coconut husks
-
ఇంటిపంటల కోసమే సిటీకి దూరంగా సొంతిల్లు!
వరంగల్‌లో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రేగూరి సింధూజ ఇంజనీరింగ్ చదువుకొని హైదరాబాద్ టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. రసాయనిక అవశేషాలు లేని ప్రకృతిసిద్ధమైన ఆహారం విలువ గుర్తెరిగిన ఆమె.. సిటీలో ఫ్లాట్‌కు బదులు (బీహెచ్ఈఎల్ దగ్గర) నగర శివారు ప్రాంతం అమీన్పూర్ నరేంద్ర నగర్ కాలనీలో ఇండిపెండెంట్ హౌస్ నిర్మించుకున్నారు. 200 గజాల టెర్రస్‌లో సగభాగంలో వందకు పైగా గ్రోబాగ్స్, కుండీలలో గత ఏడాదిగా ఇంటిపంటలు పండించుకుంటున్నారు. తెలంగాణ ఉద్యాన శాఖ నుంచి 4 పెద్ద వృత్తాకారపు గ్రీన్ గ్రోబాగ్స్తో కూడిన సబ్సిడీ కిట్‌ను తీసుకున్నారు. శిక్షణా శిబిరాలకు హాజరై అవగాహన పెంచుకున్నారు. వీటితోపాటు తెల్లని గ్రోబాగ్స్‌ను, కొబ్బరిపొట్టు తదితర పరికరాలను సేకరించుకున్నారు. 30%మట్టి, 30%పశువుల ఎరువు, 30% శుద్ధి చేసిన కొబ్బరిపొట్టు, వంటింటి వ్యర్థాలతో తయారు చేసిన ఇంటి కంపోస్టు+వేపపిండితో కలిపిన మట్టి మిశ్రమాన్ని గ్రోబాగ్స్, కుండీలలో నింపారు. వేసవి ఎండ తీవ్రత నుంచి ఇంటిపంటలను కాపాడుకోవడానికి ఇనుప ఫ్రేమ్‌తో షేడ్‌నెట్ వేసుకున్నారు. సింధూజ కుటుంబంలో నలుగురు పెద్దవారు ఉంటారు. పాలకూర, చుక్కకూర, గోంగూర, తోటకూర, కొత్తిమీర, బచ్చలి కూర పెంచుకొని తింటున్నారు. గత ఏడాదిగా ఆకుకూరలను బయట కొనటం లేదు. తీగజాతి కూరగాయలను పాకించడానికి కొబ్బరి తాళ్లతో పందిరి అల్లారు. బెండ, బీర, గోరుచిక్కుడు, కాప్సికం, సొర తదితర కూరగాయలు సాగులో ఉన్నాయి. ప్రస్తుతం వారంలో 2,3 రోజులు ఈ కూరగాయలు తింటున్నామని, కొద్ది రోజుల్లో పూర్తిస్థాయిలో ఇంటి కూరగాయలే తమకు సరిపోతాయని సింధూజ(98857 61707) సంతోషంగా చెప్పారు. ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా నిపుణుల సలహాలను తెలుసుకుంటున్నానన్నారు. -
కొబ్బరి పొట్టు.. సేంద్రియ కంపోస్టు!
పంట పొలంలో, కుండీ మట్టిలో నీటి తేమను ఎక్కువ కాలం పట్టి ఉంచడానికి శుద్ధి చేసిన కొబ్బరి పొట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. శుద్ధి చేసే ప్రక్రియలో గతంలో రసాయనాలను వాడేవారు. అయితే, కేంద్ర కాయిర్ బోర్డు రసాయనాలు వాడకుండా కొబ్బరి పొట్టును శుద్ధి చేసి సేంద్రియ ఎరువులా పంటలకు వాడుకునే వినూత్న పద్ధతిని ఇటీవల రూపొందించింది. కృషీవల కొబ్బరి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఈ పద్ధతిలో సేంద్రియ కంపోస్టును తయారు చేస్తూ.. కొబ్బరి రైతులకు మంచి మార్గాన్ని చూపుతోంది. కొబ్బరి పంట రైతుకు అనేక విధాలుగా ఆదాయాన్ని అందిస్తుంది. కాయలతోపాటు కాండం, ఆకులు, ఈనెలు, చిప్పలు, డొక్కలు.. ఇలా అన్నీ రైతులకు ఉపయోగపడుతూ ఆదాయాన్నందించేవే. కొబ్బరి డొక్కల నుంచి ‘పీచు’ తీసి.. ఆ పీచుతో అనేక ఉత్పత్తులను తయారు చేస్తారు. కేజీ పీచు తీసేటప్పుడు సుమారు 6 నుంచి 8 కేజీల కొబ్బరి పొట్టు వస్తుంది. ఇలా వచ్చిన పొట్టును నేరుగా వ్యవసాయంలో వినియోగించకూడదు. దీనిలో కర్బనం–నత్రజని నిష్పత్తి మొక్కలకు అనుకూలంగా ఉండదు. ‘లెగ్నిన్’ అధిక మోతాదులో ఉండటం వలన దీన్ని నేరుగా మొక్కలకు వేస్తే పంటలకు హాని జరుగుతుంది. ఎలక్ట్రిక్ కండక్టవిటీ(ఈసీ)ని తగ్గించాలి. దీన్ని శుద్ధి చేసి కంపోస్టుగా మార్చి వేసుకుంటే పంటలకు మేలు జరుగుతుంది. కొబ్బరి పొట్టు రైతుకు మేలు చేసే విధంగా తయారు చేసుకోవడంలో వివిధ పద్ధతులు, విధానాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. సెంట్రల్ కాయిర్ బోర్డు ‘ఫ్లూరోటస్ సాజర్ కాజూ’అనే శీలింధ్రాన్ని ఉపయోగించి పొట్టును వేగంగా కుళ్లబెట్టే ప్రక్రియను అభివృద్ధి చేసింది. తొలినాళ్లలో ఈ శిలీంధ్రం, రాతి భాస్వరం పొరలు, పొరలుగా వేసి కుళ్లబెట్టేవారు. తరువాత కొద్దిపాటి యూరియాను పొరల మధ్య చల్లడం ద్వారా మరింత వేగంగా పొట్టును కుళ్లబెట్టవచ్చని తేల్చారు. ఈ కొత్త పద్ధతిలో రసాయనిక పదార్థాలకు బదులు.. ఫ్లూరోటస్ సాజర్ కాజూ, అజోల్లా, వేపపిండిలను వినియోగిస్తూ వేగంగా కొబ్బరి పొట్టును కుళ్లబెట్టే విధానం అభివృద్ధి చేశారు. ఇటీవల కోనసీమలో కొంతమంది రైతులు ఏర్పాటు చేసుకున్న కృషీవల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో చేసిన ప్రయోగం సత్ఫలితాన్నిచ్చింది. కొబ్బరి పొట్టు కంపోస్టును తయారు చేసి రైతులకు, పట్టణాల్లో ఇంటిపంటల సాగుదారులకు అందించడానికి ఈ సంస్థ ఏర్పాట్లు చేసుకుంటున్నది. టన్ను కొబ్బరి పొట్టు (బేబీయార్న్ తొలగించింది), 10 కేజీల అజోల్లా, 30 కేజీల వేపపిండి, 5 కేజీల ఫ్లూరోటస్ సాజర్ కాజూ లను పొరలు, పొరలుగా వేసి తడపటం ద్వారా 30 రోజుల్లో మంచి నాణ్యమైన కొబ్బరి పొట్టు కంపోస్టును తయారు చేస్తున్నారు. ప్రతి రోజూ స్వల్పమోతాదులో నీరు చల్లాల్సి ఉంటుంది. అనంతరం ఈ కొబ్బరి పొట్టు బాగా కుళ్లి మంచి కంపోస్టు ఎరువుగా తయారవుతుంది. శిలీంధ్రం, అజోల్లాలతో శాస్త్రీయ పద్ధతిలో కుళ్లబెట్టిన కొబ్బరి పొట్టు కంపోస్టు వాడటం వల్ల అనేక లాభాలున్నాయి. – నిమ్మకాయల సతీష్‌బాబు, సాక్షి, అమలాపురం కొబ్బరి పొట్టు కంపోస్టుతో ప్రయోజనాలు ► మంచి నీటి నిల్వ సామర్థ్యం కలిగిన సేంద్రియ పదార్థం ► తక్కువ బరువు– విమానాల్లో సైతం రవాణాకు అనుకూలం ► విదేశాలకు ఎగుమతికి క్వారంటెయిన్ ఇబ్బందులు లేవు ► అధిక మోతాదులో పొటాషియంతోపాటు అనేక పోషకాలు కలిగిన సేంద్రియ ఎరువు ► జీవన ఎరువులు, శీలింధ్రనాశనులు కలిపి వినియోగానికి అనుకూల పదార్ధం ► అత్యంత తక్కువ ధరకు లభించే ఎరువు కొబ్బరి తోటలున్న ప్రాంతాల్లో లభించే వ్యర్థ పదార్థం ► సులువైన తయారీ విధానం నూతన ఉపాధి అవకాశాల కల్పనకు తోడ్పడుతోంది ► ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యం పొందవచ్చు ► మిద్దె పంటలు, ఇంటి పంటలకూ అనుకూలమైన సేంద్రియ ఎరువు. భూమిలో నీటి నిల్వ సామర్ధ్యం పెరుగుతుంది కొబ్బరి పొట్టు కంపోస్టును వినియోగించడం ద్వారా పంట భూమిలో నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచుకునే అవకాశముంది. మెట్ట, నీటి సౌలభ్యం తక్కువుగా ఉన్న మాగాణి భూముల్లో మంచి పంటలు పండించుకోవచ్చు. దీని తయారీ విధానం, ఖర్చు చాలా తక్కువ. మంచి పోషకాలు కలిగిన కంపోస్టును మొక్కలకు అందించేందుకు ఇది దోహదపడుతుంది. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే ఖరీదైన ఉత్పత్తులకన్నా.. కొబ్బరి పొట్టుతో పెద్దగా ఖర్చులేకుండా సేంద్రియ పద్ధతిలో కంపోస్టును తయారు చేసుకొని వినియోగించుకోవచ్చు. – అడ్డాల గోపాలకృష్ణ (94402 50552), కన్వీనర్, రైతుమిత్ర రూరల్ టెక్నాలజీ పార్కు, అమలాపురం అజొల్లా -
సౌరశక్తి, ఉప్పు నీరు, కొబ్బరి పొట్టుతో సేద్యం
వ్యవసాయానికి అత్యంత ఆవశ్యకమైన వనరులు.. మట్టి, నీరు, శిలాజ ఇంధనాలు, పురుగుమందులు. ఇవేవీ అవసరం లేని పంటల సాగును ఊహించలేం. కానీ, దక్షిణ ఆస్ట్రేలియాలోని సముద్ర తీరానికి దగ్గర్లోని ఎడారి ప్రాంతంలో సన్‌డ్రాప్ ఫార్మ్స్‌లో ఇవేవీ అవసరం లేకుండానే టమాటాను సాగుచేస్తున్నారు. సౌరశక్తి సహాయంతో వాణిజ్య స్థాయిలో సాగుతున్న ఈ కృషిలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం గత ఆరేళ్లుగా పాలు పంచుకుంటోంది.ఈ విధానంలో ముందుగా సముద్ర జలాలను పైపుల ద్వారా శుద్ధి చేసే ప్లాంట్‌కు తరలిస్తారు. సౌరశక్తితో పనిచేసే ప్లాంట్‌లో ఉప్పు నీటిని శుద్ధి చేస్తారు. సౌర విద్యుదుత్పత్తి కోసం ఈ వ్యవసాయ క్షేత్రం మధ్యలో 23 వేల అద్దాలను అమర్చారు. వీటిపై పడిన సూర్యకాంతిని 115 మీటర్ల ఎత్తున నిర్మించిన టవర్ గ్ర హించి సౌరశక్తి సహాయంతో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ద్వారా ఉత్పత్తయ్యే 39 మెగావాట్ల విద్యుత్‌ను గ్రీన్హౌస్ నిర్వహణకు, సముద్ర జలాన్ని శుద్ధి చేసే ప్లాంట్‌ను నడిపేందుకు వాడుతున్నారు. వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రతల బారి నుంచి పంటలను కాపాడేందుకు గ్రీన్‌హౌస్‌ను సముద్రపు నీటితో తడుపుతున్నారు. దీనివల్ల వాతావరణ శుద్ధి జరిగి చీడపీడల నివారణకు రసాయనిక కీటకనాశనులు వాడాల్సిన అవసరం తప్పింది. మొక్కలను పెంచేందుకు మట్టికి బదులు కొబ్బరి పొట్టును వాడారు. శుద్ధి చేసిన సముద్ర జలాలతో 1.80 లక్షల టమాటా మొక్కలను సాగుచేస్తున్నారు. ప్రస్తుతం ఏడాదికి 17 వేల టన్నుల టమాటాలను ఉత్పత్తి చేసి ఆస్ట్రేలియాలోని సూపర్ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. కోస్తా తీరానికి దగ్గర్లో ఉండే ఎడారి ప్రాంతాల్లో లేదా ఇసుక నేలల్లో ఈ విధానంలో హరిత గృహాల్లో పంటలను సాగు చేయవచ్చని ఈ ప్రాజెక్టు నిర్వాహకులు చెబుతున్నారు. గ్రీన్‌హౌస్‌ల నిర్వహణకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తి కోసం శిలాజ ఇంధనాలకు పెట్టే ఖర్చును ఆదా చేయవచ్చు. పర్యావరణ కాలుష్యాన్నీ తగ్గించవచ్చు. దీని కోసం ప్రారంభంలో ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు. చాలా కాలం వరకు పెద్దగా ఖర్చు లేకుండానే దిగుబడులు తీయొచ్చునంటున్నారు. ఈ విధానాన్ని అనుసరించేందుకు పోర్చుగల్, అమెరికా, ఒమన్, ఖతార్ వంటి దేశాలు సిద్ధమవుతున్నాయి. ఇది చాలా ఉపయోగకరమైన విధానమని, భవిష్యత్‌లో ఆహారోత్పత్తుల దిగుబడులు పెరిగేందుకు దోహదం చేస్తుందని సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ రోబర్ట్ పార్క్ చెప్పారు. - దండేల కృష్ణ, సాగుబడి డెస్క్