పుడమి.. పులకించేలా..
♦ రైతన్న మెరిసేలా జనం మెచ్చేలా
♦ పారిశ్రామిక వేత్త సరితారెడ్డి కృషి
♦ సేంద్రియ ఎరువుల తయారీ
♦ తక్కువ ధరకే రైతులకు సరఫరా.. ఆపై ప్రోత్సాహం
♦ సరిత సేవలకు ప్రభుత్వ గుర్తింపు
♦ రాష్ట్ర స్థాయి పురస్కారానికి ఎంపిక
♦ నేడు హైదరాబాద్‌లో సన్మానం
కొండపాక మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన కిష్టారెడ్డి, భాగ్యమ్మ దంపతుల కూతురు మన్నెం సరితారెడ్డి. తండ్రి కిష్టారెడ్డి ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నారు. ఎర్రవల్లిలో పుట్టిన ఈమె ములుగు మండలం క్షీరసాగర్‌లో ఆరోతరగతి వరకు చదువుకున్నారు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేటలో పదోతరగతి పూర్తిచేశారు. హైదరాబాద్‌లోని ప్రైవేట్ కళాశాలలో బీఎస్సీ (అగ్రికల్చర్) చేశారు. కొంతకాలం పాటు పార్ట్‌టైం జామ్ చేశారు. నల్లగొండ జిల్లా చండూర్‌కు చెందిన రమణారెడ్డితో వివాహమైంది. ఇంత చదివి జాబ్ చేస్తున్నా ఏమాత్రం సంతృప్తి కలగకపోవడంతో ఏదో సాధించాలన్న పట్టుదలను పెంచుకున్నారు.
సాధారణ రైతు కుటుంబానికి చెందిన ఓ మహిళ.. తన చొరవతో జనాన్ని మెప్పించింది. పల్లె వాసనలు.. శ్రమైక జీవన సౌందర్యాన్ని ప్రత్యక్షంగా ఎరిగిన ఈమె.. వాటిని శాశ్వతంగా కాపాడాలని కంకణం కట్టుకుంది. పరోక్షంగా పుడమితల్లిని, రైతును, ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది. సేంద్రియ ఎరువులను తయారు చేసి రైతులను అటువైపు ప్రోత్సహిస్తోంది. ఫలితంగా భూమిలో సారాన్ని పెంచడంతోపాటు.. రైతుకు దిగుబడులు వచ్చేలా కృషి చేస్తోంది. అదే సమయంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతోంది. ఈమె సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం... అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ పారిశ్రామిక వేత్తగా సరితారెడ్డిని పురస్కారానికి ఎంపిక చేసింది. - కొండపాక
చొరవ ఇలా...
రసాయన ఎరువులు వాడటం కంటే జీవ సేంద్రియ ఎరువులను వాడితే 25 శాతం పెట్టుబడులు తగ్గడంతోపాటు మరో 20 శాతం దిగుబడులు పెరుగుతాయని సరితారెడ్డి ప్రత్యక్షంగా నిరూపించారు. వరుసగా మూడేళ్లపాటు జీవ రసాయన ఎరువులతో వ్యవసాయం చేస్తే తప్ప నాణ్యమైన, అధిక దిగుబడులు సాధ్యం కాదని చెప్పారు. ఇలాంటి పద్ధతులు పాటిస్తూ సాగు చేసిన పంట (కూరగాయలు) మార్కెట్‌లో ఒకటి, రెండు రోజులపాటు గిట్టుబాటు ధరలు లభించకపోయినా అవి పాడు కాకుండా తాజాగా ఉంటాయని చెబుతున్నారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులతోపాటు మెలకువలు చూపుతున్నారు. తన సూచనలు పాటించిన అన్ని రకాలుగా వృద్ధి చెందిన వారు మెదక్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎందరో ఉన్నారంటున్నారు. భర్త రమణారెడ్డి సహకారంతో తాను జీవ రసాయన ఎరువుల సంస్థను దిగ్విజయంగా నడుపుతున్నాని సరితారెడ్డి ‘సాక్షి’తో తెలిపారు.
ఎర్రవల్లి టు ఎర్రవల్లి...
కొండపాక మండలం ఎర్రవల్లిలో జన్మించిన సరితారెడ్డి జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి వైపు తన ప్రయాణాన్ని సాగించారు. జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో సాగవుతోన్న వ్యవసాయ ఉత్పత్తులకు తన పరిశ్రమ అయిన నవరత్న క్రాప్ సైన్స్ ప్రైవేటు లిమిటెడ్ నుంచి సేంద్రియ ఎరువులను సరఫరా చేస్తున్నారు. నాణ్యమైన సేంద్రియ ఎరువులను తయారు చేసి సీఎం దృష్టిని ఆకర్శించారు.
ఆనందంగా ఉంది...
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తనను పురస్కారానికి ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉందని సరితారెడ్డి తెలిపారు. జీవ రసాయన ఎరువుల తయారీ, రైతులను ప్రోత్సహిస్తోన్న విషయాన్ని గుర్తించినందుకు ఆమె ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం ద్వారా తన జన్మ సార్థకమైందన్నారు.
రైతులపైనే దృష్టి...
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినందున సరితారెడ్డి రైతులపై ప్రధానంగా దృష్టిసారించారు. వారి సాదకబాధకాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండడంతో ఆమెకు కలిసొచ్చింది. రైతులు అవగాహన లేమితో అధిక దిగుబడులు సాధించాలన్న ఆశతో మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడడాన్ని ఆమె గమనించారు. ఇం దుకుగాను భారీగా పెట్టుబడులు పెట్టడం.. తీరానష్టపోవడం జరుగుతున్న తీరును నిశితంగా గమనించారు.
అవగాహన...
రసాయనిక ఎరువులు వాడటం వల్ల వచ్చే నష్టాలు, జీవ సేంద్రియ ఎరువుల వినియోగంతో పొందే లాభాలపై సరితారెడ్డి తన సంస్థ తరఫున రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులకు సైతం ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. సేంద్రియ ఎరువుల వాడకంపై పరిశోధనల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కూడా అవగాహన కల్పిస్తున్నారు.
సేంద్రియ ఎరువుల తయారీ...
ఆరేళ్ల కిందట హైదరాబాద్‌లోని చర్లపల్లి కేంద్రంగా నవరత్న క్రాప్ సైన్స్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమను స్థాపించారు. ఈ పరిశ్రమ ద్వారా రైతులకు సాయమందించాలని నిర్ణయించుకున్నారు. జీవ సేంద్రియ ఎరువులను తయారు చేస్తూ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. వాతావరణంలో ఏర్పడే సంక్షోభాలకు తట్టుకునే విధంగా సేంద్రియ ఎరువులను ఉత్పత్తి చేస్తున్నారు.