలకు వాడుకోవాలి. అదేవిధంగా, గుర్రపు డెక్క మొక్కల కాండం, ఆకులతో తయారు చేసే సేంద్రియ ఎరువును అధికాదాయాన్నిచ్చే కూరగాయలు, ఉద్యాన పంటలకు వాడుకోవచ్చని ఖాన్ ఎనర్జీ సంస్థ ప్రతినిధి కె. లక్ష్మీనారాయణ(93923 75756) ‘సాక్షి’కి తెలిపారు. గుర్రపు డెక్క మొక్కల కాండం, ఆకులను సేకరించి ముక్కలు చేసి.. ఐ.ఐ.సి.టి. శాస్త్రవేత్తలు తయారు చేసిన బాక్టీరియల్ కల్చర్, పేడ కలిపి 45 రోజులు నిల్వ ఉంచితే ఎరువుగా మారుతుంది. భారతీయ ఎరువుల సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా ఐ.ఐ.సి.టి. శాస్త్రవేత్తలు రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ సేంద్రియ ఎరువులో సాధారణ వర్మీకంపోస్టులో కన్నా అనేక రెట్లు ఎక్కువగా పోషకాలున్నాయని ఆయన తెలిపారు. ఫాస్ఫేటు తప్ప ఇతర పోషకాలన్నీ ఉన్నాయన్నారు. పది కిలోలు వర్మీ కంపోస్టుకు బదులు ఈ ఎరువును కిలో వాడితే సరిపోతుందని, సేంద్రియ కర్బనం పుష్కలంగా ఉందన్నారు. దుర్వాసన ఉండదని, తయారైన ఎరువు ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందన్నారు. కిలో ఎరువు తయారీకి రూ. 18 వరకు ఖర్చయిందని, కిలో రూ. 25 చొప్పున విక్రయించనున్నామని తెలిపారు. బస్తాల్లోకి నింపే ముందు ఆరబెట్టిన కంపోస్టు –కంచికట్ల శ్రీనివాస్, సాక్షి, ఉప్పల్ -
కాలువ నీటిపై తేలాడే ఇంటిపంటలు !
సృజనకు హద్దులు లేవని తెలిపేందుకు ఈ నీటిపై ఇంటిపంటల పెంపకం మంచి ఉదాహరణ. ప్రకృతి అందాలకు నెలవైన కేరళలో కాలువల్లోని నీటిపై ఇంటిపంటలు పండిస్తూ అబ్బురపరుస్తున్నాడు ఓ యువకుడు. ఇంటి పక్క నుంచి వెళుతున్న కాలువనే అతను ఇంటిపంటల సాగుకు వినియోగిస్తున్నాడు. మోకాలి లోతు నీరు గల కాలువలో వెదురు బొంగులతో తెప్పలు తయారు చేశాడు. వాటిపై చెక్క పెట్టెలు ఉంచి, జారిపోకుండా తాళ్లతో బిగించి కడతారు. చెక్క పెట్టెల్లో మట్టి, సేంద్రియ ఎరువు మిశ్రమాన్ని నింపి ఇంటిపంటలు పెంచుతున్నారు. తెప్పకు నాలుగు వైపులా నిలువుగా కర్రలు కట్టి వాటి ఆసరాతో తీగెలు పైకి పాకేలా ఏర్పాటు చేశారు. ఇలా కాలువ నీటిలో తెప్పలపై పదుల సంఖ్యలో పెట్టెల్లో ఇంటిపంటలు పండిస్తూ చూపరులను ఆశ్చర్యచకితులను చేస్తున్నాడు. -
పట్టుదలే.. పెట్టుబడి!
మండల పరిధిలోని బోక్కస్‌గాంకు చెందిన జార పోతిరెడ్డి, సావిత్రి దంపతుల కుమారుడు సంగారెడ్డి అధికారుల సాయంతో వర్మీ కంపోస్టు ఎరువులను తయారు చేస్తున్నాడు. రసాయన మందులు వద్దు సేంద్రియ ఎరువులే ముద్దు అనే సూత్రాన్ని పాటిస్తూ మంచి ఫలితాలు రాబడుతున్నాడు. గ్రామ శివారులో ఇతనికి రెండు చోట్ల 4.26 ఎకరాలు భూమి ఉంది. వ్యవసాయమే జీవనాధారంగా సాగుతూ ఆదర్శ రైతుగా కూడా గుర్తింపు పొందాడు. వ్యవసాయం పట్ల ఆసక్తితో వానపాములతో ఎరువుల తయారీకి శ్రీకారం చుట్టాడు. జేడీఏతోపాటు వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు, అధికారుల మన్ననలు పొందుతున్నాడు. ప్రారంభంలో కష్టాలు... వానపాములతో ఎరువుల తయారీ ప్రారంభ దశలో నెలకొన్న ప్రకృతి వైపరీత్యాల కారణంగా సంగారెడ్డి అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు. ఏడాది క్రితం వర్మీయాచర్ కోసం ఏర్పాటు చేసిన షెడ్డు గాలివాన బీభత్సంతో ధ్వంసమైంది. దీంతో ప్రభుత్వం ఇచ్చిన రాయితీ, రూ.1 లక్ష వరకు సొంత డబ్బులు నష్టపోయాడు. అయినా ధైర్యం కోల్పోకుండా మరోసారి షెడ్డును నిర్మించుకున్నాడు. అప్పటి నుంచి తిరిగి వెనక్కి చూడలేదు. వర్మీ ఎరువు తయారీ విధానం... వర్మీయాచర్ యూనిట్ విలువ రూ.2 లక్షలు ఉంటుంది. దీనికి ప్రభుత్వం 50శాతం సబ్సిడీ ఇస్తుంది. మిగతా ఖర్చును రైతు భరించాల్సి ఉంటుంది. షెడ్డు, 5 బెడ్లు, ఎరువుల నిల్వకు గోదాం నిర్మించాలి. 54 అడుగుల పొడవు, 27 అడుగులు వెడల్పు షెడ్డు నిర్మించాలి. అందులో 50 అడుగుల పొడవు, 4 అడుగులు వెడల్పు, ఒక అడుగు ఎత్తున 5 బెడ్లు నిర్మించాలి. ఒక్కో బెడ్లో 20 కిలోల చొప్పున వానపాములు (ఐదు బెడ్లలో కలిపి క్వింటాలు) వేయాలి. వీటికి ఆహారంగా వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలు, చెత్త, ఆకులు, పేడ, పండ్ల తొక్కలు, కూరగాయల వ్యర్థాలు వేయాలి. మూడు నెలల్లో ఎరువు తయారవుతుంది. వానపాముల ఎరువుల సరఫరా కోసం వ్యవసాయ శాఖ అధికారులు రైతు సంగారెడ్డికి ఆర్డరు ఇచ్చారు. 126 బెడ్లకు సరిపోయేన్ని వానపాములను పంపిణీ చేసేందుకు ఆయన శ్రమిస్తున్నాడు. సొంత పొలంలో వర్మీ ఎరువుల వాడకం... వానపాములతో తయారు చేసిన ఎరువులను సంగారెడ్డి ఇతర రైతులకు సరఫరా చేస్తున్నాడు. సొంత భూమిలో క్రమంగా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ వర్మీకంపోస్టునే వాడుతున్నాడు. ఖరీఫ్‌లో ఒక ఎకరం కావేరి కేవీ 21 రకం వరి సాగు చేశాడు. మరో 20 గుంటల్లో సాయిరాం సన్న రకం వరి వేశాడు. మరి కొంత మొక్కజొన్న, కూరగాయలు సాగు చేపట్టాడు. వీటన్నింటికీ తన షెడ్లో తయారైన ఎరువులనే వినియోగిస్తున్నాడు. దిగుబడులు ఆశాజనకం గా ఉన్నాయి. వర్మీకంపోస్టు, సేంద్రియ ఎరువులతో సంగారెడ్డి పండించిన కూరగాయలు, బియ్యాన్నే ఇంట్లో వాడుతున్నాడు. ఇతను పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేం దుకు పలువురు ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. వర్మీ ఎరువులు తీసుకెళ్లేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు బోక్కస్‌గాంకు వస్తున్నారు. వ ర్మీఎరువును రూ.6 కిలో చొప్పున విక్రయిస్తున్నట్లు ఆయన తెలిపాడు. ఇప్పటి వరకు తాను రూ.1 లక్ష వరకు లాభం పొందానని చెప్పాడు. వ్యవసాయం ఉన్న మక్కువతో తన రెండో కొడుకు విష్ణువర్ధన్‌రెడ్డిని అగ్రీకల్చర్ డిప్లొమా చదివించాడు. వర్మీయూనిట్లను ఏర్పా టు చేసుకునే వారికి సలహాలిస్తానని చెప్పారు. -
వంగ బంగారమే
* సీతాఫలం, కలబంద, వేపాకుల కషాయంతో పురుగులు పరారీ * సింథటిక్ రసాయనాల అవసరం లేదు * ప్రకృతి సేద్య పద్ధతిలో పూర్తిగా విషరహితమైన పంట * సేంద్రియ ఎరువుతో దీటైన దిగుబడి ఎప్పుడో ఏళ్లనాటి మాట. ఒక ఊరిలో ఇద్దరు అత్తాకోడళ్లు.. అత్తగారు కాకిని తోలిన ఎంగిలి చేయిని కూడా కోడలి ముందు విదిల్చేది కాదట. అంత వేధించి వేపుకు తింటున్నా.. కోడలు కొడిగడుతున్న ప్రాణాలు కండ్లలో పెట్టుకొని కాపాడుకుంటూ బతుకెళ్లదీస్తున్నది. ఇంతలో అత్తగారికి కాలం మూడింది. మహిషవాహనుడి పరివారం వచ్చి అమ్మా.. ఇక్కడి నీ పెత్తనానికి సెలవిచ్చి మాతో తరలిరా అని ఆదేశించారట. మంచం మీద వాలి యమభటుల ఆదేశాలందుకొని అలాగే కనుమూసుకొందట. కోడలు నాడి పట్టుకు చూసి అత్త పుటుక్కుమందని గ్రహించేసింది. ఎన్నాళ్ల నుంచో అన్నపానీయాలకు మొహం వాచి పోయి ఉందేమో... అప్పటికే అత్తవారు వండి ఉట్టి మీద పెట్టిన వంకాయ కూర కుండను దించి కంచంలో వేడి అన్నం పెట్టుకొని వంకాయ ముక్కలు అంచుకు ఇంత నెయ్యి వేసుకొని కొసిరి కొసిరి కొరుకుతూ... అత్తో.. అత్తా.. వంకాయ తొడిమి వేయించి తింటున్న లేవమ్మ లే.. నీకింత పెడతమ్మా లేవమ్మ లే.. అంటూ రాని దుఃఖంతో కాకి శోక రాగం అందుకుందట. అప్పటికే యమభటుల వారెంట ఊరుదాటి వెళ్లిన ఆ తల్లి వంకాయ తొడిమ వేపుడు మాట వినగానే భటులవారిని నాలుగు భజాయించి పోండేహె.. వంగతోట ఒడిసిన తరువాత వచ్చి కనపడండి. అప్పటి వరకూ సచ్చినా వచ్చేది లేదు అని దబాయించేసి.. మంచం మీద లేచి కూర్చొని కోడలిని కోటొక్కతిట్లు తిట్టడం మొదలు పెట్టిందట. ఇది కథ. వంకాయ ప్రశస్తిని చెప్పే ఇలాంటి కథలు పుంఖాను పుంఖాలు. వంకాయ అంటే నోరూరని వారెవరూ ఉండరనేది అతిశయోక్తి కాదు. ఇంత ప్రశస్తి పొందిన వంకాయను పండించడం కూడా అంతే గగనం. మనుషులకే కాదు చీడపీడలకు కూడా వంగ తోట ప్రీతి పాత్రమే. అందుకే మొక్క ఆరాకుల దశకు ఎదిగింది మొదలు వివిధ రకాల పురుగులు దాడి మొదలు పెడతాయి. ఇందులో మొదటిది కాండం తొలిచే పురుగు, తరువాత దశలో వచ్చేది కాయతొలిచే పురుగు. చీడపీడల ఉధృతిని గమనించే పెద్దలు వంగ పండించినోడు ఏ పంట సాగుకూ వెనుకాడడన్నారు. వంగ మీద చీడపీడలను అదుపు చేసి ఫలసాయం అందుకో గలిగినవాడు ఏ పంట యాజమాన్యమైనా చేయగలడన్నది పెద్దల మాట. అయితే ఆధునిక వ్యవసాయపద్ధతిలో వంగ పంట తీయాలంటే తోటను నిత్యం పురుగుమందుల్లో జలకాలాడించాల్సిందే. మిరప తరువాత అతి ఎక్కువగా పురుగు మందుల వాడకం వంగ తోటలోనే అన్నది అతిశయోక్తి కాదు. పురుగు మందు చల్లిన మరుసటి రోజే కాయలు కోసి మార్కెట్‌కు తరలించాల్సిన పరిస్థితి. ఎంతో ఇష్టంగా వంకాయను ఆరగించే వినియోగదారుడు దానిలో ఇంకిపోయిన విషాన్ని కూడా భుజిస్తున్న పరిస్థితి. విషరహితమైన వంకాయలు తినాలంటే ప్రకృతి సేద్య విధానమొక్కటే మార్గం. అందుకే ప్రకృతి సేద్య విధానంలో వంగ తోట సస్యరక్షణ నిర్వహణను తెలుసుకుందాం. ఇది ఉష్ణమండలపు కూరగాయ. విటమిన్ ఎ, బి పుష్కలంగా లభించే వంకాయను మధుమేహ రోగులూ తినొచ్చు. సాగు విధానం: వంగసాగుకు దుక్కి చేసేముందే దుక్కిలో పశువుల ఎరువు, కోడి పెంట సమపాళ్లలో వేసుకొని దుక్కి చేసుకోవాలి. వంగ మొక్కలు నాటుకోవడంతో పాటు చుట్టూ ఎరపంటగా ఆముదం వేసుకోవాలి. ఇది క్రిమికీటకాలను ఆకర్షించడం వలన ప్రధాన పంటకు రక్షణలభిస్తుంది. అంతర పంటగా వంగతోటలో ఉల్లి, వెల్లుల్లి వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వలన కాండం తొలిచే పురుగు, కాయతొలిచే పురుగుల బెడద తగ్గుతుంది. అంతర పంటగా సోయకూర వేసుకోవడం మంచిది. ఇది కూడా కాండం తొలిచే పురుగు, కాయతొలిచే పురుగులను దరి చేరనీయదు. మొక్క 50 రోజుల వయసు వచ్చే నాటికి ఎకరాకు 40 కిలోల వేపగింజల చెక్క వేస్తే దిగుబడి పెరుగుతుంది. తామర పురుగుల నివారణకు 4 కిలోల వేపగింజల పొడి, 4 కిలోల సన్నగా తరిగిన కలబందను 100 లీటర్ల నీటిలో 10 రోజుల పాటు ఊరనివ్వాలి. ఈ ద్రావణాన్ని వడకట్టుకొని పిచికారీ చేస్తేతామరపురుగు, ఇతర రసం పీల్చే పురుగుల బెడద ఉండదు. పసుపు పొడి, బూడిద సమపాళ్లలో కలిపి ఉదయం వేళల్లో ఆకుల మీద చల్లితే పచ్చదోమ, తెల్లదోమ దరి చేరవు. వంగ తోటకున్న మరో బెడద పిండినల్లి. దీన్ని సున్నం చల్లి నివారించవచ్చు. మొక్క మొదలుకు వేప చెక్క వేస్తే.. వేరు, కాండం కుళ్లును నివారిస్తుంది. కాండం తొలిచే పురుగు, పెంకు పురుగు, కంపు నల్లిని నివారించడానికి సీతాఫలం, వేపపిండి కషాయం అద్భుతంగా పనిచేస్తుంది. ముద్దగా నూరిన కిలో సీతాఫలం ఆకులు, కిలో వేప చెక్క, 2.5 లీటర్ల ఆవుమూత్రంలో ఒక రోజంతా నానబెట్టాలి. ఈ ద్రావణాన్ని వడకట్టి పిచికారీ చేస్తే కాండం తొలిచే పురుగులతో పాటు అన్ని రకాల కీటకాలు పోతాయి. ప్రకృతి సేద్య విధానం అనుసరిస్తున్న రైతులు అనేక మంది ఈ విధంగా వంగ సాగు సాధ్యమేనని విజయవంతంగా చాటుతున్నారు. - జిట్టా బాల్‌రెడ్డి, సాగుబడి డెస్క్ -
స్వచ్ఛ భారతీయం
‘పరిసరాల పరిశుభ్రత’పై క్లాస్ రూముల్లో చదువుకోవడమే కాదు... దాన్ని ఆచరించి చూపుతున్నారు జూబ్లీహిల్స్ భారతీయ విద్యాభవన్ విద్యార్థులు. పనిలో పనిగా ‘వేస్ట్ మేనేజ్‌మెంటూ’ ఎంచక్కా చేసేస్తున్నారు. రోజూ పాఠశాల పరిసరాల్లోని చెత్తను శుభ్రం చేసి ‘స్వచ్ఛ భారత్’కు బాటలు వేస్తూనే... అదే చెత్తను పోగేసి.. సేంద్రియ ఎరువుగా మార్చి సేద్యం చేస్తున్నారు. ‘పచ్చదనం... పరిశుభ్రత’... భారతీయ విద్యాభవన్‌లోకి అడుగు పెట్టగానే ఆహ్లాదకర దృశ్యం కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. స్కూల్ నుంచి చెత్తనేదే బయటకు వెళ్లదు. రెండు వేల మంది పిల్లలు ఇక్కడ చదువుతున్నా... రోజుకు దాదాపు 20 కిలోల చెత్త వస్తున్నా... ఎక్కడా అపరిశభ్రత కనిపించదు. ఈ చెత్తంతా ఎటు పోతుంది..! సేకరించి... కిచెన్, గార్డెనెంగ్, ప్లాస్టిక్, ఈ వేస్ట్‌గా విభజించి కంపోస్ట్, రీసైక్లింగ్ చేస్తున్నారు. బడిలోనే కాదు.. ఎల్కేజీ బుడతడి నుంచి ఇంట్లో కూడా ఇదే సిస్టమ్ ఫాలో అవుతున్నారు విద్యార్థులు. బయోగ్యాస్ ఉత్పత్తి... పోగుచేసే చెత్తద్వారా బయోగ్యాస్ ఉత్పత్తి చేసి హాస్టల్లో వంటకు ఉపయోగించారు. ఉత్పత్తి సామరా్థ్యాన్ని పెంచాలని ఆవుని కొనుగోలు చేశారు. దాని ద్వారా వచ్చే పేడతో బయోగ్యాస్ తీశారు. ప్రస్తుతం ఈ ఆవుల సంఖ్యకు ఐదుకు పెరగడమే గాక గ్యాస్‌స్థాయీ రెట్టింపయ్యింది. - మహి కంపోస్ట్ ఇలా... - కంపోస్ట్ తయారీకి ఆగా బిన్లను ఎంచుకున్నారు. వీటి వాడకం వల్ల వ్యర్థాల నుంచి దుర్వాసన రాదు. - వెదర్ ప్రూఫ్. ఇరవైయ్యేళ్ల వరకు ఇవి మన్నికగా ఉంటాయి. ఒక్కో బిన్లో 300 కిలోల చెత్త పడుతుంది. - వీటిల్లో కూరగాయలు, పండ్ల వ్యర్థాలు, మిగిలిపోయిన ఆహార పదార్థాలు వేస్తారు. - ఈ బిన్స్‌లో వేసిన కిచెన్ వేస్ట్‌కు కోకోపీట్ కలుపుతారు. - ఉష్ణోగ్రత పెంచేందుకు వీలుగా ఐదు రోజులకోసారి యాగ్జిలేటర్‌ను కలుపుతారు. - బిన్ నిండాక 15 రోజుల్లో వేస్టంతా కుళ్లి కంపోస్ట్‌గా మారుతుంది. - దీన్ని బిన్ నుంచి తీసి మొక్కలకు సేంద్రీయ ఎరువుగా వాడుతున్నారు. - ఇవిగాక డిస్పోజబుల్ గ్లాస్లు, టీ కప్స్, పాలిథిన్ కవర్లను నెలకోసారి రీసైక్లింగ్ చేస్తారు. మనందరి కర్తవ్యం... పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన కర్తవ్యం. అందువల్లే స్కూల్లో చెత్తాచెదారం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. దీనికి స్చచ్ఛ భారత్ ఉద్యమం తోడైంది. విద్యార్థులందరూ దీనిపై అవగాహన పెంచుకుని ఆచరిస్తుండటం వల్లే ఇది సాధ్యమవుతోంది. 100 శాతం వే స్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నాం. - రమాదేవి, ప్రిన్సిపాల్ ప్రకృతికి మేలు... వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా ప్రకృతికి మేలు చే సినవాళ్లమవుతాం. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ, స్కూల్ యాజమాన్యాలు సామాజిక బాధ్యతగా ఆచరించాలి. అప్పుడే స్వచ్ఛ హైదరాబాద్ ఆవిష్కృతమవుతుంది. - అరుణ శేఖర్, వేస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్స ఆర్గనైజర్ మా వంతు సహకారం... స్కూల్లో చెత్త సేకరించి పరిశుభ్రంగా చేయడం మా బాధ్యత. చెత్తతో కంపోస్ట్ చేసి ఇక్కడ పెంచుతున్న మొక్కలకు వాడుతూ సమాజ పరిశుభ్రత కు మా వంతు తోడ్పాటు అందిస్తున్నాం. - విశిష్ట, విద్యార్థిని -
మూడు ‘పూలు’.. ఆరు‘కాయలు’
- సేంద్రియ ఎరువుతో కూరగాయల సాగు - వానపాములు, కుళ్లిన పదార్థాలతో వర్మీకంపోస్టు తయారీ - అధిక దిగుబడి సాధిస్తున్న మోహన్‌రావుపేట యువరైతు రాజుకు ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో ఎకరంలో కూరగాయలు, రెండెకరల్లో మొక్కజొన్న, మిగిలిన రెండెకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. ప్రభుత్వం అందించిన వర్మీ బెడ్స్, సబ్సిడీని ఉపయోగించుకుని స్వయంగా వర్మీకంపోస్టు ఎరువును తయారు చేసుకుంటూ పొలాన్ని సారవంతంగా మార్చుకుంటున్నాడు. పశువుల పేడ, కుళ్లిన పదార్థాలు పోగుచేసి వానపాములను పెంచి రెండు నెలలకోమారు టన్ను సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నాడు. బెండ, వంకాయ సాగు ఎకరం భూమిలో 10 గుంటల్లో వంకాయ, మిగిలిన 30గుంటల్లో బెండ సాగు చేస్తున్నాడు. రెండు నెలలు బెండ, మరో రెండు నెలలు టమాట, ఆర్నెల్లు వంకాయ సాగుచేస్తానని, పంట మార్పిడి తప్పకుండా ఉంటుందంటున్నాడు రాజు. సేంద్రియ ఎరువులతో సాగు చేయడం ద్వారా కూరగాయలు తాజాగా ఉంటాయని, మార్కెట్లోనూ గిరాకీ అధికంగా ఉంటోందని పేర్కొంటున్నాడు. పండించిన కూరగాయలను కోరుట్ల, చుట్టూ పక్కల గ్రామాలకు తీసుకెళ్లి విక్రయిస్తానని, ప్రస్తుతం రేట్లు అధికంగా ఉండడంతో ఆదాయం భారీగానే వస్తోందని పేర్కొంటున్నాడు. ఈయన సిరిసిల్ల మండలం పెద్దబోనాలకు చెందిన కాశెట్టి శ్రీనివాస్. తనకున్న ఎకరం పొలంలో ఆరురకాల కూరగాయలు సాగు చేస్తున్నాడు. బీర, అనపుకాయ, బెండ, టమాట, వంకాయ, మిర్చి, అల్చింత పండిస్తున్నాడు. ఈ రకాలన్నీ 45 రోజుల నుంచే కోతకు వస్తున్నాయి. పెద్ద బోనాల సిరిసిల్లకు సమీపంలో ఉండడంతో రవాణాకు పెద్దగా ఇబ్బంది లేకుండాపోయింది శ్రీనివాస్‌కు. నిత్యం కూరగాయలను మార్కెట్‌కు తరలిస్తూ ఆదాయాన్ని పొందుతున్నాడు. కరువు పరిస్థితుల నేపథ్యంలో కుటుంబ అవసరాలు తీరుతున్నాయంటున్నాడీ రైతు. - సిరిసిల్ల