organic composting
-
కొబ్బరి పొట్టుతో సేంద్రియ ఎరువు! ఎలా తయారు చేసుకోవాలంటే!
How To Prepare Coconut Coir Based Compost: కొబ్బరి పొట్టుతో తయారు చేసిన సేంద్రియ ఎరువు ‘మట్టి లేని సేద్యాని’కి ఉపయోగపడుతోంది. నిస్సారమైన భూముల్లో లేదా సాగుకు నేల అందుబాటులో లేని అర్బన్ ప్రాంతాల్లో నివాస గృహాల పైన, మిద్దెలపైన, గేటెడ్ కమ్యూనిటీల్లోని ఖాళీ స్థలాల్లో.. గ్రో బ్యాగ్‌లలో కొబ్బరి పొట్టు ఎరువు (కంపోస్టు)తో.. కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కల సాగుకు మట్టి లేని సేద్యం ఉపకరిస్తుంది. తామర తంపరగా పట్టణీకరణ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎక్కువ జనం కూడే పట్టణాలు, నగరాల దగ్గర్లోనే తాజా కూరగాయలు, ఆకుకూరల లభ్యతను పెంచడానికి ఈ సేద్యం ఉపయోగకరమని బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) చెబుతోంది. ఆ విశేషాలు ఈ నెల 16న ‘సాక్షి సాగుబడి’లో ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొబ్బరి పొట్టుతో చక్కటి సేంద్రియ ఎరువు తయారీ పద్ధతి గురించి తెలుసుకుందాం.. కొబ్బరి డొక్కల నుంచి ఒక కేజీ పీచును వేరు చేసే క్రమంలో 6 నుంచి 8 కేజీల కొబ్బరి పొట్టు వస్తుంది. ఈ ముడి పొట్టును నేరుగా వ్యవసాయంలో వినియోగించకూడదు. ముడి కొబ్బరి పొట్టులోని ‘కర్బనం–నత్రజని’ నిష్పత్తి మొక్కలకు అనుకూలం కాదు. దీనిలో ‘లెగ్నిన్’ కూడా అధిక మోతాదులో ఉంటుంది. అందువల్ల దీన్ని కుళ్లబెట్టకుండా నేరుగా వాడితే మొక్కలకు హాని జరుగుతుంది. కొబ్బరి పొట్టును ఒక శిలీంధ్రం కలిపి కుళ్లబెడితే సేంద్రియ ఎరువుగా మారుతుంది. మట్టి లేని సేద్యానికే కాకుండా.. సాధారణ పొలాల్లో పంటల సాగులో కూడా సేంద్రియ ఎరువుగా వాడుకోవచ్చు. కొబ్బరి పొట్టును సులువుగా సేంద్రియ ఎరువుగా మార్చే ప్రక్రియను సెంట్రల్ కాయిర్ బోర్డు ప్రమాణీకరించింది. ‘ఫ్లూరోటస్ సాజర్ కాజూ’అనే శీలింధ్రాన్ని ఉపయోగించి పొట్టును వేగంగా కుళ్లబెట్టే ప్రక్రియను కాయిర్ బోర్డు రైతులకు పరిచయం చేసింది. రసాయనిక పదార్థాలు వాకుండా ఫ్లూరోటరస్ సాజర్ కాజూ, అజొల్లా, వేప పిండినివినియోగిస్తూ వేగంగా కొబ్బరి పొట్టును కుళ్లబెట్టే విధానం ఇది. కోనసీమ రైతుల ‘కృషీవల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ’ కొబ్బరి పొట్టు ఎరువును తయారు చేస్తోంది. కొబ్బరి పొట్టు ఎరువు తయారీకి కావలసిన పదార్ధాలు: ►టన్ను కొబ్బరి పొట్టు (బేబీయార్న్ తొలగించినది) ►10 కేజీల అజొల్లా ∙30 కేజీల వేప పిండి. ►5 కేజీల ఫ్లూరోటస్ సాజర్ కాజూ శిలీంధ్రం. ►వీటిని పొరలు, పొరలుగా వేసి తడుపుతూ ఉంటే నెల రోజుల్లో బాగా చివికిన కొబ్బరి పొట్టు ఎరువు తయారవుతుంది. ►ఫ్లూరో టస్ సాజార్ కాజూ శిలీంధ్రం ధవళేశ్వరంలోని కాయిర్ బోర్డు రీజనల్ కార్యాలయంలో లభిస్తుంది. కొబ్బరి పొట్టుతో కంపోస్టు తయారీ ఇలా.. ►ఒక టన్ను కొబ్బరి పొట్టుకు 12 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు, 2 అడుగుల ఎత్తున బెడ్ తయారు చేసుకోవాలి. ►ముందుగా 200 కేజీల కొబ్బరి పొట్టును సమతలంగా, నీడగా ఉన్న ప్రదేశంలో ఒక పొరలా వేయాలి. ►దీనిపై నీరు చిలకరించి (సుమారు 20 లీటర్లు) ఒక కేజీ ఫ్లూరోటస్ సాజర్ కాజూ శిలీంధ్రాన్ని వెదజల్లాలి. ►దీనిపై మళ్లీ 200 కేజీల పొట్టు వేయాలి. పొట్టు వేసిన తరువాత అజోల్లా, వేపపిండి మిశ్రమం 20 కేజీలు వేయాలి. ►20 లీటర్ల నీరు పోసి మళ్లీ 200 కేజీల పొట్టు వేయాలి ►తరువాత ఫ్లూరోటస్ సాజర్ కాజు 2 కేజీలు వేసి నీరు చల్లి, తిరిగి 200 కేజీల పొట్టు వేయాలి. ►తరువాత నీటితో తడపాలి. ►మరోసారి మిగిలిన 20 కేజీల అజొల్లా, వేప పిండి మిశ్రమం, ఫ్లూరోటస్ శిలీంధ్రం 2 కేజీలు చల్లి.. దానిపై నీరు చిలకరించి, మిగిలిన 200 కేజీల కొబ్బరి పొట్టును వేసి నీరు చల్లాలి. ►కనీసం 30 రోజులు దీనిపై ప్రతి రోజూ స్వల్పమోతాదులో నీరు చల్లి తడపాల్సి ఉంది. ►నెల రోజుల్లో పొట్టు బాగా కుళ్లి మంచి ఎరువుగా తయారవుతుంది. ►కొబ్బరి పొట్టు ఎరువు తయారీకి మరో పద్ధతి కూడా ఉంది. ►గైలరిసీడియా (గిరిపుష్పం) చెట్ల ఆకులు, గోమూత్రం కలిపిన పశువుల పేడ, ముడి కొబ్బరి పొట్టును పొరలుపొరలుగా వేసి కుళ్లబెట్టినా కొబ్బరి పొట్టు కంపోస్టు తయారవుతుంది. ►అయితే, ఈ పద్ధతిలో రెండు నెలల సమయం పడుతుంది. – నిమ్మకాయల సతీష్‌బాబు, సాక్షి అమలాపురం చదవండి: Sagubadi: కూరగాయల్లోనూ ‘డ్యూయల్ గ్రాఫ్టింగ్’! ఒకే మొక్కకు రెండు అంట్లు! Organic Farming: 34 ఎకరాల భూమిలో ప్రకృతి సేద్యం.. ఆరోగ్యసిరిగా...! -
గోకృప అమృతంతో ఎరువు చేసేదెలా?
పంచగవ్య, జీవామృతం, వేస్ట్ డీ కంపోజర్.. వంటి ద్రావణాలు లేనిదే ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం అడుగు ముందుకు పడదు. ఈ జాబితాలో ఇప్పుడు కొత్తగా ‘గోకృప అమృతం’ ద్రావణం వచ్చి చేరింది. భూసారం పెంపుదలకు, చీడపీడల నివారణకూ ఇది ఉపయోగపడుతుందని.. ఇదొక్కటి ఉంటే చాలు యూరియా, డీఏపీ, విష రసాయనాల అవసరమే ఉండదని ‘గోకృప అమృతం’ ఆవిష్కర్త గోపాల్ భాయ్ సుతారియా చెబుతున్నారు. ఎకరానికి ప్రతి ఏటా దేశీ ఆవు పేడతో తయారు చేసిన ఎరువు 4 వేల కిలోలు వేసి, ఎకరానికి నెలకు ఒకసారి 1,500 లీటర్ల గోకృప అమృతం ద్రావణం ఇస్తూ ఉంటే.. చక్కని దిగుబడులు వస్తాయని ఆయన అంటున్నారు. ఇప్పటికే 65 రకాల స్వల్పకాలిక పంటలు, పండ్ల తోటలపై అనేక రాష్ట్రాల్లో వాడిన రైతులు చక్కని ఫలితాలు పొందుతున్నారన్నారు. గోపాల్ భాయ్ చెబుతున్న పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేయడానికి ‘ప్రతి ఎకరానికి ఒక దేశీ ఆవు’ అవసరమవుతుంది.. గోకృప అమృతం! గోకృప అమృతం.. తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయ వర్గాల్లో ఇప్పుడు వినిపిస్తున్న కొత్త మాట ఇది. పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. సుభాష్ పాలేకర్ ‘జీవామృతం’ను ప్రాచుర్యంలోకి తెచ్చిన కనీసం పదేళ్ల తర్వాత.. వేస్ట్ డీ కంపోజర్ నాలుగేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించి.. దేశవిదేశాల్లో అతి తక్కువ కాలంలోనే విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ‘గోకృప అమృతం’ (ప్రోబయోటిక్ బాక్టీరియల్ కల్చర్) కొద్ది నెలల క్రితం రైతుల ముందుకు వచ్చింది. అహ్మదాబాద్ (గుజరాత్) లోని బన్సీ గిర్ గోశాల వ్యవస్థాపకులు గోపాల్ భాయ్ సుతారియా దీన్ని రూపొందించి, ఉచితంగా రైతులకు అందిస్తున్నారు. తాము శాస్త్రవేత్తలు, ఆయుర్వేద నిపుణులు, రైతుల తోడ్పాటుతో చాలా సంవత్సరాల పాటు పరిశోధనలు చేసి గోకృప అమృతంను రూపొందించాం అని ఆయన అంటున్నారు. దేశీ ఆవు పేడ, మూత్రం, పాలు, పెరుగు, నెయ్యిలలోని మేలుచేసే 70 రకాల సూక్ష్మజీవరాశికి మరో 21 రకాల ఓషధులను సమన్వయపరచి గోకృప అమృతాన్ని రూపొందించామన్నారు. ఇది భూమికి, పంటలకే కాకుండా మనుషులు ఇతర జీవరాశికి కూడా మేలు చేస్తుందని చెబుతున్నారు. ‘గోకృప అమృతం’ తయారీ పద్ధతి దాదాపుగా వేస్ట్‌డీకంపోజర్ ద్రావణం మాదిరిగానే ఉంటుంది. గోకృప అమృతం మదర్ కల్చర్ (తోడుగా వేసే మూల ద్రావణం) ఒక లీటరును 200 లీటర్ల నీటిలో పోసి, రెండు కిలోల బెల్లం, 2 లీటర్ల దేశీ ఆవు తాజా మజ్జిగ కలపాలి. రోజూ కలియదిప్పాలి. ఐదారు రోజుల్లో ‘గోకృప అమృతం’ వాడకానికి తయారవుతుంది. ‘పంచగవ్యాలలోని సూక్ష్మజీవులు, ఔషధ మొక్కల రసాలతో కూడినది కావటం వల్ల మళ్లీ ఆవు పేడ, మూత్రం జోడించాల్సిన అవసరం లేదు. గుజరాత్‌తోపాటు మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో దీన్ని కొద్ది నెలలుగా చాలా మంది రైతులు వాడి సత్ఫలితాలు పొందారు సుమారు 65 పంటలపై ప్రయోగాలు జరిగాయని, రైతులతోపాటు శాస్త్రవేత్తలు సైతం దీనిపై ఆసక్తి చూపిస్తున్నార’ని గోపాల్ భాయ్ అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిగా సిద్ధిపేట జిల్లా మర్రిముచ్చలలో ఇటీవల గ్రామభారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ‘గోకృప అమృతం’ పరిచయ సభ జరిగింది. సభకు హాజరైన వందలాది మందికి ఒక్కో లీటరు చొప్పున గోకృప అమృతం ద్రావణాన్ని ఉచితంగా పంచి పెట్టారు. సమస్త వ్యవసాయ రసాయనాల బెడద నుంచి గోకృప అమృతం రైతులకు, భూమాతకు సంపూర్ణంగా విముక్తి కలిగించగలదని గోపాల్ భాయ్ ఆశిస్తున్నారు. తన మాటలను రైతులు గుడ్డిగా నమ్మవద్దని అంటూ.. జీవామృతం, వేస్ట్‌డీకంపోజర్, గోకృప అమృతాలను పక్కపక్కనే మడుల్లో వేర్వేరుగా వాడి, స్వయంగా తమ పొలంలో ఫలితాలను కళ్లారా చూసి, సంతృప్తి చెందిన తర్వాతే పంట పొలాల్లో వాడుకోవాలని గోపాల్ భాయ్ సూచిస్తున్నారు. రైతులు ఎలా స్పందిస్తారో చూడాలి. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ గోకృప అమృతం ఎక్కడ దొరుకుతుంది? గోకృప అమృతం ద్రావణం (ప్రోబయోటిక్ బాక్టీరియా కల్చర్)ను ఒకసారి ఇతరుల నుంచి తీసుకున్న రైతులు దాన్ని నీరు, బెల్లం, మజ్జిగలను తగిన మోతాదులో కలిపి మళ్లీ మళ్లీ తయారు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు.. అహ్మదాబాద్ (గుజరాత్)లోని బన్సీ గిర్ గోశాల వెబ్‌సైట్‌ను చూడొచ్చు.. www.bansigir.in తెలుగు రాష్ట్రాల్లో గోకృప అమృతం ద్రావణం మదర్ కల్చర్‌ను పొందాలనుకునే రైతులు, ఇంటిపంటలు / మిద్దె తోటల సాగుదారులు ‘గ్రామభారతి’కి ఈ నంబర్లకు ఫోన్ చేయొచ్చు: 97057 34202, 62817 77517. చీడపీడల నియంత్రణ ఎలా? స్వల్పకాలిక పంటలు, పండ్ల తోటలపై పురుగులు, తెగుళ్ల నియంత్రణకు వారానికి ఒకసారి గోకృప అమృతం 13 లీటర్లకు 2 లీటర్ల నీటిని కలిపి పిచికారీ చేయాలి. పంట ఏ దశలో ఉన్నా వారానికోసారి ఇదే మోతాదులో పిచికారీ చేయవచ్చు. పంటలపై పురుగులు, తెగుళ్ల తీవ్రత ఎక్కువగా ఉంటే వారానికి రెండు లేదా మూడు సార్లు కూడా ఇదే మోతాదులో పిచికారీ చేయవచ్చు. ‘గోకృప అమృతం’లో ఏమి ఉన్నాయి? గోకృప అమృతం తయారీకి కావాల్సిన సామగ్రి: గోకృప అమృతం ద్రావణం ఒక లీటరు, 2 కిలోల బెల్లం (ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించినది), 2 లీటర్ల దేశీ ఆవు తాజా మజ్జిగ 200 లీటర్ల బ్యారెల్ నిండా నీరు. గోకృప అమృతం తయారీ విధానం రసాయనాలు, ఆయిల్ లేని శుభ్రమైన బ్యారెల్‌ను తీసుకొని 200 లీటర్ల నీటిని నింపండి. అందులో 1 లీటరు గోకృప అమృతం ద్రావణం, 2 లీటర్ల తాజా దేశీ ఆవు మజ్జిగ కలపండి. 2 కేజీల ప్రకృతి వ్యవసాయంలో పండించిన బెల్లంను (ద్రవరూపంలోకి మార్చి) కలపండి. బ్యారెల్‌ను నీడలో ఉంచి, పైన గుడ్డ కప్పి ఉంచాలి. రోజుకు 2 సార్లు కర్రతో సవ్య దిశలో 2 నిమిషాలు తిప్పండి. 5 నుంచి 7వ రోజు నుంచి గోకృప అమృతం వ్యవసాయానికి వాడకానికి సిద్ధమవుతుంది. అర్జెంటుగా కావాలంటే చిన్నపాటి ఎయిరేటర్ను అమర్చుకుంటే ఒకటి లేదా రెండు రోజుల్లోనే ఈ ద్రావణం వాడకానికి సిద్ధమవుతుంది. గోకృప అమృతంతో ఎరువు చేసేదెలా? దేశీ ఆవు పేడతో గోకృప అమృతం ద్రావణాన్ని కలిపి ఎరువు తయారు చేసుకోవచ్చు. నీడలో 2 అడుగుల ఎత్తు, 2 అడుగుల వెడల్పున మడిలాగా పేడను వేసి.. అందులో అక్కడక్కడా కన్నాలు పెట్టి 20 లీ. గోకృప అమృతం పోయాలి. 15 రోజులకు ఒకసారి గడ్డపారతో మిశ్రమాన్ని కలిసేలా తిప్పాలి. రోజూ లేదా రెండు రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా మిశ్రమంలో తేమ తగ్గకుండా నీటిని చల్లాలి. 40 నుంచి 45 రోజుల్లో గోకృప అమృతంతో ఎరువు తయారవుతుంది. పంట ఏదైనప్పటికీ ప్రతి ఎకరానికీ ప్రతి ఏటా 4 టన్నుల ఈ ఎరువు వేయాలి. పెద్ద ఆవు ఏటా 4 టన్నుల పేడ, 8 వేల లీటర్ల మూత్రం ఇస్తుందని ఓ అంచనా. గోకృప అమృతాన్ని భూమికి ఇచ్చేదెలా? గోకృప అమృతం ద్రావణాన్ని ఏ పంటకైనా తొలిసారి ‘ఎకరాని’కి వెయ్యి (1,000) లీటర్లు భూమికి ఇవ్వాలి. ఆ తర్వాత ప్రతి నెలా ఎకరానికి 1,500 లీటర్ల గోకృప అమృత ద్రావణం పారించాలి. దీన్ని ఒకేసారి 1500 లీటర్లు ఇవ్వొచ్చు లేదా 15 రోజులకోసారి 750 లీటర్లు అయినా పారించవచ్చు. ఆ విధంగా ఆ పంట ఎంత కాలం ఉంటే అంతకాలం నెలకు ఎకరానికి 1,500 లీటర్ల చొప్పున గోకృప అమృతం ద్రావణం ఇస్తూనే ఉండాలి. డ్రిప్ పద్ధతిలో గోకృప అమృతం భూమికి ఇవ్వటం సులభం. ఇందులో పేడ కలపటం లేదు కాబట్టి వడకట్టాల్సిన అవసరం ఉండదు. డ్రిప్ లేటరల్స్లో ఇరుక్కుపోవటం వంటి సమస్య ఉండదు. కాలువ ద్వారా సాగు నీటిని పొలంలో పారిస్తున్నప్పుడు దానితోపాటుగా గోకృప అమృతాన్ని కలిపి సులభంగా ఇవ్వవచ్చు. పంటలపై నీటిని వెదజల్లే స్ప్రింక్లర్ల ద్వారా కూడా నీటితోపాటు గోకృప అమృతాన్ని కలిపి ఇవ్వొచ్చు. అత్యవసర కీటక నియంత్రణ ఎలా? పంటపై పురుగుల తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే ఆవు మూత్రం, పులిసిన మజ్జిగ కూడా కలిపి పిచికారీ చేయాలి. 2 లీటర్ల ‘తాజా’ దేశీ ఆవు మూత్రం, 2 లీటర్ల బాగా పులిసిన దేశీ ఆవు మజ్జిగ (రాగి రేకు వేసి ఉంచిన 45 రోజుల తర్వాత తీసిన దేశీ ఆవు మజ్జిగ), 2 లీటర్ల గోకృప అమృతం కలపాలి. ఈ 6 లీటర్లకు నీటిని 9 లీటర్లు కలిపి పంటకు పిచికారీ చేయండి. మొదటగా 10 లేదా 25 మొక్కలపై ఈ అత్యవసర పురుగుల మందును ప్రయోగించి ఫలితాన్ని చూసి, ఆ తర్వాతే మిగిలిన పంట మీద ప్రయోగించండి. ముఖ్య సూచన: ఈ అత్యవసర క్రిమిసంహారక ద్రావణం అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే వాడాలి. 21న పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ పుట్టగొడుగుల పెంపకంపై హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్‌లో రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 21 (ఆదివారం) ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణా కార్యక్రమం జరగనుంది. ప్రొఫెసర్ బి. రాజేశ్వరి, పుట్టగొడుగుల రైతు శ్రీమతి కొప్పుల శ్రీలక్ష్మి (రాజమండ్రి) అవగాహన కల్పిస్తారు. పేరు రిజిస్ట్రేషన్ కోసం 70939 73999, 96767 97777 నంబర్లలో సంప్రదింవచచ్చు. -
మిడతల దాడి: పాక్ వినూత్న యోచన
పంట పొలాలపై దాడి చేస్తూ ఆహార భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్న రాకాసి ఎడారి మిడతల సమస్యను అధిగమించే ప్రయత్నంలో భాగంగా పాకిస్తాన్ వినూత్న సేంద్రియ ఎరువు ఉత్పత్తి పథకానికి శ్రీకారం చుట్టింది. తూర్పు ఆఫ్రికా దేశాలు, ఇరాన్ నుంచి వచ్చిన మిడతల గుంపుల దాడితో పాకిస్తాన్, భారత్‌లు గత 30 ఏళ్లలో ఎన్నడూ ఎరుగనంత పంట నష్టాన్ని చవిచూస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ ఆహార భద్రత, పరిశోధన మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని అమలు చేయబోతోంది. గ్రామస్థాయిలో ప్రజల నుంచి మిడతలను కొనుగోలు చేసి, పంట వ్యర్థాలతో కలిపి బయో ఎరువు తయారు చేయడం ద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నది లక్ష్యం. తద్వారా 25% మేరకు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవడంతోపాటు 10–15% వరకు పంట దిగుబడులు పెంచుకోవాలని పాకిస్తాన్ ఆలోచిస్తోంది. మిడతలతో తయారైన సేంద్రియ ఎరువులో నత్రజని 9 శాతం, ఫాస్ఫరస్ 7 శాతం అధికంగా ఉంటాయని పాక్ జాతీయ ఆహార భద్రత, పరిశోధన మంత్రిత్వ శాఖ చెబుతోంది. పరిశోధన, విస్తరణ, అధ్యాపక, పౌర సమాజ ప్రతినిధులను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయనున్నారు. రానున్న 3–4 నెలల్లో ఖోలిస్తాన్, థార్ ఎడారి ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తారు. మిడతలను కందకాలు తవ్వడం, వలలు వేసి పట్టుకోవటంపై మిడతల బాధిత ప్రాంతాల ప్రజలకు శిక్షణ ఇవ్వనున్నారు. 50 చోట్ల మిడతల సేకరణ కేంద్రాలను తెరవనున్నారు. తొలి ఏడాదే రూ. వంద కోట్ల విలువైన మిడతల కంపోస్టును తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ‘మిడతల వల్ల జరిగే పంట నష్టంలో ఒక్క శాతం తగ్గినా రూ. 3,200 కోట్ల లబ్ధి కలుగుతుంది. లక్ష టన్నుల మిడతలను పట్టుకుంటే 70 వేల టన్నుల కంపోస్టు తయారవుతుంది. సగటున ప్రతి క్రుటుంబం నెలకు రూ. 6 వేల ఆదాయం పొందుతుంది. ప్రాజెక్టు పెట్టుబడి మూడేళ్లలో తిరిగి వచ్చేస్తుంది’ అంటున్నది పాక్ జాతీయ ఆహార భద్రత,పరిశోధన మంత్రిత్వ శాఖ. -
ఉల్లి పొట్టుతో ఉపయోగాలెన్నో!
ప్రతి వంటింట్లో అనుదినం ఉల్లిపాయలను ఉపయోగిస్తూ ఉంటాం. ఉల్లిపాయ పై పొర ఎండిపోయి ఉంటుంది. సాధారణంగా ఈ పొట్టును తీసి చెత్తబుట్టలో వేస్తుంటాం. అయితే, అలా పారెయ్యకుండా మీ ఇంటిపంటల ఉత్పాదకత పెంపుదల కోసం ఉల్లి పొట్టును ఉపయోగించుకోవచ్చు. చక్కని సేంద్రియ ఎరువును, పోషక జలాన్ని కూడా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకొని వాడుకునే పద్ధతులను ఇప్పుడు తెలుసుకుందాం. ఉల్లి పొట్టుతో సేంద్రియ ఎరువు పండ్ల మొక్కలు, పూల మొక్కలకు పోషక లోపం లేకుండా అన్ని పోషకాలనూ అందించేందుకు ఉల్లి పొట్టుతో తయారు చేసుకునే సేంద్రియ ఎరువు ఉపయోగపడుతుంది. పూత రాలుడు సమస్యను ఆపుతుంది. ఉల్లి పొట్టులో పొటాషియం, ఫాస్ఫరస్, జింక్ పుష్కలంగా, స్వల్పంగా గంధకం ఉన్నాయి. ఇవన్నీ మొక్కలు పోషక లోపం లేకుండా, వేరు వ్యవస్థ బాగా విస్తరించి, ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడతాయి. ఉల్లి పొట్టుతోపాటు.. వాడేసిన టీపొడిని, కాల్షియం కోసం గుడ్ల పెంకులను కూడా కలుపుకుంటే సమగ్రమైన సేంద్రియ ఎరువు తయారవుతుంది. ఉల్లిపొట్టు ఎరువు ఉల్లి పొట్టును బాగా ఎండబెట్టాలి. పూర్తిగా ఎండిన పొట్టునే వాడాలి. వాడేసిన టీ పొడిని కూడా బాగా ఎండబెట్టి వాడాలి. టీ పొడితోపాటే పంచదార వేసుకొని మరగబెట్టే అలవాటు మీకుంటే.. వాడేసిన టీ పొడిని నీటిలో కడిగి మరీ పూర్తిగా ఎండబెట్టి, ఆ తర్వాత ఈ ఎరువు తయారీలో ఉపయోగించాలి. టీ పొడిలో 4.4% నత్రజని, 0.24% ఫాస్ఫరస్, 0.25%పొటాషియం ఉంటాయి. గుడ్ల పెంకులను కూడా బాగా ఎండబెట్టాలి. బాగా ఎండిన ఉల్లి పొట్టు, వాడేసిన టీ పొడి, గుడ్ల పెంకులను సమపాళ్లలో తీసుకొని మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. అంతే.. సమగ్ర పోషకాలతో కూడిన సేంద్రియ ఎరువు సిద్ధమైనట్లే. దీన్ని 3–4 నెలల పాటు నిల్వ చేసుకొని వాడుకోవచ్చు. ఉల్లి ఎరువు వేసుకునే విధానం... ప్రతి మొక్కకు వారానికి 2–3 చెంచాలు వేసి నీరు పోయాలి. టమాటా మొక్కలకు, గులాబీ మొక్కలకు ఇది వేస్తే తేడా ఇట్టే తెలిసిపోతుంది. ఉల్లి పొట్టుతో సేంద్రియ పోషక జలం కేవలం ఉల్లి పొట్టుతో చాలా సులువుగా సేంద్రియ పోషక జలాన్ని ఇంట్లోనే తయారు చేసుకొని ఇంటిపంటలను ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. ఒక పాత్రలోకి నీరు (పట్టుకొని పెట్టుకున్న వాన నీటిని వాడుకుంటే శ్రేష్టం. అవి లేకపోతే ఆర్.ఓ. నీరు పోయాలి) తీసుకొని అందులో ఎండు ఉల్లి పొట్టును వేసి మూత పెట్టాలి. రోజు గడిచే కొద్దీ పొట్టులోని పోషకాలు నీటిలోకి వచ్చి చేరుతూ ఉంటాయి. నీటి రంగు మారుతూ ఉంటుంది. 3–4 రోజుల తర్వాత వడపోసి బాటిల్లో నిల్వ చేసుకోవచ్చు. 1–2 నెలలు నిల్వ ఉంటుంది. పిచికారీ విధానం... పూత దశకు ముందు 15 రోజులకోసారి ఈ పోషక జలాన్ని మొక్కలకు పోయండి. నీరు కలపాల్సిన అవసరం లేదు. ఎండ వేళ్లలో కాకుండా ఉదయం/సాయంత్రపు వేళల్లోనే పోయాలి. ఉల్లి పొట్టులోని యాంధిసైనెన్ పిగ్మెంట్స్ వల్ల పూలకు చక్కని నిగారింపు వస్తుంది. వేసవిలో గులాబీ మొక్కలు చక్కగా పూయడానికి దోహదపడుతుంది. వారానికి 2-3 చెం‘చాలు’ పచ్చబారిన ఆకులకు చెక్ పోషక లోపం వల్ల మొక్కల ఆకులపై పసుపు పచ్చ మచ్చలు వస్తుంటాయి. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఉల్లి పొట్టుతో తయారు చేసుకున్న పోషక జలం సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. 100–200 ఎం.ఎల్. పోషక జలంతోపాటు 800 ఎం.ఎల్. నీటి (వాన నీరు/ఆర్.ఓ. నీరు)ని కలిపి పిచికారీ చేయాలి. మొక్కల ఆకులు పూర్తిగా తడిచేలా వారానికి రెండు సార్లు సూర్యోదయానికి ముందే చల్లాలి. సిట్రస్ జాతి పండ్ల మొక్కలకు నీరు ఎక్కువగా పోయనవసరం లేదు. నీటి తేమ చాలు. నీటి తేమ త్వరగా ఆరిపోకుండా ఉండాలంటే.. ఉల్లి పొట్టును/గడ్డిని మొక్కల చుట్టూ ఆచ్ఛాదన (మల్చింగ్)గా వేయాలి. -
కొబ్బరి పొట్టు.. సేంద్రియ కంపోస్టు!
పంట పొలంలో, కుండీ మట్టిలో నీటి తేమను ఎక్కువ కాలం పట్టి ఉంచడానికి శుద్ధి చేసిన కొబ్బరి పొట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. శుద్ధి చేసే ప్రక్రియలో గతంలో రసాయనాలను వాడేవారు. అయితే, కేంద్ర కాయిర్ బోర్డు రసాయనాలు వాడకుండా కొబ్బరి పొట్టును శుద్ధి చేసి సేంద్రియ ఎరువులా పంటలకు వాడుకునే వినూత్న పద్ధతిని ఇటీవల రూపొందించింది. కృషీవల కొబ్బరి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఈ పద్ధతిలో సేంద్రియ కంపోస్టును తయారు చేస్తూ.. కొబ్బరి రైతులకు మంచి మార్గాన్ని చూపుతోంది. కొబ్బరి పంట రైతుకు అనేక విధాలుగా ఆదాయాన్ని అందిస్తుంది. కాయలతోపాటు కాండం, ఆకులు, ఈనెలు, చిప్పలు, డొక్కలు.. ఇలా అన్నీ రైతులకు ఉపయోగపడుతూ ఆదాయాన్నందించేవే. కొబ్బరి డొక్కల నుంచి ‘పీచు’ తీసి.. ఆ పీచుతో అనేక ఉత్పత్తులను తయారు చేస్తారు. కేజీ పీచు తీసేటప్పుడు సుమారు 6 నుంచి 8 కేజీల కొబ్బరి పొట్టు వస్తుంది. ఇలా వచ్చిన పొట్టును నేరుగా వ్యవసాయంలో వినియోగించకూడదు. దీనిలో కర్బనం–నత్రజని నిష్పత్తి మొక్కలకు అనుకూలంగా ఉండదు. ‘లెగ్నిన్’ అధిక మోతాదులో ఉండటం వలన దీన్ని నేరుగా మొక్కలకు వేస్తే పంటలకు హాని జరుగుతుంది. ఎలక్ట్రిక్ కండక్టవిటీ(ఈసీ)ని తగ్గించాలి. దీన్ని శుద్ధి చేసి కంపోస్టుగా మార్చి వేసుకుంటే పంటలకు మేలు జరుగుతుంది. కొబ్బరి పొట్టు రైతుకు మేలు చేసే విధంగా తయారు చేసుకోవడంలో వివిధ పద్ధతులు, విధానాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. సెంట్రల్ కాయిర్ బోర్డు ‘ఫ్లూరోటస్ సాజర్ కాజూ’అనే శీలింధ్రాన్ని ఉపయోగించి పొట్టును వేగంగా కుళ్లబెట్టే ప్రక్రియను అభివృద్ధి చేసింది. తొలినాళ్లలో ఈ శిలీంధ్రం, రాతి భాస్వరం పొరలు, పొరలుగా వేసి కుళ్లబెట్టేవారు. తరువాత కొద్దిపాటి యూరియాను పొరల మధ్య చల్లడం ద్వారా మరింత వేగంగా పొట్టును కుళ్లబెట్టవచ్చని తేల్చారు. ఈ కొత్త పద్ధతిలో రసాయనిక పదార్థాలకు బదులు.. ఫ్లూరోటస్ సాజర్ కాజూ, అజోల్లా, వేపపిండిలను వినియోగిస్తూ వేగంగా కొబ్బరి పొట్టును కుళ్లబెట్టే విధానం అభివృద్ధి చేశారు. ఇటీవల కోనసీమలో కొంతమంది రైతులు ఏర్పాటు చేసుకున్న కృషీవల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో చేసిన ప్రయోగం సత్ఫలితాన్నిచ్చింది. కొబ్బరి పొట్టు కంపోస్టును తయారు చేసి రైతులకు, పట్టణాల్లో ఇంటిపంటల సాగుదారులకు అందించడానికి ఈ సంస్థ ఏర్పాట్లు చేసుకుంటున్నది. టన్ను కొబ్బరి పొట్టు (బేబీయార్న్ తొలగించింది), 10 కేజీల అజోల్లా, 30 కేజీల వేపపిండి, 5 కేజీల ఫ్లూరోటస్ సాజర్ కాజూ లను పొరలు, పొరలుగా వేసి తడపటం ద్వారా 30 రోజుల్లో మంచి నాణ్యమైన కొబ్బరి పొట్టు కంపోస్టును తయారు చేస్తున్నారు. ప్రతి రోజూ స్వల్పమోతాదులో నీరు చల్లాల్సి ఉంటుంది. అనంతరం ఈ కొబ్బరి పొట్టు బాగా కుళ్లి మంచి కంపోస్టు ఎరువుగా తయారవుతుంది. శిలీంధ్రం, అజోల్లాలతో శాస్త్రీయ పద్ధతిలో కుళ్లబెట్టిన కొబ్బరి పొట్టు కంపోస్టు వాడటం వల్ల అనేక లాభాలున్నాయి. – నిమ్మకాయల సతీష్‌బాబు, సాక్షి, అమలాపురం కొబ్బరి పొట్టు కంపోస్టుతో ప్రయోజనాలు ► మంచి నీటి నిల్వ సామర్థ్యం కలిగిన సేంద్రియ పదార్థం ► తక్కువ బరువు– విమానాల్లో సైతం రవాణాకు అనుకూలం ► విదేశాలకు ఎగుమతికి క్వారంటెయిన్ ఇబ్బందులు లేవు ► అధిక మోతాదులో పొటాషియంతోపాటు అనేక పోషకాలు కలిగిన సేంద్రియ ఎరువు ► జీవన ఎరువులు, శీలింధ్రనాశనులు కలిపి వినియోగానికి అనుకూల పదార్ధం ► అత్యంత తక్కువ ధరకు లభించే ఎరువు కొబ్బరి తోటలున్న ప్రాంతాల్లో లభించే వ్యర్థ పదార్థం ► సులువైన తయారీ విధానం నూతన ఉపాధి అవకాశాల కల్పనకు తోడ్పడుతోంది ► ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యం పొందవచ్చు ► మిద్దె పంటలు, ఇంటి పంటలకూ అనుకూలమైన సేంద్రియ ఎరువు. భూమిలో నీటి నిల్వ సామర్ధ్యం పెరుగుతుంది కొబ్బరి పొట్టు కంపోస్టును వినియోగించడం ద్వారా పంట భూమిలో నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచుకునే అవకాశముంది. మెట్ట, నీటి సౌలభ్యం తక్కువుగా ఉన్న మాగాణి భూముల్లో మంచి పంటలు పండించుకోవచ్చు. దీని తయారీ విధానం, ఖర్చు చాలా తక్కువ. మంచి పోషకాలు కలిగిన కంపోస్టును మొక్కలకు అందించేందుకు ఇది దోహదపడుతుంది. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే ఖరీదైన ఉత్పత్తులకన్నా.. కొబ్బరి పొట్టుతో పెద్దగా ఖర్చులేకుండా సేంద్రియ పద్ధతిలో కంపోస్టును తయారు చేసుకొని వినియోగించుకోవచ్చు. – అడ్డాల గోపాలకృష్ణ (94402 50552), కన్వీనర్, రైతుమిత్ర రూరల్ టెక్నాలజీ పార్కు, అమలాపురం అజొల్లా -
పుడమి.. పులకించేలా..
♦ రైతన్న మెరిసేలా జనం మెచ్చేలా ♦ పారిశ్రామిక వేత్త సరితారెడ్డి కృషి ♦ సేంద్రియ ఎరువుల తయారీ ♦ తక్కువ ధరకే రైతులకు సరఫరా.. ఆపై ప్రోత్సాహం ♦ సరిత సేవలకు ప్రభుత్వ గుర్తింపు ♦ రాష్ట్ర స్థాయి పురస్కారానికి ఎంపిక ♦ నేడు హైదరాబాద్‌లో సన్మానం కొండపాక మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన కిష్టారెడ్డి, భాగ్యమ్మ దంపతుల కూతురు మన్నెం సరితారెడ్డి. తండ్రి కిష్టారెడ్డి ఆర్ఎంపీగా పనిచేస్తున్నారు. ఎర్రవల్లిలో పుట్టిన ఈమె ములుగు మండలం క్షీరసాగర్‌లో ఆరోతరగతి వరకు చదువుకున్నారు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేటలో పదోతరగతి పూర్తిచేశారు. హైదరాబాద్‌లోని ప్రైవేట్ కళాశాలలో బీఎస్సీ (అగ్రికల్చర్) చేశారు. కొంతకాలం పాటు పార్ట్‌టైం జామ్ చేశారు. నల్లగొండ జిల్లా చండూర్‌కు చెందిన రమణారెడ్డితో వివాహమైంది. ఇంత చదివి జాబ్ చేస్తున్నా ఏమాత్రం సంతృప్తి కలగకపోవడంతో ఏదో సాధించాలన్న పట్టుదలను పెంచుకున్నారు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన ఓ మహిళ.. తన చొరవతో జనాన్ని మెప్పించింది. పల్లె వాసనలు.. శ్రమైక జీవన సౌందర్యాన్ని ప్రత్యక్షంగా ఎరిగిన ఈమె.. వాటిని శాశ్వతంగా కాపాడాలని కంకణం కట్టుకుంది. పరోక్షంగా పుడమితల్లిని, రైతును, ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది. సేంద్రియ ఎరువులను తయారు చేసి రైతులను అటువైపు ప్రోత్సహిస్తోంది. ఫలితంగా భూమిలో సారాన్ని పెంచడంతోపాటు.. రైతుకు దిగుబడులు వచ్చేలా కృషి చేస్తోంది. అదే సమయంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతోంది. ఈమె సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం... అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ పారిశ్రామిక వేత్తగా సరితారెడ్డిని పురస్కారానికి ఎంపిక చేసింది. - కొండపాక చొరవ ఇలా... రసాయన ఎరువులు వాడటం కంటే జీవ సేంద్రియ ఎరువులను వాడితే 25 శాతం పెట్టుబడులు తగ్గడంతోపాటు మరో 20 శాతం దిగుబడులు పెరుగుతాయని సరితారెడ్డి ప్రత్యక్షంగా నిరూపించారు. వరుసగా మూడేళ్లపాటు జీవ రసాయన ఎరువులతో వ్యవసాయం చేస్తే తప్ప నాణ్యమైన, అధిక దిగుబడులు సాధ్యం కాదని చెప్పారు. ఇలాంటి పద్ధతులు పాటిస్తూ సాగు చేసిన పంట (కూరగాయలు) మార్కెట్లో ఒకటి, రెండు రోజులపాటు గిట్టుబాటు ధరలు లభించకపోయినా అవి పాడు కాకుండా తాజాగా ఉంటాయని చెబుతున్నారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులతోపాటు మెలకువలు చూపుతున్నారు. తన సూచనలు పాటించిన అన్ని రకాలుగా వృద్ధి చెందిన వారు మెదక్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎందరో ఉన్నారంటున్నారు. భర్త రమణారెడ్డి సహకారంతో తాను జీవ రసాయన ఎరువుల సంస్థను దిగ్విజయంగా నడుపుతున్నాని సరితారెడ్డి ‘సాక్షి’తో తెలిపారు. ఎర్రవల్లి టు ఎర్రవల్లి... కొండపాక మండలం ఎర్రవల్లిలో జన్మించిన సరితారెడ్డి జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి వైపు తన ప్రయాణాన్ని సాగించారు. జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో సాగవుతోన్న వ్యవసాయ ఉత్పత్తులకు తన పరిశ్రమ అయిన నవరత్న క్రాప్ సైన్స్ ప్రైవేటు లిమిటెడ్ నుంచి సేంద్రియ ఎరువులను సరఫరా చేస్తున్నారు. నాణ్యమైన సేంద్రియ ఎరువులను తయారు చేసి సీఎం దృష్టిని ఆకర్శించారు. ఆనందంగా ఉంది... అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తనను పురస్కారానికి ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉందని సరితారెడ్డి తెలిపారు. జీవ రసాయన ఎరువుల తయారీ, రైతులను ప్రోత్సహిస్తోన్న విషయాన్ని గుర్తించినందుకు ఆమె ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం ద్వారా తన జన్మ సార్థకమైందన్నారు. రైతులపైనే దృష్టి... వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినందున సరితారెడ్డి రైతులపై ప్రధానంగా దృష్టిసారించారు. వారి సాదకబాధకాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండడంతో ఆమెకు కలిసొచ్చింది. రైతులు అవగాహన లేమితో అధిక దిగుబడులు సాధించాలన్న ఆశతో మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడడాన్ని ఆమె గమనించారు. ఇం దుకుగాను భారీగా పెట్టుబడులు పెట్టడం.. తీరానష్టపోవడం జరుగుతున్న తీరును నిశితంగా గమనించారు. అవగాహన... రసాయనిక ఎరువులు వాడటం వల్ల వచ్చే నష్టాలు, జీవ సేంద్రియ ఎరువుల వినియోగంతో పొందే లాభాలపై సరితారెడ్డి తన సంస్థ తరఫున రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులకు సైతం ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. సేంద్రియ ఎరువుల వాడకంపై పరిశోధనల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కూడా అవగాహన కల్పిస్తున్నారు. సేంద్రియ ఎరువుల తయారీ... ఆరేళ్ల కిందట హైదరాబాద్‌లోని చర్లపల్లి కేంద్రంగా నవరత్న క్రాప్ సైన్స్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమను స్థాపించారు. ఈ పరిశ్రమ ద్వారా రైతులకు సాయమందించాలని నిర్ణయించుకున్నారు. జీవ సేంద్రియ ఎరువులను తయారు చేస్తూ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. వాతావరణంలో ఏర్పడే సంక్షోభాలకు తట్టుకునే విధంగా సేంద్రియ ఎరువులను ఉత్పత్తి చేస్తున్నారు.