పంట పొలాలపై దాడి చేస్తూ ఆహార భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్న రాకాసి ఎడారి మిడతల సమస్యను అధిగమించే ప్రయత్నంలో భాగంగా పాకిస్తాన్ వినూత్న సేంద్రియ ఎరువు ఉత్పత్తి పథకానికి శ్రీకారం చుట్టింది. తూర్పు ఆఫ్రికా దేశాలు, ఇరాన్ నుంచి వచ్చిన మిడతల గుంపుల దాడితో పాకిస్తాన్, భారత్‌లు గత 30 ఏళ్లలో ఎన్నడూ ఎరుగనంత పంట నష్టాన్ని చవిచూస్తున్న సంగతి తెలిసిందే.
జాతీయ ఆహార భద్రత, పరిశోధన మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని అమలు చేయబోతోంది. గ్రామస్థాయిలో ప్రజల నుంచి మిడతలను కొనుగోలు చేసి, పంట వ్యర్థాలతో కలిపి బయో ఎరువు తయారు చేయడం ద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నది లక్ష్యం. తద్వారా 25% మేరకు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవడంతోపాటు 10–15% వరకు పంట దిగుబడులు పెంచుకోవాలని పాకిస్తాన్ ఆలోచిస్తోంది. మిడతలతో తయారైన సేంద్రియ ఎరువులో నత్రజని 9 శాతం, ఫాస్ఫరస్ 7 శాతం అధికంగా ఉంటాయని పాక్ జాతీయ ఆహార భద్రత, పరిశోధన మంత్రిత్వ శాఖ చెబుతోంది. పరిశోధన, విస్తరణ, అధ్యాపక, పౌర సమాజ ప్రతినిధులను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయనున్నారు. రానున్న 3–4 నెలల్లో ఖోలిస్తాన్, థార్ ఎడారి ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తారు.
మిడతలను కందకాలు తవ్వడం, వలలు వేసి పట్టుకోవటంపై మిడతల బాధిత ప్రాంతాల ప్రజలకు శిక్షణ ఇవ్వనున్నారు. 50 చోట్ల మిడతల సేకరణ కేంద్రాలను తెరవనున్నారు. తొలి ఏడాదే రూ. వంద కోట్ల విలువైన మిడతల కంపోస్టును తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ‘మిడతల వల్ల జరిగే పంట నష్టంలో ఒక్క శాతం తగ్గినా రూ. 3,200 కోట్ల లబ్ధి కలుగుతుంది. లక్ష టన్నుల మిడతలను పట్టుకుంటే 70 వేల టన్నుల కంపోస్టు తయారవుతుంది. సగటున ప్రతి క్రుటుంబం నెలకు రూ. 6 వేల ఆదాయం పొందుతుంది. ప్రాజెక్టు పెట్టుబడి మూడేళ్లలో తిరిగి వచ్చేస్తుంది’ అంటున్నది పాక్ జాతీయ ఆహార భద్రత,పరిశోధన మంత్రిత్వ శాఖ.
సంక్షోభం నుంచి సేంద్రియం!
Published Tue, Jun 30 2020 8:47 AM | Last Updated on Tue, Jun 30 2020 8:47 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment