కొబ్బరి పొట్టు.. సేంద్రియ కంపోస్టు! | Coconut husk as a organic compost! | Sakshi
Sakshi News home page

కొబ్బరి పొట్టు.. సేంద్రియ కంపోస్టు!

Published Tue, Jul 3 2018 3:47 AM | Last Updated on Sat, Sep 15 2018 7:34 PM

Coconut husk as a organic compost! - Sakshi

కొబ్బరి కంపోస్టు తయారు చేసేందుకు ఏర్పాటు చేసిన బెడ్‌

పంట పొలంలో, కుండీ మట్టిలో నీటి తేమను ఎక్కువ కాలం పట్టి ఉంచడానికి శుద్ధి చేసిన కొబ్బరి పొట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. శుద్ధి చేసే ప్రక్రియలో గతంలో రసాయనాలను వాడేవారు. అయితే, కేంద్ర కాయిర్‌ బోర్డు రసాయనాలు వాడకుండా కొబ్బరి పొట్టును శుద్ధి చేసి సేంద్రియ ఎరువులా పంటలకు వాడుకునే వినూత్న పద్ధతిని ఇటీవల రూపొందించింది. కృషీవల కొబ్బరి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఈ పద్ధతిలో సేంద్రియ కంపోస్టును తయారు చేస్తూ.. కొబ్బరి రైతులకు మంచి మార్గాన్ని చూపుతోంది.

కొబ్బరి పంట రైతుకు అనేక విధాలుగా ఆదాయాన్ని అందిస్తుంది. కాయలతోపాటు కాండం, ఆకులు, ఈనెలు, చిప్పలు, డొక్కలు.. ఇలా అన్నీ రైతులకు ఉపయోగపడుతూ ఆదాయాన్నందించేవే. కొబ్బరి డొక్కల నుంచి ‘పీచు’ తీసి.. ఆ పీచుతో అనేక ఉత్పత్తులను తయారు చేస్తారు. కేజీ పీచు తీసేటప్పుడు సుమారు 6 నుంచి 8 కేజీల కొబ్బరి పొట్టు వస్తుంది.  ఇలా వచ్చిన పొట్టును నేరుగా వ్యవసాయంలో వినియోగించకూడదు.  దీనిలో కర్బనం–నత్రజని నిష్పత్తి మొక్కలకు అనుకూలంగా ఉండదు.


‘లెగ్నిన్‌’ అధిక మోతాదులో ఉండటం వలన దీన్ని నేరుగా మొక్కలకు వేస్తే పంటలకు హాని జరుగుతుంది. ఎలక్ట్రిక్‌ కండక్టవిటీ(ఈసీ)ని తగ్గించాలి. దీన్ని శుద్ధి చేసి కంపోస్టుగా మార్చి వేసుకుంటే పంటలకు మేలు జరుగుతుంది. కొబ్బరి పొట్టు రైతుకు మేలు చేసే విధంగా తయారు చేసుకోవడంలో వివిధ పద్ధతులు, విధానాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. సెంట్రల్‌ కాయిర్‌ బోర్డు ‘ఫ్లూరోటస్‌ సాజర్‌ కాజూ’అనే శీలింధ్రాన్ని ఉపయోగించి పొట్టును వేగంగా కుళ్లబెట్టే ప్రక్రియను అభివృద్ధి చేసింది.

తొలినాళ్లలో ఈ శిలీంధ్రం, రాతి భాస్వరం పొరలు, పొరలుగా వేసి కుళ్లబెట్టేవారు. తరువాత కొద్దిపాటి యూరియాను పొరల మధ్య చల్లడం ద్వారా మరింత వేగంగా పొట్టును కుళ్లబెట్టవచ్చని తేల్చారు. ఈ కొత్త పద్ధతిలో రసాయనిక పదార్థాలకు బదులు.. ఫ్లూరోటస్‌ సాజర్‌ కాజూ, అజోల్లా, వేపపిండిలను వినియోగిస్తూ వేగంగా కొబ్బరి పొట్టును కుళ్లబెట్టే విధానం అభివృద్ధి చేశారు. ఇటీవల కోనసీమలో కొంతమంది రైతులు ఏర్పాటు చేసుకున్న కృషీవల కోకోనట్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ ఆధ్వర్యంలో చేసిన ప్రయోగం సత్ఫలితాన్నిచ్చింది.

కొబ్బరి పొట్టు కంపోస్టును తయారు చేసి రైతులకు, పట్టణాల్లో ఇంటిపంటల సాగుదారులకు అందించడానికి ఈ సంస్థ ఏర్పాట్లు చేసుకుంటున్నది. టన్ను కొబ్బరి పొట్టు (బేబీయార్న్‌ తొలగించింది), 10 కేజీల అజోల్లా, 30 కేజీల వేపపిండి, 5 కేజీల ఫ్లూరోటస్‌ సాజర్‌ కాజూ లను పొరలు, పొరలుగా వేసి తడపటం ద్వారా 30 రోజుల్లో మంచి నాణ్యమైన కొబ్బరి పొట్టు కంపోస్టును తయారు చేస్తున్నారు. ప్రతి రోజూ స్వల్పమోతాదులో నీరు చల్లాల్సి ఉంటుంది. అనంతరం ఈ కొబ్బరి పొట్టు బాగా కుళ్లి మంచి కంపోస్టు ఎరువుగా తయారవుతుంది. శిలీంధ్రం, అజోల్లాలతో శాస్త్రీయ పద్ధతిలో కుళ్లబెట్టిన కొబ్బరి పొట్టు కంపోస్టు వాడటం వల్ల అనేక లాభాలున్నాయి.
– నిమ్మకాయల సతీష్‌బాబు, సాక్షి, అమలాపురం

కొబ్బరి పొట్టు కంపోస్టుతో ప్రయోజనాలు
► మంచి నీటి నిల్వ సామర్థ్యం కలిగిన సేంద్రియ పదార్థం
► తక్కువ బరువు– విమానాల్లో సైతం రవాణాకు అనుకూలం
► విదేశాలకు ఎగుమతికి క్వారంటెయిన్‌ ఇబ్బందులు లేవు
► అధిక మోతాదులో పొటాషియంతోపాటు అనేక పోషకాలు కలిగిన సేంద్రియ ఎరువు
► జీవన ఎరువులు, శీలింధ్రనాశనులు కలిపి వినియోగానికి అనుకూల పదార్ధం
► అత్యంత తక్కువ ధరకు లభించే ఎరువు  కొబ్బరి తోటలున్న ప్రాంతాల్లో లభించే వ్యర్థ పదార్థం
► సులువైన తయారీ విధానం  నూతన ఉపాధి అవకాశాల కల్పనకు తోడ్పడుతోంది
► ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యం పొందవచ్చు
► మిద్దె పంటలు, ఇంటి పంటలకూ అనుకూలమైన సేంద్రియ ఎరువు.


భూమిలో నీటి నిల్వ సామర్ధ్యం పెరుగుతుంది
కొబ్బరి పొట్టు కంపోస్టును వినియోగించడం ద్వారా పంట భూమిలో నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచుకునే అవకాశముంది. మెట్ట, నీటి సౌలభ్యం తక్కువుగా ఉన్న మాగాణి భూముల్లో మంచి పంటలు పండించుకోవచ్చు. దీని తయారీ విధానం, ఖర్చు చాలా తక్కువ. మంచి పోషకాలు కలిగిన కంపోస్టును మొక్కలకు అందించేందుకు ఇది దోహదపడుతుంది. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే ఖరీదైన ఉత్పత్తులకన్నా.. కొబ్బరి పొట్టుతో పెద్దగా ఖర్చులేకుండా సేంద్రియ పద్ధతిలో కంపోస్టును తయారు చేసుకొని వినియోగించుకోవచ్చు.

– అడ్డాల గోపాలకృష్ణ (94402 50552), కన్వీనర్, రైతుమిత్ర రూరల్‌ టెక్నాలజీ పార్కు, అమలాపురం


                           అజొల్లా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement